Sakshi Editorial Article On Women Empowerment In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

మహిళాశక్తిపై మారీచ యుద్ధం!

Published Sun, Jul 30 2023 12:31 AM | Last Updated on Sun, Jul 30 2023 2:20 PM

Sakshi Editorial Article On Womens Empowerment In Andhrapradesh

పవన్‌ కల్యాణ్‌ అమ్ముల పొదిలో అన్నీ పచ్చబాణాలే ఉంటా యన్న నిజం ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూనే వస్తున్నది. ఇటీవల ఆయన వదిలిన ఒక పచ్చబాణం మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది. ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంత నిబద్ధత లేనప్పుడు, స్వార్థ ప్రయోజనాలే ఆ పార్టీ కార్యక్రమంగా ఉన్నప్పుడు... మాయోపాయాలతో కూడిన వ్యూహాలనూ,ఎత్తుగడలనూ ఆశ్రయిస్తుంది. అటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. తాను అధికారంలోకి రావడానికి కారణమైన ఎన్నికల మ్యానిఫెస్టోను మాయం చేసి, వెబ్‌సైట్‌లోంచి కూడా తొలగించిన ఏకైక పార్టీ తెలుగుదేశం. పార్టీ అధ్యక్షుడు తన సిద్ధాంతగ్రంథంగా వెలువరించిన ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని కూడా మార్కెట్‌లో ఎక్కడా లభ్యం కాకుండా మాయం చేసిన ఘనత ఆ పార్టీదే. ఇటువంటి ఘనత ప్రపంచంలో మరో పార్టీకి లేదు.

స్వార్థ ప్రయోజనాలకూ, సిద్ధాంత నిబద్ధతకూ చుక్కెదురు. తన ఆశయ గ్రంథాన్నీ, ఎన్నికల హామీలనూ జనంలో లేకుండా దాచేయడం సిద్ధాంత నిబద్ధత లేదనడానికి నిదర్శనం. స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పటికెయ్యది ప్రయోజనమో అప్పటికా జెండా ఎత్తడాన్ని ఆ పార్టీ ఒక వ్యూహంగా అనుసరిస్తూ వస్తు న్నది. ప్రత్యర్థి పార్టీ ఒక భావజాల నిబద్ధతతో ఉన్నప్పుడు, తాను ప్రకటించిన కార్యక్రమాలను వరుసగా అమలు చేస్తున్న ప్పుడు, తన మ్యానిఫెస్టోకు పటం కట్టి, ఇంటింటికీ వెళ్లి మీరే మార్కులేయండని అడుగుతున్నప్పుడు... ఈ పారదర్శకతను ఎదుర్కోవడం, ఈ నిబద్ధతతో తలపడటం స్వార్థపక్షానికి సాధ్య మవుతుందా? కాదు కనుకనే వైసీపీపై మారీచ యుద్ధ వ్యూహాన్ని టీడీపీ ఎంచుకున్నది. వైసీపీ అమలు చేస్తున్న పేదల అనుకూల కార్యక్రమాలన్నింటిపైనా దుష్ప్రచారం చేయడమే ఎజెండాగా అది తలకెత్తుకున్నది. ఇందులో ఎల్లో మీడియా, రాజకీయ భాగ స్వామిగా కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ పార్టీ తమకు తాము నిర్దేశించిన పాత్రలను పోషిస్తున్నాయి.

పేదల సంక్షేమం కోసం జగన్‌ ప్రభుత్వం ఒక్క పైసా వృధా కాకుండా ఇప్పటికి రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేసింది. ఈ కార్యక్రమం వల్ల ఏపీ మరో శ్రీలంక కాబోతున్నదని వీరు చేసిన ప్రచారం సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ కార్యక్రమం రాష్ట్రాన్ని మాంద్యంలోకి జారకుండా కాపాడిందనీ, జీఎస్‌డీపీ వృద్ధికి దోహదపడిందనీ ఆర్థికవేత్తలు పలువురు ప్రశంసించడంతో వారి గొంతులో వెలక్కాయ పడింది. నగదు బదిలీ అంశాన్ని వదిలిపెట్టి అడ్డ గోలు అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం తప్పని మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విడుదల చేసిన రాష్ట్రాల వారీ అప్పుల జాబితా రుజువు చేసింది.

పేద పిల్లల ఇంగ్లీషు మీడియం చదువుపై చేసిన దుష్ప్ర చారం కూడా ఈ కోవలోదే. భాషాభిమానులను రెచ్చగొట్టడానికి చేతనైనంత ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి దాకా రాజ్యాంగ పదవులు నిర్వహించిన ఒకరిద్దరి సేవలను కూడా ఇందుకు ఉపయోగించుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే నగరం మైలపడిపోతుందని కోర్టుకెక్కారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి కాలనీలు ఏర్పాటు చేస్తుంటే చేసిన తప్పుడు ప్రచారం కూడా అప్పుడే మరిచిపోయేది కాదు. ఇటువంటి ఉదాహరణలు కొన్ని వందలు ఇవ్వొచ్చు. జగన్‌ ప్రభుత్వం మహిళా సాధికారత కార్య క్రమం కూడా ఇప్పుడు వీటి సరసన చేరింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్య కార్యక్రమాల్లో మహిళా సాధికా రత ఒకటి. చంద్రబాబు – పవన్‌ – ఎల్లో మీడియా కూటమికి సిద్ధాంత నిబద్ధత లేకపోవడంతో పాటు ప్రత్యేకంగా మహిళా సాధికారత పట్ల వ్యతిరేకత, మహిళల పట్ల వివక్ష వారి స్వభావా ల్లోనే ఉన్నది. బహిరంగంగా వారు మాట్లాడిన మాటల ద్వారానే ఈ సంగతిని గ్రహించవచ్చు. వీరి మహిళా వ్యతిరేక వైఖరిని ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ ఎండగట్టిన విషయం తెలిసిందే. ఇటువంటి మనస్తత్వమున్న వ్యక్తులు మహిళా సాధికారతను ఎలా సహిస్తారు? అలాగని ఆ భావనను బహిరంగంగా వ్యతిరేకించలేరు. అందుకని దుష్ప్రచా రాలతో చేసే పరోక్ష దాడినే ఎంచుకున్నారు. ఈ దాడిలో తొలి బాణాన్ని వేసే బాధ్యతను పవన్‌ కల్యాణ్‌కు అప్పగించారు చంద్రబాబు.

గోదావరి జిల్లాల పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ ఈ దాడులకు దిగారు. పవన్‌ ప్రసంగంలోని రెండు అంశాలను మహిళా సాధికారతపై పరోక్షంగా జరిగిన దాడిగా విశ్లేషకులు పరిగణి స్తారు. మొదటి అంశం – ‘ఉమన్‌ ట్రాఫికింగ్‌’. రాష్ట్రం నుంచి మూడేళ్లలో 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందనీ, ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నదనీ పవన్‌ ఆరోపించారు. రెండో అంశం – ‘వలంటీర్‌ వ్యవస్థ’. ఒంటరి మహిళలు, వితంతువులు, నిస్సహాయుల వివ రాలు సేకరించి వలంటీర్లు సంఘవిద్రోహ శక్తులకు అప్పగించారనీ, అందువల్లనే ఇన్ని వేలమంది అక్రమ రవాణా సాధ్య మైందనీ ఆయన ఆరోపణ. ఈ వలంటీర్లలో 55 శాతం మంది మహిళలే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. మహిళా సాధికారత కార్యక్రమాలు ఒక ఉద్యమంగా సాగుతున్న తరు
ణంలో ఈ తరహా వ్యాఖ్యలు కచ్చితంగా బురద జల్లడానికీ, పక్కదోవ పట్టించడానికీ ఉద్దేశించినవేననే అభిప్రాయం కలుగు తున్నది.

మహిళా సాధికారత అంటే ఏమిటో అర్థమైతే ఈ తరహా దాడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. మహిళా సాధికారత అనే అంశానికి చాలామంది చాలా రకాలుగా నిర్వచ నాలు చెప్పారు. వాటన్నింటినీ క్రోడీకరిస్తే తేలే విషయం ఒక్కటే. ‘సమస్త జీవన రంగాల్లో భాగస్వామిగా ఉండగలిగే స్వేచ్ఛ – అందలాలను అందుకోవడానికి, వనరులను వినియో గించుకోవడానికి, నిర్ణయాధికార స్వాతంత్య్రానికి సంబంధించి సమాన అవకాశాలు – సాంఘిక కట్టుబాట్లు, వివక్ష లేకుండా తన జీవితంపై తాను సంపూర్ణ హక్కులు కలిగి ఉండటం.’ ఇటు వంటి పరిస్థితులన్నీ ఒనగూడితేనే మహిళా సాధికారత సిద్ధించిందని భావించవలసి ఉంటుంది. ఇటువంటి వ్యవస్థ సాధ్యమవు తుందా అనేది పితృస్వామిక వ్యవస్థల్లో తలెత్తే మొదటి ప్రశ్న. గడచిన కొన్ని దశాబ్దాల పరిణామాలను, కొన్ని పశ్చిమ దేశాలు సాధించిన గణనీయమైన పురోగతిని పరిశీలిస్తే ఇది అసాధ్య మైన విషయం కాదని బోధపడుతుంది. కాకపోతే, ఇందుకు ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు ఈ దిశలో పట్టుదలగా పని చేయవలసి ఉంటుంది.

మహిళా సాధికారతకు దోహదపడే అంశాలేమిటి?
అందుకు అడ్డుపడే అంశాలేమిటి? స్థూలంగా ఒక ఐదు అంశాలు సాధికారతకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. 1. సాధికారతకు ‘విద్య’ తొలి మెట్టు. తమ జీవిత లక్ష్యాలను ఎంచు కోవడానికి, చేరుకోవడానికి, అందుకు సంబంధించిన నిర్ణ యాలను స్వయంగా తెలివిడితో తీసుకోవడానికి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా మెలగడానికి విద్య దోహదపడుతుంది. 2. రెండో మెట్టు – ‘ఆర్థిక స్వాతంత్య్రం’. ఉత్పాదక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తిలో పెరగాలి. ఆర్థిక వనరులు వారికి కూడా అందుబాటులో ఉండాలి. నిర్ణయాధికార స్థానాల్లో వారికి సమాన అవకాశాలు ఉండాలి. 3. ‘ఆరోగ్యం–సంక్షేమం’ మూడో ముఖ్యాంశం. వైద్య–ఆరోగ్య అవకాశాలు అందు బాటులో ఉండటం. వివక్షకు, హింసకు దూరంగా ఉండటం. 4. ‘రాజకీయ ప్రాతినిధ్యం’ నాలుగోది. వివిధ స్థాయిల్లో వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. వారి జీవితాలపై ప్రభావం చూపే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాలి. 5. సాంఘిక కట్టుబాట్లు ఐదో అంశం.

మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలి మారకుండా అవరోధంగా ఉండే శృంఖలాలను తెంచుకుంటూ లింగ వివక్షను తొలగించడం. ఈ ఐదు అంశాల్లో పురోగతి సాధిస్తే సూత్రప్రాయంగా మహిళా సాధికారత సాధించినట్టే! ఈ ఐదు అంశాలకూ విరు ద్ధంగా పనిచేస్తే అవే సాధికారతకు ఆటంకాలుగా మారుతాయి.

మహిళా సాధికారతలో ప్రభుత్వాల చిత్తశుద్ధి, కృషి ముఖ్యం. ఈ పదాన్ని ఉపయోగించకపోయినా భారత రాజ్యాంగంలో ఇదే తరహా కర్తవ్యబోధ ఉన్నది. రాజ్యాంగ పీఠికల్లోనూ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో వివక్షలేని మహిళా భ్యున్నతికి సంబంధించిన అధికరణాలున్నాయి. పేదరికం, పెరుగుతున్న అసమానతలు, పర్యావరణ ముప్పు అనే మూడు భూతాలు మొత్తం భూగోళానికే ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే.

ప్రపంచ రాజ్యాలన్నీ 2015లో సమావేశమై మెరుగైన ప్రపంచం కోసం 17 లక్ష్యాలను ఏర్పర చుకున్నాయి. ఈ లక్ష్యాలను 2030లోగా సాధించాలన్న గడు వును కూడా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాల్లో ఐదవది మహిళా సాధికారత. తీర్మానమైతే చేసుకున్నారు కానీ, చాలా దేశాల్లో సంకల్పం కొరవడినట్టు కనిపిస్తున్నది. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన స్పృహే ఉన్నట్టు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణాలు – రాజకీయ నేతలు స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకోవడం! పేదరికం నుంచి ప్రజ లను బయటకు తీసుకురావడంపై, అసమానతల తొలగింపుపై వారికి అవసరమైన సామాజిక దృక్పథం లేకపోవడం! ఈ ధోరణికి ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్లుగా సాగుతున్న వైఎస్‌ జగన్‌ పరిపాలన భిన్నమైనది.

అంబేడ్కర్‌ రాజ్యాంగ ఆశయాలను జగన్‌ ప్రభుత్వం ఔదలదాల్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గీటురాళ్లుగా పెట్టు కున్నది. ఇందుకు మనం అనేక ఉదాహరణలు ఉటంకించవచ్చు. పేదరికం నుంచి విముక్తి, అసమానతల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున ఉద్యమస్థాయి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇదిగో ఈ ఉద్యమంపైనే చంద్రబాబు – ఎల్లో మీడియా – పవన్‌ కల్యాణ్‌ టీమ్‌ బురదజల్లింది. ఆంధ్రప్రదేశ్‌ శ్రీలంకలా మారు తుందని శాపనార్థాలు పెట్టింది కూడా దీనిపైనే. మహిళా సాధికా రత విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నది. మహిళా సాధికారతకు దోహదపడే
అంశాలను అధ్యయనం చేసి అందుకు అనుగుణమైన చర్యలను తీసుకున్నది.

నాణ్యమైన విద్యావకాశాలను అందరికీ అందు బాటులో తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు చదువులకు దూరం కాకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతే అమ్మాయిలకు పెళ్లి కానుక (కల్యాణమస్తు, షాదీ తోఫా) వర్తిస్తుందనే నియమం వెనుక బాల్య వివాహాలను నిరోధించడంతోపాటు కనీసం ఇంటర్మీడి యట్‌ పూర్తయ్యే వరకైనా బాలికలు డ్రాపవుట్‌లుగా మిగలకుండా ఉంటారనే ఆశాభావం కూడా ఉన్నది. ఈ నిబంధనను కూడా విమర్శించి తన సామాజిక స్పృహ స్థాయేమిటో ప్రతి పక్షం వెల్లడించింది. ఈ నాలుగేళ్ల చర్యల ఫలితంగాæ పాఠశాలల్లో బాలికల సంఖ్య పెరిగింది. అమ్మ ఒడి కూడా అందుకు దోహదపడింది. ఇప్పుడు పాఠశాలల్లో బాలికల సంఖ్య సుమారు 48 శాతానికి చేరుకున్నది. డ్రాపౌట్‌ల సంఖ్య స్థిరంగా తగ్గుతున్నది.
ఆర్థిక రంగంలో మహిళల పురోభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.

‘చేయూత’ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో పదహారున్నర లక్షల మంది మహిళలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడమో, పాత వ్యాపారాలను వృద్ధి చేసుకోవడమో జరిగింది. చంద్రబాబు నమ్మకద్రోహంతో నిస్తేజ మైన పొదుపు సంఘాలను ‘ఆసరా’ పథకం ఆదుకున్నది. పునరుజ్జీవం పొందిన పొదుపు సంఘాలకు ఈ నాలుగేళ్లలో బ్యాంకులు ఒక లక్షా పదహారు వేల కోట్ల రుణాలను అంద జేశాయి. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పొదుపు సంఘాలు క్రియాశీల పాత్రను పోషిస్తున్నాయి. 30 లక్షలమంది మహిళలకు ఇళ్ల పట్టాలు లభించి, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రభుత్వ పథకాల ప్రధాన లబ్ధిదారులుగా మహిళలే ఉన్నారు.

గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది. బాబు కేబినెట్‌లో ఇద్దరు మహిళలుంటే ఇప్పుడు నలుగురున్నారు. గతం కంటే ముఖ్యమైన శాఖలను వారు నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు, జడ్‌పి చైర్మన్‌ పదవుల్లో 55 శాతం
మంది మహిళలే. 50 శాతం నామినేటెడ్‌ పదవులను వారికి రిజర్వ్‌ చేశారు. గ్రామ సచివాలయాల్లో 1,38,026 మందిని నియమిస్తే అందులో 77,935 మంది మహిళలు. వలంటీర్లలో 55 శాతం మంది మహిళలు. ఆరోగ్య శాఖలో చేసిన 48 వేల నియామకాల్లో అత్యధికులు మహిళలు. ఈ సంవత్సరం డిగ్రీ పూర్తిచేసి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందిన లక్షా ముప్ఫయ్‌వేల మందిలో 60 శాతం అమ్మాయిలు. మహిళా సాధికారత దిశలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన కలిగిన ఫలితాల్లో ఇవి కొన్ని మాత్రమే! గర్భిణీలు, బాలింతల దగ్గర నుంచి మహిళల ఆరోగ్య పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వేధింపులకు విరుగుడుగా తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌ సూపర్‌ హిట్టయ్యింది.

ఈ విజయాలను పక్కదారి పట్టించడానికే వ్యూహం ప్రకారం మహిళల అక్రమ రవాణా అంశాన్ని పవన్‌ కల్యాణ్‌ తెరపైకి తెచ్చారని అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకంటే పవన్‌ చెప్పినట్టు ఈ మూడేళ్లలో 30 వేలమంది మహిళల అక్రమ రవాణా జరగలేదు. కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించిన నివే దిక, రాష్ట్ర పోలీసు అధికారుల వివరణ ప్రకారం ఈ మూడేళ్లలో 26,099 మంది ‘అదృశ్య’మయ్యారు. వీటిని మిస్సింగ్‌ కేసులు అంటారు. ట్రాఫికింగ్‌ అనరు. ఈ మొత్తంలో 2019కి ముందు అదృశ్యమై అప్పటికి ఆచూకీ లభించని వారి సంఖ్య కూడా కలిసి ఉన్నది. ఈ అదృశ్యమైన వారిలో 23,394 మందిని గుర్తించి, తిరిగి ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఇక మిగిలింది 2705 మంది. ఇది 2021 డిసెంబర్‌ 31 నాటి లెక్క.

ఆ తర్వాత ఇందులో మరెంతమంది ఇల్లు చేరారనే అంశంపై పోలీసు శాఖ ఆ యా కేసులను పరిశీలించవలసి ఉన్నది. కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ 14వ స్థానంలో ఉన్నది. కానీ, పవన్‌ తీసిన రాగం, దానికి యెల్లో మీడియా, చంద్రబాబు చేసిన రాద్ధాంతం చూస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాత్రమే వేలాది మంది అదృశ్యమయ్యారనే అపోహ కలుగుతుంది. ఈ అపోహ కలిగించడమే వారి లక్ష్యం. వందలు, వేలు కాదు. పదిమంది అదృశ్యమైనా, ఒక్కరు అక్రమంగా రవాణా అయినా ఆందోళన చెందవలసిన విష యమే. సిగ్గుపడవలసిన సంగతే! ఈ పరిస్థితులకు కారణాలే మిటి? పేదరికం, అవిద్య, నిస్సహాయత – ఇటువంటివన్నీ కారణాలవుతాయి. మహిళా సాధికారత ద్వారానే వీటిని జయించగలుగుతారు. ఆ దిశలో పనిచేస్తున్న జగన్‌ ప్రభుత్వ విజయా లను మరపించేందుకే ట్రాఫికింగ్‌ను ముందుకు తెచ్చారనే వాదనకు బలం చేకూరుతున్నది.

సాధికారతకు దోహదపడే అంశాలను బలపరచకపోగా అడ్డంకిగా ఉండే సాంఘిక రుగ్మత లను మాత్రం తెలుగుదేశం కూటమి ఎగదోస్తున్నది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అంటూ చంద్ర బాబు చేసే ప్రచారం ఈ రుగ్మతలకు ఆజ్యం పోసేదే! పైగా ఈ ముఠాలోని ముఖ్యనేతలంతా గతంలో మాట్లాడిన మాటలూ, చేసిన చేష్టలూ మహిళను సాటి మనిషిగా కాక, ఆట వస్తువుగా పరిగణించే దృక్పథానికి ప్రతీకలు. ఇటువంటి శక్తులు మహిళా సాధికారతను సహిస్తాయా? చస్తే సహించవు. లక్షన్నరమంది మహిళలు ఒక్కసారిగా వలంటీర్లుగా సేవారంగంలోకి అడుగు పెట్టి క్రియాశీలంగా వ్యవహరిస్తుంటే తట్టుకోలేని ప్రబుద్ధుడు వారిపై నిందలు మోపడం ఈ అసహనానికి పరాకాష్ఠ!


వర్ధెళ్లి మురళి, Vardhelli959@gmail.com
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement