
చెన్నై: మగోమెడ్ సాలమ్ ఉమఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటారు. ఏకంగా నలుగురు సెమీస్ చేరి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల 69 కేజీల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా బొర్గోహైన్ (భారత్) 5–0తో అనస్తాసియ సిగెవ (రష్యా)పై విజయం సాధించింది. 75 కేజీల విభాగంలో పూజా రాణి (భారత్) 4–1తో లారా మమెద్కులోవ (రష్యా)పై గెలిచి ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.
అదే విధంగా మహిళల క్వార్టర్స్‌లో నీరజ్ (57 కేజీలు) 4–1తో సయాన సగతేవ (రష్యా)పై గెలవగా... జాని (60 కేజీలు) 5–0తో అనస్తాసియ ఒబుషెంకోవ (బెలారస్)ను ఓడించి సెమీస్ చేరింది. అయితే కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత పింకీ జాంగ్రా (51 కేజీలు)కు మాత్రం క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. ఆమె 0–5తో యులియా అపనసోవిచ్ (బెలారస్) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల విభాగంలో 2018 కామన్వెల్త్ గేమ్ పసిడి పతక విజేత గౌరవ్ సొలంకీ (56 కేజీలు), గోవింద్ సహాని (49 కేజీలు), సంజిత్ (91 కేజీలు),అభిషేక్ (52 కేజీలు) క్వార్టర్స్ చేరారు.
Comments
Please login to add a commentAdd a comment