Marin Cilic
-
సిలిచ్ కొత్త చరిత్ర... 777వ ర్యాంక్‌తో బరిలోకి దిగి ఏటీపీ సింగిల్స్ టైటిల్ సొంతం
హాంగ్జౌ (చైనా): క్రొయేషియా టెన్నిస్ ప్లేయర్ మారిన్ సిలిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ చరిత్రలో కొత్త ఘనతను నమోదు చేశాడు. ఏటీపీ టైటిల్ నెగ్గిన అతి తక్కువ ర్యాంకింగ్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సిలిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–6 (7/5), 7–6 (7/5)తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్‌ను ఓడించి తన కెరీర్లో 21వ టైటిల్ గెలుచుకున్నాడు. హౌంగ్జౌ ఓపెన్‌లో బరిలోకి దిగే సమయానికి సిలిచ్ ఏటీపీ ర్యాంక్ 777 కావడం విశేషం. 35 ఏళ్ల సిలిచ్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇక్కడ ఆడే అవకాశం లభించింది. ఒకప్పుడు పురుషుల సింగిల్స్‌లో మంచి విజయాలతో టాప్ ఆటగాళ్లలో ఒకడిగా సిలిచ్ కొనసాగాడు. 2014లో తన ఏకైక గ్రాండ్‌స్లామ్ (యూఎస్ ఓపెన్) నెగ్గిన అతను ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్‌లలో రన్నరప్‌గా నిలిచాడు. 2018లో అతను వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకును కూడా అందుకున్నాడు. గత కొంత కాలంగా గాయాలతో అతను చాలా వరకు ఆటకు దూరమయ్యాడు. -
జొకోవిచ్ ఖాతాలో 89వ సింగిల్స్ టైటిల్
సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ తన కెరీర్లో 89వ సింగిల్స్ టైటిల్ సాధించాడు. టెల్ అవీవ్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేíÙయా)పై గెలుపొందాడు. చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌కు 1,44,415 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 17 లక్షలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మెద్వెదేవ్‌కు భారీ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఔట్
ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ నం.2 డానియల్ మెద్వెదేవ్‌కు భారీ షాక్ తగిలింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ 6-2, 6-3, 6-2తో మెద్వెదేవ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. దీంతో మెద్వెదేవ్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే మెద్వెదేవ్పై సిలిక్ ఆధిపత్యం చెలాయించాడు. కేవలం గంటా 47 నిమిషాల్లో సిలిక్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో సిలిక్ నాలుగేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఇక క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ ఆండ్రూ రూబ్లేవ్తో సిలిక్ తలపడనున్నాడు. చదవండి: ISSF World Cup: స్వర్ణ పతకంపై ఇలవేనిల్ బృందం గురి -
రోజర్స్ కప్ సెమీఫైనల్లో రాఫెల్ నాదల్
హార్డ్ కోర్టులపై ఐదేళ్లుగా ఊరిస్తోన్న ఏటీపీ మాస్టర్స్ సింగిల్స్ టైటిల్‌ను సాధించే దిశగా రాఫెల్ నాదల్ ముందంజ వేశాడు. కెనడాలోని టొరంటోలో జరుగుతోన్న రోజర్స్ కప్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 2–6, 6–4, 6–4తో గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు వరుసగా 14వ ఏడాది అర్హత సాధించాడు. -
వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సిలిచ్ నిష్క్రమణ
-
సిలిచ్ నిష్క్రమణ
లండన్: గతేడాది రన్నరప్, క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రెండోరౌండ్లోనే చుక్కెదురైంది. ఇది మినహా నాలుగో రోజు మిగతా సీడెడ్ ఆటగాళ్లంతా ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో స్పానిష్ స్టార్ రాఫెల్ నాదల్, సెర్బియన్ జొకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ హలెప్, ఎంజెలిక్ కెర్బర్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. భారత ఆటగాళ్లలో దివిజ్ శరణ్ జోడీ శుభారంభం చేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనలిస్ట్ సిలిచ్ ఈ టోర్నీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. మూడో సీడ్ క్రొయేషియా ఆటగాడు 6–3, 6–1, 4–6, 6–7 (3/7), 5–7తో గుయిడో పెల్లా (అర్జెంటీనా) చేతిలో కంగుతిన్నాడు. 3 గంటల 13 నిమిషాల పాటు జరిగిన పోరులో సిలిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన పెల్లా చివరకు అతన్ని ఇంటిదారి పట్టించాడు. రెండో సీడ్ నాదల్, జొకోవిచ్‌లు అలవోక విజయాలతో ముందంజ వేశారు. రెండో రౌండ్లో నాదల్ 6–4, 6–3, 6–4తో మిఖాయిల్ కుకుష్కిన్ (కజకిస్తాన్)పై, 12వ సీడ్ జోకొవిచ్ 6–1, 6–2, 6–3తో జెబల్లొస్ (అర్జెంటీనా)పై గెలిచారు. 9వ సీడ్ ఇస్నర్ (అమెరికా) 6–1, 6–4, 6–7 (6/8), 6–7 (3/7), 7–5తో బెమెల్మన్స్ (బెల్జియం)పై చెమటోడ్చి నెగ్గాడు. వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–7 (7/9), 3–6, 6–7 (6/8) థామస్ ఫెబియానో (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ హలెప్ (రుమేనియా) 7–5, 6–0తో ససై జెంగ్ (చైనా)పై, 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 3–6, 6–2, 6–4తో క్లెయిర్ లియూ (అమెరికా)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో దివిజ్ శరణ్–అర్టెమ్ సిటక్ (న్యూజిలాండ్) జోడీ 7–6 (7/4), 6–7 (8/10), 6–3, 6–2తో అల్బొట్ (మాల్డొవా)–మలెక్ జజిరి (ట్యూనిషియా) ద్వయంపై గెలిచింది. విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 7–6 (7/5), 6–4, 7–6 (7/4)తో డానియెల్ (న్యూజిలాండ్)– వెస్లీ కూల్హోఫ్ (నెదర్లాండ్స్) జోడీపై గెలుపొందగా, జీవన్ నెడున్‌జెళియన్ (భారత్)–క్రాజిసెక్ (అమెరికా) జోడీ 6–7 (5/7), 6–7 (3/7), 6–7 (2/7)తో అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేత ఫెడరర్
మెల్బోర్న్: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఆస్ర్టేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7(5/7), 6-3, 3-6, 6-1తో గెలిపొందాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెడరరే పైచేయి సాధించాడు. ఈ విజయంతో కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన ఫెడరర్ 6 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలుచుకొని నోవాక్ జొకోవిక్, ఆస్ట్రేలియన్ గ్రేటర్ రాయ్ ఎమెర్సన్ల సరసన అగ్రస్థానంలో నిలిచాడు. సెమీఫైనల్లో ఫెడరర్ దక్షిణకొరియా ప్లేయర్ చుంగ్యాన్పై గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. -
ఫెడరర్ వర్సెస్ సిలిచ్
మెల్బోర్న్: ఊహించనట్లుగానే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ హైన్ చుంగ్ మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ అయ్యాడు. తొలి సెట్‌ను ఫెడరర్ 6-1తో గెలవడమే కాకుండా రెండో సెట్లో 5-2తో ఆధిక్యంతో దూసుకెళ్తున్నసమయంలో హైన్ చుంగ్ అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఫెడరర్ మ్యాచ్ పూర్తిగా ఆడకుండానే ఫైనల్‌కు చేరాడు. ఆదివారం జరిగే తుది పోరులో మారిన్ సిలిచ్‌తో ఫెడరర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. -
'అష్ట' చమక్...
♦ ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఫెడరర్ ♦ ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డు ♦ ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సిలిచ్‌పై ఘనవిజయం ♦ రూ. 18 కోట్ల 53 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ఎలాంటి అద్భుతం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. తనకెంతో కలిసొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఎనిమిదోసారి విజయగర్జన చేశాడు. 140 ఏళ్ల ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో పీట్ సంప్రాస్ (అమెరికా), విలియమ్ రెన్షా (బ్రిటన్) ఏడుసార్లు చొప్పున ఈ టైటిల్‌ను సాధించగా... తాజా విజయంతో ఫెడరర్ ఈ ఇద్దరినీ అధిగమించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. లండన్: ఏ లక్ష్యం కోసమైతే క్లే కోర్టు సీజన్ మొత్తానికి దూరంగా ఉండాలని ఫెడరర్ నిర్ణయం తీసుకున్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. తనకెంతో ప్రియమైన వింబుల్డన్ టోర్నమెంట్లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలవాలని ఆశించిన అతను అనుకున్నది చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–1, 6–4తో ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచాడు. తద్వారా వింబుల్డన్ టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి విజేతగా నిలిచి రికార్డు పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. టైటిల్ నెగ్గిన ఫెడరర్‌కు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు)... రన్నరప్ సిలిచ్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభం నుంచే... గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఫెడరర్‌కు తన ప్రత్యర్థి నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. అందరి అంచనాలను తారుమారు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చిన సిలిచ్ అంతిమ సమరంలో మాత్రం 35 ఏళ్ల ఫెడరర్ జోరు ముందు నిలువలేకపోయాడు. తొలి సెట్ రెండో గేమ్‌లోనే ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా సిలిచ్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న ఫెడరర్... ఐదో గేమ్‌లో సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో మరోసారి సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫెడరర్ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. సిలిచ్ కంట కన్నీరు... రెండో సెట్లో ఫెడరర్ మరింత చెలరేగిపోయాడు. ఈ స్విస్ దిగ్గజాన్ని ఎలా నిలువరించాలో సిలిచ్‌కు అర్థం కాలేదు. 0–3తో వెనుకబడిన దశలో సిలిచ్ తన విజయావకాశాలు చేజారిపోతున్నాయనే బాధను తట్టుకోలేక కోర్టులోనే కన్నీరు పెట్టుకున్నాడు. వెంటనే తన ముఖాన్ని టవల్లో దాచుకున్నాడు. రెండో సెట్లో ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన ఫెడరర్ మూడో సెట్లోనూ తన దూకుడును కొనసాగించాడు. ఎనిమిదో గేమ్‌లో సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌లో ఏస్ సంధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను ముగించేశాడు. విజయానంతరం ఫెడరర్ పెద్దగా సంబరాలు చేసుకోలేదు. గాల్లో చేతులు ఎత్తి అందరికీ వందనం చేశాడు. తన ప్రత్యర్థి సిలిచ్ దగ్గరకు వెళ్లి అతడినీ అభినందించాడు. ఇన్ని ఘనతలు సాధించగలగడం నమ్మశక్యంగా లేదు. మరోసారి ఈ వేదికపై ఫైనల్ ఆడగలనని గత ఏడాది అనుకోలేదు. అప్పట్లో రెండు సార్లు జొకోవిచ్ చేతిలో ఫైనల్స్‌లో ఓడిపోవడం బాధించింది. అయితే పునరాగమనం చేయగలనని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించవచ్చనేదానికి నా ఎనిమిదో టైటిల్ ఉదాహరణ. ఒక్క సెట్ ఓడకుండా ట్రోఫీ సాధించడం ఒక మాయలా కనిపిస్తోంది. విశ్రాంతి నాకు కలిసొచ్చింది. ఈ సారి మళ్లీ ఆరు నెలలు విరామం ఇస్తే అది మరోసారి అనుకూలంగా మారుతుందేమో చూడాలి. –ఫెడరర్ 19 ఫెడరర్ సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య. ఇందులో ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ (2004, 06, 07, 2010, 2017), ఒక ఫ్రెంచ్ ఓపెన్ (2009), ఎనిమిది వింబుల్డన్ (2003, 04, 05, 06, 07, 09, 2012, 2017), ఐదు యూఎస్ ఓపెన్ (2004, 05, 06, 07, 08) టైటిల్స్ ఉన్నాయి. 2 ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫెడరర్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, 2017 వింబుల్డన్ టోర్నీలో ఫెడరర్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. 1976లో జాన్ బోర్గ్ (స్వీడన్) తర్వాత ఫెడరర్ మాత్రమే ఒక్క సెట్ చేజార్చుకోకుండా వింబుల్డన్ విజేతగా నిలిచాడు. 2 ఓపెన్ శకంలో (1968 తర్వాత) 30 ఏళ్లు దాటిన తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్ ఫెడరర్. గతంలో రాడ్ లేవర్ (1969లో) మాత్రమే ఈ ఘనత సాధించాడు. 1111 ఫెడరర్ కెరీర్లో విజయాల సంఖ్య. 102 వింబుల్డన్‌లో ఫెడరర్ ఆడిన మ్యాచ్‌లు. జిమ్మీ కానర్స్ రికార్డును అతను సమం చేశాడు. 1 వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్ గుర్తింపు పొందాడు. 1976లో ఆర్థర్ యాష్ (32 ఏళ్లు) రికార్డు తెరమరుగైంది. హింగిస్... 23వ ‘గ్రాండ్’ టైటిల్ స్విట్జర్లాండ్ టెన్నిస్ మహిళా దిగ్గజం మార్టినా హింగిస్ తన కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగం ఫైనల్లో హింగిస్–జేమీ ముర్రే (బ్రిటన్) ద్వయం 6–4, 6–4తో కొంటినెన్ (ఫిన్లాండ్)–హీతెర్ (బ్రిటన్) జంటపై గెలిచి విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా హింగిస్ సింగిల్స్‌లో 5, డబుల్స్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచింది. -
వింబుల్డన్ విజేత ఫెదరర్
లండన్: వింబుల్డన్ ఫైనల్లో వార్ వన్‌సైడ్ అయ్యింది. రోజర్ ఫెదరర్(స్విడ్జర్లాండ్) దాటికి మారిన్ సిలిచ్ (క్రొయేషియా) చేతులు ఎత్తేశాడు. మారిన్ తో జరిగిన టైటిల్ పోరులో వరుస సెట్లలో నెగ్గి(6-3, 6-1, 6-4) వింబుల్డన్ విజేతగా రోజర్ ఫెదరర్ నిలిచాడు. చివరిగా 2012లో ముర్రేను ఓడించి టైటిల్ గెలిచిన ఈ స్విస్ వీరుడు. 2014, 15 సీజన్లలో రన్నరప్‌గా నిలిచి, తిరిగి 2017 వింబుల్డన్ విజేతగా నిలిచాడు. దీంతో పీట్ సంప్రాస్ (7 టైటిళ్లు) రికార్డును బద్దలు కొట్టి వింబుల్డన్‌లో ఎనిమిదో ట్రోఫీ గెలిచాడు. ఫేదర్కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్. -
ఫెడరర్...కాచుకో
∙ తొలిసారి వింబుల్డన్ ఫైనల్లోకి సిలిచ్ ∙ సెమీస్‌లో సామ్ క్వెరీపై విజయం ∙ రేపు స్విస్ దిగ్గజంతో టైటిల్ పోరు ∙ రెండో సెమీస్‌లో బెర్డిచ్‌పై ఫెడరర్ గెలుపు ఏమాత్రం అంచనాలు లేకుండా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన క్రొయేషియా ఆజానుబాహుడు మారిన్ సిలిచ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అంతిమ సమరానికి చేరుకున్నాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 89 కేజీల బరువున్న సిలిచ్ తన 11వ ప్రయత్నంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రూపంలో సిలిచ్‌కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. తన కెరీర్లోనే అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న ఫెడరర్ సెమీఫైనల్లో థామస్ బెర్డిచ్ను వరుస సెట్లలో ఓడించాడు. 11వ సారి వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన ఫెడరర్ రికార్డుస్థాయిలో ఎనిమిదో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. లండన్: ఎవరూ ఊహించని విధంగా క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఏడో సీడ్ సిలిచ్ 6–7 (6/8), 6–4, 7–6 (7/3), 7–5తో 24వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై గెలిచాడు. 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బుల్లెట్‌లాంటి సర్వీస్‌లు, పదునైన రిటర్న్‌లతో అలరించాడు. అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మల్చుకొని తన కెరీర్లో రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు అర్హత పొందాడు. 2001లో గొరాన్ ఇవానిసెవిచ్ తర్వాత క్రొయేషియా నుంచి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా సిలిచ్ గుర్తింపు పొందాడు. 2014లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సిలిచ్ తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. ‘నమ్మశక్యంగా లేదు. ఈ టోర్నీ ఆరంభం నుంచి నేను అద్భుతంగా ఆడాను. ఫెడరర్‌కు వింబుల్డన్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అయితేనేం అతనితో పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతని సవాల్‌కు సిద్ధంగా ఉన్నాను’ అని సిలిచ్ వ్యాఖ్యానించాడు. ఎదురులేని ఫెడరర్... రెండో సెమీఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 7–6 (7/4), 7–6 (7/4), 6–4తో 11వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. 2 గంటల 18 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తొలి రెండు సెట్లను టైబ్రేక్‌లో గెలిచాడు. మూడో సెట్లో ఒకసారి బెర్డిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి... ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్ చేరే క్రమంలో ఫెడరర్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. బోపన్న జంట ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–దబ్రౌస్కీ ద్వయం 7–6 (7/4), 4–6, 5–7తో హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–హీతెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడింది. ముగురుజా (vs) వీనస్ ఆరోసారి టైటిల్ సాధించాలని వీనస్ విలియమ్స్... తొలిసారి విజేతగా నిలవాలని ముగురుజా... వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో అమీతుమీకి సిద్ధమయ్యారు. నేడు జరిగే ఫైనల్లో వీనస్ గెలిస్తే పెద్ద వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. ముగురుజా నెగ్గితే 1994 తర్వాత ఈ టైటిల్‌ను గెలిచిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా ఘనత వహిస్తుంది. ముఖాముఖి రికార్డులో వీనస్ 3–1తో ముగురుజాపై ఆధిక్యంలో ఉంది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
'నంబర్ వన్' విజయం.. వెరీ వెరీ స్పెషల్!
లండన్: బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు. నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం ఎవరికైనా గొప్ప విషయమే. అందులోనూ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న తర్వాత గెలిచిన ఫస్ట్ మ్యాచ్ కూడా ఆటగాళ్లకు ప్రత్యేకమే కదా. లండన్‌లో జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో భాగంగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో క్రొయేషియా ప్లేయర్ మారిన్ సిలిక్ పై 6-3, 6-2 తేడాతో విజయం సాధించాడు. గంటన్నర పాటు జరిగిన గేమ్‌లో రెండు వరుస నెట్లలో ముర్రే పైచేయి సాధించాడు. స్థానిక ఆటగాడు ముర్రేకు మ్యాచ్ ఆసాంతం వీక్షకుల నుంచి మద్దుతు లభించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ముర్రే మాట్లాడుతూ.. ఈ వాతావరణం తనకెంతో గొప్పగా అనిపించిందన్నాడు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ గెలుపోటముల రికార్డును ముర్రే 73-9తో మెరుగు పరుచుకున్నాడు. బుధవారం జరగనున్న తన తర్వాతి మ్యాచ్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ కీ నిషికోరితో తలపడనున్నాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా ముర్రే నెంబర్ ర్యాంకు సాధించగా.. అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య గత వారం ర్యాంకులను వెల్లడించింది. ముర్రే, జొకోవిచ్, వావ్రింకా వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచారు. -
టైటిల్ దిశగా డిఫెండింగ్ చాంపియన్
న్యూయార్క్ : క్రొయేషియా ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ మారిన్ సిలిచ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో టైటిల్ దిశగా అడుగులేస్తున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో నెగ్గి సెమీఫైనల్స్‌లో ప్రవేశించాడు. ఫ్రాన్స్‌కు చెందిన సోంగాను 6-4, 6-4, 3-6, 6-7(3/7), 6-4 తేడాతో మట్టికరిపించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఐదు సెట్ల పాటు జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ సిలిచ్ విజయాన్ని సాధించాడు. సోంగాతో జరిగిన గత ఆరు మ్యాచుల్లో సిలిచ్ కి ఇది ఐదో విజయం కావడం గమనార్హం. నాలుగు గంటల పాటు జరిగిన సుదీర్ఘపోరులో 29 ఎస్‌లు, 63 విన్నర్లను సిలిచ్ సాధించాడు. సెమీస్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్, స్పెయిన్ ప్లేయర్ లోపేజ్లలో ఒకరితో తలపడతాడు. 2011లోనూ యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టిన విషయం విదితమే. -
నాడు దోషి... నేడు విజేత
శతాబ్దంన్నర కంటే ఎక్కువ చరిత్ర కలిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఆసియా క్రీడాకారుడికి ప్రతిష్టాత్మక సింగిల్స్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే జపాన్ యువకెరటం కీ నిషికోరి రూపంలో తొలిసారి ఆసియా క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. దాంతో యూఎస్ ఓపెన్‌లో ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందని యావత్ జపాన్‌తోపాటు ఆసియా మొత్తం వేయి కళ్లతో ఎదురుచూసింది. అయితే క్రొయేషియా ఆజానుబాహుడు మారిన్ సిలిచ్ అసమాన ఆటతీరు ముందు నిషికోరి చేతులెత్తేయడంతో ఆసియా అభిమానులకు నిరాశ తప్పలేదు. తుది మెట్టుపై నిషికోరి బోల్తా యూఎస్ ఓపెన్ చాంపియన్ సిలిచ్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: ఆసియా నుంచి పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌ను చూసేందుకు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. సంచలన విజయాలతో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న జపాన్ యువతార కీ నిషికోరి పోరాటం టైటిల్ పోరులో ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో 14వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-3తో పదో సీడ్ నిషికోరిపై గెలిచి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. తద్వారా తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అంతేకాకుండా సిలిచ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సిలిచ్ 17 ఏస్‌లు సంధించడంతోపాటు నిషికోరి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు సిలిచ్ సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒకేసారి సఫలమైన నిషికోరి 30 అనవసర తప్పిదాలు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. విజేతగా నిలిచిన సిలిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 18 కోట్లు); రన్నరప్ నిషికోరికి 14 లక్షల 50 వేల డాలర్లు (రూ. 8 కోట్ల 73 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2001లో గొరాన్ ఇవానిసెవిచ్ (వింబుల్డన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రొయేషియా క్రీడాకారుడిగా సిలిచ్ నిలిచాడు. యాదృచ్ఛికంగా ప్రస్తుతం సిలిచ్‌కు ఇవానిసెవిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ సాధించిన ఫైనల్ విజయాలు సోమవారమే రావడం విశేషం. తాజా ప్రదర్శనతో సిలిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి, నిషికోరి 8వ స్థానానికి ఎగబాకారు. స్థిరమైన ఆటతీరు క్వార్టర్స్‌లో ఆరో సీడ్ బెర్డిచ్ను, సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్, రెండో సీడ్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించి ఫైనల్ చేరిన సిలిచ్ అదే దూకుడును టైటిల్ పోరులోనూ ప్రదర్శించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న సిలిచ్ బుల్లెట్ వేగంతో కూడిన భారీ సర్వీస్‌లు... కచ్చితమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు... నెట్‌వద్ద చలాకీతనంతో నిషికోరి ఆట కట్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్పై, మూడో సీడ్ వావ్రింకాపై, ఐదో సీడ్ రావ్నిక్లపై అద్భుత విజయాలు సాధించి ఫైనల్ చేరిన నిషికోరి తుదిపోరులో సిలిచ్ జోరు ముందు ఎదురునిలువలేకపోయాడు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 68 కేజీల బరువున్న నిషికోరి మ్యాచ్ మొత్తంలో రెండో సెట్లో మాత్రమే ఒకసారి సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు. తన ప్రధాన ఆయుధం శక్తివంతమైన సర్వీస్‌లను నమ్ముకున్న సిలిచ్ ఆరోగేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరులో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో సిలిచ్ ఒకసారి తన సర్వీస్ కోల్పోయినా వెంటనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌పై తన పట్టుబిగించాడు. మూడో సెట్లోనూ సిలిచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌లో క్రాస్‌కోర్టు బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో సిలిచ్ మ్యాచ్‌ను ముగించాడు. * ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక 14వ సీడ్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. * పీట్ సంప్రాస్ (2002లో-ప్రపంచ 17వ ర్యాంకర్) తర్వాత టాప్-10 ర్యాంకింగ్స్‌లో లేని క్రీడాకారుడు యూఎస్ ఓపెన్‌ను (సిలిచ్-ప్రపంచ 16వ ర్యాంకర్) గెలవడం ఇదే ప్రథమం. గాస్టన్ గాడియో (ప్రపంచ 44వ ర్యాంకర్; 2004-ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత సిలిచ్ రూపంలో టాప్-10లో లేని క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. * గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అత్యంత పొడగరి క్రీడాకారుడిగా యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా-2009 యూఎస్ ఓపెన్) సరసన సిలిచ్ చేరాడు. ఈ ఇద్దరూ 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నారు. * ఓపెన్ శకంలో యూఎస్ ఓపెన్‌ను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌గా నెగ్గిన 13వ క్రీడాకారుడు సిలిచ్. గతంలో ఆండీ ముర్రే (2012), డెల్‌పొట్రో (2009), లీటన్ హెవిట్ (2001) ఈ ఘనత సాధించారు. * ఓపెన్ శకంలో చివరి మూడు మ్యాచ్‌ల్లో (క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్) ఒక్క సెట్ కోల్పోకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఐదో ఆటగాడు సిలిచ్. గతంలో ఫెడరర్ (2003-వింబుల్డన్), రిచర్డ్ క్రాయిసెక్ (1996-వింబుల్డన్), ప్యాట్ క్యాష్ (1987-వింబుల్డన్), గిలెర్మో విలాస్ (1977-ఫ్రెంచ్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. నాడు దోషి... నేడు విజేత క్లిష్ట పరిస్థితులు గొప్ప వ్యక్తుల్లోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తాయి. మారిన్ సిలిచ్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్లో సిలిచ్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా... మోకాలి నొప్పితో వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఏప్రిల్‌లో మ్యూనిచ్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు అతనికి వింబుల్డన్ టోర్నీలో సమాచారం ఇవ్వడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. దాంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సిలిచ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఫలితంగా సిలిచ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. 2013 చివర్లో తన చిన్ననాటి అభిమాన క్రీడాకారుడు గొరాన్ ఇవానిసెవిచ్ను కోచ్‌గా నియమించుకున్నాడు. అదే సమయంలో తన నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేశాడు. తన సహాయక సిబ్బందిలో ఎవరో తెలియకుండా తనకు నిషేధిత ఉత్ప్రేరకం ఉన్న మాత్రలను ఇవ్వడంతోనే ఇలా జరిగిందని వాదించాడు. సిలిచ్ వాదనలతో ఏకభవించిన కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ నిషేధాన్ని నాలుగు నెలలకు కుదించింది. సత్తా ఉన్నా సరైన ప్రణాళిక లేకపోవడంతో సిలిచ్లో ఉన్న అసలు చాంపియన్ బయటకు రావడంలేదని ఇవానిసెవిచ్ గ్రహించాడు. అతని ఆటలోని లోపాలను సవరించాడు. అతని ప్రధాన ఆయుధమైన భారీ సర్వీస్‌లకు మరింతగా పదును పెట్టాడు. పదేపదే ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాలని సూచించాడు. అయితే సిలిచ్ తన ఆటతీరును మార్చుకోవడానికి ఆరేడు నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో అనుకున్న ఫలితం వచ్చింది. మూడో రౌండ్లో 18వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), నాలుగో రౌండ్లో 26వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), సెమీఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్) లను ఓడించిన సిలిచ్ ఫైనల్లో పదో సీడ్ నిషికోరిపై గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. డోపింగ్‌లో దోషిగా తేలి కెరీర్ ప్రమాదంలో పడిన సమయంలో సిలిచ్ స్థయిర్యం కోల్పోకుండా పరిణతితో వ్యవహరించాడు. పట్టుదలే పెట్టుబడిగా పోరాటం చేసి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచి కెరీర్‌ను చక్కదిద్దుకున్నాడు. -
మారిన్ సిలిచ్ కు యూఎస్ ఓపెన్ టైటిల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను క్రొయేషియాకు చెందిన 14వ సీడ్ ఆటగాడు మారిన్ సిలిచ్ గెలుచుకున్నాడు. అతడికిది తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో పదో సీడ్ కీ నిషికోరి (జపాన్)ను 6-3, 6-3, 6-3తో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను కంగుతినిపించిన నిషికోరి తుదిపోరులో పెద్దగా పోరాడకుండానే తలవంచాడు. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (సఫిన్, హెవిట్) ఫైనల్ తర్వాత... ఫెడరర్, జొకోవిచ్, రాఫెల్ నాదల్‌లలో ఒక్కరూ లేకుండా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. డోపింగ్‌లో పట్టుబడిన కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉన్న మారిన్ సిలిచ్ ఈసారి ఏకంగా విజేతగా అవతరించాడు.