
కోమ్ కీ ఖౌమ్
మేరీకోమ్ తన ప్రపంచాన్నే మార్చేసింది ఆమెనే స్ఫూర్తిగా తీసుకున్న ఈ యువతులు బాక్సింగ్ రింగ్‌లోనే కాదు జీవితంలో కూడా ఒడిదొడుకులనెదుర్కొని గెలవగలమని నిరూపిస్తున్నారు అని నినదిస్తున్నారు ఉర్దూలో ఖౌమ్ అంటే జాతి. మేరీ కోమ్ భారత జాతికి అందించిన ఒలింపిక్ ఖ్యాతిని అందుకోవడానికి కొత్త తరం సిద్ధంగా ఉంది.... ఆమె జాతికి అందించిన కిరీటానికి వీళ్లు వారసులవుతారు!
కోల్‌కతా ఇప్పుడు కొత్త శకాన్ని చూస్తోంది. అభ్యుదయ బాక్సింగ్ రింగ్‌కు వేదికవుతోంది. కిడ్డెర్‌పూర్ ఫిజికల్ కల్చర్ స్కూల్‌లోని బాక్సింగ్ రింగ్ ఇందుకు ప్రత్యక్ష సాక్షి. కోల్‌కతాలోని ముస్లిం యువ తులు బాక్సింగ్ గ్లవ్స్ ధరించి... విమర్శించే వారి ముఖానికి పంచ్ ఇస్తున్నారు. కోల్‌కతాలోని ఈ యువతులంతా రాబోయే విమెన్స్ నేషనల్స్ కోసం సిద్ధమవుతున్నారు. వారి కోచ్ చీనా భాయ్ (ఎకా మెహ్రాజుద్దీన్ అహ్మద్)ని పలకరిస్తే అనేక విషయాలు తెలిశాయి. 90లలో ఇదే క్లబ్‌లో ఇద్దరంటే ఇద్దరు ముస్లిం మహిళలు శిక్షణ తీసుకున్నారు. ఇదే క్లబ్‌కి బాక్సింగ్ నేర్చుకోవడానికి ఇప్పుడు అనేక మంది ముస్లిం యువతులు క్యూ కడుతున్నారు. పైగా వారంతా సంపన్నులేమీ కాదు. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, బంధువుల ఈసడింపులను భరిస్తూ ఆట మీద ఇష్టంతో కొనసాగుతున్నవారేనంటారు మెహ్రాజుద్దీన్. రకరకాల ఎదురీతలకు ఒడ్డి బాక్సింగ్‌లో రాణిస్తున్న యువతుల అభిప్రాయాలివి.
ఇది మహిళలకు సేఫ్ స్పోర్ట్!
కోల్‌కతాలోని ఎక్‌బల్‌పోర్‌లోని ‘టి’ జంక్షన్ దగ్గరకెళ్లి బాక్సర్, రెఫ్రీ షబ్‌నమ్ పేరు చెప్పగానే అక్కడ ఉండే వారి చూపుడు వేళ్లన్నీ ఓ మూడంతస్తుల భవనం వైపు చూపిస్తాయి. ఆ ఇంట్లో ఓ పోర్షన్‌లో షబ్‌నమ్ భర్త, పిల్లలతో జీవిస్తోంది. ఆమె భర్త ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, మొబైల్ ఫోన్‌ల డీలర్ కూడ. ఈ నేపథ్యం చూస్తే షబ్‌నమ్ బాక్సింగ్ కెరీర్ నల్లేరు మీద నడకలానే సాగినట్లు అనిపిస్తుంది. అయితే ఆమెకు తోటి మగబాక్సర్ల నుంచి ఆటుపోట్లు ఎదురయ్యాయి. షబ్‌నమ్ 1997లో కలకత్తా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రస్తుతం స్థానిక, జాతీయ బృందాలకు శిక్షణనిస్తున్నారు, బాక్సింగ్ పోటీలకు రిఫరీగానూ వ్యవహరిస్తున్నారు. మూడేళ్ల అనుభవంలోనే కోచ్ అయ్యారామె. అందుకు అవసరమైన పరీక్షలను పూర్తి చేశారు. కానీ ఆమెతోపాటు శిక్షణ తీసుకున్న మగ క్రీడాకారులు చాలా మంది ఇంకా కోచ్‌లు కాలేదు. చాలాకాలం పాటు వారు తనకు అడుగడుగునా సమస్యలు సృష్టిస్తూనే వచ్చారని, వాటిని అధిగమిస్తూ రాటుతేలిపోయానని చెప్తారు షబ్‌నమ్. ‘‘ఇప్పుడు నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారిలో నాకంటే పెద్దవారు, నాకంటే బలంగా ఉన్న మగవాళ్లు కూడా ఉన్నారు. అయితే వారెవ్వరూ నన్ను కోచ్‌గా అంగీకరించడానికి ఏ మాత్రం సందేహించరు. నా దగ్గర శిక్షణ తీసుకున్న అనేకమంది గోల్డ్‌మెడల్ సాధించారు. 2003లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న బెంగాల్ టీమ్‌కు శిక్షణనిచ్చాను. మా బంధువులు, నివాస ప్రదేశంలోని ముస్లిం అమ్మాయిల్లో నేను మొదటి గ్రాడ్యుయేట్‌ని, అలాగే తొలి బాక్సర్‌ని కూడా. మా అన్నయ్య బాక్సింగ్ నేర్చుకోవడంతో నాకు దారి ఏర్పడింది. నా ఇష్టాన్ని చెప్పగానే నాన్న చాలా సపోర్టు ఇచ్చారు. మా అమ్మ మాత్రం ఇలాంటి ఆటలు నేర్చుకుంటే పెళ్లెలా అవుతుందని నిరాకరించారు. కానీ నా ప్రాక్టీస్ ఆగలేదు. అప్పుడు మా అమ్మను ఒప్పించాను. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను వారి బాలికలకు బాక్సింగ్ నేర్పించమని ఒప్పించగలుగుతున్నాను. ఇది మహిళలకు అనువైన ఆట. ఆత్మ రక్షణనిచ్చే ఆట కూడ’’. - రజియా షబ్‌నమ్, బాక్సింగ్ కోచ్
అమ్మానాన్న ఓకే... కానీ బంధువులే!
పదిహేనేళ్ల సబినా యాస్మీన్ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. కోల్‌కతాలోని బొటానికల్ గార్డెన్ సమీపంలోని క్లబ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఆరుగురమ్మాయిల్లో సబినా చిన్నది. సబీనా పెద్దక్క ఫుట్‌బాల్ క్రీడాకారిణి. నిజానికి సబీనా తండ్రికి క్రీడాకారుడు కావాలనే కోరిక ఉండేది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదు. దాంతో కూతుళ్లలో ఆసక్తి ఉన్న వారిని అయినా క్రీడల వైపు ప్రోత్సహించాలనేది అతడి ఆకాంక్ష. అయితే ముస్లిం ఇంటి ఆడపిల్లలు కురచ దుస్తులు ధరించడం పట్ల బంధువులు, ఇరుగుపొరుగు వారి నుంచి విమర్శలు తప్పడం లేదు. పైగా వారికి పెళ్లిళ్లు కావాలంటే ఈ ఆటలను వదిలేయడమే శ్రేయస్కరం అనే సలహాలూ వారిని వదలడం లేదు. అయితే సబినా తల్లిదండ్రులు మాత్రం ‘‘మా పిల్లలను క్రీడాకారులను చేయడానికి ఇతర ఖర్చులు తగ్గించుకుని సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్నాం. అన్ని రాజీలతో పిల్లల్ని క్రీడాకారులను చేిసిన మా శ్రమకు, ప్రాక్టీస్ చేసిన పిల్లల శ్రమకు విలువ లేదా? ’’ అంటున్నారు. - సబినా యాస్మీన్, బాక్సర్
బాక్సింగ్‌నెలా వదులుతాను?
సరితా ఖాతూన్... 18 ఏళ్ల అమ్మాయి. ఆమె తండ్రి కోల్‌కతాకు సమీపంలోని ‘నుంగి’ గ్రామంలో తాపీమేస్త్రీ. సరిత బాక్సర్ కావడం చాలా యాదృచ్చికంగా జరిగిపోయింది. ఆమె పెద్దన్నయ్య నుంగిలోని బాక్సింగ్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు సరిత కూడా అన్నయ్య వెంట వెళ్లేది. ఆమె అన్నయ్యను అనుకరిస్తూ సరదాగా పంచ్‌లిస్తుండేది. ఆమెలో స్పార్క్ చూసిన కోచ్‌లు ఆమెకు బాక్సింగ్ నేర్పించమని చెప్పారు. అందుకు తండ్రి ససేమిరా అన్నాడు. ఆ విముఖత... ఆమె ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సహకారంతో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో గోల్డ్ మెడల్ సాధించే వరకు కొనసాగింది. గోల్డ్‌మెడల్‌తో సరితకు తండ్రి నుంచి అంగీకారం వచ్చింది. ఆ తర్వాత ఆమె తిరిగి చూసుకోలేదు. 2012లో జరిగిన నేషనల్ మీట్‌లో కాంస్య పతకంతోపాటు మొత్తం తొమ్మిది పతకాలతో దూసుకుపోతోంది. అయితే ఆమెకి ఈ సారి మత సంప్రదాయాల పేరుతో బంధువుల నుంచి అడ్డంకి ఎదురైంది. ‘ఒక ముస్లిం అమ్మాయి బాక్సింగ్ పోటీలలో పాల్గొనడం ఏమిటి, మానెమ్’ అని సలహా రూపంలో ఆదేశించారు. అలాంటి క్లిష్టసమయంలో తల్లి తనకు అండగా నిలిచిందని సరిత చెప్తోంది. ‘‘మా అమ్మకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. శిక్షణ తరగతులకు, టోర్నమెంట్‌లకు నాకు తోడుగా వచ్చేది. నాకు శిక్షణకు అవసరమైన షూస్, గ్లవ్స్, యూనిఫామ్, మంచి ఆహారం వంటి వసతులు సమకూర్చడానికి ఆమె చాలా శ్రమించేది. నేనీ స్థాయికి రావడానికి మా ఇద్దరి శ్రమ ఎంత ఉందో నాకు తెలుసు. అలాంటి బాక్సింగ్‌ను ఎందుకు వదులుకుంటాను? ఈ ఏడాది నేను స్కూల్ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ రాయాలి. అయితే నాకు చదువు మీద ఎలాగూ పెద్ద ఆసక్తి లేదు కాబట్టి పరీక్షలయ్యాక బాక్సింగ్ మీదనే పూర్తి సమయం కేటాయిస్తాను. ఇందులోనే కెరీర్ బిల్డప్ చేసుకుంటాను’’. - సరితా ఖాతూన్ విమెన్ బాక్సర్
నేను బురఖా బాక్సర్‌ని!
2012లో పాట్నాలో జరిగిన నేషనల్ టోర్నమెంట్‌లో వెస్ట్‌బెంగాల్‌కి కాంస్య పతకాన్ని సాధించింది సిమి పర్వీన్. ఆమెది మరో రకమైన నేపథ్యం. సిమికి సామాజిక, మతపరమైన అడ్డంకులు లేవు. తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంది. సిమికి మేరీకోమ్ అంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానమే ఆమెను బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా చేసింది. ఎనిమిది మంది సంతానంలో చిన్నది సిమి. ‘‘నేను ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్‌ని. కోల్‌కతాలోని ఎక్‌బాల్‌పోర్ ఏరియాలో నివాసం. అభ్యుదయ భావాలు కలిగిన సంప్రదాయ ముస్లిం కుటుంబం మాది. నేను బురఖా బాక్సర్‌ని అంటే మా వాళ్లంతా నవ్వుతారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించాను. ఇదే పరంపరను కొనసాగిస్తూ దేశానికి పతకాలు సాధించాలనేది నా ఆశయం’’. - సిమి పర్వీన్, బాక్సర్
ముస్లిం అమ్మాయి ఆ దుస్తులు వేసుకోరాదన్నారు!
అజ్మీరాకి 18 ఏళ్లు, కశ్మీరాకి 15 ఏళ్లు. ఈ అక్కాచెల్లెళ్లకు వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ సోదరీమణులు రోల్‌మోడల్స్. ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలని వీరి ఆకాంక్ష. అనేక వ్యయప్రయాసలకోర్చి శిక్షణ తీసుకుంటున్నారు. కోల్‌కతాలోని కిడ్డర్‌పూర్ క్లబ్‌కు చేరడానికి రోజూ ఇంటి నుంచి కాలినడకన రైల్వే స్టేషన్ చేరుకుని లోకల్ ట్రైన్‌లో గంటన్నర సేపు ప్రయాణించాలి. వీరి తండ్రి కిడ్డర్‌పోర్ మార్కెట్‌లో చేపలమ్ముతాడు. ఈ నేపథ్యం నుంచి వచ్చిన ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పటికి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఐదు బంగారు పతకాలను సాధించారు. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడంతోపాటు సంప్రదాయ ఆంక్షలకు ఎదురీదడం కష్టమైన పనేనంటారు. మేనత్త ఒత్తిడి తట్టుకోవడం వీరికి కత్తిమీద సామవుతోంది. ‘బాక్సింగ్ సాధన సమయంలో ధరించే దుస్తులను ముస్లిం అమ్మాయిలు ధరించరాదు, కాబట్టి బాక్సింగ్ సాధన మానేయ’మనే మేనత్త వేధింపు భరించలేని స్థాయిలో ఉంటోందని చెప్తోంది కశ్మీరా. ఇంటి పరిసరాల్లోని మగవాళ్లు కూడా వీరు కనిపించగానే ‘బాక్సర్స్’ అని ఎగతాళిగా కేకలు పెడుతున్నారు. ఇన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ కూడా ముందుకు సాగాలనేదే తమ నిర్ణయమని చెప్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. శిక్షణకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కోసం ఉద్యోగం వెతుక్కునే పనిలో పడింది అజ్మీరా.