Bronze medals
-
Manu Bhaker: నేను చేసిన తప్పు అదే.. అందుకే ఇలా!
తన కూతురిని ‘షూటర్’గా తీర్చిదిద్ది తప్పుచేశామంటూ మనూ భాకర్(Manu Bhaker) తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను క్రికెటర్‌ను చేసి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని పేర్కొన్నారు. ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించినా సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు.కాగా భారత ప్రభుత్వం ప్రదానం చేసే క్రీడా అత్యుతన్నత పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న’(Major Dhyan Chand Khel Ratna). ఇందుకు సంబంధించిన అవార్డు కమిటీ సోమవారం నామినీల పేర్లను ప్రకటించగా.. అందులో మనూ భాకర్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన మనూ తండ్రి రామ్ కిషన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నా బిడ్డ ఇంకేం చేయాలి?‘‘ఇప్పటి వరకు భారత్ తరఫున ఎవరూ సాధించని ఘనత నా కూతురు సాధించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతకంటే దేశం కోసం నా బిడ్డ ఇంకేం చేయాలి? ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించాలి కదా!.పతకాలు గెలవకుంటేనే బాగుండేదిఈ విషయం గురించి నేను మనూతో మాట్లాడాను. తన మనసంతా బాధతో నిండి ఉంది. ‘నేనసలు దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించకపోయి ఉంటే.. ఈ బాధ ఉండేదే కాదు. అసలు క్రీడాకారిణిని కాకపోయే ఉంటే ఇంకా బాగుండేది’ అని తను నాతో అన్నది’’ అని రామ్ కిషన్ భాకర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తమ ఆవేదనను పంచుకున్నారు.బాహ్య శక్తుల ప్రభావం ఉంది!ఇక దేశానికి ఇంత గొప్ప పేరు తెచ్చినా గుర్తింపు దక్కకపోవడం చూస్తుంటే.. కమిటీపై బాహ్య శక్తుల ప్రభావం లేదంటే నమ్మబుద్ధి కావడం లేదని రామ్ కిషన్ భాకర్ అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె విషయంలో ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.కాగా హర్యానాకు చెందిన రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్. ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024(Paris Olympics 2024)లో రెండు మెడల్స్ గెలిచింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా స్వాతంత్ర్యం తర్వాత భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మొట్టమొదటి ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించింది.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు. పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్’ సుమిత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
‘మిషన్ 2028’ మొదలైంది...
న్యూఢిల్లీ: నాలుగేళ్ల తర్వాత జరగనున్న 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని భారత స్టార్ షూటర్ మనూ భాకర్ వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మనూ బుధవారం స్వదేశానికి తిరిగి వచి్చంది. స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మనూ భాకర్, ఆమె కోచ్ జస్పాల్ రాణాకు ఘనస్వాగతం లభించింది. 22 ఏళ్ల మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ విభాగంలో కాంస్య పతకాలు గెలుచుకొని.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొలి్పన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనూ భాకర్ మాట్లాడుతూ. ‘పారిస్ ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. నేనప్పుడే 2028 లాస్ ఏంజెలిస్ క్రీడల కోసం ప్రయాణం ప్రారంభించా. కాస్త విరామం అనంతరం సాధన మొదలుపెడతాను. భవిష్యత్తులోనూ ఇదే నిలకడ చూపేందుకు ప్రయతి్నస్తా. అందుకోసం మరింత శ్రమిస్తా. కాకపోతే ఇప్పుడు కొంతకాలం కుటుంబ సభ్యులతో గడుపుతాను. మూడు నెలల తర్వాత తిరిగి షూటింగ్ ప్రాక్టీస్ ప్రారంభిస్తా’ అని ఆమె వెల్లడించింది. విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించడంతో పాటు 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. శనివారం తిరిగి పారిస్ వెళ్లనుంది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మనూ భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించనుంది. -
NSG: బాక్సింగ్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులకు పతకాలు
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ” అండర్ -17, 19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందం పతకాలు గెలుచుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఏపీ టీమ్‌కు నాలుగు కాంస్యాలు దక్కాయి. ఈ సందర్భంగా.. ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఈ బాక్సింగ్ పోటీలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు ఢిల్లీలో జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు. పతకాలు గెలుచుకుంది వీళ్లే ►అండర్ 19- బాలికల (45-48 కేజీలు) విభాగంలో మొహ్మద్ హీనా కౌసర్ (నారాయణ జూనియర్ కాలేజీ ,విశాఖపట్నం)- కాంస్య పతకం. ►అండర్ 19- బాలికల (48-51 కేజీలు ) విభాగంలో కోలుసు నిహారిక (విశాఖ గవర్నమెంట్ జూనియర్ కాలేజి,విశాఖపట్నం )- కాంస్య పతకం. ►అండర్ 19- బాలికల (51-54 కేజీలు) విభాగంలో గంగవరపు అక్షిత (గవర్నమెంట్ జూనియర్ కాలేజి ,రాజమహేంద్రవరం,తూర్పు గోదావరి జిల్లా)- కాంస్య పతకం. ►అండర్ 17- బాలికల (46-48 కేజీలు) విభాగంలో మైలపిల్లి మేఘన (సెయింట్ జాన్స్ పారిష్ స్కూల్ ,విశాఖపట్నం జిల్లా ) - కాంస్య పతకం. చదవండి: National School Games: ఆంధ్రప్రదేశ్ తైక్వాండో బృందానికి పతకాలు Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్ -
NSG: ఆంధ్రప్రదేశ్ తైక్వాండో బృందానికి పతకాలు
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “తైక్వాండో” అండర్ – 14,17, 19 బాల, బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందానికి పతకాలు లభించాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఏపీ టీమ్ మొత్తంగా ఒక రజతం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలను అభినందించారు. ఇక.. మధ్యప్రదేశ్‌లోని ‘బీటల్’ వేదికగా డిసెంబరు 31 నుంచి జనవరి 5 వరకు ఈ పోటీలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు. విజేతలు వీరే: ►అండర్ 19 బాలికల (52-55 కేజీలు) విభాగంలో- హస్తి తేజస్విని (యస్.వి.జూనియర్ కాలేజీ ,కోడూరు ఆర్.యస్. అన్నమయ్య జిల్లా)కి రజత పతకం ►అండర్ 19 బాలికల (46-49 కేజీలు ) విభాగంలో వారణాసి హిమ శ్రీ (మున్సిపల్ హై స్కూల్ , కస్పా, విజయనగరం)కి కాంస్య పతకం ►అండర్ 14 బాలికల (16-18 కేజీలు) విభాగంలో ఆకుల సమీరా (జెడ్పీహెచ్ఎస్, భాగ్యనగరం, దొర్నిపాడు, మండలం, నంద్యాల జిల్లా)కి కాంస్య పతకం ►అండర్ 17 బాలురు (73-78 కేజీలు) విభాగంలో పెదగాడి ధనుష్ తేజ(ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అశోక్ నగర్, కాకినాడ, కాకినాడ జిల్లా)కు కాంస్య పతకం -
భారత్ ‘పంచ్’ పవర్
యెరెవాన్ (అర్మేనియా): అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. అర్మేనియాలో ముగిసిన ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో మహిళల, పురుషుల విభాగాల్లో కలిసి భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. చివరిరోజు భారత్‌కు మూడు పసిడి పతకాలు, ఆరు రజత పతకాలు లభించాయి. మూడు స్వర్ణాలూ మహిళా బాక్సర్లే నెగ్గడం విశేషం. పాయల్ (48 కేజీలు), నిషా (52 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో పాయల్ 5–0తో హెజినె పెట్రోసియాన్ (అర్మేనియా)పై, నిషా 5–0తో ఫరినోజ్ అబ్దుల్లాఇవా (తజికిస్తాన్)పై, ఆకాంక్ష 5–0తో తైమజోవా ఎలిజవెటా (రష్యా)పై విజయం సాధించారు. ఇతర ఫైనల్స్‌లో వినీ (57 కేజీలు) 0–5తో మమతోవా సెవర (ఉజ్బెకిస్తాన్) చేతిలో... సృష్టి (63 కేజీలు) 0–5తో సియోఫ్రా లాలెస్ (ఐర్లాండ్) చేతిలో... అనా బుజులెవా (రష్యా) చేతిలో నాకౌట్ అయిన మేఘ (80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో సాహిల్ (75 కేజీలు), హేమంత్ సాంగ్వాన్ (ప్లస్ 80 కేజీలు), జతిన్ (54 కేజీలు) ఫైనల్లో పరాజయం చవిచూసి రజత పతకాలు గెల్చుకున్నారు. సాహిల్ 0–5తో అల్బెర్ట్ హరుతిన్యాన్ (అర్మేనియా) చేతిలో... హేమంత్ 0–5తో సలిఖోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... జతిన్ 1–4తో తులెబెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
చైనాలో కొనసాగుతున్న భారత్ పతకాల వేట.. చరిత్ర సృష్టించిన ముఖర్జీ సిస్టర్స్
Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 21 వెండి, 21 కాంస్యాలు కైవసం చేసుకుంది. కాగా అత్యధికంగా ఆదివారం ఒక్కరోజే భారత క్రీడాకారులు 15 మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్‌లో 9, షూటింగ్లో 3, బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం సాధించారు. ఇక సోమవారం(అక్టోబరు 2) నాటి విశేషాలు తెలుసుకుందాం! ముఖర్జీ సిస్టర్స్‌కు కాంస్యం టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత్‌కు బ్రాంజ్ మెడల్ లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సోమవారం నాటి మ్యాచ్‌లో గెలుపొంది ఆసియా క్రీడల్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్‌కు తొట్టతొలి పతకం అందించారు. తద్వారా ముఖర్జీ సిస్టర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. SMASHING IN STYLE: THE MUKHERJEE SISTERS🏓 🇮🇳's Table Tennis phenomenal duo, Ahyika Mukherjee and Sutirtha Mukherjee script history at #AsianGames2022 by clinching the BRONZE MEDAL 🏓🥉 in the women's doubles event! 🙌💫 They've broken the barrier in style, getting India's… pic.twitter.com/FDVUgnD06p — SAI Media (@Media_SAI) October 2, 2023 రోలర్ స్కేటింగ్‌లో.. భారత స్కేటింగ్ రిలే టీమ్ కాంస్య పతకం సాధించింది. వుమెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. సమన్వయలోపానికి తావులేకుండా సమష్టిగా రాణించి 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు. అబ్బాయిలు సైతం.. రోలర్ స్కేటింగ్‌లో అబ్బాయిలు కూడా అదరగొట్టారు. మెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ. రిలే టీమ్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్ధాంత్, విక్రమ్ కలిసి భారత్‌కు మరో పతకం అందించారు. 🥉 BACK TO BACK BRONZE GLORY 🇮🇳 What a start to the day! ☀️ 🇮🇳's Aryan Pal, Anand Kumar, Siddhant, and Vikram have rolled their way to BRONZE in the Men's Speed Skating 3000m Relay, clocking an incredible time of 4:10.128! 🤩 🛼 Let's give them a roaring applause for their… pic.twitter.com/WkLDxvKvTS — SAI Media (@Media_SAI) October 2, 2023 -
Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్...
హాంగ్జౌ: తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ షూటర్లు ఆసియా క్రీడల్లో తమ గురికి పదును పెట్టారు. పోటీల రెండో రోజు భారత షూటర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు అందించారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొలి్పంది. ఈ ఏడాది ఆగస్టు 23న చైనా జట్టు 1893.3 పాయిం్లటతో సాధించిన ప్రపంచ రికార్డును భారత త్రయం తిరగరాసింది. క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు చేసిన స్కోరును లెక్కించి టాప్–3లో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి రుద్రాంశ్ 632.5 పాయింట్లు, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 631.6 పాయింట్లు, దివ్యాంశ్ 629.6 పాయింట్లు సాధించారు. టాప్–8లో నిలిచిన ఈ ముగ్గురూ ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లకు మాత్రమే ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఉంది. దాంతో దివ్యాంశ్ కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు చేసిన రుద్రాంశ్ , ఐశ్వరీ ప్రతాప్ భారత్ తరఫున ఫైనల్లో పోటీపడ్డారు. ఎనిమిది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంశ్ 208.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువగా... ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 228.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. లిహావో షింగ్ (చైనా; 253.3 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని ౖకైవసం చేసుకోగా... హాజున్ పార్క్ (దక్షిణ కొరియా; 251.3 పాయింట్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్ సింగ్ (576 పాయింట్లు), అనీశ్ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత త్రయం మొత్తం 1718 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండోనేసియా కూడా 1718 పాయింట్లు సాధించినా... 10 పాయింట్ల షాట్లు భారత్‌కంటే (45) ఇండోనేసియా (37) తక్కువగా కొట్టడంతో టీమిండియాకు కాంస్యం ఖరారైంది. క్వాలిఫయింగ్‌లో విజయ్‌వీర్ సిద్ధూ ఆరో ర్యాంక్‌లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయ్‌వీర్ 21 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో కాంస్య పతకానికి దూరమయ్యాడు. కాంస్య పతకాలతో ఆదర్శ్, విజయ్‌వీర్, అనీశ్ -
ఆర్చరీలో ‘డబుల్’ ధమాకా
పారిస్: భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 ఈవెంట్లో పసిడి పంట పండించారు. కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో ‘డబుల్’ ధమాకా సాధించాయి. రికర్వ్ జట్లు కాంస్య పతకాలు గెలిచాయి. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓజస్ ప్రవీణ్, ప్రథమేశ్ జౌకర్‌లతో కూడిన భారత జట్టు శని వారం జరిగిన ఫైనల్లో 236–232 స్కోరుతో క్రిస్ షాఫ్, జేమ్స్ లుజ్, సాయెర్ సలైవాన్‌లతో కూడిన అమెరికా జట్టుపై ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలవగా, కీలకమైన చివరి రౌండ్లో భారత్ పైచే యి సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్ టీమ్‌పై గెలిచింది. ధీరజ్ బొమ్మదేవర, అతాను దాస్, తుషార్‌లతో కూడిన భారత్ 6–2తో స్పానిష్ టీమ్‌ను ఓడించి కాంస్యం గెలుచుకుంది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భజన్ కౌర్, అంకిత భకత్, సిమ్రాన్‌జీత్ కౌర్‌లు ఉన్న భారత త్రయం కాంస్య పతక పోరులో 5–4తో మెక్సికో జట్టుపై గెలిచింది. అమ్మాయిల జట్టు పైచేయి మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్ కౌర్‌లతో కూడిన భారత బృందం 234–233తో మెక్సికో జట్టుపై గెలిచి పసిడి పతకం చేజిక్కించుకుంది. తొలి రౌండ్లో 59–59తో అండ్రియా బెకెరా, అనా సోఫియా, డాఫ్నే క్వింటెరోలతో కూడిన మెక్సికో జట్టుతో భారత్ స్కోరు సమంచేసింది. రెండో రౌండ్లో 59–58తో స్వల్ప ఆధిక్యం కనబరిచింది. 118–117 తో మూడో రౌండ్లోకి దిగిన భారత ఆర్చర్లు 57–59తో వెనుకబడ్డారు. 175–176తో ఆధిక్యం మెక్సికోవైపు మళ్లింది. ఈ దశలో నాలుగో రౌండ్‌పై దృష్టిపెట్టిన ఆర్చర్లు 59 స్కోరు చేస్తే... మెక్సికన్ అమ్మాయిలు 57 స్కోరే చేయడంతో పాయింట్ తేడాతో భారత్ (234–233) స్వర్ణ పతకం గెలుపొందింది. జ్యోతి సురేఖ @ 50 ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ పోటీల్లో పతకాల ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ టోర్నీకి ముందు 48 పతకాలు సాధించిన ఆమె శనివారం కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. అనంతరం వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకోవడంతో 50వ పతకం ఆమె ఖాతాలో చేరింది. సెమీస్‌లో ఓడిన ఆమె మూడో స్థానం కోసం కొలంబియాకు చెందిన సారా లోపెజ్‌తో తలపడింది. స్కోరు 146–146తో సమం కాగా, షూటాఫ్‌లోనూ 10–10తో సమంగా నిలిచారు. అయితే లక్ష్యబిందువుకు అతి సమీపంగా కచ్చితత్వంతో కూడిన బాణాలు సంధించిన జ్యోతినే విజేతగా ప్రకటించడంతో కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో కలిపి గెలిచిన మొత్తం 50 పతకాల్లో 17 స్వర్ణాలు, 18 రజతాలు, 15 కాంస్యాలున్నాయి. -
రష్మీ, భవానిలకు కాంస్యాలు
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రష్మీ, భవాని యాదవ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలతో మెరిశారు. ఒడిశాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో రష్మీ ఈటెను 50.95 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో ప్రయత్నంలో ఈ మెరుగైన ప్రదర్శన ద్వారా ఆమె కాంస్య పతకం నెగ్గింది. ఇందులో అన్ను రాణి (ఉత్తరప్రదేశ్; 58.22 మీ.) స్వర్ణం, ప్రియాంక (హరియాణా; 51.94 మీ.) రజతం గెలుపొందారు. అంతకుముందు జరిగిన లాంగ్‌జంప్ పోటీలో భవాని 6.44 మీటర్ల దూరం దూకి కాంస్యంతో తృప్తిపడింది. అన్సీ సోజన్ (కేరళ; 6.51 మీ.), శైలీసింగ్ (ఉత్తరప్రదేశ్; 6.49 మీ.) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు. భారత స్టార్ అథ్లెట్, షాట్‌పుటర్ తజీందర్ పాల్ తూర్ తన రికార్డును తానే సవరించి కొత్త ‘ఆసియా’ రికార్డు నెలకొల్పాడు. అతను గుండును 21.77 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 28 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ తజీందర్ 2021లో 21.49 మీటర్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అతను విసిరిన దూరం ఈ సీజన్లో ప్రపంచంలోనే తొమ్మిదో మెరుగైన ప్రదర్శనగా నిలిచింది. 21.40 మీటర్ల క్వాలిఫయింగ్ మార్క్‌ను దాటడంతో ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకూ తజీందర్ పాల్ అర్హత సంపాదించాడు. సోమవారం ముగిసిన ఈ పోటీల్లో ఏపీ అమ్మాయి యెర్రా జ్యోతి ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఎంపికైంది. తమిళనాడు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. -
దినేశ్‌కు మూడు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: ఉగాండా పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రామ్‌కో సిమెంట్స్ ఉద్యోగి దినేశ్ రాజయ్య రాణించి మూడు కాంస్య పతకాలు సాధించాడు. దినేశ్ ఎస్ఎల్–3 సింగిల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్ఎల్4 డబుల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్యు5 మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా దినేశ్‌ను ఉగాండాలో భారత హైకమిషనర్‌గా ఉన్న ఎ.అజయ్ కుమార్ సన్మానించి అభినందించారు. మొత్తం 20 దేశాల నుంచి వివిధ కేటగిరీల్లో కలిపి 191 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 42 పతకాలు లభించాయి. -
డబుల్ ధమాకా
సాక్షి, చెన్నై: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్ సాధ్వానిలతో కూడిన భారత ‘బి’ జట్టు... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు కాంస్య పతకాలు సాధించాయి. ► నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు 8 విజయాలు, 2 ‘డ్రా’లు, ఒక ఓటమితో మొత్తం 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, అర్మేనియా 19 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉజ్బెకిస్తాన్ చాంపియన్‌గా అవతరించింది. అర్మేనియా రన్నరప్‌గా నిలిచింది. ► పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, విదిత్, నారాయణన్, కృష్ణన్ శశికిరణ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 17 పాయింట్లతో నాలుగో స్థానంలో... సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, అభిజిత్ గుప్తా, మురళీ కార్తికేయ, అభిమన్యులతో కూడిన భారత ‘సి’ జట్టు 14 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాయి. ► చివరిదైన 11వ రౌండ్లో భారత్ ‘బి’ 3–1తో జర్మనీని ఓడించింది. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గే మ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నిహాల్, రౌనక్ తమ ప్రత్యర్థులపై గెలిచారు. అమెరికాతో మ్యాచ్ ను భారత్ ‘ఎ’ 2–2తో... కజకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత్ ‘సి’ 2–2తో ‘డ్రా’ చేసుకున్నాయి. ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు సభ్యులు ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్, నిహాల్ సరీన్, గుకేశ్ అమెరికా చేతిలో ఓడి... మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. సోమ వారం జరిగిన చివరిదైన 11వ రౌండ్లో భారత ‘ఎ’ జట్టు 1–3తో అమెరికా చేతిలో ఓడిపోయింది. ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చాంపియన్ అయ్యేది. భారత్, అమెరికా, కజకిస్తాన్ 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా భారత్‌కు కాంస్య పతకం ఖరారైంది. అమెరికా నాలుగో స్థానంతో, కజకిస్తాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయి. 18 పాయింట్లతో ఉక్రెయిన్, జార్జియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉక్రెయిన్‌కు టైటిల్ ఖాయమైంది. జార్జియా రన్నరప్‌గా నిలిచింది. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీఆన్ గోమ్స్, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత ‘బి’ జట్టు 16 పాయింట్లతో 8వ స్థానంలో... ఇషా కరవాడే, నందిద, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారి ణులు సాహితి వర్షిణి, ప్రత్యూష, విశ్వ వాస్నావాలాలతో కూడిన భారత ‘సి’ జట్టు 15 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో నిలిచాయి. ► క్లాసికల్ విభాగంలో ముఖాముఖిగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఒకేసారి భారత జట్టు ఓపెన్, మహిళల విభాగంలో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఓపెన్ విభాగంలో భారత్‌కిది రెండో పతకం. 2014లో నార్వేలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో పరిమార్జన్ నేగి, సేతురామన్, కృష్ణన్ శశికిరణ్, ఆధిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబులతో కూడిన భారత జట్టు ఓపెన్ విభాగంలో కాంస్య పతకం గెలిచింది. చెస్ ఒలింపియాడ్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భార తీయ ప్లేయర్‌గా ఆధిబన్ నిలిచాడు. కరోనా కారణంగా 2020లో ఆన్లైన్ లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలువగా... 2021లో ఆన్లైన్లోనే జరిగిన ఒలింపియాడ్‌లో భారత్ కాంస్యం సాధించింది. మనోళ్లకు ఏడు పతకాలు టీమ్ విభాగంలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా వ్యక్తిగత విభాగం పతకాలను (కనీసం 8 గేమ్‌లు ఆడాలి) ఖరారు చేయగా... భారత ప్లేయర్లకు ఏడు పతకాలు లభించాయి. బోర్డు–1పై 11 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు గుకేశ్ 9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... బోర్డు–2పై 10 గేమ్‌లు ఆడిన నిహాల్ సరీన్ 7.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు. బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో రజతం... బోర్డు–3పైనే 9 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో కాంస్యం గెల్చుకున్నారు. మహిళల విభాగంలో బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన వైశాలి 7.5 పాయింట్లతో కాంస్యం, బోర్డు–4పై 11 గేమ్‌లు ఆడిన తానియా 8 పాయింట్లతో కాంస్యం... బోర్డు–5పై 9 గేమ్‌లు ఆడిన దివ్య 7 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నారు. -
Commonwealth Games 2022: భారత్ పతకాల మోత
కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 11 పతకాలతో అదరగొట్టారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉండటం విశేషం. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, మహిళల టి20 క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల రేసులో నిలిచారు. బర్మింగ్‌హామ్: ఊహించినట్టే భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం ఆరు పతకాలతో అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు), పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో రవి దహియా 10–0తో వెల్సన్ (నైజీరియా)పై, నవీన్ 9–0తో షరీఫ్ తాహిర్ (పాకిస్తాన్)పై గెలుపొందారు. మహిళల 53 కేజీల విభాగంలో నలుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. వినేశ్ ఆడిన మూడు బౌట్లలోనూ గెలిచి విజేతగా నిలిచింది. వినేశ్ తొలి రౌండ్లో సమంతా స్టీవర్ట్ (కెనడా)పై, రెండో రౌండ్లో మెర్సీ (నైజీరియా)పై, మూడో రౌండ్లో చమోదయ కేశని (శ్రీలంక)పై గెలిచింది. కాంస్య పతక బౌట్లలో పూజా సిహాగ్ 11–0తో నయోమి బ్రున్ (ఆస్ట్రేలియా)పై, పూజా గెహ్లోత్ 12–2తో క్రిస్టెల్లీ (స్కాట్లాండ్)పై, దీపక్ 10–2తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై నెగ్గారు. హాకీలో మూడోసారి... పురుషుల హాకీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 3–2తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ (2010, 2014) చేరి రన్నరప్‌గా నిలిచింది. 2018లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. అవినాష్, ప్రియాంక అద్భుతం అథ్లెటిక్స్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్‌కిది తొమ్మిదోసారి కావడం విశేషం. తాజా ప్రదర్శనతో అవినాష్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఘనత వహించాడు. మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ క్రీడల చరిత్రలో రేస్ వాకింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. లాన్ బౌల్స్‌లో రజతం లాన్ బౌల్స్ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్’ ఈవెంట్లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. -
షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం
Ajith Kumar Wins Medals In Tamilnadu 47Th State Shooting Championship: ప్రముఖ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాలలోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్లో ఆయన పలు పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం తన 61వ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అజిత్ రైఫిల్ షూటర్‌గా బంగారు పతకాలను, కాంస్య పతకాలను గెలుచుకోవడం సినీ ఇండస్ట్రీలో విశేషంగా మారింది. తమిళనాడు రాష్ట్రస్థాయిలో 47వ రైఫిల్ షూటింగ్ పోటీలు తిరుచ్చిలో ఈనెల 26వ తేదీ నుంచి రైఫిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 1300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలో పాల్గొనడానికి అజిత్ టీమ్ చెన్నై సమీపంలోని మౌరై వీరపురం పోలీసు ట్రైనింగ్ అకాడమీలో తీవ్రంగా రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇక ఈనెల 27వ తేదీన అజిత్ టీమ్ తిరుచ్చిలో జరిగిన పోటీలో పాల్గొని 4 బంగారు పతకాలను, 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. సెంటర్ ఫైర్ పిస్టల్, స్తందర్డ్ పిస్టల్ వస్టర్, 50 మీటర్ల ప్రీ పిస్టల్ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ కేటగిరీల్లో పసిడి పతకాలను, 50 మీటర్ల ప్రీ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో కాంస్య పతకాలను సాధించారు. దీంతో అజిత్ అభిమానులు ఆయన్ను షూటింగ్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. -
తొలిరోజు భారత్‌కు మూడు కాంస్యాలు
Asia Senior Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కాంస్య పతక బౌట్లలో కర్ణాటకకు చెందిన అర్జున్ 10–7తో దవాబంది ముంఖ్‌ఎర్డెన్ (మంగోలియా)పై... నీరజ్ 7–4తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... సునీల్ 9–1తో బత్బెయర్ లుత్బాయర్ (మంగోలియా)పై నెగ్గారు. 77 కేజీల విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సజన్ 1–11తో సకురాబా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! -
జూనియర్ల జోరు
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవీందర్ ‘బంగారు’ ఆశలు ఫైనల్లో ఆవిరయ్యాయి. 61 కేజీల విభాగంలో అతను రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇరాన్ రెజ్లర్ రహ్మాన్ ముసా అమోజద్కలి 9–3తో రవీందర్‌ను ఓడించాడు. రెపిచేజ్ దారిలో ఉన్న రజతం అవకాశాల్ని యశ్ (74 కేజీలు), పృథ్వీ పాటిల్ (92 కేజీలు), అనిరుధ్ (125 కేజీలు) సద్వినియోగం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు చేరాయి. రజతం సహా మొత్తం 6 పతకాలు ఫ్రీస్టయిల్ రెజ్లర్లు గెలిచారు. 74 కేజీల కాంస్య పతక పోరులో యశ్ 12–6తో కిర్గిజిస్తాన్‌కు చెందిన స్టాంబుల్ జానిబెక్పై గెలుపొందగా, పృథ్వీ పాటిల్ (92 కేజీలు) 2–1తో ఇవాన్ కిరిలోవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. అనిరుధ్ (125 కేజీలు) 7–2తో అయిదిన్ అహ్మదోవ్ (అజర్బైజాన్)ను ఓడించాడు. ఫైనల్లో బిపాషా: మహిళల ఈవెంట్లో బిపాషా (76 కేజీలు) స్వర్ణ బరిలో నిలిచింది. ఆమె ఫైనల్ చేరడంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో బిపాషా 9–4తో మంగోలియాకు చెందిన ఒద్బాగ్ ఉల్జిబాత్పై అలవోక విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 6–3తో కజకిస్తాన్ రెజ్లర్ దిల్నాజ్ ముల్కినోవాను ఓడించింది. 50 కేజీల విభాగంలో సిమ్రాన్ ఉడుం పట్టు సెమీస్‌లో సడలింది. ఎమిలీ కింగ్ షిల్సన్ (అమెరికా)తో జరిగిన పోరులో ఆమె ‘టెక్నికల్ సుపీరియారిటీ’లో పరాజయం చవిచూసింది. మిగతా రెజ్లర్లు సితో (55 కేజీలు), కుసుమ్ (59 కేజీలు), అర్జూ (68 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ► 4 X 400 మీ. మిక్స్డ్ రిలేలో భారత్‌కు కాంస్యం ► జావెలిన్‌లో ఇద్దరు ఫైనల్‌కు నైరోబీ: వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్ సత్తా చాటింది. 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మన బృందం 3 నిమిషాల 20.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కాంస్యం గెలిచిన భారత జట్టులో శ్రీధర్ భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్ సభ్యులుగా ఉన్నారు. శ్రీధర్ ముందుగా పరుగు మొదలు పెట్టగా...ప్రియా, సుమ్మీ తర్వాతి లెగ్‌లలో పరుగెత్తారు. చివర్లో బ్యాటన్ అందుకున్న కపిల్...తనకు పోటీగా దూసుకొచ్చిన జమైకా అథ్లెట్‌ను వెనక్కి నెట్టి భారత్‌ను గెలిపించాడు. ఈ ఈవెంట్లో నైజీరియా (3 నిమిషాల 19.70 సెకన్లు), పోలండ్ (3 నిమిషాల 19.80 సెకన్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నాయి. అంతకు ముందు హీట్స్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ పరుగులో పాల్గొన్న అబ్దుల్ రజాక్ స్థానంలో ఫైనల్లో శ్రీధర్ బరిలోకి దిగాడు. వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో గతంలో భారత్ తరఫున సీమా అంటిల్ (కాంస్యం – డిస్కస్, 2002), నవజీత్ కౌర్ (కాంస్యం – డిస్కస్ 2014), నీరజ్ చోప్రా (స్వర్ణం – జావెలిన్, 2016), హిమ దాస్ (స్వర్ణం – 400 మీ., 2018) పతకాలు గెలుచుకున్నారు. షాట్‌పుట్‌లో ఫైనల్‌కు: వరల్డ్ చాంపియన్‌షిప్ మరో మూడు ఈవెంట్లలో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. షాట్‌పుట్‌లో అమన్‌దీప్ సింగ్ గుండును 17.92 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రియా మోహన్ 400 మీటర్ల పరుగులో కూడా ఫైనల్‌కు చేరుకుంది. జావెలిన్ త్రోలో ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టడం విశేషం. అజయ్ సింగ్ రాణా (71.05 మీటర్లు), జై కుమార్ (70.34 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో సత్తా చాటి ఫైనల్ చేరారు. -
World Archery Youth Championship: ‘పసిడి’ కోమలిక
వ్రోక్లా (పోలాండ్): ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ రికర్వ్ విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరి రోజు భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. అండర్–21 జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో కోమలిక బారి 7–3తో 2018 యూత్ ఒలింపిక్స్ చాంపియన్ ఇలియా కెనాలెస్ (స్పెయిన్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో కోమలిక అండర్–18 విభాగంలోనూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. దీపిక కుమారి తర్వాత అండర్–21, అండర్–18 విభాగాల్లో విశ్వవిజేతగా నిలిచిన రెండో భారతీయ ఆర్చర్‌గా కోమలిక గుర్తింపు పొందింది. జూనియర్ మిక్స్డ్ ఫైనల్లో కోమలిక–సుశాంత్ సాలుంఖే (భారత్) ద్వయం 5–3తో ఇలియా కెనాలెస్–యున్ సాంచెజ్ (స్పెయిన్) జోడీని ఓడించి పసిడి పతకాన్ని సాధించింది. ధీరజ్ జట్టుకు స్వర్ణం... జూనియర్ పురుషుల టీమ్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్‌తో కూడిన భారత జట్టు బంగారు పతకం గెలిచింది. ధీరజ్, సుశాంత్, ఆదిత్యలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–3తో స్పెయిన్ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్‌మయ్, అమిత్ కుమార్, విక్కీ రుహాల్లతో కూడిన భారత జట్టు 5–3తో ఫ్రాన్స్‌పై నెగ్గింది. క్యాడెట్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్‌మయ్–తామ్నా జంట (భారత్) 6–2తో జపాన్ జోడీని ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. క్యాడెట్ మహిళల టీమ్ కాంస్య పతక పోటీలో భారత్ 5–3తో జర్మనీపై గెలిచింది. క్యాడెట్ మహిళల వ్యక్తిగత కాంస్య పతక పోరులో మంజిరి అలోన్ 6–4తో క్వింటీ రోఫెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. క్యాడెట్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో బిశాల్ చాంగ్‌మయ్ 6–4తో దౌలక్కెల్దీ (కజకిస్తాన్)పై గెలిచాడు. శనివారం కాంపౌండ్ విభాగంలో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు లభించాయి. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో భారత్ ఆర్చర్లు 15 పతకాలు గెలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. -
‘పసిడి’తో ముగింపు
న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత షూటర్లు ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌ను స్వర్ణ పతకాలతో ముగించారు. టోర్నీ చివరి రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. ఓవరాల్‌గా భారత్ 15 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 30 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్ టోర్నీ ల చరిత్రలో ఒకే ఈవెంట్లో ఒక దేశానికి 15 స్వర్ణాలు రావడం ఇదే ప్రథమం. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో గుర్ప్రీత్ సింగ్, విజయ్‌వీర్ సిద్ధూ, ఆదర్శ్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 2–10తో సాండెర్సన్, హాబ్సన్, టర్నర్లతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. మహిళల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో శ్రేయసి, రాజేశ్వరి, మనీషాలతో కూడిన భారత జట్టు 6–0తో మరియా, ఐజాన్, సర్సెన్‌కుల్‌లతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, పృథ్వీరాజ్, లక్షయ్‌లతో కూడిన భారత పురుషుల ట్రాప్ జట్టు టీమ్ ఫైనల్లో 6–4తో స్లామ్‌కా, అడ్రియన్, మరినోవ్‌లతో కూడిన స్లొవేకియా జట్టుపై గెలిచి స్వర్ణాన్ని నెగ్గింది. 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం 8 పతకాలతో అమె రికా రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో 53 దేశాల నుంచి 294 మంది షూటర్లు పాల్గొన్నారు. -
‘రజత’ సరిత
రోమ్: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సరిత మోర్ (57 కేజీలు) రజతం పతకం దక్కించుకోగా... పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), నవీన్ (130 కేజీలు), కుల్దీప్ మలిక్ (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. గిలియా రోడ్రిగ్స్ (బ్రెజిల్)తో జరిగిన ఫైనల్లో సరిత 2–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషం వరకు 2–0తో ఆధిక్యంలో నిలిచిన సరిత ఆ తర్వాత నాలుగు పాయింట్లు సమర్పించుకొని రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల గ్రీకో రోమన్ కాంస్య పతక బౌట్లలో అర్జున్ 8–0తో రికార్డో (పోర్చుగల్)పై, నీరజ్ 6–4తో శామ్యూల్ జోన్స్ (అమెరికా)పై, నవీన్ 3–1తో స్టీఫెన్ డేవిడ్ (చెక్ రిపబ్లిక్)పై, కుల్దీప్ 10–9 తో లబజనోవ్ (రష్యా)పై గెలుపొందారు. -
భారత రెజ్లర్ల తీన్మార్...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు బుధవారం గ్రీకో రోమన్ శైలిలో అశు (67 కేజీలు), ఆదిత్య కుందు (72 కేజీలు), హర్దీప్ (97 కేజీలు) భారత్‌కు మూడు కాంస్య పతకాలను అందించారు. జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతక పోరులో ఓడిపోయాడు. కాంస్యం కోసం జరిగిన బౌట్లలో అశు 8–1తో అబ్దుల్ కరీమ్ మొహమ్మద్ అల్ హసన్ (సిరియా)ను ఓడించగా... ఆదిత్య 8–0తో నవో కుసాకా (జపాన్)పై, హర్దీప్ 3–1తో బెక్సుల్తాన్ (కిర్గిస్తాన్)పై విజయం సాధించారు. జ్ఞానేందర్ 0–6తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. ఓవరాల్‌గా భారత్‌కు గ్రీకో రోమన్ విభాగంలో ఐదు పతకాలు లభించాయి. నేడు, రేపు మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత శని, ఆదివారాల్లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీలుంటాయి. -
సింధు, సాయి చరిత్ర
కల కాదు నిజమే. నమ్మశక్యంకానీ రీతిలో... కళ్లు చెదిరే ప్రదర్శనతో... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒకేరోజు ఇద్దరు తెలుగు తేజాలు పూసర్ల వెంకట (పీవీ) సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ గర్జించారు. కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్‌ను సింధు మట్టికరిపించగా... ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించిన సాయిప్రణీత్ అందరి అంచనాలను తారుమారు చేసి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. సెమీఫైనల్ చేరడంతో సింధు, సాయిప్రణీత్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. దాంతో 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారి భారత్ ఖాతాలో మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్‌లో పతకాలు చేరనున్నాయి. 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే కాంస్యం సాధించాక... పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మళ్లీ పతకం అందించనున్న ప్లేయర్‌గా సాయిప్రణీత్ చరిత్ర లిఖించాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): కొడితే కుంభస్థలం కొట్టాలి. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాయిప్రణీత్ నిజం చేసి చూపించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులపై అద్వితీయ విజయాలు సాధించారు. ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శనను అందరూ మర్చిపోయేలా చేశారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పీవీ సింధు 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19వ ర్యాంకర్, తెలంగాణ ప్లేయర్ సాయిప్రణీత్ 51 నిమిషాల్లో 24–22, 21–14తో నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను మట్టికరిపించాడు. వెనుకంజలో ఉన్నా... ఈ మ్యాచ్‌కంటే ముందు తై జు యింగ్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన సింధు... తొలి గేమ్ తర్వాత ఈసారి కూడా తన ఖాతాలో మరో ఓటమి వేసుకుంటుందనిపించింది. తొలి గేమ్‌ను సులువుగా సమర్పించుకున్న సింధు... రెండో గేమ్‌లో 5–8తో వెనుకంజ లో ఉంది. ఈ కీలక సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు వరుసగా ఐదు పా యింట్లు గెలిచి 10–8తో ఆధిక్యంలోకొచ్చింది. అయితే తై జు యింగ్ కూడా పట్టుదలతో ఆడటంతో ఐదుసార్లు స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 21–21 వద్ద సింధు చక్కటి రిటర్న్ షాట్, ఆ తర్వాత క్రాస్‌కోర్టు షాట్లతో వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనూ సింధు తడబడింది. 4–8తో వెనుకబడింది. అయితే ఈసారీ సింధు అద్భుతంగా పుంజుకుంది. స్కోరును 14–14 వద్ద సమం చేశాక ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 19–19 వద్ద ఉన్నపుడు సింధు స్మాష్ షాట్‌తో ఒక పాయింట్ సాధించగా... ఆ తర్వాత తై జు యింగ్ కొట్టిన రిటర్న్ షాట్ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది. సూపర్ సాయి... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను ఓడించిన సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచాడు. సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించాడు. కీలకదశలో స్మాష్ షాట్లతో చెలరేగాడు. తొలి గేమ్ నెగ్గిన తర్వాత రెండో గేమ్‌లో సాయిప్రణీత్ మరింత దూకుడు పెంచాడు. జొనాథన్ క్రిస్టీకి తేరుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన రికార్డు చైనా ప్లేయర్ జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉంది. తాజా ప్రదర్శనతో సింధు ఈ రికార్డును సమం చేసింది. 1: ప్రపంచ సీనియర్, జూనియర్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్ సాయిప్రణీత్. 2010 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ కాంస్యం గెలిచాడు. 2: ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు రావడం ఇది రెండోసారి. 2017లో సింధు, సైనా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో సాయిప్రణీత్... ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)తో సింధు ఆడతారు. మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
మెరిసిన భారత రెజ్లర్లు
సోఫియా (బల్గేరియా): ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఫ్రీస్టయిల్ బాలుర విభాగంలో ఉదిత్ (48 కేజీలు), అమన్ (55 కేజీలు), మనీశ్ గోస్వామి (65 కేజీలు), అనిరుధ్ కుమార్ (110 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. గ్రీకో రోమన్ బాలుర విభాగంలో రూపిన్ (48 కేజీలు) కాంస్యం నెగ్గగా... ప్రవీణ్ పాండురంగ పాటిల్ (55 కేజీలు) రజతం సొంతం చేసుకున్నాడు. భారత గ్రీకో రోమన్ జట్టుకు తెలంగాణకు చెందిన జి.అశోక్ కుమార్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. ఫ్రీస్టయిల్ బాలికల విభాగంలో కోమల్ (40 కేజీలు), సోనమ్ (65 కేజీలు) స్వర్ణాలు సొంతం చేసుకోగా... హనీ కుమారి (46 కేజీలు) కాంస్యం గెల్చుకుంది. -
జ్యోతి సురేఖ డబుల్ ధమాకా
ఎస్–హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ అదరగొట్టింది. విజయవాడకు చెందిన 22 ఏళ్ల జ్యోతి సురేఖ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. తొలుత ముస్కాన్ కిరార్, రాజ్ కౌర్‌లతో కలిసి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో కాంస్యం దక్కించుకోగా... ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో మరో కాంస్యం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్ కౌర్ బృందం 229–226తో యెసిమ్ బోస్టాన్, గిజెమ్ ఎల్మాగాక్లి, ఇపెక్ టామ్రుక్లతో కూడిన టర్కీ జట్టుపై గెలిచింది. భారత జట్టు విజయంలో జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. ఆమె సంధించిన ఎనిమిది బాణాల్లో ఆరు ‘10’ షాట్లు ఉండటం విశేషం. యెసిమ్ బోస్టాన్ (టర్కీ)తో జరిగిన వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ ‘షూట్ ఆఫ్’లో పైచేయి సాధించింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 145–145 పాయింట్లతో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో బాణం అవకాశం ఇచ్చారు. ఇందులో జ్యోతి సురేఖ గురికి 10 పాయింట్లు రాగా... యెసిమ్ బాణానికి తొమ్మి ది పాయింట్లే వచ్చాయి. నేడు పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో తరుణ్‌దీప్ రాయ్, రమేశ్ ప్రవీణ్ జాదవ్, అతాను దాస్లతో కూడిన భారత జట్టు స్వర్ణం కోసం తలపడనుంది. చైనా జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 24: తన ఎనిమిదేళ్ల కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన అంతర్జాతీయ పతకాల సంఖ్య. ఇందులో మూడు స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ‘రెండేళ్ల క్రితం టీమ్ విభాగంలో మేం రజత పతకం సాధించాం. ఈసారి కాంస్యం దక్కినా ఎలాంటి నిరాశ లేదు. ఎందుకంటే వరుసగా రెండో ప్రపంచ చాంపియన్ షిప్‌లోనూ టాప్–3లో నిలిచాం. ఈ పతకం మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ఇక వ్యక్తిగత విభాగంలో నాకిది తొలి ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం. ఒకదశలో కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నించాను. నా ప్రత్యర్థి నుంచి కూడా గట్టిపోటీ ఎదురుకావడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను. షూట్ ఆఫ్‌లో మాత్రం కంగారు పడకుండా గురి చూసి కొట్టాను. ’’ –జ్యోతి సురేఖ -
బాక్సర్ ప్రసాద్‌కు స్వర్ణం
పుణే: జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా (పీఎల్) ప్రసాద్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన ప్రసాద్ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో ప్రసాద్ 3–2తో అనంత చోపాడే (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. వైజాగ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రసాద్ 2015లో 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అంతే కాకుండా ప్రపంచ యూత్, ఆసియా యూత్ బాక్సింగ్ పోటీల్లో భారత్‌కు కాంస్య పతకాలను అందించాడు. ఈసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ తరఫున ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది బాక్సర్లు స్వర్ణాలు గెలవడం విశేషం. ఓవరాల్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న సర్వీసెస్‌కు మనీశ్ కౌశిక్ (60 కేజీలు), మదన్‌లాల్ (56 కేజీలు), సంజీత్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), దీపక్ (49 కేజీలు), దుర్యోధన్ సింగ్ (69 కేజీలు), మంజీత్ సింగ్ (75 కేజీలు) కూడా పసిడి పతకాలు అందించారు. -
టీటీ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యమే
టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో భారత జోడీ ఆచంట శరత్ కమల్–మనికా బాత్రా పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. బుధవారం సెమీస్‌లో చైనాకు చెందిన ఇంగ్షా సన్– వాంగ్ సన్ జంట 11–9, 11–5, 11–13, 11–4, 11–8 తేడాతో భారత జోడీని ఓడించింది. అంతకుముందు క్వార్టర్స్‌లో భారత్ 4–11, 12–10, 6–11, 11–6, 11–8తో ఉత్తర కొరియాపై, ప్రికార్వర్ట్స్లో 11–7, 7–11, 11–8, 10–12, 11–4 స్కోరుతో దక్షిణ కొరియాపై గెలుపొందింది.