ఫస్ట్‌ పంచ్‌ | Saritadevi first female professional boxer | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ పంచ్‌

Published Sun, Jan 15 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

ఫస్ట్‌ పంచ్‌

ఫస్ట్‌ పంచ్‌

ఫస్ట్‌ పంచా?!  అంటే? సరితాదేవి ఇంతకుముందెప్పుడూ పంచ్‌ ఇవ్వలేదా? ఇచ్చారు. పంచ్‌లు ఇచ్చారు. పతకాలు తెచ్చారు. కానీ ఇప్పుడు ఆమె ఇవ్వబోతున్నది ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఫస్ట్‌ పంచ్‌. ఇంతకాలం అమెచ్యూర్‌గా ఆడి, ఇప్పుడు ప్రొఫెషనల్‌గానూ సత్తా చూపబోతున్న సరిత.. త్వరలో తొలి భారతీయ మహిళా ప్రొఫెషనల్‌ బాక్సర్‌ అనే రికార్డ్‌ సాధించబోతున్నారు.

బాక్సింగ్‌లో రెండు రకాలు. అమెచ్యూర్, ప్రొఫెషనల్‌. బాక్సర్‌ కంటికి దెబ్బతగిలి, కంటి చుట్టూ వాపొచ్చి, రక్తం కారుతుంటే ఆట ఆగిపోతుంది. అది అమెచ్యూర్‌. బరిలో ఉన్న బాక్సర్‌ల తలకు రక్షణగా హెడ్‌గార్డ్స్‌ ఉంటాయి. అది అమెచ్యూర్‌. ఆట కన్నా కూడా బాక్సర్‌ల రక్షణకే రిఫరీ ప్రాధాన్యం ఇస్తాడు. అది అమెచ్యూర్‌. బాక్సర్‌ నీరసించి నిలబడలేకపోతుంటే రిఫరీ ఆట ఆపేస్తాడు. అది అమెచ్యూర్‌. దూకుడు మీదున్న బాక్సర్‌.. రెఫరీ వార్నింగ్‌లను పట్టించుకోకపోతే ఆట ఆగిపోతుంది. అది అమెచ్యూర్‌.

కన్ను వాచి, రక్తం కారుతుంటుంది. అయినా ఆట ఆగదు. అది ప్రొఫెషనల్‌. బాక్సర్‌ తలకు హెడ్‌గార్డ్స్‌ ఉండవు. అది ప్రొఫెషనల్‌. ఆటకు తప్ప ఆటగాళ్ల రక్షణకు ప్రాధాన్యం ఉండదు. అది ప్రొఫెషనల్‌. బాక్సర్‌ ఆడలేకపోయినా ఆట కంటిన్యూ అవుతుంది. అది ప్రొఫెషనల్‌.
బాక్సర్‌.. రిఫరీ వార్నింగ్‌లను పట్టించుకోకపోయినా ఆట కొనసాగుతుంది. అది ప్రొఫెషనల్‌. ఒక్కమాటలో.. అమెచ్యూర్‌ అనేది సాఫ్ట్‌ బాక్సింగ్‌. ప్రొఫెషనల్‌ అనేది హార్డ్‌ బాక్సింగ్‌. డేంజరస్‌. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో చనిపోయినవాళ్లు కూడా ఉన్నారు! ఇండియాలో ప్రొఫెషనల్‌ బాక్సర్‌లు చాలామందే ఉన్నారు. అయితే అందరూ మగవాళ్లే. ఇప్పటి వరకు ఒక్క మహిళా ప్రొఫెషనల్‌ బాక్సర్‌ లేరు. కానీ త్వరలో రాబోతున్నారు!!  

అమెచ్యూర్‌ బాక్సర్‌ సరితాదేవి.. అమెచ్యూర్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ సరితాదేవి.. అమెచ్యూర్‌ ఏషియన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ సరితాదేవి... ఈ నెల 29న భారతదేశ తొలి మహిళా ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా బరిలోకి దిగబోతున్నారు. హంగేరి మహిళా బాక్సర్‌ సోఫియా బెడోతో ఫైట్‌ చెయ్యబోతున్నారు. తాడోపేడో. డూ ఆర్‌ డై.

కలత.. కసిగా మారిందా?!
ఎవరు డూ ఆర్‌ డై అంటున్నది?! కాంస్య పతకం వస్తే నాకక్కర్లేదు అని తిప్పికొట్టిన ఆ అమ్మాయా? రెఫరీ పొరపాటుకు నేను బలయ్యాను అని బోరుమని ఏడ్చిన ఆ అమ్మాయా? క్రమశిక్షణ చర్యగా ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ నుంచి ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆ అమ్మాయా? ఆ అమ్మాయే! అయితే అవన్నీ తుడిచేయండి. సరితాదేవి ఇప్పుడు కసితో ఉన్నారు. ఆట మీద ప్రేమ ఉన్నప్పుడు ఆమె అమెచ్యూర్‌. ఆటలో అటో ఇటో తేలిపోవాలన్న కసితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రొఫెషనల్‌. తొలిసారి ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సరితాదేవి తలపడబోతున్న సోఫియా ఇప్పటికే 59 ప్రొఫెషనల్‌ ‘బౌట్‌’లు (మ్యాచ్‌లు) ఆడారు. వాటిల్లో 19 బౌట్‌లు గెలిచారు. వయసు 29. ఆమె కన్నా సరితాదేవి రెండేళ్లు పెద్ద. పైగా ఆలస్యంగా ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లోకి వచ్చారు. ప్రత్యర్థికి ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు సరితాదేవి గెలవడం అటుంచి, బరిలో కాసేపైనా నిలదొక్కుకోగలరా అని సందేహం. అయితే సరితాదేవికి ఇలాంటి సందేహాలేమీ లేవు. తనకు సమ ఉజ్జీ దొరికిందని ఆమె ఉత్సాహంగా ఉన్నారు.

అలీ గురువే ఇప్పుడు సరిత కోచ్‌!
ప్రస్తుతం సరిత.. జో క్లాఫ్‌ దగ్గర ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయన వయసు 73 ఏళ్లు! లెజెండ్‌ బాక్సర్‌ ఇవాండర్‌ హోలీఫీల్డ్, యువ ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ రాండోల్ఫ్, వరల్డ్‌ చాంపియన్‌లు జానీ బంఫస్, రాకీ లాక్‌రిడ్జ్‌ వంటి వారికి జో ట్రైనింగ్‌ ఇచ్చారు. ఇది గొప్ప సంగతే కానీ జో క్లాఫ్‌లో సరితాదేవికి ఆసక్తి కలిగించిన అంశం వేరే ఉంది. స్వర్గీయ లెజెండ్‌ బాక్సర్‌ మొహమ్మద్‌ అలీ కోచింగ్‌ గురువుల బృందంలో ఈయనా ఒకరు! మొహమ్మద్‌ అలీ.. సరితాదేవికి అభిమాన బాక్సర్‌ మాత్రమే కాదు, ఆమె.. బాక్సింగ్‌లోకి రావడానికి స్ఫూర్తి కూడా!

పేళ్లు కొట్టి.. రాటు తేలిన వేళ్లు!
2000 సంవత్సరంలో సరితాదేవి బాక్సింగ్‌లోకి వచ్చేనాటికి ఆమె వయసు 15 ఏళ్లు. అలీ వయసు 58 ఏళ్లు. అలీది యు.ఎస్‌., సరితాదేవిది మణిపూర్‌. ఆయన్ని ఈ అమ్మాయి ఆదర్శంగా తీసుకుని బాక్సింగ్‌లోకి వచ్చేయడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఆమె కుటుంబం. సరితాదేవి పుట్టింది చిన్న గ్రామంలో. వ్యవసాయ కుటుంబంలో. ఎనిమిది మంది పిల్లల్లో ఆరో సంతానం సరితాదేవి. స్కూలు నుంచి వచ్చాక, స్కూలు లేనపుడు తల్లిదండ్రులతో (దేవి, బాబూచాన్‌) కలసి వంటచెరకు కోసం ఈ అమ్మాయి పొలాల్లోకి వెళ్లేది. ఎండు కొమ్మల్ని చెక్కలుగా నరికేది. తలపై పెట్టుకుని ఇంటికి మోసుకొచ్చేది. అలా ఆమె చేతులు గరుకుబారాయి. ఒళ్లు బండరాయి అయింది. స్కూల్లో ఆమె చెయ్యి చిన్నగా తగిలినా చాలు ‘అమ్మా’ అనేవాళ్లు. అలా అనడంలో ‘నువ్వెంత గట్టిదానివే’ అనే ప్రశంస కనిపించేది. సరితాదేవి హైస్కూలుకు వచ్చేనాటికి ఆమె ‘స్ట్రాంగ్‌’ అయింది. ఆమెను ఇంకా స్ట్రాంగ్‌ చేసింది మాత్రం మొహహ్మద్‌ అలీ! ఎనిమిదో తరగతిలో ఉండగా తొలిసారి అలీ గురించి చదివింది సరితాదేవి. తర్వాత టెన్త్‌లో, తర్వాత ఓపెన్‌ స్కూల్లో అలీ గురించి చదివింది. చదువుతూనే బాక్సింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది. సరిత అదృష్టం.. లోకల్‌గా కొద్దో గొప్పో బాక్సింగ్‌ నేర్పించేవారు ఉన్నారు.

తల్లిగా.. భార్యగా..
అథ్లెట్‌ జీవితం కఠినంగా ఉంటుంది. ఆ అథ్లెట్‌ స్త్రీ అయితే ఇంకా కఠినంగా ఉంటుంది. ఆ స్త్రీ.. తల్లి అయితే కఠినాతికఠినంగా ఉంటుంది. భర్త తోయిబా, నాలుగేళ్ల కొడుకు తోంథిన్, తను.. ఇదీ సరితాదేవి ఫ్యామిలీ. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి కుటుంబాన్ని ఎంత త్యాగం చెయ్యాల్సి ఉంటుందో, ఎంత మనోబలాన్ని కూడగట్టుకోవలసి ఉంటుందో సరితాదేవికి తెలుసు.  గత పదహారేళ్లుగా అమెచ్యూర్‌ బాక్సింగ్‌ బరిలో ఉన్నారు సరిత. బరిలో ఆమెకు ఎంత జీవితం ఉందో, బరి బయటా అంతే జీవితం ఉంది. రెండూ ఆమెకు వేర్వేరు జీవితాలు కాదు. రియో ఒలింపిక్స్‌కు ఆమె క్వాలిఫై కాలేదు కానీ, క్వాలిఫై కావడానికి ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఎంతగానో సర్దుబాటు చేసుకోవలసి వచ్చింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో కఠోర శిక్షణ కోసం కుటుంబాన్ని వదిలి వచ్చేశారు సరితాదేవి. కొడుకును వదిలి అన్నాళ్లు దూరంగా ఉండడం ఆమెకు ఇంకో బరిలోకి దిగినంత పనైంది. వారానికొకసారి బిడ్డను తీసుకొచ్చి తల్లికి చూపించి మళ్లీ తీసుకెళ్లేవారు సరితాదేవి భర్త. ‘నాకింకా ప్రాక్టీస్‌ ఉంది. నువ్వు వెళ్లు’ అనే మాటను తన కొడుకు అదొక మామూలు సంగతిలా అర్థం చేసుకునేలా వాడిని మలుచుకోగలిగారు ఆమె!

ఒకే ఇంట్లో బాక్సింగ్‌.. ఫుట్‌బాల్‌.. మ్యూజిక్‌
సరిత భర్త జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు. కొడుకును కూడా ఫుట్‌బాలర్‌ని చెయ్యాలని అతడి తపన. తగిన వయసు రాగానే వాడిని యూరోపియన్‌ అకాడమీకి పంపాలని తలంపు. కానీ తోంథిన్‌కు మ్యూజిక్‌ అంటే ఇష్టం. ఆ సంగతిని ముందుగా సరితాదేవే కనిపెట్టారు. తోంథిన్‌ హిందీ పాటల్ని కూడా ఆసక్తిగా వినేవాడు. పాడేవాడు. అది చూసి సరితాదేవి, ‘మీ కల నిజమయ్యేలా లేదు’ అని భర్తతో నవ్వుతూ అనేవారు.


ఓ సందర్భంలో.. సరితాదేవిని విమానం ఎక్కించడానికి ఆ రాత్రి భర్త, కొడుకు ఎయిర్‌పోర్ట్‌ వరకు వెళ్లారు. అప్పటి వరకు తండ్రి భుజంపై నిద్రపోతున్న తోంథిన్‌.. సరిగ్గా తల్లి విమానంలోకి వెళ్లబోతున్నప్పుడు కళ్లు తెరిచి, ‘మమ్మీ ట్రైనింగ్‌కి వెళుతోందా’ అని తండ్రి వైపు చూస్తూ అడిగాడట. నా కొడుకు పెద్దవాడయ్యాడని సరితాదేవి ఆ సందర్భంలో మురిసిపోయారు. సరితాదేవి తన బాక్సింగ్‌ వరకే చూసుకోవడం లేదు. తన స్వగ్రామం మయాంగ్‌ ఇంపాల్‌లో  చిన్న చిన్న బాక్సర్‌లను తయారు చేస్తున్నారు. వాళ్లకు గైడెన్స్‌ ఇస్తున్నారు. ఉచితంగా బాక్సింగ్‌ సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఆర్థిక సహాయం చేస్తున్నారు. బాల్యంలో తనకు అందని సహకారాన్ని ఇప్పుడు ఉపకారంలా కొత్త జనరేషన్‌కి అందిస్తున్నారు. రేపు సరిత ప్రొఫెషనల్‌గా గెలిస్తే.. ఈ ఉపకారాలు, సహకారాల బాధ్యత మరింత ఎక్కువవుతుంది. అందుకు కూడా సరితాదేవి ఓ ప్రొఫెషనల్‌గా సిద్ధంగా ఉన్నారు.

ప్రదానోత్సవంలో పతకం నిరాకరణ!
2014లో గ్లాస్గో (స్కాట్లాండ్‌)లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో సరితా దేవి 60 కేజీల విభాగంలో రజతం... అదే ఏడాది ఇంచియోన్‌ (దక్షిణ కొరియా)లో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. ఆసియా క్రీడల సెమీఫైనల్లో కొరియా బాక్సర్‌ పార్క్‌ జీనాపై సరితా పూర్తి ఆధిపత్యం చలాయించినా ఆమెకు ఫలితం ప్రతికూలంగా రావడం వివాదాస్పదమైంది. తనపట్ల సెమీ ఫైనల్‌ బౌట్‌ న్యాయ నిర్ణేతలు పక్షపాతంతో వ్యవహరించారని, ఆతిథ్య దేశం కొరియా బాక్సర్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించిన సరిత... పతకాల ప్రదానోత్సవంలో కాంస్య పతకం స్వీకరించేందుకు నిరాకరించింది. వేదికపైనే కన్నీటి పర్యంతమైన సరిత తనకు ఇచ్చిన కాంస్య పతకాన్ని సెమీస్‌లో తనపై గెలిచి, ఫైనల్లో చైనా బాక్సర్‌ చేతిలో ఓడిపోయిన పార్క్‌ జీనాకు అందించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

‘కీర్తి’ దక్కింది కానీ ‘కనకం’ దక్కలేదు
మొదటి నుంచీ అమెచ్యూర్‌ బాక్సింగ్‌లో డబ్బు తక్కువ. మరీ ముఖ్యంగా మహిళలకు ఏడాదికి ఒకట్రెండు టోర్నీలు మాత్రమే ఉంటాయి. ఇప్పటికే అమెచ్యూర్‌ బాక్సింగ్‌లో ఒలింపిక్స్‌ మినహా అందుబాటులో ఉన్న అన్ని పతకాలను సరితాదేవి సొంతం చేసుకుంది. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. మున్ముందూ అమెచ్యూర్‌ స్థాయిలో ఎన్ని పతకాలు గెలిచినా ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన ప్రయోజనం కనిపించడంలేదు. ఈ దశలో సరితా దేవి మరో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది.   తనలో ఇంకా ఆట మిగిలి ఉండగానే ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకోవాలని భావించి ‘ప్రొఫెషనల్‌ రింగ్‌’లో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. అమెచ్యూర్‌లతో పోలిస్తే ప్రొఫెషనల్‌ బాక్సర్ల శిక్షణ కఠినంగా ఉంటుంది. ప్రొఫెషనల్‌గా శిక్షణ తీసుకుంటే ఆ ప్రయోజనం అమెచ్యూర్‌ కెరీర్‌లో కూడా ఉపయోగపడుతుందని సరితా దేవి భావిస్తోంది. అందుకే కొత్తదనం కోసం ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకుంది.

మారిన నిబంధన
గతంలో ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన వాళ్లకు మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండేదికాదు. కానీ ఇటీవలే అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఏఐబీఏ) ఈ నిబంధనను సవరించింది. ఇక మీదట ఆయా దేశాల బాక్సింగ్‌ సంఘాలు అనుమతి ఇస్తే ప్రొఫెషనల్‌ బాక్సర్లు మళ్లీ అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. దాంతో సరితా దేవి ప్రొఫెషనల్‌గా మారినా ఆమె దేశం తరఫున అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొనవచ్చు.

‘పంచ్‌’ విసిరితే పతకాలే!
మణిపూర్‌కే చెందిన మరో బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ నీడలో సరితాదేవి సాధించిన విజయాలకు అంతగా పేరు రాలేదనే చెప్పాలి. అయినప్పటికీ సరితాదేవి పట్టించుకోలేదు. రింగ్‌లో దిగితే తుదికంటా పోరాడటమే అలవాటు చేసుకుంది. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ,  అంతర్జాతీయస్థాయిలో ఎన్నో పతకాలను తన మెడలో వేసుకుంది.

నాలుగుసార్లు
2001లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన సరిత... ఆ తర్వాత తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకుంది.2003లో హిస్సార్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మూడుసార్లు (2005, 2008, 2010లలో) ఆసియా చాంపియన్‌షిప్‌లలో పాల్గొని అజేయంగా నిలిచి మూడు స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకుంది.

విశ్వవిజేత
2006 సరితా దేవికి చిరస్మరణీయ ఏడాది అని చెప్పాలి. ఆ ఏడాది న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సరిత 52 కేజీల విభాగంలో పోటీపడి అగ్రస్థానాన్ని సంపాదించి విశ్వవిజేతగా అవతరించింది. 2005, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సరిత ఖాతాలో కాంస్య పతకాలు చేరాయి.

ఇప్పుడు.. ప్రొఫెషనల్‌గా!
2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయిన సరిత తాజాగా ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో అడుగుపెట్టింది. మణిపూర్‌ పోలీసు విభాగంలో ఆఫీసర్‌ హోదాలో ఉన్న సరిత ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లోనూ తన పంచ్‌ పవర్‌తో అదరగొట్టేందుకు సిద్ధమైంది. జనవరి 29న హంగేరి బాక్సర్‌ సోఫియా బెడోతో తన స్వస్థలం ఇంఫాల్‌ వేదికగా జరిగే తొలి ప్రొఫెషనల్‌ పోరులో సత్తా చాటుకునేందుకు సరిత రెడీగా ఉంది. ఆల్‌ ది బెస్ట్‌... సరిత..!    ఇన్‌పుట్స్‌ : కె.నారాయణ, సాక్షి స్పోర్ట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement