ఫెడరర్...కాచుకో
∙ తొలిసారి వింబుల్డన్ ఫైనల్లోకి సిలిచ్
∙ సెమీస్‌లో సామ్ క్వెరీపై విజయం
∙ రేపు స్విస్ దిగ్గజంతో టైటిల్ పోరు
∙ రెండో సెమీస్‌లో బెర్డిచ్‌పై ఫెడరర్ గెలుపు
ఏమాత్రం అంచనాలు లేకుండా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన క్రొయేషియా ఆజానుబాహుడు మారిన్ సిలిచ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అంతిమ సమరానికి చేరుకున్నాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 89 కేజీల బరువున్న సిలిచ్ తన 11వ ప్రయత్నంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రూపంలో సిలిచ్‌కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. తన కెరీర్‌లోనే అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న ఫెడరర్ సెమీఫైనల్లో థామస్ బెర్డిచ్‌ను వరుస సెట్‌లలో ఓడించాడు. 11వ సారి వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన ఫెడరర్ రికార్డుస్థాయిలో ఎనిమిదో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు.
లండన్: ఎవరూ ఊహించని విధంగా క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఏడో సీడ్ సిలిచ్ 6–7 (6/8), 6–4, 7–6 (7/3), 7–5తో 24వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై గెలిచాడు. 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బుల్లెట్‌లాంటి సర్వీస్‌లు, పదునైన రిటర్న్‌లతో అలరించాడు. అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మల్చుకొని తన కెరీర్‌లో రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు అర్హత పొందాడు. 2001లో గొరాన్ ఇవానిసెవిచ్ తర్వాత క్రొయేషియా నుంచి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా సిలిచ్ గుర్తింపు పొందాడు. 2014లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సిలిచ్ తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. ‘నమ్మశక్యంగా లేదు. ఈ టోర్నీ ఆరంభం నుంచి నేను అద్భుతంగా ఆడాను. ఫెడరర్‌కు వింబుల్డన్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అయితేనేం అతనితో పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతని సవాల్‌కు సిద్ధంగా ఉన్నాను’ అని సిలిచ్ వ్యాఖ్యానించాడు.
ఎదురులేని ఫెడరర్...
రెండో సెమీఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 7–6 (7/4), 7–6 (7/4), 6–4తో 11వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. 2 గంటల 18 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తొలి రెండు సెట్‌లను టైబ్రేక్‌లో గెలిచాడు. మూడో సెట్‌లో ఒకసారి బెర్డిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి... ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్ చేరే క్రమంలో ఫెడరర్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.
బోపన్న జంట ఓటమి
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–దబ్రౌస్కీ ద్వయం 7–6 (7/4), 4–6, 5–7తో హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)–హీతెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడింది.
ముగురుజా (vs) వీనస్
ఆరోసారి టైటిల్ సాధించాలని వీనస్ విలియమ్స్... తొలిసారి విజేతగా నిలవాలని ముగురుజా... వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో అమీతుమీకి సిద్ధమయ్యారు. నేడు జరిగే ఫైనల్లో వీనస్ గెలిస్తే పెద్ద వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. ముగురుజా నెగ్గితే 1994 తర్వాత ఈ టైటిల్‌ను గెలిచిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా ఘనత
వహిస్తుంది. ముఖాముఖి రికార్డులో వీనస్ 3–1తో ముగురుజాపై ఆధిక్యంలో ఉంది.
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం