World Archery Youth Championship: India wins 5 Gold and 3 Bronze - Sakshi
Sakshi News home page

World Archery Youth Championship: ‘పసిడి’ కోమలిక

Published Mon, Aug 16 2021 4:48 AM | Last Updated on Mon, Aug 16 2021 11:40 AM

Mens And Mixed Team Also Win Gold Medals in World Archery Youth Championship - Sakshi

వ్రోక్లా (పోలాండ్‌): ప్రపంచ యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ రికర్వ్‌ విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో చివరి రోజు భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. అండర్‌–21 జూనియర్‌ మహిళల వ్యక్తిగత ఫైనల్లో కోమలిక బారి 7–3తో 2018 యూత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ ఇలియా కెనాలెస్‌ (స్పెయిన్‌)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

గతంలో కోమలిక అండర్‌–18 విభాగంలోనూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. దీపిక కుమారి తర్వాత అండర్‌–21, అండర్‌–18 విభాగాల్లో విశ్వవిజేతగా నిలిచిన రెండో భారతీయ ఆర్చర్‌గా కోమలిక గుర్తింపు పొందింది. జూనియర్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో కోమలిక–సుశాంత్‌ సాలుంఖే (భారత్‌) ద్వయం 5–3తో ఇలియా కెనాలెస్‌–యున్‌ సాంచెజ్‌ (స్పెయిన్‌) జోడీని ఓడించి పసిడి పతకాన్ని సాధించింది.  

ధీరజ్‌ జట్టుకు స్వర్ణం...

జూనియర్‌ పురుషుల టీమ్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ బొమ్మదేవర ధీరజ్‌తో కూడిన భారత జట్టు బంగారు పతకం గెలిచింది. ధీరజ్, సుశాంత్, ఆదిత్యలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–3తో స్పెయిన్‌ జట్టును ఓడించింది. క్యాడెట్‌ పురుషుల టీమ్‌ ఫైనల్లో బిశాల్‌ చాంగ్‌మయ్, అమిత్‌ కుమార్, విక్కీ రుహాల్‌లతో కూడిన భారత జట్టు 5–3తో ఫ్రాన్స్‌పై నెగ్గింది.

క్యాడెట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో బిశాల్‌ చాంగ్‌మయ్‌–తామ్నా జంట (భారత్‌) 6–2తో జపాన్‌ జోడీని ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. క్యాడెట్‌ మహిళల టీమ్‌ కాంస్య పతక పోటీలో భారత్‌ 5–3తో జర్మనీపై గెలిచింది. క్యాడెట్‌ మహిళల వ్యక్తిగత కాంస్య పతక పోరులో మంజిరి అలోన్‌ 6–4తో క్వింటీ రోఫెన్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించింది.

క్యాడెట్‌ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో బిశాల్‌ చాంగ్‌మయ్‌ 6–4తో దౌలక్‌కెల్దీ (కజకిస్తాన్‌)పై గెలిచాడు. శనివారం కాంపౌండ్‌ విభాగంలో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు లభించాయి.  ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ ఆర్చర్లు 15 పతకాలు గెలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement