Tokyo Olympics 2020: Lovlina Borgohain Boxing Bronze Medal Inspirational Journey - Sakshi
Sakshi News home page

Lovlina Borgohain: ‘ఏదో పాపం చేసినందుకే కొడుకు పుట్టలేదని వేధింపులు..’

Published Wed, Aug 4 2021 3:02 PM | Last Updated on Wed, Aug 4 2021 6:50 PM

Tokyo Olympics: Lovlina Borgohain Bronze Medalist Inspirational Story - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: అసోంలోని గోల్‌ఘాట్‌ జిల్లాలోని మారుమూల గ్రామం బారోముఖియా.. రాజధాని డిస్పూర్‌ నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఊరికి ఇంతవరకు సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు.. బయటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే మట్టి రోడ్డే దిక్కు.. అటువంటి గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌ పుట్టిన గడ్డగా ప్రత్యేకతను సంతరించుకుంది. విశ్వ క్రీడల్లో భారత కీర్తి పతాకను ఎగురవేసిన ఘనతను సాధించినందుకు తమ ఆడపడుచుకు స్వాగతం పలికేందుకు ముస్తాబు అవుతోంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన లవ్లీనా ఈ విజయంతో తన దేశమంతా గర్వపడేలా చేసింది. 

పొలంలో నాట్లు వేయడం కూడా వచ్చు..
లవ్లీనా తండ్రి టికెన్‌ బొర్గోహెయిన్‌కు స్వస్థలంలో చిన్న తేయాకు తోట ఉంది. సాధారణ కుటుంబం. మొత్తం ముగ్గురు అమ్మాయిల్లో లవ్లీనా చిన్నది. కవల అక్కల బాటలో సరాదాగా ఆమె కూడా మువతాయ్‌ (కిక్‌ బాక్సింగ్‌)తోనే కెరీర్‌ ఆరంభించింది. 2009లో కోచ్‌ ప్రశాంత కుమార్‌ దాస్‌ వద్ద తన అక్కలతో పాటు శిక్షణ తీసుకుంది. ముగ్గురూ కలిసి బారోముఖియా నుంచి 3- 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్పాథార్‌లోని కోచింగ్‌ సెంటర్‌కు సైకిల్‌పై వెళ్లేవారు. 


ఫొటో కర్టెసీ: ఇండియా టుడే

ఈ విషయాల గురించి లవ్లీనా తండ్రి టికెన్‌ మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిలు చాలా కష్టపడేవారు. రాళ్లురప్పలతో నిండిన మట్టిరోడ్డు మీద ప్రయాణం వారికి నరకప్రాయంగా ఉండేది. వచ్చేటపుడు గాయాలతో తిరిగి వచ్చేవారు. వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా లవ్లీనా ఎన్నటికీ తన మూలాలు మర్చిపోదని, లాక్‌డౌన్‌ సమయంలోలో పొలంలో నాట్లు వేస్తూ తమకు సహాయపడిందని బిడ్డపై ప్రేమను కురిపించారు. కాగా మువతాయ్‌ కొనసాగిస్తున్న సమయంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కోచ్‌ పదమ్‌ బోరో దృష్టిలో పడటంతో లవ్లీనా కెరీర్‌ మలుపు తిరిగింది. 

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని... టోక్యోకు
కోచ్‌ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన లవ్లీనా... 2020లో జోర్డాన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లాక్‌డౌన్‌లో సొంతూరిలోనే ఉన్న ఆమె.. ప్రాక్టీస్‌ ప్రారంభం కావడంతో పటియాలాలోని శిక్షణా శిబిరానికి పయనమైంది. కానీ, కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న తల్లికి సహాయంగా ఉండేందుకు అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలో లవ్లీనా కరోనా బారిన పడింది. 

దీంతో 52 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం స్పెయిన్‌ వెళ్లాల్సిన భారత బాక్సర్ల బృందం నుంచి ఆమె వైదొలగాల్సిన పరిస్థితి. అయినా సరే ఆమె కుంగిపోలేదు. కోవిడ్‌ను జయించడమే కాకుండా.. పట్టుదలగా ముందుకు సాగి టోక్యోలో సత్తా చాటింది ఈ 23 ఏళ్ల బాక్సర్‌. కంచు పంచ్‌తో కాంస్యం సాధించి, ప్రతిభ ముందు ఏ అవాంతరాలైనా దూదిపింజల్లా తేలిపోవాల్సిందేనని నిరూపించింది. విశ్వ క్రీడల్లో పతకంతో మెరిసి, ఈ ఘనత సాధించిన మూడో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది.

అమ్మానాన్నలను ఎన్నో మాటలు అన్నారు.. వారికిదే సమాధానం
‘‘ముగ్గురు ఆడపిల్లలను కలిగి ఉన్నందుకు గానూ నా తల్లిదండ్రులను ఈ సమాజం ఎన్నో మాటలు అన్నది. గత జన్మలో ఏదో పాపం చేసినందుకే కొడుకు పుట్టలేదంటూ వేధించేవారు. నిజానికి నేను బాక్సింగ్‌ చేయడం ప్రారంభించినపుడు చాలా మంది నన్ను చూసి నవ్వారు. ముఖ్యంగా లింగ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి నా ప్రదర్శన, ఈ పతకం ముఖం మీద కొట్టినట్లుగా సమాధానం ఇస్తుందని భావిస్తున్నా. మాకోసం తమ జీవితాలను త్యాగం చేసిన నా తల్లిదండ్రులకు ఈ విజయం అంకితం చేస్తున్నా’’ అని సెమీ ఫైనల్‌ అనంతరం ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ లవ్లీనా భావోద్వేగానికి గురైంది.

ఫైనల్‌ చేరాలని భావించానని, అయితే తన ప్రణాళికను పక్కాగా అమలు చేయలేకపోయానని పేర్కొంది. పారిస్‌ ఒలింపిక్స్‌తో తప్పక ఇంతకంటే మెరుగ్గా రాణించి, మరో పతకం గెలుస్తానని లవ్లీనా చెప్పుకొచ్చింది. అంతకంటే ముందు... వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఏసియన్‌ గేమ్స్‌లో సత్తా చాటాల్సి ఉందని అని పేర్కొంది. ఏదేమైనా.. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించిన లవ్లీనా నిజంగానే బంగారుకొండ.. కంగ్రాట్స్‌ అండ్‌ ఆల్‌ ది బెస్ట్‌ లవ్లీనా!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement