లవ్లీనా విజయ గర్జన, చైనీస్ తైపీ బాక్సర్ నీన్–చిన్ చెన్
లవ్లీనా బొర్గొహైన్... ఈ పేరు భారత క్రీడాభిమాని ఇక ఎప్పటికీ మరచిపోలేడు. టోక్యో ఒలింపిక్స్‌లో ‘పంచ్ పవర్’ తగ్గుతూ ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ నేనున్నానంటూ లవ్లీనా తన పదును చూపించింది. అద్భుతమైన ఆటతో చెలరేగి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్‌లోనూ గెలిస్తే ఆమె స్వర్ణం లేదా రజతం కోసం పోటీ పడుతుంది. ఒకవేళ ఓడినా... కనీసం కాంస్య పతకం దక్కుతుంది. 2012లో మేరీకోమ్, విజేందర్ సింగ్‌ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది.
టోక్యో: 2020 ఒలింపిక్స్‌లో మరో మహిళ భారత్ ఖాతాలో పతకాన్ని చేర్చింది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ (69 కేజీల విభాగం)లో లవ్లీనా బొర్గొహైన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 4–1 తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ నీన్–చిన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత బాక్సర్... చివరి మూడు నిమిషాల్లో సమర్థవంతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని నిరోధించి విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో చెన్ చిన్ చేతిలో ఓడిన లవ్లీనా ఈసారి ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
తొలి రౌండ్‌లో ముగ్గురు జడ్జీలు భారత బాక్సర్‌కు 10 పాయింట్లు ఇవ్వగా, రెండో రౌండ్‌లో ఆమె జోరుకు ఐదుగురూ 10 పాయింట్ల చొప్పున అందజేయడం విశేషం. మూడో రౌండ్‌లోనూ నలుగురు జడ్జీలు లవ్లీనాకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఈ అస్సాం బాక్సర్ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకుంటూ ఒలింపిక్ పతకంతో మెరిసింది. ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో ఆమె ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలీ (టర్కీ)తో తలపడుతుంది. ఈ బౌట్‌లో గెలిస్తే ఒలింపిక్ చరిత్రలో భారత బాక్సింగ్ ఘనత కూడా కాంస్యాన్ని (మేరీకోమ్, విజేందర్) దాటి మరింత మెరుగైన స్థితికి చేరుతుంది. తాను గెలిచినట్లు రిఫరీ ప్రకటించగానే ఆనందం పట్టలేక 23 ఏళ్ల లవ్లీనా స్టేడియం దద్దరిల్లేలా గట్టిగా అరిచేసింది!
సిమ్రన్‌జిత్‌కు నిరాశ...
60 కేజీల విభాగంలో తలపడిన మరో భారత బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ ఓటమితో ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. థాయ్‌లాండ్‌కు చెందిన సుదపొర్న్ సిసొండీ 5–0తో సిమ్రన్‌ను చిత్తు చేసింది. థాయ్‌లాండ్ బాక్సర్ ఆరంభం నుంచి చివరి వరకు సిమ్రన్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా ఆమె ‘లెఫ్ట్ హుక్’లకు సిమ్రన్ వద్ద జవాబు లేకపోయింది. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జడ్జీలు ప్రతీసారి సుదపొర్న్‌కు పర్‌ఫెక్ట్ ‘10’ పాయింట్లు ఇవ్వడం విశేషం.
ఇద్దరికీ కాంస్యం ఎందుకు?
ఒలింపిక్స్‌లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోరు జరుగుతుంది. సెమీస్‌లో ఓడిన ఇద్దరు కంచు పతకం కోసం ఆడాల్సి ఉంటుంది. అయితే బాక్సింగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నం. సెమీఫైనల్ చేరిన ఇద్దరికీ మరో మ్యాచ్ లేకుండా పతకం ఖాయమవుతుంది. సాధారణంగా సెమీస్‌లో ఓడిన బాక్సర్‌పై ప్రత్యర్థి పంచ్‌ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘నాకౌట్’ ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత స్పృహ కోల్పోయే (కన్‌కషన్) అవకాశం కూడా ఉండవచ్చు.
వారు సాధారణ స్థితికి వచ్చి తక్కువ సమయంలో మళ్లీ బరిలోకి దిగడం చాలా కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48–72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే కాంస్యం కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయినా ఆడితే ఇద్దరికీ ప్రమాదం జరగవచ్చు కాబట్టి మూడో స్థానం మ్యాచ్‌ను రద్దు చేసి ఇద్దరికీ పతకాలు ఇస్తున్నారు. సెమీస్‌లో ఓడిన ప్రతీ బాక్సర్ సమస్య ఎదుర్కోవాలని లేదు కానీ ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు రాకుండా ముందు జాగ్రత్త అని
చెప్పవచ్చు!
ఆమె చేతిలో నేను గతంలో నాలుగుసార్లు ఓడాను. ఇప్పుడు మాత్రం బెదరకుండా దూకుడుగా పంచ్‌లు విసరాలని నిర్ణయించుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడి వంద శాతం నా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాను. సరిగ్గా చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించిది. ఆమె గురించి బాగా తెలుసు కాబట్టి కొత్తగా ప్రణాళిక, వ్యూహం అవసరమే రాలేదు. సెమీస్ పోరుకు తగినంత సమయం ఉంది కాబట్టి వీడియో ద్వారా ప్రత్యర్థి బలాబలాలు తెలుసుకొని ఏం చేయాలో ఆలోచిస్తా. గతంలో రింగ్‌లో దిగేటప్పుడు కొంత భయం వేసేది. ఇప్పుడు అది దూరం కావడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. నాలుగు నెలల క్రితం వరకు కూడా మెడిటేషన్ చేసేదాన్ని కానీ... బాక్సింగ్‌లాంటి క్రీడలో ప్రశాంతంగా ఉండలేం. అనుకోకుండానే ఆవేశాన్ని ప్రదర్శిస్తాం. తాజా ఘనత గురించి ఇప్పుడే వివరంగా మాట్లాడలేను. ఇంకా ఆట మిగిలి ఉంది కదా.
–లవ్లీనా బొర్గొహైన్
Comments
Please login to add a commentAdd a comment