
న్యూఢిల్లీ: బరిలో దిగిన తొలి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనే యువ బాక్సర్ సోనియా చహల్ అదర గొట్టింది. శుక్రవారం జరిగిన 57 కేజీల సెమీఫైనల్లో సోనియా 5–0తో జో సన్ హవా (ఉత్తర కొరియా)పై నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (48 కేజీలు) ఇప్పటికే ఫైనల్ చేరగా... తాజాగా సోనియా ఆమె సరసన చేరింది. 64 కేజీల విభాగంలో జరిగిన మరో సెమీఫైనల్లో సిమ్రన్‌జిత్ 1–4తో డాన్ డూ (చైనా) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో భారత్ ఖాతాలో రెండు కాంస్యాలు చేరగా... ఇద్దరు బాక్సర్లు స్వర్ణ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరుగనున్న ఫైనల్లో హనా (ఉక్రెయిన్)తో మేరీకోమ్, ఆర్నెల్లా గాబ్రియల్ (జర్మనీ)తో సోనియా తలపడనున్నారు. 2006లో సొంత గడ్డపై జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా భారత్ 4 స్వర్ణాలు సహా 8 పతకాలు సాధించింది. అనంతరం 2008లో 4 పతకాలు (1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలు) దక్కించుకుంది. ఇప్పుడు ఈ ప్రదర్శనను మెరుగుపరిచే అవకాశం భారత బాక్సర్ల ముందుంది.
హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియా సెమీఫైనల్లో జకార్తా ఆసియా క్రీడల రజత పతక విజేతపై సునాయాసంగా గెలుపొందింది. మొదటి రెండు రౌండ్‌లు మామూలుగానే ఆడిన సోనియా... మూడో రౌండ్‌లో రెచ్చిపోయింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ప్రత్యర్థి ఎవరైనా తన సహజసిద్ధ ఆట మారదని చెప్పే సోనియా ఈ బౌట్‌లో అదే చేసి చూపించింది. ‘ఫైనల్‌కు చేరతానని ఊహించలేదు. సొంతగడ్డపై అభిమానుల మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్లడం సంతోషాన్నిస్తోంది. తొలి రెండు రౌండ్‌లు ముగిసేసరికి ప్రత్యర్థే ముందంజలో ఉందని కోచ్ చెప్పారు. దీంతో మూడో రౌండ్ ప్రారంభం నుంచే దూకుడు కనబర్చాను. ఫైనల్లోనూ ఇదే ఆటతీరు కొనసాగిస్తూ... స్వర్ణం గెలవడమే నా లక్ష్యం’ అని సోనియా వెల్లడించింది. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలో దిగి కాంస్యం నెగ్గడంపై సిమ్రన్‌జిత్ సంతోషం వ్యక్తం చేసింది.