జీవితంతో బాక్సింగ్ | Priyanka Chopra talks about capturing the moxie of the Indian boxer in the biopic Mary Kom | Sakshi
Sakshi News home page

జీవితంతో బాక్సింగ్

Published Sun, Aug 31 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

జీవితంతో బాక్సింగ్

జీవితంతో బాక్సింగ్

విజయం: మహిళలకు బాక్సింగ్ అంటేనే నవ్విపోయే పరిస్థితుల్లో.. కనీసం చేతులకు గ్లవ్స్ కూడా కొనుక్కోలేని పేదరికం నుంచి వచ్చిన ఓ అమ్మాయి వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అమ్మా నాన్నలకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో బాక్సింగ్‌ను ఎంచుకున్నా.. కఠోర శ్రమ, పట్టుదలతో అటు ప్రత్యర్థులతోపాటు ఇటు జీవితంతోనూ తలపడి గెలిచింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక కూడా బాక్సింగ్ రింగ్‌లో విజయాల పంచ్‌లు కురిపించి మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ కామ్. దేశం గర్వించదగ్గ ఈ క్రీడారత్నం జీవితకథ త్వరలో సినిమా రూపంలో మన ముందుకు రానుంది.  
 
మణిపూర్ రాష్ట్రంలోని చురాచంద్‌పూర్ జిల్లాలో కంగ్‌తయ్ అనే మారుమూల గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో 1983 మార్చి 1వ తేదీన జన్మించింది మేరీ కామ్. తండ్రి మాంగ్తే తోన్పాకామ్, తల్లి మాంగ్తే అఖమ్ కామ్‌లు అడవుల్లో చెట్లను నరికి, కాల్చివేసి వ్యవసాయ భూమిని తయారు చేసే పని (ఝమ్ కల్టివేషన్)లో దినసరి కూలీలు. బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి తానూ పనికి వెళ్లిన మేరీ.. తమ కోసం వారు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయేది. దీంతో ఎలాగైనా వారికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో క్రీడల్లో అడుగుపెట్టింది. ఆరంభంలో అథ్లెటిక్స్‌పై ఆసక్తి కనబరిచినా.. తమ రాష్ట్రానికే చెందిన డింకోసింగ్.. 1998లో ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించడం చూసి మేరీ తన నిర్ణయాన్ని మార్చుకుంది.
 
 ఎవరి మద్దతూ లేకపోయినా..
 బాక్సింగ్ క్రీడ మగవాళ్లకు మాత్రమేనన్న అభిప్రాయం బలంగా ఉన్న పరిస్థితుల్లో.. ఏ ఒక్కరూ మద్దతుగా నిలవకపోయినా బాక్సర్‌ను కావాలన్న లక్ష్యాన్ని వీడలేదు మేరీ కామ్. బాక్సింగ్ రింగ్‌లో పంచ్‌లు కురిపించే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు సర్దిచెబుతూ.. శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించిన కోచ్‌ను ఒప్పిస్తూ తొలి అడుగులు వేసింది. కోచ్ ఇంబోచా సింగ్ వద్ద అంతా అబ్బాయిలే శిక్షణ తీసుకుంటున్నా.. వెరవకుండా వారితో కలిసే మెళకువలు నేర్చుకుంది. మణిపూర్ రాష్ట్ర కోచ్ ఎం.నర్జిత్‌సింగ్ వద్ద శిక్షణతో రాటుదేలి 2000 సంవత్సరంలో.. పాల్గొన్న తొలిసారే రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో గర్వంతో పొంగిపోయిన తండ్రి.. భుజం తట్టగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగింది మేరీ.
 
 ‘చెన్నై’తో మొదలు...
  2001 ఫిబ్రవరిలో చెన్నైలో జరిగిన జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీ కామ్.. తన జైత్రయాత్రను ఏడాదంతా కొనసాగించింది. 18 ఏళ్ల వయసులోనే అమెరికాలోని పెన్సిల్వేనియాలో మహిళలకు తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో పాల్గొని రజతం గెలిచింది. 2002లో టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఆ తరువాత  2005, 2006, 2008, 2010లలో జరిగిన ప్రపంచకప్‌లలో వరుసగా విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2006 ప్రపంచకప్ తరువాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన మేరీ.. మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతూనే చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచింది.

దృఢచిత్తం ఉండాలి...
బాక్సర్‌గా సక్సెస్ కావాలంటే శారీరకంగా బలంగా ఉండటమొక్కటే సరిపోదు. గెలిచి తీరాలన్న పట్టుదల, వెనకడుగు వేయరాదన్న ధృడచిత్తం అవసరం. మహిళలు బాక్సింగ్‌లో రాణించాలంటే పురుషుల కన్నా ఎక్కువగా శ్రమించాల్సివుంటుంది.కెరీర్‌లో ఎక్కువసార్లు నాకన్నా ఎత్తుగా, బలంగా ఉన్న ప్రత్యర్థుల్నే ఎదుర్కొన్నాను. కానీ, నా తక్కువ ఎత్తునే అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థికి అందకుండా తప్పించుకుంటాను. రింగ్‌లో వారిని ఎక్కువగా పరిగెట్టిస్తూ.. అలసటకు గురిచేస్తాను. ఆ తరువాత నా పంచ్‌ల రుచి చూపించి పడగొడతుంటాను.
 -మేరీ కామ్
 
 ప్రతికూలతల్ని దాటి...
 ప్రతి క్రీడాకారుడికీ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమన్నది ఓ స్వప్నం. ఐదుసార్లు విజేతగా నిలిచినా.. విశ్వ క్రీడల్లో పాల్గొనలేకపోయానన్న బాధ మేరీ కామ్‌ను వేధిస్తుండేది. అయితే 2012లో లండన్ ఒలింపిక్స్‌లో దాన్ని చేర్చడంతో మేరీకి ఆ అవకాశం రానే వచ్చింది. కానీ, కనీసం 51 కేజీల నుంచి మూడు కేటగిరీలకు మాత్రమే చోటు కల్పించారు. దీనికి తగ్గట్టుగానే ఏఐబీఏ కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మహిళలకు ఈ మూడు కేటగిరీల్లోనే పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకునేందుకు మేరీ అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటిదాకా 45, 46 కేజీల కేటగిరీల్లో పోటీపడుతూ వచ్చిన మేరీ కామ్.. 51 కేజీలకు మారాల్సి వచ్చింది. దీంతో మహిళల ప్రపంచకప్‌లో తొలిసారిగా 2012లో మేరీ.. సెమీఫైనల్లో బ్రిటన్‌కు చెందిన నికోలా ఆడమ్స్ చేతిలో ఓటమిపాలైంది. కానీ, ఒలింపిక్స్ బెర్తును మాత్రం దక్కించుకోగలిగింది.
 
 ఫలించిన కల...
 బాక్సింగ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి మేరీ కామ్ కన్న కల నిజమయ్యే రోజు వచ్చింది. ఉద్విగ్నభరిత క్షణాల మధ్య లండన్ ఒలింపిక్స్‌లో తొలిరౌండ్ కోసం రింగ్‌లో అడుగు పెట్టిన మేరీ.. బెబ్బులిలా విజృంభించింది. కరోలినా మిచల్‌చుక్ (పోలండ్)ను అలవోకగా ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో మరోవా రహాలి (టునిషియా)నూ మట్టికరిపించింది. అయితే సెమీ ఫైనల్లో మళ్లీ నికోలా ఆడమ్స్ (బ్రిటన్) ఎదురైంది. ఆమెతో తీవ్రంగా పోరాడిన మేరీ..చివరకు 6-11తో ఓటమిపాలైంది. కానీ, మూడోస్థానంలో నిలవడం ద్వారా కాంస్య పతకాన్ని దక్కించుకుని సగర్వంగా నిలిచింది. లండన్‌లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించి.. భారత మహిళలందరికీ స్ఫూర్తిప్రదాత అయింది.
 
 పద్మభూషణ్ ‘మేరీ’...
 ఒలింపిక్ పతకం సాధించి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన మేరీ కామ్‌ను భారత ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అంతకుముందు 2010లోనే పద్మశ్రీ అవార్డునందించింది. దీంతోపాటు 2009లో రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, 2003లో అర్జున అవార్డుల్ని మేరీ కామ్ అందుకుంది.
 
 వెండితెరపై ‘మేరీ కామ్’
 ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన మేరీ కామ్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. మేరీ కామ్ పాత్రను పోషిస్తుండగా ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లామర్ క్వీన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక ఈ చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని మేరీ కామ్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసింది. చిత్రం ప్రివ్యూను ఇప్పటికే వీక్షించిన మేరీ కామ్.. ప్రియాంక నటనను చూసి చలించిపోయింది. భాగ్ మిల్కా భాగ్ వంటి సూపర్‌హిట్ తరువాత వస్తున్న క్రీడా నేపథ్య చిత్రంగా ‘మేరీ కామ్’ కోసం అటు సినీ, ఇటు క్రీడాభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు.
 
 అతనే లేకపోతే...
 తాను సాధించిన విజయాల వెనుక తన తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో.. భర్త ఓన్లర్ కామ్ ప్రోత్సాహమూ అంతే ఉందంటుంది మేరీ కామ్. 2001లో పంజాబ్‌లో జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో మేరీకి పరచయమయ్యాడు ఓన్లర్. ఢిల్లీ యూనివర్సిటీలో ‘లా’ కోర్సు చదువుతున్న ఓన్లర్‌తో నాలుగేళ్ల ప్రేమ తరువాత 2005లో వివాహం జరిగింది. అతడు తనను చక్కగా అర్థం చేసుకొని ప్రోత్సహించాడని, తాను బాక్సింగ్ టోర్నీలతో బిజీగా గడుపుతుంటే ఇద్దరు పిల్లల్ని అన్నీ తానై చూసుకున్నాడని చెబుతుంది. అతనే లేకపోతే.. బాక్సర్‌గా తాను ఈ స్థాయికి చేరడం కష్టమయ్యేదేమో అంటుంది. అన్నట్టు.. మేరీకి ఇటీవలే మూడో బాబు పుట్టాడు!
 - శ్యామ్ కంచర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement