Saritadevi
-
భర్తను హతమార్చిన భార్య.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: తాగుడుకు అలవాటు పడితే ఆ మైకంలో ఏం చేస్తారో వారికే తెలియదు. తాగుడుకు బానిసై తమను అశ్రద్ధ చేస్తున్నాడని భార్య కట్టుకున్న భర్తనే చంపగా, తాగటానికి డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి కన్నతల్లినే కడతేర్చాడు. ఈ రెండు వేర్వేరు ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఫతేపూర్‌కు చెందిన సరితాదేవి, సికిందర్ సహని భార్యాభర్తలు. సికిందర్‌కు పూటుగా మద్యం తాగే అలవాటు ఉంది. ప్రతి రోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. పిల్లలముందే నోటికొచ్చినట్లు తిట్టేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడు మరోసారి తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన సరిత, చీర తీసుకుని మత్తులో ఉన్న భర్త మెడకు బిగించింది. దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఆమె వెంటనే తన భర్తను సఫ్దార్జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే మెడపై కొన్ని గుర్తులు ఉండటంతో హత్య అని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీసీపీ అతుల్ ఠాకుర్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని ప్రశ్నించారు. ఆమె పొంతన లేని మాటలు మాట్లాడటంతో ఇది హత్యేనన్న అనుమానం మరింత బలపడింది. దీంతో మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షలు చేయించారు. ఆ తర్వాత సరితను తమదైన శైలిలో విచారించగా, భర్త తాగుడుకు బానిసవ్వడం, ఏ పని చేయకపోవడం వల్లే హత్య చేసినట్లు అంగీకరించింది. తాగడానికి డబ్బులివ్వలేదని.. ఢిల్లీలోని నార్త్ ఈస్ట్‌లో 64 ఏళ్ళ వృద్దురాలిని ఆమె కొడుకు హత్యచేశాడు. తాగడానికి డబ్బులివ్వాలని సుశీల్ పాండే తన తల్లి లల్లిదేవిని బలవంతపెట్టాడు. ఆమె డబ్బులివ్వడానికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన అతడు స్ర్కూడ్రైవర్ తీసుకొని తల్లిని క్రూరంగా హత్యచేశాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు సుశీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి -
కుస్తీ మే సవాల్
స్త్రీకి జీవితంలో ప్రతిదీ ఒక కుస్తీనే.అలాంటి స్త్రీ.. కుస్తీ పోటీల్లో ఉంటే..భర్త చప్పట్లు కొట్టకపోతే ఎలా?!‘బెటర్ హాఫ్’గా ఒప్పుకున్నప్పుడుచేతికి రింగు తొడిగిస్తారు. బాక్సింగ్ చేసే చోటు కూడా రింగే. భార్య బాక్సింగ్ రింగ్‌ని ప్రేమించింది.భర్త భార్యను ప్రేమించాలి.. ‘విత్ దిస్ రింగ్’! ‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్ దిస్ రింగ్ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.వధువు, వరుడు ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి అయిపోయింది. జనవరి 1 అది. పెళ్లికి వచ్చినవాళ్లలో ముగ్గురు స్నేహితురాళ్లు ఉన్నారు. వారిలో ఒకరు కెరీర్లో పైపైకి ఎదగాలని కోరుకుంటున్న అమ్మాయి. ఇంకొకరు మంచి కాలమిస్టుగా ఎదుగుతున్న అమ్మాయి. మరొకరు ఒక అడుగు పైకి ఎగబాగుతూ, ఒక అడుగు కిందికి జారుతూ ఉన్న నటి. ఆ పెళ్లిలో ఆ ముగ్గురూ ఒక ఒప్పందానికి వస్తారు. సరిగ్గా ఏడాది లోపు తాము కూడా పెళ్లి చేసుకోవాలని. అంతగా పెళ్లిలోని ఆ రింగ్ సెరిమనీ వాళ్లలో ఉత్సాహం తెస్తుంది. పెళ్లిప్రమాణాల్లో ‘విత్ దిస్ రింగ్’ అనే మాటకు ఈ ముగ్గురు అమ్మాయిల చెంపలు కెంపులవుతాయి. నాలుగేళ్ల క్రితం అమెరికన్ టెలివిజన్ చానల్ ‘లైఫ్‌టైమ్’లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామాలోని థీమ్ ఇది. ఆ టీవీ మూవీ పేరు ‘విత్ దిస్ రింగ్’. ‘విత్ దిస్ రింగ్’ అనే పేరుతోనే ఇండియాలో ఈ ఫిబ్రవరిలో యూట్యూబ్‌లోకి ఒక డాక్యుమెంటరీ అప్లోడ్ అయింది. అందులోనూ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. మనకు తెలిసిన అమ్మాయిలే. మేరీకోమ్, సరితాదేవి, చోటో లోరా. ముగ్గురూ బాక్సర్లు. ‘నువ్వసలు అమ్మాయివేనా?’, ‘నీకు పెళ్లెలా అవుతుందనుకున్నావ్?’, ‘కండలున్న ఆడదాన్ని ఏ మగాడు చేసుకుంటాడు?’, ‘పరువు తియ్యడానికి పుట్టావే నువ్వు నా కడుపున’, ‘ఊళ్లో అంతా నవ్వుతున్నారు’, ‘నీ నడక ఎలా మారిపోతోందో తెలుసా.. ఆడతనాన్ని వెతుక్కోవలసి వస్తోంది’.. ఎన్ని మాటలు!! అన్నీ పడ్డారు. బాక్సింగ్ ప్రాణం అనుకున్నారు. కష్టాలు అనుభవించారు. తినీ తినకా బరిలో నిలబడ్డారు. ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. పతకాలు సాధించారు. ఊరేం సంతోషించలేదు. పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. బాక్సింగ్ రింగ్.. ఈ ముగ్గురి ఫస్ట్ మ్యారేజ్. ఆ తర్వాతే మ్యారేజ్ రింగ్. ఇంట్లో వద్దన్న పని చెయ్యడం కష్టం. ఊరు వద్దన్న పని చెయ్యడం ఇంకా కష్టం. ఆ రెండు కష్టాలనూ వీళ్లు బాక్సింగ్‌తో ముఖం మీద.. ముఖం మీద గుద్దేసి, విజేతలయ్యారు. ‘విత్ దిస్ రింగ్’ అనే ఈ డాక్యుమెంటరీ ఇప్పటికిప్పుడు యూట్యూబ్‌లో మీకు అందుబాటులో ఉంది. అయితే ఇవాళ మనస్టోరీ పై ముగ్గురి స్నేహితురాళ్లు, కింది ముగ్గురు మహిళా బాక్సర్ల గురించి కాదు. అమీషా జోషి, అన్నా సర్కిస్సియన్ అనే ఇద్దరు అమ్మాయిల గురించి! మేరీ కోమ్, సరితాదేవి, ఛోటో లోరాలపై డాక్యుమెంటరీ తీసింది వీళ్లే. బాక్సర్లుగా ఎదగడానికి ఆ ముగ్గరూ ఎంత కష్టపడ్డారో, వాళ్లపై డాక్యుమెంటరీ తియ్యడానికి వీళ్లిద్దరూ అంత కష్టపడ్డారు. గంటన్నర నిడివి ఉన్న ఈ చిత్రాన్ని తియ్యడానికి వీళ్లకు పదేళ్లు పట్టింది!!అమీషా, అన్నా ఎవరికి వారుగా ఫిల్మ్మేకర్లు. చిన్న వయసే. కెనడాలో ఉంటారు. అనుకోకుండా కలుసుకున్నారు. ఎవరైనా బయోపిక్‌లు, బయోబుక్లు తేవాలంటే.. ఇన్స్పైరింగ్ పీపుల్ ఎవరా అని వెదకుతారు. వీళ్లకు ఆ సమస్య లేదు. ప్రతి మహిళ జీవితమూ ఇన్స్పైరింగే వీళ్ల ఉద్దేశంలో. అయితే మేరీ, సరిత, ఛోటోల స్టోరీ అనుకున్నప్పుడు ఇన్స్పైరింగ్ని పక్కన పెట్టి, వాళ్ల స్ట్రగుల్‌ని ముఖ్యాంశంగా తీసుకున్నారు. ఎక్కడో ఈశాన్య భారతదేశంలో, పేదరికంలో, సంప్రదాయాల చట్రాల్లో ఉన్న ఆడపిల్లలు ఏంటి, బాక్సింగ్ రింగ్‌లోకి రావడమేంటి! వచ్చి విజయం సాధించడం ఏంటి! డాక్యుమెంటరీ తియ్యాల్సిందే అనుకున్నారు. ఊరికే అవుతుందా? రిసెర్చ్ అవసరం. ఆట టఫ్‌గా ఉంటుంది. ట్రైనింగ్ ఇంకా టఫ్‌గా ఉంటుంది. ఇక లేత బలహీనమైన ఎముకలు గల ఆ అమ్మాయిల మనోబలం వాటికి మించి టఫ్‌గా ఉందని.. అన్నా, అమీషలకు తెలుస్తూనే ఉంది. బయల్దేరారు. ఆ ముగ్గురు బాక్సర్లు పుట్టిన ఊరికి, ఆడిన ఊరికీ, పతకం గెలిచిన ఊరికీ తిరిగారు. శ్రమ పడ్డారు. నోట్స్ రాసుకున్నారు. షూట్స్ చేశారు. డబ్బులు ఖర్చుపెట్టారు. మరి వీటన్నిటికీ టైమ్? ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లే. సెలవురోజుల్లో కొంత పని. సెలవు పెట్టి కొంత పని. ఇలా పదేళ్లు.. ఓ భారీ నీటì పారుదల ప్రాజెక్టును కట్టినట్లుగా.. జీవితం అనే ఒక బరిలో, బాక్సింగ్ అనే ఇంకో బరిలో మేరీ, సరితా ఛోటో ఎలా నెగ్గుకొచ్చిందీ చిత్రీకరించారు. అన్నా అయితే ఒక ఆటగా బాక్సింగ్‌ను ఎప్పుడూ ఇష్టపడలేదు. మేరి, సరిత, ఛోటోల ఆట చూశారు కాబట్టి ఇష్టపడ్డారు. మామూలుగానైతే విస్మయపరిచే అనామక స్త్రీల జీవితాలను అన్నాను నమ్మోహనపరుస్తాయి. అయితే ఈ ముగ్గురి గురించి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు.. ఒక స్త్రీ జీవన పోరాటాన్ని డాక్యుమెంటరీని తీయడానికి అవసరమైన స్క్రీన్ ప్లే అన్నాకు లభించింది.పదేళ్ల తర్వాతనైనా డాక్యుమెంటరీ పూర్తయినందుకు అమీషా కూడా విశ్రాంతిగా వేళ్లు విరుచుకుంటున్నారు. ‘బాబోయ్.. చిన్న పనైతే కాదు’’ అని నవ్వుతోంది అమీషా. డాక్యుమెంటరీ కోసం ఈ ఇద్దరూ రోజూ సాయంత్రాలలో, శని ఆదివారాల్లో పూర్తిగా డే అంతా పని చేశారు. ప్రాజెక్టులో సగభాగం పూర్తయ్యాక.. సగంలో ఆపేద్దాం అని కూడా అనుకున్నారు. ఒళ్లంతా సినిమా రీళ్లు చుట్టుకుపోయి తమను బందీలను చేసినట్లు ఫీలయ్యారు. సొంత డబ్బు సరిపోవడం లేదు. ఫండింగ్ చేసేవాళ్లు.. మహిళల బాక్సింగ్ అంటే చిన్న పంచ్లాంటి చూపు విసిరి.. మీకేం పనిలేదా? పని లేని పనికి ఫండింగ్ కూడానా అన్నట్లు వెళ్లిపోయేవారు. ఓ రోజు అమీషా అంది... ‘‘మనకేనా ఈ ఎగ్జయింట్మెంట్! ప్రపంచానికి లేదా?’’ అని. ‘మేరీ కోమ్’ సినిమా బాగా ఆడింది. ‘దంగల్’ ఇంకా బాగా ఆడింది. ఒకటి బాక్సింగ్. ఇంకొకటి రెజ్లింగ్. రెండూ స్త్రీలు చేసినవే. ఆ ధైర్యంతో ముందుకు వెళ్లారు. డబ్బు సంపాదించడం కోసం కాదు. ముందసలు జనాల్లోకి వెళ్లాలి. పెళ్లి, పిల్లలు కాకుండా కెరియర్లో ఎదగాలన్న అభిలాష ఉన్న యువతుల జీవితాల్లో ఎంత కష్టం ఉంటుందో తెలియాలి. మహిళా బాక్సింగ్‌లో ఇండియాకు, కెనడాకు తేడా ఉంటుంది. కెనడా కన్నా ఇండియా చాలా నయం. కెనడానే కాదు, తక్కిన దేశాలతో పోలిస్తే కూడా.. ఉమెన్ బాక్సింగ్ ఈవెంట్‌కి ఇండియాలో డబ్బులు కుమ్మరించే స్పాన్సరర్లు చాలామందే ఉంటారు. కెనడాలో ఫండింగే ఉండదు. మహిళలు ఒక హాబీగా మాత్రమే ఆడతారు. వాళ్లకు సొంత జిమ్‌లు ఉంటాయి. ట్రైనర్‌ను పిలిపించుకుని అక్కడే శిక్షణ పొందుతారు. ముందు జాబ్ చూసుకుంటారు. బాక్సింగ్ పోటీలకు వెళ్లాలనుకున్నప్పుడు.. అప్పుడు ఫండ్ రైజింగ్ కోసం చూస్తారు. ఇండియాలో అసలు చదువుతున్నప్పుడే ఆర్థిక సహాయం చేసేవాళ్లుంటారు. ప్రభుత్వమూ ముందుకొస్తుంది. బాగా ఆడితే ఉద్యోగం ఇస్తుంది. ఒకసారి ఉద్యోగం వచ్చాక జీవితం స్థిరపడిననట్లే. ఇన్ని అవకాశాలు, సదుపాయాలు ఉన్నా కూడా భారతదేశంలో మహిళా బాక్సర్లు కుటుంబ ఆంక్షల వల్ల, పెళ్లి కాదేమోనన్న పెద్దవాళ్ల భయాల వల్ల ఆశను చంపుకోవలసి వస్తోంది. ఈ విషయాలన్నీ అన్నా, అమీషా ఇండియా టూర్లో ఉన్నప్పుడు అర్థం చేసుకున్నారు. వాటన్నిటినీ డాక్యుమెంటరీలో.. చూసింది చూసినట్లు చూపిస్తే ఈ ముగ్గురూ ఎగిరిపోయి, భారతదేశంలో క్రీడలకు లభిస్తున్న ప్రోత్సాహం ఒక్కటే కనిపిస్తుంది. అందుకే మొదట మేరీ కోమ్ చుట్టూ ఆమె నిజ జీవితాన్ని ఒక కథగా అల్లుకున్నారు. తర్వాత మిగతా ఇద్దరి లైఫ్‌ని, లైఫ్ అచీవ్మెంట్స్నీ తీసుకున్నారు. లైఫ్ అచీవ్మెంట్ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే లోపు సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్ స్త్రీ కెరీర్‌కి. అర్థం చేసుకునే మనిషి, హెల్ప్ చేసే మనిషి భర్తగా దొరికితే కెరీర్లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి. మేరీకోమ్‌కి, సరితకు పెళ్లయింది. మేరీ కోమ్ భర్త.. పిల్లల్ని భద్రంగా చూసుకుంటాడు. ఆట ఆడేందుకు అవసరమైన స్థిమితత్వాన్ని ఆమెకు చేకూరుస్తాడు. సరిత భర్త కూడా అంతే. వాళ్లకొక కొడుకు. సరిత ఈవెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాడికి తల్లీ తండ్రీ అతడే. వాస్తవానికి మేరీ, సరిత.. పెళ్లయ్యాకే మెరుగైన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీళ్లిలా శ్రమ పడడం, భర్త సహకరించడం.. డాక్యుమెంటరీలో ఇవేవీ నేరుగా చూపించలేదు అన్నా, అమీషా. చూస్తుంటే తెలిసిపోతుంది.. చిన్న మాట, చిన్న సహాయం తోడుగా ఉంటే స్త్రీలు ఎంత కష్టమైన ఆటలోనైనా అత్యున్నతస్థాయిలో రాణించగలరని.ఇంతకీ ఈ డాక్యుమెంటరీకి ‘విత్ దిస్ రింగ్’ అని పేరెందుకు పెట్టినట్లు?‘‘నీపై నాకున్న ప్రేమకు సాక్షిగా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. విత్ దిస్ రింగ్ (ఈ ఉంగరంతో) నేనెప్పుడూ నీకు తోడుగా నీ వెంటే ఉంటానని, నీకు విధేయుడైన భర్తగా / విధేయురాలినైన భార్యగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’.. అనే పెళ్లి ప్రమాణంలోని ఈ మాటను ఇక్కడ మనం మరొక రకంగా అర్థం చేసుకోవాలి. ‘నిన్నే కాదు.. ఆటపై ఉన్న నీ ఇష్టాన్నీ ప్రేమిస్తున్నాను’ అని. జీవిత భాగస్వామిగా నీ ఇష్టానికి పూర్తి భాగం ఇస్తాను’ అని కూడా! అన్నా.. అమీష అభినందనీయులు. ►పతకం మెడలో వేసుకోడానికి పనికొస్తుంది. పతకానికి తాళి కడతాడా ఎవరైనా.. ఎంత బంగారు పతకమైనా! వ్యంగ్యం, అవమానాలు! తట్టుకుని నిలబడ్డారు. దేశమే తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగారు. ►అర్థం చేసుకునే మనిషి, హెల్ప్ చేసే మనిషి భర్తగా దొరికితే స్త్రీకి కెరీర్లో ఎదురయ్యే అవాంతరాలన్నీ వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి. ►లైఫ్ అచీవ్మెంట్ అంటే బాక్సింగ్‌లో బంగారు పతకాలు, అర్జున అవార్డులు కాదు. బరి వరకు వెళ్లే దారిలో సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎదురయ్యే పంచ్‌లను తప్పించుకోవడం. మరి పెళ్లి?! పెళ్లి పెద్ద పంచ్ స్త్రీ కెరీర్‌కి. -
ఫస్ట్ పంచ్
ఫస్ట్ పంచా?! అంటే? సరితాదేవి ఇంతకుముందెప్పుడూ పంచ్ ఇవ్వలేదా? ఇచ్చారు. పంచ్‌లు ఇచ్చారు. పతకాలు తెచ్చారు. కానీ ఇప్పుడు ఆమె ఇవ్వబోతున్నది ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఫస్ట్ పంచ్. ఇంతకాలం అమెచ్యూర్‌గా ఆడి, ఇప్పుడు ప్రొఫెషనల్‌గానూ సత్తా చూపబోతున్న సరిత.. త్వరలో తొలి భారతీయ మహిళా ప్రొఫెషనల్ బాక్సర్ అనే రికార్డ్ సాధించబోతున్నారు. బాక్సింగ్‌లో రెండు రకాలు. అమెచ్యూర్, ప్రొఫెషనల్. బాక్సర్ కంటికి దెబ్బతగిలి, కంటి చుట్టూ వాపొచ్చి, రక్తం కారుతుంటే ఆట ఆగిపోతుంది. అది అమెచ్యూర్. బరిలో ఉన్న బాక్సర్ల తలకు రక్షణగా హెడ్‌గార్డ్స్ ఉంటాయి. అది అమెచ్యూర్. ఆట కన్నా కూడా బాక్సర్ల రక్షణకే రిఫరీ ప్రాధాన్యం ఇస్తాడు. అది అమెచ్యూర్. బాక్సర్ నీరసించి నిలబడలేకపోతుంటే రిఫరీ ఆట ఆపేస్తాడు. అది అమెచ్యూర్. దూకుడు మీదున్న బాక్సర్.. రెఫరీ వార్నింగ్‌లను పట్టించుకోకపోతే ఆట ఆగిపోతుంది. అది అమెచ్యూర్. కన్ను వాచి, రక్తం కారుతుంటుంది. అయినా ఆట ఆగదు. అది ప్రొఫెషనల్. బాక్సర్ తలకు హెడ్‌గార్డ్స్ ఉండవు. అది ప్రొఫెషనల్. ఆటకు తప్ప ఆటగాళ్ల రక్షణకు ప్రాధాన్యం ఉండదు. అది ప్రొఫెషనల్. బాక్సర్ ఆడలేకపోయినా ఆట కంటిన్యూ అవుతుంది. అది ప్రొఫెషనల్. బాక్సర్.. రిఫరీ వార్నింగ్‌లను పట్టించుకోకపోయినా ఆట కొనసాగుతుంది. అది ప్రొఫెషనల్. ఒక్కమాటలో.. అమెచ్యూర్ అనేది సాఫ్ట్ బాక్సింగ్. ప్రొఫెషనల్ అనేది హార్డ్ బాక్సింగ్. డేంజరస్. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో చనిపోయినవాళ్లు కూడా ఉన్నారు! ఇండియాలో ప్రొఫెషనల్ బాక్సర్లు చాలామందే ఉన్నారు. అయితే అందరూ మగవాళ్లే. ఇప్పటి వరకు ఒక్క మహిళా ప్రొఫెషనల్ బాక్సర్ లేరు. కానీ త్వరలో రాబోతున్నారు!! అమెచ్యూర్ బాక్సర్ సరితాదేవి.. అమెచ్యూర్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ సరితాదేవి.. అమెచ్యూర్ ఏషియన్ బాక్సింగ్ చాంపియన్ సరితాదేవి... ఈ నెల 29న భారతదేశ తొలి మహిళా ప్రొఫెషనల్ బాక్సర్‌గా బరిలోకి దిగబోతున్నారు. హంగేరి మహిళా బాక్సర్ సోఫియా బెడోతో ఫైట్ చెయ్యబోతున్నారు. తాడోపేడో. డూ ఆర్ డై. కలత.. కసిగా మారిందా?! ఎవరు డూ ఆర్ డై అంటున్నది?! కాంస్య పతకం వస్తే నాకక్కర్లేదు అని తిప్పికొట్టిన ఆ అమ్మాయా? రెఫరీ పొరపాటుకు నేను బలయ్యాను అని బోరుమని ఏడ్చిన ఆ అమ్మాయా? క్రమశిక్షణ చర్యగా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆ అమ్మాయా? ఆ అమ్మాయే! అయితే అవన్నీ తుడిచేయండి. సరితాదేవి ఇప్పుడు కసితో ఉన్నారు. ఆట మీద ప్రేమ ఉన్నప్పుడు ఆమె అమెచ్యూర్. ఆటలో అటో ఇటో తేలిపోవాలన్న కసితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రొఫెషనల్. తొలిసారి ప్రొఫెషనల్ బాక్సర్‌గా సరితాదేవి తలపడబోతున్న సోఫియా ఇప్పటికే 59 ప్రొఫెషనల్ ‘బౌట్’లు (మ్యాచ్‌లు) ఆడారు. వాటిల్లో 19 బౌట్లు గెలిచారు. వయసు 29. ఆమె కన్నా సరితాదేవి రెండేళ్లు పెద్ద. పైగా ఆలస్యంగా ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి వచ్చారు. ప్రత్యర్థికి ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు సరితాదేవి గెలవడం అటుంచి, బరిలో కాసేపైనా నిలదొక్కుకోగలరా అని సందేహం. అయితే సరితాదేవికి ఇలాంటి సందేహాలేమీ లేవు. తనకు సమ ఉజ్జీ దొరికిందని ఆమె ఉత్సాహంగా ఉన్నారు. అలీ గురువే ఇప్పుడు సరిత కోచ్! ప్రస్తుతం సరిత.. జో క్లాఫ్ దగ్గర ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయన వయసు 73 ఏళ్లు! లెజెండ్ బాక్సర్ ఇవాండర్ హోలీఫీల్డ్, యువ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ రాండోల్ఫ్, వరల్డ్ చాంపియన్లు జానీ బంఫస్, రాకీ లాక్రిడ్జ్ వంటి వారికి జో ట్రైనింగ్ ఇచ్చారు. ఇది గొప్ప సంగతే కానీ జో క్లాఫ్లో సరితాదేవికి ఆసక్తి కలిగించిన అంశం వేరే ఉంది. స్వర్గీయ లెజెండ్ బాక్సర్ మొహమ్మద్ అలీ కోచింగ్ గురువుల బృందంలో ఈయనా ఒకరు! మొహమ్మద్ అలీ.. సరితాదేవికి అభిమాన బాక్సర్ మాత్రమే కాదు, ఆమె.. బాక్సింగ్‌లోకి రావడానికి స్ఫూర్తి కూడా! పేళ్లు కొట్టి.. రాటు తేలిన వేళ్లు! 2000 సంవత్సరంలో సరితాదేవి బాక్సింగ్‌లోకి వచ్చేనాటికి ఆమె వయసు 15 ఏళ్లు. అలీ వయసు 58 ఏళ్లు. అలీది యు.ఎస్., సరితాదేవిది మణిపూర్. ఆయన్ని ఈ అమ్మాయి ఆదర్శంగా తీసుకుని బాక్సింగ్‌లోకి వచ్చేయడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఆమె కుటుంబం. సరితాదేవి పుట్టింది చిన్న గ్రామంలో. వ్యవసాయ కుటుంబంలో. ఎనిమిది మంది పిల్లల్లో ఆరో సంతానం సరితాదేవి. స్కూలు నుంచి వచ్చాక, స్కూలు లేనపుడు తల్లిదండ్రులతో (దేవి, బాబూచాన్) కలసి వంటచెరకు కోసం ఈ అమ్మాయి పొలాల్లోకి వెళ్లేది. ఎండు కొమ్మల్ని చెక్కలుగా నరికేది. తలపై పెట్టుకుని ఇంటికి మోసుకొచ్చేది. అలా ఆమె చేతులు గరుకుబారాయి. ఒళ్లు బండరాయి అయింది. స్కూల్లో ఆమె చెయ్యి చిన్నగా తగిలినా చాలు ‘అమ్మా’ అనేవాళ్లు. అలా అనడంలో ‘నువ్వెంత గట్టిదానివే’ అనే ప్రశంస కనిపించేది. సరితాదేవి హైస్కూలుకు వచ్చేనాటికి ఆమె ‘స్ట్రాంగ్’ అయింది. ఆమెను ఇంకా స్ట్రాంగ్ చేసింది మాత్రం మొహహ్మద్ అలీ! ఎనిమిదో తరగతిలో ఉండగా తొలిసారి అలీ గురించి చదివింది సరితాదేవి. తర్వాత టెన్త్‌లో, తర్వాత ఓపెన్ స్కూల్లో అలీ గురించి చదివింది. చదువుతూనే బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. సరిత అదృష్టం.. లోకల్‌గా కొద్దో గొప్పో బాక్సింగ్ నేర్పించేవారు ఉన్నారు. తల్లిగా.. భార్యగా.. అథ్లెట్ జీవితం కఠినంగా ఉంటుంది. ఆ అథ్లెట్ స్త్రీ అయితే ఇంకా కఠినంగా ఉంటుంది. ఆ స్త్రీ.. తల్లి అయితే కఠినాతికఠినంగా ఉంటుంది. భర్త తోయిబా, నాలుగేళ్ల కొడుకు తోంథిన్, తను.. ఇదీ సరితాదేవి ఫ్యామిలీ. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి కుటుంబాన్ని ఎంత త్యాగం చెయ్యాల్సి ఉంటుందో, ఎంత మనోబలాన్ని కూడగట్టుకోవలసి ఉంటుందో సరితాదేవికి తెలుసు. గత పదహారేళ్లుగా అమెచ్యూర్ బాక్సింగ్ బరిలో ఉన్నారు సరిత. బరిలో ఆమెకు ఎంత జీవితం ఉందో, బరి బయటా అంతే జీవితం ఉంది. రెండూ ఆమెకు వేర్వేరు జీవితాలు కాదు. రియో ఒలింపిక్స్‌కు ఆమె క్వాలిఫై కాలేదు కానీ, క్వాలిఫై కావడానికి ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఎంతగానో సర్దుబాటు చేసుకోవలసి వచ్చింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కఠోర శిక్షణ కోసం కుటుంబాన్ని వదిలి వచ్చేశారు సరితాదేవి. కొడుకును వదిలి అన్నాళ్లు దూరంగా ఉండడం ఆమెకు ఇంకో బరిలోకి దిగినంత పనైంది. వారానికొకసారి బిడ్డను తీసుకొచ్చి తల్లికి చూపించి మళ్లీ తీసుకెళ్లేవారు సరితాదేవి భర్త. ‘నాకింకా ప్రాక్టీస్ ఉంది. నువ్వు వెళ్లు’ అనే మాటను తన కొడుకు అదొక మామూలు సంగతిలా అర్థం చేసుకునేలా వాడిని మలుచుకోగలిగారు ఆమె! ఒకే ఇంట్లో బాక్సింగ్.. ఫుట్‌బాల్.. మ్యూజిక్ సరిత భర్త జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. కొడుకును కూడా ఫుట్‌బాలర్‌ని చెయ్యాలని అతడి తపన. తగిన వయసు రాగానే వాడిని యూరోపియన్ అకాడమీకి పంపాలని తలంపు. కానీ తోంథిన్కు మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ సంగతిని ముందుగా సరితాదేవే కనిపెట్టారు. తోంథిన్ హిందీ పాటల్ని కూడా ఆసక్తిగా వినేవాడు. పాడేవాడు. అది చూసి సరితాదేవి, ‘మీ కల నిజమయ్యేలా లేదు’ అని భర్తతో నవ్వుతూ అనేవారు. ఓ సందర్భంలో.. సరితాదేవిని విమానం ఎక్కించడానికి ఆ రాత్రి భర్త, కొడుకు ఎయిర్పోర్ట్ వరకు వెళ్లారు. అప్పటి వరకు తండ్రి భుజంపై నిద్రపోతున్న తోంథిన్.. సరిగ్గా తల్లి విమానంలోకి వెళ్లబోతున్నప్పుడు కళ్లు తెరిచి, ‘మమ్మీ ట్రైనింగ్‌కి వెళుతోందా’ అని తండ్రి వైపు చూస్తూ అడిగాడట. నా కొడుకు పెద్దవాడయ్యాడని సరితాదేవి ఆ సందర్భంలో మురిసిపోయారు. సరితాదేవి తన బాక్సింగ్ వరకే చూసుకోవడం లేదు. తన స్వగ్రామం మయాంగ్ ఇంపాల్‌లో చిన్న చిన్న బాక్సర్లను తయారు చేస్తున్నారు. వాళ్లకు గైడెన్స్ ఇస్తున్నారు. ఉచితంగా బాక్సింగ్ సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఆర్థిక సహాయం చేస్తున్నారు. బాల్యంలో తనకు అందని సహకారాన్ని ఇప్పుడు ఉపకారంలా కొత్త జనరేషన్‌కి అందిస్తున్నారు. రేపు సరిత ప్రొఫెషనల్‌గా గెలిస్తే.. ఈ ఉపకారాలు, సహకారాల బాధ్యత మరింత ఎక్కువవుతుంది. అందుకు కూడా సరితాదేవి ఓ ప్రొఫెషనల్‌గా సిద్ధంగా ఉన్నారు. ప్రదానోత్సవంలో పతకం నిరాకరణ! 2014లో గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సరితా దేవి 60 కేజీల విభాగంలో రజతం... అదే ఏడాది ఇంచియోన్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. ఆసియా క్రీడల సెమీఫైనల్లో కొరియా బాక్సర్ పార్క్ జీనాపై సరితా పూర్తి ఆధిపత్యం చలాయించినా ఆమెకు ఫలితం ప్రతికూలంగా రావడం వివాదాస్పదమైంది. తనపట్ల సెమీ ఫైనల్ బౌట్ న్యాయ నిర్ణేతలు పక్షపాతంతో వ్యవహరించారని, ఆతిథ్య దేశం కొరియా బాక్సర్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించిన సరిత... పతకాల ప్రదానోత్సవంలో కాంస్య పతకం స్వీకరించేందుకు నిరాకరించింది. వేదికపైనే కన్నీటి పర్యంతమైన సరిత తనకు ఇచ్చిన కాంస్య పతకాన్ని సెమీస్‌లో తనపై గెలిచి, ఫైనల్లో చైనా బాక్సర్ చేతిలో ఓడిపోయిన పార్క్ జీనాకు అందించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘కీర్తి’ దక్కింది కానీ ‘కనకం’ దక్కలేదు మొదటి నుంచీ అమెచ్యూర్ బాక్సింగ్‌లో డబ్బు తక్కువ. మరీ ముఖ్యంగా మహిళలకు ఏడాదికి ఒకట్రెండు టోర్నీలు మాత్రమే ఉంటాయి. ఇప్పటికే అమెచ్యూర్ బాక్సింగ్‌లో ఒలింపిక్స్ మినహా అందుబాటులో ఉన్న అన్ని పతకాలను సరితాదేవి సొంతం చేసుకుంది. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. మున్ముందూ అమెచ్యూర్ స్థాయిలో ఎన్ని పతకాలు గెలిచినా ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన ప్రయోజనం కనిపించడంలేదు. ఈ దశలో సరితా దేవి మరో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. తనలో ఇంకా ఆట మిగిలి ఉండగానే ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకోవాలని భావించి ‘ప్రొఫెషనల్ రింగ్’లో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. అమెచ్యూర్లతో పోలిస్తే ప్రొఫెషనల్ బాక్సర్ల శిక్షణ కఠినంగా ఉంటుంది. ప్రొఫెషనల్‌గా శిక్షణ తీసుకుంటే ఆ ప్రయోజనం అమెచ్యూర్ కెరీర్లో కూడా ఉపయోగపడుతుందని సరితా దేవి భావిస్తోంది. అందుకే కొత్తదనం కోసం ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకుంది. మారిన నిబంధన గతంలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన వాళ్లకు మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండేదికాదు. కానీ ఇటీవలే అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ఈ నిబంధనను సవరించింది. ఇక మీదట ఆయా దేశాల బాక్సింగ్ సంఘాలు అనుమతి ఇస్తే ప్రొఫెషనల్ బాక్సర్లు మళ్లీ అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. దాంతో సరితా దేవి ప్రొఫెషనల్‌గా మారినా ఆమె దేశం తరఫున అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొనవచ్చు. ‘పంచ్’ విసిరితే పతకాలే! మణిపూర్‌కే చెందిన మరో బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ నీడలో సరితాదేవి సాధించిన విజయాలకు అంతగా పేరు రాలేదనే చెప్పాలి. అయినప్పటికీ సరితాదేవి పట్టించుకోలేదు. రింగ్‌లో దిగితే తుదికంటా పోరాడటమే అలవాటు చేసుకుంది. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో పతకాలను తన మెడలో వేసుకుంది. నాలుగుసార్లు 2001లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన సరిత... ఆ తర్వాత తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకుంది.2003లో హిస్సార్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మూడుసార్లు (2005, 2008, 2010లలో) ఆసియా చాంపియన్‌షిప్‌లలో పాల్గొని అజేయంగా నిలిచి మూడు స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకుంది. విశ్వవిజేత 2006 సరితా దేవికి చిరస్మరణీయ ఏడాది అని చెప్పాలి. ఆ ఏడాది న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సరిత 52 కేజీల విభాగంలో పోటీపడి అగ్రస్థానాన్ని సంపాదించి విశ్వవిజేతగా అవతరించింది. 2005, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సరిత ఖాతాలో కాంస్య పతకాలు చేరాయి. ఇప్పుడు.. ప్రొఫెషనల్‌గా! 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయిన సరిత తాజాగా ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టింది. మణిపూర్ పోలీసు విభాగంలో ఆఫీసర్ హోదాలో ఉన్న సరిత ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోనూ తన పంచ్ పవర్‌తో అదరగొట్టేందుకు సిద్ధమైంది. జనవరి 29న హంగేరి బాక్సర్ సోఫియా బెడోతో తన స్వస్థలం ఇంఫాల్ వేదికగా జరిగే తొలి ప్రొఫెషనల్ పోరులో సత్తా చాటుకునేందుకు సరిత రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్... సరిత..! ఇన్పుట్స్ : కె.నారాయణ, సాక్షి స్పోర్ట్స్ -
మేమంతా... నీవెంటే
న్యూఢిల్లీ: బాక్సర్ సరితాదేవి సస్పెన్షన్‌పై పునరాలోచించాలని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి (ఏఐబీఏ-ఐబా) భారత ప్రభుత్వం అప్పీల్ చేయనుంది. ఇటీవలి ఆసియా క్రీడల్లో తనకు లభించిన కాంస్య పతకాన్ని తీసుకోకుండా మరో బాక్సర్ మెడలో వేసినందుకు ఐబా ఆమెపై తాత్కాలికంగా వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సరిత విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ పలువురు క్రీడాకారులు, అధికారులతో సమావేశమయ్యారు. ‘ఈ విషయంలో సరితకు ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా ఆమెకు కావల్సిన సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పటిదాకా ఆమె తన విజయాలతో దేశం గర్వపడేలా చేసింది. అందుకే భారత ప్రభుత్వం తరఫున సస్పెన్షన్‌ను పునరాలోచించాలని ఐబాకు విజ్ఞప్తి చేస్తాం’ అని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ సమావేశంలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తేందూల్కర్, బాక్సర్లు మేరీకోమ్, విజేందర్ సింగ్, ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్, బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా, జాతీయ బాక్సింగ్ కోచ్ జీఎస్ సంధూ తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం అండగా ఉండాలి: సచిన్ బాక్సర్ సరితా దేవికి ఈ కష్ట కాలంలో దేశం మొత్తం అండగా నిలవాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తేందూల్కర్ కోరాడు. క్రీడల మంత్రితో సమావేశం అనంతరం సచిన్ విలేకరులతో మాట్లాడాడు. ‘సరితా దేవి ఉదంతం గురించే ఈ సమావేశం జరిగింది. ఆమె విషయంలో ఎలా ముందుకెళ్లాలి.. ఐబాతో ఏం చెప్పాలి.. అని మేం చర్చించాం. ఓ క్రీడాకారుడిగా ఆమె బాధ నాకు తెలుసు. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కోలా స్పందిస్తుంటాడు. ఐబా కచ్చితంగా ఆమె కేసును మరోసారి పరిశీలించాలి. ఇప్పటికే తను క్షమాపణలు చెప్పింది. ఈ సమయంలో దేశం యావత్తూ ఆమెకు మద్దతుగా నిలవాలి’ అని సచిన్ కోరాడు. మరోవైపు ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఐబా తమ నిబంధనల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ అభిప్రాయపడ్డాడు. -
తొండి చేశారు... ఏడిపించారు
మహిళల లైట్ వెయిట్ 57-60కేజీ విభాగం సెమీఫైనల్లో తలపడిన సరితాదేవి 0-3తో ఓడడం వివాదాస్పదమైంది. ఈ బౌట్లో సరిత పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా... జడ్జిలు మాత్రం కొరియా బాక్సర్‌కు అనుకూలంగా ఫలితం ప్రకటించారు. ఓ దశలో సరిత తన వేగవంతమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సరిత విసిరిన పంచ్‌లకు జినా ఎన్నిసార్లు కిందపడినా రిఫరీ ఒక్కసారి కూడా స్టాండింగ్ కౌంట్ చెప్పకపోవడం వివాదానికి దారి తీసింది. ఇక బౌట్ చివర్లో ముగ్గురు రింగ్ సైడ్ జడ్జిలు 39-37తో (3-0) జినా పార్క్‌ను విజేతగా ప్రకటించడంతో సరిత షాక్ తింది. ఇది కచ్చితంగా ఫిక్సింగ్ అని సరిత భర్త తొయిబా సింగ్ ధ్వజమెత్తారు. ‘మీరు బాక్సింగ్‌ను చంపేస్తున్నారు’ అంటూ అరుస్తూ రింగ్ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ బౌట్‌పై విచారణ జరపాలంటూ భారత జట్టు 500 డాలర్లు చెల్లించి ఫిర్యాదు చేసింది. అయితే ఐబా టెక్నికల్ కమిటీ దీన్ని తోసిపుచ్చింది. రిఫరీ నిర్ణయాలపైనే తప్ప జడ్జిలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకూడదని తేల్చి చెప్పింది.