తొండి చేశారు... ఏడిపించారు
మహిళల లైట్ వెయిట్ 57-60కేజీ విభాగం సెమీఫైనల్లో తలపడిన సరితాదేవి 0-3తో ఓడడం వివాదాస్పదమైంది. ఈ బౌట్‌లో సరిత పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా... జడ్జిలు మాత్రం కొరియా బాక్సర్‌కు అనుకూలంగా ఫలితం ప్రకటించారు. ఓ దశలో సరిత తన వేగవంతమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సరిత విసిరిన పంచ్‌లకు జినా ఎన్నిసార్లు కిందపడినా రిఫరీ ఒక్కసారి కూడా స్టాండింగ్ కౌంట్ చెప్పకపోవడం వివాదానికి దారి తీసింది. ఇక బౌట్ చివర్లో ముగ్గురు రింగ్ సైడ్ జడ్జిలు 39-37తో (3-0) జినా పార్క్‌ను విజేతగా ప్రకటించడంతో సరిత షాక్ తింది. ఇది కచ్చితంగా ఫిక్సింగ్ అని సరిత భర్త తొయిబా సింగ్ ధ్వజమెత్తారు. ‘మీరు బాక్సింగ్‌ను చంపేస్తున్నారు’ అంటూ అరుస్తూ రింగ్ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ బౌట్‌పై విచారణ జరపాలంటూ భారత జట్టు 500 డాలర్లు చెల్లించి ఫిర్యాదు చేసింది. అయితే ఐబా టెక్నికల్ కమిటీ దీన్ని తోసిపుచ్చింది. రిఫరీ నిర్ణయాలపైనే తప్ప జడ్జిలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకూడదని తేల్చి చెప్పింది.