షాంఘై: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ జానిక్ సినెర్ ఈ ఏడాది టైటిళ్లతో దూసుకెళుతున్నాడు. చైనాలో జరిగిన షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇటాలియన్ స్టార్ ప్లేయర్ వరుస సెట్లలోనే టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు షాకిచ్చాడు. ఫైనల్లో సినెర్ 7–6 (7/4), 6–3తో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, సెర్బియన్ సూపర్‌స్టార్ జొకొవిచ్‌ను కంగు తినిపించాడు. కేవలం గంటా 37 నిమిషాల్లోనే సినెర్ ఈ టైటిల్ పోరును ముగించడం విశేషం. సినెర్ 8 ఏస్‌లను సంధించి, 22 విన్నర్లు కొట్టాడు.
మరోవైపు అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోయిన నొవాక్ 4 ఏస్‌లు, 12 విన్నర్లే కొట్టగలిగాడు. దీంతో కెరీర్‌లో వందో టైటిల్ సాధించాలన్న సెర్బియన్ ఆశలు ఆవిరయ్యాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఇద్దరే ఆటగాళ్లు అమెరికన్ లెజెండ్ జిమ్మీ కానర్స్ 109, స్విట్జర్లాండ్ ఆల్‌టైమ్ గ్రేట్ రోజర్ ఫెడరర్ 103 టైటిళ్లతో సెంచరీ మార్క్‌ను దాటారు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న 23 ఏళ్ల సినెర్ హార్డ్‌కోర్ట్‌లో టాప్–5 ప్లేయర్లపై తన విజయాల ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు.
ప్రపంచ టాప్ ఐదు ర్యాంక్ ప్లేయర్లపై 8 సార్లు గెలిచిన సినెర్ కేవలం రెండు సార్లు మాత్రమే ఓడిపోయాడు. ఐదేళ్ల తర్వాత షాంఘై బరిలోకి దిగిన 37 ఏళ్ల జొకోవిచ్ చివరకు రన్నరప్‌గానే సరిపెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో జరిగిన వుహాన్ ఓపెన్‌లో వరుసగా మూడోసారి బెలారస్ స్టార్ అరియాన సబలెంక హ్యాట్రిక్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంక 6–3, 7–5, 6–3తో స్థానిక చైనా స్టార్ జెంగ్ కిన్వెన్‌ను కంగుతినిపించింది. ఈ సీజన్‌లో బెలారస్ టెన్నిస్ స్టార్‌కిది నాలుగో టైటిల్. ఆమె గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో ఆ్రస్టేలియన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను కూడా గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment