సిట్సిపాస్, స్లోన్ స్టీఫెన్స్, కరెన్ ఖచనోవ్, డొమినిక్ థీమ్
గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాలంటే అత్యంత నిలకడగా ఆడటమే ప్రధానం. ఆ నిలకడ లేకపోతే ఆశించిన ఫలితాలు రాలేవు. భవిష్యత్‌లో ‘బిగ్ త్రీ’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ స్థానాలను భర్తీచేయగల సామర్థ్యమున్న ఆటగాళ్లుగా పేరొందిన డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్), కరెన్ ఖచనోవ్ (రష్యా) ఊహించని పరాజయాలు ఎదుర్కొన్నారు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్స్ రేసులో ఉన్న ఈ ముగ్గురూ తొలి రౌండ్ అడ్డంకినే అధిగమించలేక ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2017 చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) కూడా తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూశారు.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సంచలనాల మోత మోగింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఒకేరోజు టాప్–10లోని నలుగురు ఆటగాళ్లు తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), తొమ్మిదో సీడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా), పదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) తొలి రౌండ్‌లోనే చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్‌లో 2017 చాంపియన్, 11వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), 2004 చాంపియన్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా), మాజీ నంబర్‌వన్ ప్లేయర్లు అజరెంకా (బెలారస్), 24వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.
వరుసగా రెండేళ్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన థీమ్ 2 గంటల 23 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో 4–6, 6–3, 3–6, 2–6తో ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోగా... అన్‌సీడెడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 3 గంటల 54 నిమిషాల పోరులో 6–4, 6–7 (5/7), 7–6 (7/5), 7–5తో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ సిట్సిపాస్‌ను బోల్తా కొట్టించాడు. 216వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) 3 గంటల 51 నిమిషాల్లో 4–6, 7–5, 7–5, 4–6, 6–3తో ఖచనోవ్‌పై... కుకుష్‌కిన్ (కజకిస్తాన్) 3–6, 6–1, 6–3, 3–6, 6–3తో అగుట్‌పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. ఇతర మ్యాచ్‌ల్లో షపోవలోవ్ (కెనడా) 6–1, 6–1, 6–4తో 18వ సీడ్ అగుల్ (కెనడా)పై, అందుజార్ (స్పెయిన్) 3–6, 7–6 (7/1), 7–5, 5–7, 6–2తో 30వ సీడ్ ఎడ్మండ్ (బ్రిటన్)పై, సాండ్‌గ్రెన్ (అమెరికా) 1–6, 6–7 (2/7), 6–4, 7–6 (7/5), 7–5తో మాజీ ఐదో ర్యాంకర్ సోంగా (ఫ్రాన్స్)లపై గెలిచారు.
నాదల్ శుభారంభం
నాలుగో టైటిల్‌పై గురి పెట్టిన రెండో సీడ్ రాఫెల్ నాదల్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ఈ స్పెయిన్ స్టార్ 6–3, 6–2, 6–2తో మిల్‌మన్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–1, 6–3, 3–6, 4–6, 6–2తో ఆల్బోట్ (మాల్డోవా)పై అతికష్టమ్మీద గెలిచాడు. 14వ సీడ్ ఇస్నెర్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో లోపెజ్ (స్పెయిన్)పై, 28వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 6–3, 7–6 (7/1), 6–4తో జాన్సన్ (అమెరికా)పై నెగ్గారు.
మూడో రౌండ్‌లో ప్లిస్కోవా
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్లిస్కోవా 6–1, 6–4తో మరియం బోల్క్‌వాద్జె (జార్జియా)ను ఓడించింది. మరోవైపు నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్‌ను దాటారు. హలెప్ 6–3, 3–6, 6–2తో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న అమెరికా అమ్మాయి నికోల్ గిబ్స్‌పై గెలుపొందగా... వొజ్నియాకి 1–6, 7–5, 6–3తో యాఫన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. క్వాలిఫయర్ కలిన్‌స్కాయ (రష్యా) 6–3, 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ సబలెంకా (బెలారస్) 3–6, 6–3, 6–4తో అజరెంకాపై, రిస్కీ (అమెరికా) 2–6, 6–1, 6–3తో ముగురుజాపై, క్రిస్టీ ఆన్ (అమెరికా) 7–5, 6–2తో కుజ్‌నెత్సోవాపై సంచలన విజయాలు సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. అమెరికా టీనేజ్ సంచలనం, 15 ఏళ్ల కోరి గౌఫ్ 3–6, 6–2, 6–4తో పొటపోవా (రష్యా)ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment