పారాలింపియన్ నితేశ్ కుమార్ స్ఫూర్తిదాయక ప్రయాణం
తండ్రి నేవీ ఆఫీసర్... ఆయనను చూసి తానూ అలాగే యూనిఫామ్ సర్వీస్‌లోకి వెళ్లాలనుకున్నాడు... కానీ అనూహ్య ఘటనతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఐటీ వరకు వెళ్లాడు... కానీ శరీరం అక్కడ ఉన్నా మనసు మాత్రం ఆటలపై ఉంది... కానీ అనుకోని వైకల్యం వెనక్కి లాగుతోంది... అయినా సరే ఎక్కడా తగ్గలేదు... అణువణువునా పోరాటస్ఫూర్తి నింపుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించి పట్టుదలగా శ్రమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయాడు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను పూర్తి చేసుకున్నాడు. పారా షట్లర్ నితేశ్ కుమార్ విజయగాథ ఇది.
2009... నితేశ్ కుమార్ వయసు 15 ఏళ్లు. అప్పటికి అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్‌ను బాగా ఆడేవాడు. అయితే ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. విశాఖపట్నం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నితేశ్ తన కాలును కోల్పోయాడు. కోలుకునే క్రమంలో సుదీర్ఘ కాలం పాటు ఆస్పత్రి బెడ్‌పైనే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగైనా ఆటలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల్సి వచి్చంది. దాంతో చదువుపై దృష్టి పెట్టిన నితేశ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మండీలో సీటు సంపాదించాడు. అక్కడ ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తి పెరిగింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్‌ను చూసి అతను స్ఫూర్తి పొందాడు. ఆటగాడిగా ఉండాలంటే ఎంత ఫిట్‌గా ఉండాలనే విషయంలో కోహ్లి నుంచి ప్రేరణ పొందినట్లు నితేశ్æ చెప్పాడు.
కోల్పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును అమర్చుకునే క్రమంలో నితేశ్ పుణేలోని ‘ఆర్టిఫీషియల్ లింబ్స్ సెంటర్’కు చేరాడు. అక్కడ ఎంతో మంది తనకంటే వయసులో పెద్దవారు కూడా ఎలాంటి లోపం కనిపించనీయకుండా కష్టపడుతున్న తీరు అతడిని ఆశ్చర్యపర్చింది. ‘40–45 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కృత్రిమ అవయవాలతో ఫుట్‌బాల్, సైక్లింగ్, రన్నింగ్ చేయడం చూశాను. ఈ వయసులో వారు చేయగా లేనిది నేను చేయలేనా అనిపించింది.
ఆపై పూర్తిగా బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను’ అని హరియాణాకు చెందిన నితేశ్ చెప్పాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి నితేశ్ బరిలోకి దిగాడు. తను ఆరాధించే భగత్‌తోపాటు మనోజ్ సర్కార్‌వంటి సీనియర్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో ఈ ఆటలో మరిన్ని సాధించాలనే పట్టుదల పెరిగింది. గత ఒలింపిక్స్‌లో భగత్ స్వర్ణం గెలుచుకోవడం చూసిన తర్వాత తానూ ఒలింపిక్స్ పతకం సాధించగలననే నమ్మకం నితేశ్‌కు కలిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా తీవ్ర సాధన చేసిన అతను ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. పారిస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయాలు అందుకొని స్వర్ణపతకంతో సగర్వంగా నిలిచాడు.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment