మనికా బత్రా
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెల్చుకుని వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌కి, బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్‌కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. మనికా దేశం గర్వపడేలా చేసిందని, ఇలాగే మరిన్ని స్వర్ణ పతకాలు గెలవాలని క్రీడాభిమానులు కోరుకున్నారు. మనికా బత్రా మాట్లాడుతూ.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. కామన్వేల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, ఇలాగే మరిన్ని పతాకాలను భారత్‌కు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్‌లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్‌ను ఓడించడం విశేషం.
గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. భారత మెన్స్ అథ్లెట్లు 13 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 13 కాంస్యా పతకాలు సాధించారు. ఇక ఉమెన్స్ విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యా పతకాలు వచ్చాయి. మిక్స్ డ్ టీమ్ విభాగం లో ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment