Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్‌... | Asian Games 2023: Golden Day for India as shooters | Sakshi
Sakshi News home page

Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్‌...

Sep 26 2023 6:14 AM | Updated on Sep 26 2023 6:14 AM

Asian Games 2023: Golden Day for India as shooters - Sakshi

హాంగ్జౌ: తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ షూటర్లు ఆసియా క్రీడల్లో తమ గురికి పదును పెట్టారు. పోటీల రెండో రోజు భారత షూటర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు అందించారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో రుద్రాంశ్  పాటిల్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొలి్పంది. ఈ ఏడాది ఆగస్టు 23న చైనా జట్టు 1893.3 పాయిం్లటతో సాధించిన ప్రపంచ రికార్డును భారత త్రయం తిరగరాసింది. క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు చేసిన స్కోరును లెక్కించి టాప్‌–3లో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. క్వాలిఫయింగ్‌లో భారత్‌ నుంచి రుద్రాంశ్  632.5 పాయింట్లు, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ 631.6 పాయింట్లు, దివ్యాంశ్‌ 629.6 పాయింట్లు సాధించారు.

టాప్‌–8లో నిలిచిన ఈ ముగ్గురూ ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లకు మాత్రమే ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఉంది. దాంతో దివ్యాంశ్‌ కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు చేసిన రుద్రాంశ్ , ఐశ్వరీ ప్రతాప్‌ భారత్‌ తరఫున ఫైనల్లో పోటీపడ్డారు. ఎనిమిది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంశ్  208.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువగా... ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ 228.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.

లిహావో షింగ్‌ (చైనా; 253.3 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని ౖకైవసం చేసుకోగా... హాజున్‌ పార్క్‌ (దక్షిణ కొరియా; 251.3 పాయింట్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్‌ సింగ్‌ (576 పాయింట్లు), అనీశ్‌ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

భారత త్రయం మొత్తం 1718 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండోనేసియా కూడా 1718 పాయింట్లు సాధించినా... 10 పాయింట్ల షాట్‌లు భారత్‌కంటే (45) ఇండోనేసియా (37) తక్కువగా కొట్టడంతో టీమిండియాకు కాంస్యం ఖరారైంది. క్వాలిఫయింగ్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ ఆరో ర్యాంక్‌లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయ్‌వీర్‌ 21 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో కాంస్య పతకానికి దూరమయ్యాడు.
కాంస్య పతకాలతో ఆదర్శ్, విజయ్‌వీర్, అనీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement