కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 11 పతకాలతో అదరగొట్టారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉండటం విశేషం. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, మహిళల టి20 క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల రేసులో నిలిచారు.
బర్మింగ్‌హామ్: ఊహించినట్టే భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం ఆరు పతకాలతో అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు), పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.
ఫైనల్స్‌లో రవి దహియా 10–0తో వెల్సన్ (నైజీరియా)పై, నవీన్ 9–0తో షరీఫ్ తాహిర్ (పాకిస్తాన్)పై గెలుపొందారు. మహిళల 53 కేజీల విభాగంలో నలుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్‌లు నిర్వహించారు. వినేశ్ ఆడిన మూడు బౌట్‌లలోనూ గెలిచి విజేతగా నిలిచింది. వినేశ్ తొలి రౌండ్‌లో సమంతా స్టీవర్ట్ (కెనడా)పై, రెండో రౌండ్‌లో మెర్సీ (నైజీరియా)పై, మూడో రౌండ్‌లో చమోదయ కేశని (శ్రీలంక)పై గెలిచింది. కాంస్య పతక బౌట్‌లలో పూజా సిహాగ్ 11–0తో నయోమి బ్రున్ (ఆస్ట్రేలియా)పై, పూజా గెహ్లోత్ 12–2తో క్రిస్టెల్లీ (స్కాట్లాండ్)పై, దీపక్ 10–2తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై నెగ్గారు.
హాకీలో మూడోసారి...
పురుషుల హాకీ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 3–2తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ (2010, 2014) చేరి రన్నరప్‌గా నిలిచింది. 2018లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది.
అవినాష్, ప్రియాంక అద్భుతం
అథ్లెటిక్స్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్‌కిది తొమ్మిదోసారి కావడం విశేషం.
తాజా ప్రదర్శనతో అవినాష్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఘనత వహించాడు. మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ క్రీడల చరిత్రలో రేస్ వాకింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది.
లాన్ బౌల్స్‌లో రజతం
లాన్ బౌల్స్ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్’ ఈవెంట్‌లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment