
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ‘డ్రా’ విడుదలైంది. భారత జట్టుకు గ్రూప్ ‘బి’లో చోటు లభించింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో గురువారం ‘డ్రా’ కార్యక్రమం జరిగింది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లకు జూన్ 23 నుంచి జూలై 5 వరకు థాయ్‌లాండ్ ఆతిథ్యమిస్తుంది. భారత్‌తోపాటు థాయ్‌లాండ్, మంగోలియా, తిమోర్‌లెస్తె, ఇరాక్ జట్లు గ్రూప్ ‘బి’లో ఉన్నాయి.
గ్రూప్ విజేత వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. మొత్తం 34 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’... గ్రూప్ ‘బి’లలో ఐదు జట్ల చొప్పున ఉన్నాయి. మిగతా ఆరు గ్రూపుల్లో నాలుగు జట్ల చొప్పున ఉన్నాయి.
మొత్తం ఎనిమిది గ్రూప్‌ల విజేత జట్లు ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఆతిథ్య ఆస్ట్రేలియాతోపాటు 2022 ఆసియాకప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన చైనా, కొరియా, జపాన్ జట్లు ఇప్పటికే ఆసియా కప్–2026 టోర్నీకి నేరుగా అర్హత పొందాయి.