కుస్తీ మే సవాల్‌ | Boxing Ring is the first of these marriages | Sakshi
Sakshi News home page

కుస్తీ మే సవాల్‌

Published Wed, Apr 3 2019 12:20 AM | Last Updated on Wed, Apr 3 2019 4:20 AM

Boxing Ring is the first of these marriages - Sakshi

స్త్రీకి జీవితంలో ప్రతిదీ ఒక కుస్తీనే.అలాంటి స్త్రీ.. కుస్తీ పోటీల్లో ఉంటే..భర్త చప్పట్లు కొట్టకపోతే ఎలా?!‘బెటర్‌ హాఫ్‌’గా ఒప్పుకున్నప్పుడుచేతికి రింగు తొడిగిస్తారు. బాక్సింగ్‌ చేసే చోటు కూడా రింగే. భార్య బాక్సింగ్‌ రింగ్‌ని ప్రేమించింది.భర్త భార్యను ప్రేమించాలి.. ‘విత్‌ దిస్‌ రింగ్‌’!

‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్‌ దిస్‌ రింగ్‌ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.వధువు, వరుడు ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి అయిపోయింది. జనవరి 1 అది. పెళ్లికి వచ్చినవాళ్లలో ముగ్గురు స్నేహితురాళ్లు ఉన్నారు. వారిలో ఒకరు కెరీర్‌లో పైపైకి ఎదగాలని కోరుకుంటున్న అమ్మాయి. ఇంకొకరు మంచి కాలమిస్టుగా ఎదుగుతున్న అమ్మాయి. మరొకరు ఒక అడుగు పైకి ఎగబాగుతూ, ఒక అడుగు కిందికి జారుతూ ఉన్న నటి. ఆ పెళ్లిలో ఆ ముగ్గురూ ఒక ఒప్పందానికి వస్తారు. సరిగ్గా ఏడాది లోపు తాము కూడా పెళ్లి చేసుకోవాలని. అంతగా పెళ్లిలోని ఆ రింగ్‌ సెరిమనీ వాళ్లలో ఉత్సాహం తెస్తుంది. పెళ్లిప్రమాణాల్లో ‘విత్‌ దిస్‌ రింగ్‌’ అనే మాటకు ఈ ముగ్గురు అమ్మాయిల చెంపలు కెంపులవుతాయి.

నాలుగేళ్ల క్రితం అమెరికన్‌ టెలివిజన్‌ చానల్‌ ‘లైఫ్‌టైమ్‌’లో వచ్చిన రొమాంటిక్‌ కామెడీ డ్రామాలోని థీమ్‌ ఇది. ఆ టీవీ మూవీ పేరు ‘విత్‌ దిస్‌ రింగ్‌’. ‘విత్‌ దిస్‌ రింగ్‌’ అనే పేరుతోనే ఇండియాలో ఈ ఫిబ్రవరిలో యూట్యూబ్‌లోకి ఒక డాక్యుమెంటరీ అప్‌లోడ్‌ అయింది. అందులోనూ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. మనకు తెలిసిన అమ్మాయిలే. మేరీకోమ్, సరితాదేవి, చోటో లోరా. ముగ్గురూ బాక్సర్‌లు. ‘నువ్వసలు అమ్మాయివేనా?’, ‘నీకు పెళ్లెలా అవుతుందనుకున్నావ్‌?’, ‘కండలున్న ఆడదాన్ని ఏ మగాడు చేసుకుంటాడు?’, ‘పరువు తియ్యడానికి పుట్టావే నువ్వు నా కడుపున’,  ‘ఊళ్లో అంతా నవ్వుతున్నారు’, ‘నీ నడక ఎలా మారిపోతోందో తెలుసా.. ఆడతనాన్ని వెతుక్కోవలసి వస్తోంది’.. ఎన్ని మాటలు!! అన్నీ పడ్డారు. బాక్సింగ్‌ ప్రాణం అనుకున్నారు. కష్టాలు అనుభవించారు. తినీ తినకా బరిలో నిలబడ్డారు. ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. పతకాలు సాధించారు. ఊరేం సంతోషించలేదు. పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు.

దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. బాక్సింగ్‌ రింగ్‌.. ఈ ముగ్గురి ఫస్ట్‌ మ్యారేజ్‌. ఆ తర్వాతే మ్యారేజ్‌ రింగ్‌. ఇంట్లో వద్దన్న పని చెయ్యడం కష్టం. ఊరు వద్దన్న పని చెయ్యడం ఇంకా కష్టం. ఆ రెండు కష్టాలనూ వీళ్లు బాక్సింగ్‌తో ముఖం మీద.. ముఖం మీద గుద్దేసి, విజేతలయ్యారు. ‘విత్‌ దిస్‌ రింగ్‌’ అనే ఈ డాక్యుమెంటరీ ఇప్పటికిప్పుడు యూట్యూబ్‌లో మీకు అందుబాటులో ఉంది. అయితే ఇవాళ మనస్టోరీ పై ముగ్గురి స్నేహితురాళ్లు, కింది ముగ్గురు మహిళా బాక్సర్‌ల గురించి కాదు. అమీషా జోషి, అన్నా సర్కిస్సియన్‌ అనే ఇద్దరు అమ్మాయిల గురించి! మేరీ కోమ్, సరితాదేవి, ఛోటో లోరాలపై డాక్యుమెంటరీ తీసింది వీళ్లే. బాక్సర్‌లుగా ఎదగడానికి ఆ ముగ్గరూ ఎంత కష్టపడ్డారో, వాళ్లపై డాక్యుమెంటరీ తియ్యడానికి వీళ్లిద్దరూ అంత కష్టపడ్డారు. గంటన్నర నిడివి ఉన్న ఈ చిత్రాన్ని తియ్యడానికి వీళ్లకు పదేళ్లు పట్టింది!!అమీషా, అన్నా ఎవరికి వారుగా ఫిల్మ్‌మేకర్‌లు. చిన్న వయసే. కెనడాలో ఉంటారు. అనుకోకుండా కలుసుకున్నారు. ఎవరైనా బయోపిక్‌లు, బయోబుక్‌లు తేవాలంటే.. ఇన్‌స్పైరింగ్‌ పీపుల్‌ ఎవరా అని వెదకుతారు.

వీళ్లకు ఆ సమస్య లేదు. ప్రతి మహిళ జీవితమూ ఇన్‌స్పైరింగే వీళ్ల ఉద్దేశంలో. అయితే మేరీ, సరిత, ఛోటోల స్టోరీ అనుకున్నప్పుడు ఇన్‌స్పైరింగ్‌ని పక్కన పెట్టి, వాళ్ల స్ట్రగుల్‌ని ముఖ్యాంశంగా తీసుకున్నారు. ఎక్కడో ఈశాన్య భారతదేశంలో, పేదరికంలో, సంప్రదాయాల చట్రాల్లో ఉన్న ఆడపిల్లలు ఏంటి, బాక్సింగ్‌ రింగ్‌లోకి రావడమేంటి! వచ్చి విజయం సాధించడం ఏంటి! డాక్యుమెంటరీ తియ్యాల్సిందే అనుకున్నారు. ఊరికే అవుతుందా? రిసెర్చ్‌ అవసరం. ఆట టఫ్‌గా ఉంటుంది. ట్రైనింగ్‌ ఇంకా టఫ్‌గా ఉంటుంది. ఇక లేత బలహీనమైన ఎముకలు గల ఆ అమ్మాయిల మనోబలం వాటికి మించి టఫ్‌గా ఉందని.. అన్నా, అమీషలకు తెలుస్తూనే ఉంది. బయల్దేరారు. ఆ ముగ్గురు బాక్సర్‌లు పుట్టిన ఊరికి, ఆడిన ఊరికీ, పతకం గెలిచిన ఊరికీ తిరిగారు. శ్రమ పడ్డారు. నోట్స్‌ రాసుకున్నారు. షూట్స్‌ చేశారు. డబ్బులు ఖర్చుపెట్టారు. మరి వీటన్నిటికీ టైమ్‌? ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లే. సెలవురోజుల్లో కొంత పని. సెలవు పెట్టి కొంత పని. ఇలా పదేళ్లు.. ఓ భారీ నీటì పారుదల ప్రాజెక్టును కట్టినట్లుగా.. జీవితం అనే ఒక బరిలో, బాక్సింగ్‌ అనే ఇంకో బరిలో మేరీ, సరితా ఛోటో ఎలా నెగ్గుకొచ్చిందీ చిత్రీకరించారు. 

అన్నా అయితే ఒక ఆటగా బాక్సింగ్‌ను ఎప్పుడూ ఇష్టపడలేదు. మేరి, సరిత, ఛోటోల ఆట చూశారు కాబట్టి ఇష్టపడ్డారు. మామూలుగానైతే విస్మయపరిచే అనామక స్త్రీల జీవితాలను అన్నాను నమ్మోహనపరుస్తాయి. అయితే ఈ ముగ్గురి గురించి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు.. ఒక స్త్రీ జీవన పోరాటాన్ని డాక్యుమెంటరీని తీయడానికి అవసరమైన స్క్రీన్‌ ప్లే అన్నాకు లభించింది.పదేళ్ల తర్వాతనైనా డాక్యుమెంటరీ పూర్తయినందుకు అమీషా కూడా విశ్రాంతిగా వేళ్లు విరుచుకుంటున్నారు. ‘బాబోయ్‌.. చిన్న పనైతే కాదు’’ అని నవ్వుతోంది అమీషా. డాక్యుమెంటరీ కోసం ఈ ఇద్దరూ రోజూ సాయంత్రాలలో, శని ఆదివారాల్లో పూర్తిగా డే అంతా పని చేశారు. ప్రాజెక్టులో సగభాగం పూర్తయ్యాక.. సగంలో ఆపేద్దాం అని కూడా అనుకున్నారు. ఒళ్లంతా సినిమా రీళ్లు చుట్టుకుపోయి తమను బందీలను చేసినట్లు ఫీలయ్యారు. సొంత డబ్బు సరిపోవడం లేదు. ఫండింగ్‌ చేసేవాళ్లు.. మహిళల బాక్సింగ్‌ అంటే చిన్న పంచ్‌లాంటి చూపు విసిరి.. మీకేం పనిలేదా? పని లేని పనికి ఫండింగ్‌ కూడానా అన్నట్లు వెళ్లిపోయేవారు.

ఓ రోజు అమీషా అంది... ‘‘మనకేనా ఈ ఎగ్జయింట్‌మెంట్‌! ప్రపంచానికి లేదా?’’ అని. ‘మేరీ కోమ్‌’ సినిమా బాగా ఆడింది. ‘దంగల్‌’ ఇంకా బాగా ఆడింది. ఒకటి బాక్సింగ్‌. ఇంకొకటి రెజ్లింగ్‌. రెండూ స్త్రీలు చేసినవే. ఆ ధైర్యంతో ముందుకు వెళ్లారు. డబ్బు సంపాదించడం కోసం కాదు. ముందసలు జనాల్లోకి వెళ్లాలి. పెళ్లి, పిల్లలు కాకుండా కెరియర్‌లో ఎదగాలన్న అభిలాష ఉన్న యువతుల జీవితాల్లో ఎంత కష్టం ఉంటుందో తెలియాలి. మహిళా బాక్సింగ్‌లో ఇండియాకు, కెనడాకు తేడా ఉంటుంది. కెనడా కన్నా ఇండియా చాలా నయం. కెనడానే కాదు, తక్కిన దేశాలతో పోలిస్తే కూడా.. ఉమెన్‌ బాక్సింగ్‌ ఈవెంట్‌కి ఇండియాలో డబ్బులు కుమ్మరించే స్పాన్సరర్‌లు చాలామందే ఉంటారు. కెనడాలో ఫండింగే ఉండదు. మహిళలు ఒక హాబీగా మాత్రమే ఆడతారు. వాళ్లకు సొంత జిమ్‌లు ఉంటాయి. ట్రైనర్‌ను పిలిపించుకుని అక్కడే శిక్షణ పొందుతారు. ముందు జాబ్‌ చూసుకుంటారు. బాక్సింగ్‌ పోటీలకు వెళ్లాలనుకున్నప్పుడు.. అప్పుడు ఫండ్‌ రైజింగ్‌ కోసం చూస్తారు. ఇండియాలో అసలు చదువుతున్నప్పుడే ఆర్థిక సహాయం చేసేవాళ్లుంటారు.

ప్రభుత్వమూ ముందుకొస్తుంది. బాగా ఆడితే ఉద్యోగం ఇస్తుంది. ఒకసారి ఉద్యోగం వచ్చాక జీవితం స్థిరపడిననట్లే. ఇన్ని అవకాశాలు, సదుపాయాలు ఉన్నా కూడా భారతదేశంలో మహిళా బాక్సర్‌లు కుటుంబ ఆంక్షల వల్ల, పెళ్లి కాదేమోనన్న పెద్దవాళ్ల భయాల వల్ల ఆశను చంపుకోవలసి వస్తోంది. ఈ విషయాలన్నీ అన్నా, అమీషా ఇండియా టూర్‌లో ఉన్నప్పుడు అర్థం చేసుకున్నారు. వాటన్నిటినీ డాక్యుమెంటరీలో.. చూసింది చూసినట్లు చూపిస్తే ఈ ముగ్గురూ ఎగిరిపోయి, భారతదేశంలో క్రీడలకు లభిస్తున్న ప్రోత్సాహం ఒక్కటే కనిపిస్తుంది. అందుకే మొదట మేరీ కోమ్‌ చుట్టూ ఆమె నిజ జీవితాన్ని ఒక కథగా అల్లుకున్నారు. తర్వాత మిగతా ఇద్దరి లైఫ్‌ని, లైఫ్‌ అచీవ్‌మెంట్స్‌నీ తీసుకున్నారు. లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే లోపు సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్‌ స్త్రీ కెరీర్‌కి. అర్థం చేసుకునే మనిషి, హెల్ప్‌ చేసే మనిషి భర్తగా దొరికితే కెరీర్‌లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి.

మేరీకోమ్‌కి, సరితకు పెళ్లయింది. మేరీ కోమ్‌ భర్త.. పిల్లల్ని భద్రంగా చూసుకుంటాడు. ఆట ఆడేందుకు అవసరమైన స్థిమితత్వాన్ని ఆమెకు చేకూరుస్తాడు. సరిత భర్త కూడా అంతే. వాళ్లకొక కొడుకు. సరిత ఈవెంట్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నప్పుడు వాడికి తల్లీ తండ్రీ అతడే. వాస్తవానికి మేరీ, సరిత.. పెళ్లయ్యాకే మెరుగైన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీళ్లిలా శ్రమ పడడం, భర్త సహకరించడం.. డాక్యుమెంటరీలో ఇవేవీ నేరుగా చూపించలేదు అన్నా, అమీషా. చూస్తుంటే తెలిసిపోతుంది.. చిన్న మాట, చిన్న సహాయం తోడుగా ఉంటే స్త్రీలు ఎంత కష్టమైన ఆటలోనైనా అత్యున్నతస్థాయిలో రాణించగలరని.ఇంతకీ ఈ డాక్యుమెంటరీకి ‘విత్‌ దిస్‌ రింగ్‌’ అని పేరెందుకు పెట్టినట్లు?‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్‌ దిస్‌ రింగ్‌ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.. అనే పెళ్లి ప్రమాణంలోని ఈ మాటను ఇక్కడ మనం మరొక రకంగా అర్థం చేసుకోవాలి. ‘నిన్నే కాదు.. ఆటపై ఉన్న నీ ఇష్టాన్నీ ప్రేమిస్తున్నాను’ అని. జీవిత భాగస్వామిగా నీ ఇష్టానికి పూర్తి భాగం ఇస్తాను’ అని కూడా! అన్నా.. అమీష అభినందనీయులు. 

►పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు.

►అర్థం చేసుకునే మనిషి, హెల్ప్‌ చేసే మనిషి భర్తగా దొరికితే స్త్రీకి కెరీర్‌లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి.

►లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే దారిలో సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్‌ స్త్రీ కెరీర్‌కి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement