'నంబర్ వన్' విజయం.. వెరీ వెరీ స్పెషల్!
లండన్: బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు. నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం ఎవరికైనా గొప్ప విషయమే. అందులోనూ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న తర్వాత గెలిచిన ఫస్ట్ మ్యాచ్ కూడా ఆటగాళ్లకు ప్రత్యేకమే కదా. లండన్‌లో జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో భాగంగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో క్రొయేషియా ప్లేయర్ మారిన్ సిలిక్ పై 6-3, 6-2 తేడాతో విజయం సాధించాడు. గంటన్నర పాటు జరిగిన గేమ్‌లో రెండు వరుస నెట్లలో ముర్రే పైచేయి సాధించాడు. స్థానిక ఆటగాడు ముర్రేకు మ్యాచ్ ఆసాంతం వీక్షకుల నుంచి మద్దుతు లభించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ముర్రే మాట్లాడుతూ.. ఈ వాతావరణం తనకెంతో గొప్పగా అనిపించిందన్నాడు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ గెలుపోటముల రికార్డును ముర్రే 73-9తో మెరుగు పరుచుకున్నాడు. బుధవారం జరగనున్న తన తర్వాతి మ్యాచ్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ కీ నిషికోరితో తలపడనున్నాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్కు చేరడం ద్వారా ముర్రే నెంబర్ ర్యాంకు సాధించగా.. అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య గత వారం ర్యాంకులను వెల్లడించింది. ముర్రే, జొకోవిచ్, వావ్రింకా వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచారు.