ఎదురులేని ఫెడరర్ | Roger Federer’s Ridiculous Between-the-Legs Shot Impresses Michael Jordan | Sakshi
Sakshi News home page

ఎదురులేని ఫెడరర్

Published Thu, Aug 28 2014 1:23 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

ఎదురులేని ఫెడరర్ - Sakshi

ఎదురులేని ఫెడరర్

తొలి రౌండ్‌లో అలవోక విజయం
సెరెనా, క్విటోవా కూడా..
సిబుల్కోవా, రద్వాన్‌స్కాలకు చుక్కెదురు
యూఎస్ ఓపెన్ టెన్నిస్
న్యూయార్క్: ఆరోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) విజయవంతంగా రెండోరౌండ్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం) జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండోసీడ్ ఫెడరర్ 6-3, 6-4, 7-6 (7/4)తో మారింకో మతోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. కెరీర్‌లో 60వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఫెడరర్‌కు ఈ సీజన్‌లో ఇది 50వ విజయం. రెండు గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్విస్ ప్లేయర్ 10 ఏస్‌లు, 41 విన్నర్లు సంధించాడు.

ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-1, 6-2, 2-6, 6-2తో డామిర్ జుమ్హుర్ (బోస్నియా)పై; 10వ సీడ్ కిషి నిషికోరి (జపాన్) 6-2, 6-4, 6-2తో ఒడేస్నిక్ (అమెరికా)పై; 12వ సీడ్ గాస్కెట్ (ఫ్రాన్స్) 7-5, 7-6 (7/5), 6-4తో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్)పై; 13వ సీడ్ జాన్ ఇస్నేర్ (అమెరికా) 7-6 (7/5)6-2, 7-6 (7/2)తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై గెలిచి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు.

సెరెనా దూకుడు
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-3, 6-1తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై గెలిచి రెండోరౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్‌లో నాలుగో రౌండ్‌లోనే వెనుదిరిగిన సెరెనా ఈ మ్యాచ్‌లో కేవలం 55 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. ఇతర మ్యాచ్‌ల్లో 3వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్) 6-1, 6-0తో మల్డెనోవిచ్ (ఫ్రాన్స్)పై; 7వ సీడ్ బౌచర్డ్ (కెనడా) 6-2, 6-1తో గొవర్తోసోవా (బెలారస్)పై; 8వ సీడ్  ఇవనోవిచ్ (సెర్బియా) 6-3, 6-0తో రిస్కే (అమెరికా)పై గెలిచారు.
 
రద్వాన్‌స్కాకు షాక్

మరోవైపు నాలుగోసీడ్ అగ్నేస్కా రద్వాన్‌స్కా (పోలెండ్) టోర్నీ నుంచి నిష్ర్కమించింది. రెండోరౌండ్‌లో షుయ్ పెంగ్ (చైనా) 6-3, 6-4తో రద్వాన్‌స్కాపై నెగ్గింది.

సానియా జోడి విజయం
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో మూడోసీడ్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) 6-3, 6-0తో కరోలినా ప్లిస్కోవా-క్రిస్టియానా ప్లిస్కోవా (చెక్)పై నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో లియాండర్ పేస్-స్టెఫానెక్ (చెక్) 7-6 (7/5), 6-2తో బొలెల్లీ-ఫాగ్నిని (ఇటలీ)లపై నెగ్గగా,   బోపన్న-ఐజమ్ ఖురేషి (పాకిస్థాన్) 6-7 (10/12), 6-4, 6-7 (5/7)తో ఇటలీ జంట బార్సెల్లి-సెప్పీ చేతిలో ఓడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement