indian archers
-
Paris Olympics 2024: లక్ష్యానికి చేరని భారత బాణం
పారిస్: ఒలింపిక్స్‌లో మన ఆర్చర్లకు మరోసారి నిరాశ తప్పలేదు! భారీ అంచనాలు, మంచి ఫామ్‌తో పారిస్‌లో అడుగుపెట్టిన ఆర్చర్లు పోటీపడ్డ అన్నీ విభాగాల్లో విఫలమై.. రిక్తహస్తాలతో ఇంటిబాట పట్టారు. ఇప్పటికే పురుషుల టీమ్, మహిళల టీమ్, మిక్స్డ్ టీమ్, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో మనవాళ్లకు చేదు ఫలితాలు ఎదురుకాగా... శనివారం మహిళల వ్యక్తిగత విభాగంలోనూ అదే పునరావృతం అయింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్లో కొరియాకు చెందిన 19 ఏళ్ల టీనేజ్ ఆర్చర్ నామ్ సిహైన్ చేతిలో ఓడగా.. తొలిసారి విశ్వ క్రీడల్లో ఆడుతున్న భజన్ కౌర్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ‘పారిస్’ క్రీడల రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ నాలుగో స్థానంలో నిలవడమే ఒలింపిక్స్ చరిత్రలో మన ఆర్చర్ల అత్యుత్తమ ప్రదర్శన. వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన దీపిక శనివారం జరిగిన రికర్వ్ మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్లో 4–6 (28–26, 25–28, 29–28, 27–29, 27–29)తో నామ్ సిహైన్ చేతిలో పరాజయం పాలైంది. తొలి మూడు సెట్లలో రెండింట గెలిచి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి ఆశలు రేపిన దీపిక.. నాలుగో సెట్లో గురితప్పి 7 పాయింట్లు సాధించడంతో వెనుకబడింది. 14 ఏళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు సాధిస్తూ మేటి ఆర్చర్‌గా పేరు తెచ్చుకున్న దీపిక వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ పతకం లేకుండానే వెనుదిరిగింది. ‘నిరాశ చెందా. ఒలింపిక్స్‌లో ప్రతిసారీ ఇలాంటి ఫలితాలే ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు.ఈ వాతావరణం, అంచనాలే కారణమనుకుంటా. రెండు బాణాలు గురి తప్పడంతో.. మ్యాచ్‌ను నేనే ప్రత్యరి్థకి అప్పగించినట్లు అనిపించింది’ అని 2012 ‘లండన్’లో 33వ స్థానంలో, 2016 ‘రియో’లో 16వ స్థానంలో, 2020 టోక్యోలో 8వ స్థానంలో నిలిచిన దీపిక వ్యాఖ్యానించింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక గెలిచి ఉంటే సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతక రేసులో నిలిచేది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో దీపిక 6–4 (27–24, 27–27, 26–25, 27–29, 27–27)తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలిచింది. మరో ఆర్చర్ భజన్ కౌర్ ‘షూట్ ఆఫ్’లో దినంద చోరునిసా (ఇండోనేసియా) చేతిలో ఓడింది. మొదట స్కోర్లు 28–29, 27–25, 26–28, 28–28, 27–26తో సమం కాగా.. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన ‘షూట్ ఆఫ్’లో తడబడ్డ భజన్ 8 పాయింట్లు సాధించగా.. 9 పాయింట్లతో ఇండోనేసియా ఆర్చర్ ముందంజ వేసింది. -
అదరగొట్టిన ధీరజ్.. క్వార్టర్స్‌లో భారత ఆర్చరీ టీమ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషల ఆర్చరీ జట్టు కూడా శుభారంభం చేసింది. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో భారత అర్చర్లు అదరగొట్టారు. టీమ్ ఈవెంట్లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫికేషన్ రౌండ్లో 2,013 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచిన భారత జట్టు.. నేరుగా క్వార్టర్స్‌కు ఆర్హత సాధించింది. భారత బృందంలో ధీరజ్ బొమ్మదేవర 681 పాయింట్లతో 4వ స్ధానంలో నిలవగా.. తరుణ్‌దీప్ రాయ్(674), ప్రవీణ్ జాదవ్(658)లు వరుసగా 14, 39వ స్ధానాల్లో నిలిచారు. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. 5 నుంచి 12 స్థానాల్లో నిలిచిన టీమ్‌లు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ఆడతాయి. కాగా ఇప్పటికే అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారి త్రయంతో కూడిన భారత మహిళ ఆర్చరీ జట్టు క్వార్టర్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. -
Paris Olympics: మెరిసిన అంకిత.. క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ టీమ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళ ఆర్చర్లు శుభారంభం చేశారు. టీమ్ ఈవెంట్లో అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారి త్రయంతో కూడిన భారత ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్ ఈవెంట్లో ఈ భారత త్రయం నాలుగో స్ధానంలో నిలవడంతో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ఆర్హత సాధించింది.ఈ ఈవెంట్లో భారత్ ఓవరాల్‌గా 1983 పాయింట్లు సాధించి నాలుగో స్ధానంలో నిలిచింది. భారత బృందంలో తొలిసారి ఒలింపిక్స్‌లో భాగమైన యువ ఆర్చర్ అంకిత భకత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్ధానంలో నిలిచి సత్తాచాటింది. ఆమెతో పాటు భజన్ కౌర్(659 పాయింట్లు), దీపికా కుమారి(658 పాయింట్లు) వరుసగా 22, 23వ స్ధానాల్లో నిలిచారు. ఇక సీడింగ్ నిర్ణయాత్మక ఈవెంట్లో కొరియా 2046 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా(1996 పాయింట్లు), మెక్సికో(1986 పాయింట్లు) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచాయి. భారత్ మరో 3 పాయింట్లు సాధించి ఉంటే మెక్సికోను ఆధిగమించి టాప్-3లో చోటు ఖాయం చేసుకుండేది. Paris Olympics : Archery Ankita Bhakat finish 11th in individual while Indian women team finish 4th in qualification Ankita Bhakat - 666 (11th)Bhajan Kaur - 659 (22nd)Deepika Kumari - 658 (23rd)India women team finish 4th with 1983 , & got bye to Quarterfinal pic.twitter.com/7nzDWQPC6O— Sports India (@SportsIndia3) July 25, 2024 -
ఆర్చరీలో ‘డబుల్’ ధమాకా
పారిస్: భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 ఈవెంట్లో పసిడి పంట పండించారు. కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో ‘డబుల్’ ధమాకా సాధించాయి. రికర్వ్ జట్లు కాంస్య పతకాలు గెలిచాయి. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓజస్ ప్రవీణ్, ప్రథమేశ్ జౌకర్‌లతో కూడిన భారత జట్టు శని వారం జరిగిన ఫైనల్లో 236–232 స్కోరుతో క్రిస్ షాఫ్, జేమ్స్ లుజ్, సాయెర్ సలైవాన్‌లతో కూడిన అమెరికా జట్టుపై ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలవగా, కీలకమైన చివరి రౌండ్లో భారత్ పైచే యి సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్ టీమ్‌పై గెలిచింది. ధీరజ్ బొమ్మదేవర, అతాను దాస్, తుషార్‌లతో కూడిన భారత్ 6–2తో స్పానిష్ టీమ్‌ను ఓడించి కాంస్యం గెలుచుకుంది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భజన్ కౌర్, అంకిత భకత్, సిమ్రాన్‌జీత్ కౌర్‌లు ఉన్న భారత త్రయం కాంస్య పతక పోరులో 5–4తో మెక్సికో జట్టుపై గెలిచింది. అమ్మాయిల జట్టు పైచేయి మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్ కౌర్‌లతో కూడిన భారత బృందం 234–233తో మెక్సికో జట్టుపై గెలిచి పసిడి పతకం చేజిక్కించుకుంది. తొలి రౌండ్లో 59–59తో అండ్రియా బెకెరా, అనా సోఫియా, డాఫ్నే క్వింటెరోలతో కూడిన మెక్సికో జట్టుతో భారత్ స్కోరు సమంచేసింది. రెండో రౌండ్లో 59–58తో స్వల్ప ఆధిక్యం కనబరిచింది. 118–117 తో మూడో రౌండ్లోకి దిగిన భారత ఆర్చర్లు 57–59తో వెనుకబడ్డారు. 175–176తో ఆధిక్యం మెక్సికోవైపు మళ్లింది. ఈ దశలో నాలుగో రౌండ్‌పై దృష్టిపెట్టిన ఆర్చర్లు 59 స్కోరు చేస్తే... మెక్సికన్ అమ్మాయిలు 57 స్కోరే చేయడంతో పాయింట్ తేడాతో భారత్ (234–233) స్వర్ణ పతకం గెలుపొందింది. జ్యోతి సురేఖ @ 50 ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ పోటీల్లో పతకాల ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ టోర్నీకి ముందు 48 పతకాలు సాధించిన ఆమె శనివారం కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. అనంతరం వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకోవడంతో 50వ పతకం ఆమె ఖాతాలో చేరింది. సెమీస్‌లో ఓడిన ఆమె మూడో స్థానం కోసం కొలంబియాకు చెందిన సారా లోపెజ్‌తో తలపడింది. స్కోరు 146–146తో సమం కాగా, షూటాఫ్‌లోనూ 10–10తో సమంగా నిలిచారు. అయితే లక్ష్యబిందువుకు అతి సమీపంగా కచ్చితత్వంతో కూడిన బాణాలు సంధించిన జ్యోతినే విజేతగా ప్రకటించడంతో కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో కలిపి గెలిచిన మొత్తం 50 పతకాల్లో 17 స్వర్ణాలు, 18 రజతాలు, 15 కాంస్యాలున్నాయి. -
పసిడి పోరుకు భారత జట్లు
పారిస్: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన జోరును భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలోనూ కొనసాగించారు. బుధవారం జరిగిన కాంపౌండ్ విభాగం టీమ్ ఈవెంట్స్‌లో భారత మహిళల, పురుషుల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 234–233తో ఎల్లా గిబ్సన్, లేలా అనిసన్, ఇసాబెల్ కార్పెంటర్లతో కూడిన బ్రిటన్ జట్టును ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్ బృందం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మెక్సికో 234–233తో దక్షిణ కొరియాపై గెలిచింది. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి టాప్ సీడ్ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 233–230 ఎస్తోనియా జట్టును ఓడించింది. మరోవైపు ప్రపంచ చాంపియన్ ఓజస్ దేవ్‌తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు కూడా బంగారు పతకంపై గురి పెట్టింది. తొలి రౌండ్లో భారత జట్టు 239–235తో ఇటలీపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 237–235తో మెక్సికో జట్టును ఓడించింది. భారత్, టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో నాలుగు సిరీస్‌ల తర్వాత రెండు జట్లు 235–235తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ అనివార్యమైంది. ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే కొరియా ఆర్చర్లతో పోలిస్తే భారత ఆర్చర్ ఓజస్ దేవ్‌తలే కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో భారత జట్టును విజేతగా ప్రకటించారు. రెండో సెమీఫైనల్లో అమెరికా 238–234తో డెన్మార్క్‌పై గెలిచి శనివారం జరిగే స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్‌తో పోటీపడేందుకు సిద్ధమైంది. రెండో రౌండ్లో ధీరజ్ బుధవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో ధీరజ్ 6–2తో ఇమాదిద్దీన్ బాక్రి (అల్జీరియా)పై, అతాను దాస్ 6–0తో ఎలైన్ వాన్ స్టీన్ (బెల్జియం)పై గెలుపొందారు. భారత్‌కే చెందిన మృణాల్ చౌహాన్ 3–7తో ఫ్లోరియన్ ఫాబెర్ (స్విట్జర్లాండ్) చేతిలో, తుషార్ ప్రభాకర్ 2–6తో పీటర్ బుకువాలస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ క్వాలిఫయింగ్ టీమ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత జట్టు 2034 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో భారత జట్టుకు నేరుగా రెండో రౌండ్లోకి ‘బై’ లభించింది. -
అదరహో అదితి... ఓహో ఓజస్
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్చర్లు అద్భుతం చేశారు...గతంలో ఎన్నడూ చూపించని ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టించారు... గురి తప్పకుండా లక్ష్యం చేరిన బాణాలతో మన ఆర్చర్లు ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు...అటు మహిళల విభాగంలో అదితి స్వామి, ఇటు పురుషుల విభాగంలో ప్రవీణ్ ఓజస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించి శిఖరాన నిలిచారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించి అదితి ఆనందం పంచిన కొద్ది సేపటికే ప్రవీణ్ కూడా పసిడి గెలవడంతో ‘డబుల్ ధమాకా’ మోగింది! చాలా గర్వంగా ఉంది. 17 ఏళ్లకే ఈ ఘనత సాధించడం సంతోషంగా అనిపిస్తోంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 52 సెకన్ల మన జాతీయ గీతం వినపడాలని కోరుకున్నాను. పూర్తి ఏకాగ్రతతో షాట్‌పై దృష్టి పెట్టడంతో లక్ష్యం తప్పలేదు. ఇది ఆరంభం మాత్రమే. దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా – అదితి స్వామి బెర్లిన్: వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఒకే రోజు భారత్ తరఫున ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. శనివారం జరిగిన ఈ పోటీల కాంపౌండ్ విభాగంలో ముందుగా మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్ స్వామి అగ్రస్థానం సాధించింది. ఫైనల్లో 17 ఏళ్ల అదితి 149–147 స్కోరుతో మెక్సికోకు చెందిన ఆండ్రీయా బెసెరాపై విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 150–147 తేడాతో ల్యూకాజ్ జిల్స్కీ (పోలాండ్)ను ఓడించాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నెల రోజుల్లోపే సీనియర్ విభాగంలోనూ అదితి విశ్వ విజేత కావడం విశేషం కాగా...టోర్నీ చరిత్రలో పురుషుల విభాగంలోనూ భార త్‌కు ప్రవీణ్ సాధించిందే తొలి స్వర్ణం. వీరిద్దరూ మహారాష్ట్ర సతారాలోని అకా డమీలో ఒకే చోట శిక్షణ పొందుతున్నారు. ఓవరాల్‌గా 3 స్వర్ణాలు, ఒక కాంస్యంతో (మొత్తం 4 పతకాలు) సాధించి భారత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. శుక్రవారం భారత్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. పూర్తి ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్ సారా లోపెజ్‌ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన బెసెరా, అదితి మధ్య ఫైనల్ పోటాపోటీగా సాగింది. తొలి మూడు బాణాలను సమర్థంగా సంధించిన అదితి మొదటి రౌండ్లోనే 30–29తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 12 బాణాలను లక్ష్యం వద్దకు చేర్చిన అదితి మూడు పాయింట్లు ముందంజలో ఉంది. చివరి రౌండ్లో మాత్రం ఒక బాణంతో ‘9’ మాత్రమే స్కోర్ చేసినా...అప్పటికే ఆమె విజేత కావడం ఖాయమైంది. శనివారం సెమీస్, ఫైనల్లోనూ 149 పాయింట్లు సాధించిన అదితి మొత్తం నాలుగు పాయింట్లు మాత్రమే కోల్పోయింది. ఫైనల్లో చివరి నాలుగు అవకాశాల్లోనూ ఆమె 30 పాయింట్లు సాధించడం విశేషం. పురుషుల విభాగంలో కూడా ప్రవీణ్ ‘పర్ఫెక్ట్ స్కోర్’తో పసిడి గెలుచుకున్నాడు. ప్రవీణ్ ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయకపోగా, ఒత్తిడిలో పడిన ల్యూకాజ్ చివర్లో ఒక పాయింట్ పోగొట్టుకొని రజతంతో సంతృప్తి చెందాడు. జ్యోతి సురేఖకు కాంస్యం ప్రపంచ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో 2019లో కాంస్యం, 2021లో రజతం సాధించి∙ఈ సారి స్వర్ణంపై గురి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. సెమీ ఫైనల్లో సురేఖ 145 – 149 స్కోరుతో అదితి స్వామి చేతిలో ఓటమి పాలైంది. అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో సురేఖ చక్కటి ప్రదర్శనతో 150 స్కోరు నమోదు చేసింది. ఆమె 150 – 146 స్కోరుతో తుర్కియేకు చెందిన ఐపెక్ తోమ్రుక్ను ఓడించింది. ఓవరాల్‌గా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సురేఖకు ఇది ఎనిమిదో పతకం. టీమ్, వ్యక్తిగత విభాగాల్లో కలిపి ఆమె ఒక స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకుంది. -
ధీరజ్ 'గురి' అదిరె.. ఆర్చరీ వరల్డ్‌కప్‌లో ఇరగదీసిన ఆంధ్ర కుర్రాడు
అంటాల్యా (తుర్కియే): అంచనాలకు మించి రాణించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర (విజయవాడ) ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో రెండు పతకాలతో మెరిశాడు. తొలిసారి ప్రపంచకప్ టోర్నీలో ఆడుతున్న 21 ఏళ్ల ధీరజ్ పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కలిసి రజత పతకం ... వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల టీమ్ ఫైనల్లో ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్ బృందం 4–5తో లీ జాంగ్యువాన్, కి జింగ్షువో, వె షావోజువాన్లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్ 7–3తో ఇల్ఫాత్ అబ్దులిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో ధీరజ్ 4–6తో డాన్ ఒలారు (మాల్డోవా) చేతిలో ఓడిపోయాడు. -
భారత ఆర్చర్ల పసిడి పంట
షార్జా: ఆసియా కప్ స్టేజ్–3 ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్లు అదరగొట్టే ప్రదర్శన చేశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఇందులో ఐదుస్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. కాంపౌండ్ విభాగంలో భారత్‌కు ఏకంగా ఏడు పతకాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత అమ్మాయిలు క్లీన్‌స్వీప్ చేశారు. ప్రగతి స్వర్ణం నెగ్గగా... అదితి స్వామి రజతం, పర్ణీత్ కౌర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రియాంశ్ స్వర్ణం, ఓజస్ రజతం నెగ్గారు. కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు పసిడి పతకాలు దక్కించుకున్నాయి. ఆకాశ్, మృణాల్ చౌహాన్, పార్థ్ సాలుంకేలతో కూడిన భారత రికర్వ్ పురుషుల జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో త్రిషా పూనియా, పార్థ్ సాలుంకేలతో కూడిన టీమిండియా రజతం నెగ్గింది. -
Archery World Cup 2022: భారత్ గురి అదిరింది
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో సత్తా చాటుకున్నారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగం మ్యాచ్‌ల్లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 (56–57, 58–58, 60–56, 58–59) పాయింట్ల తేడాతో అడ్రియన్ గాంటియర్, జీన్ ఫిలిప్ బౌల్చ్, క్విన్టిన్ బారిర్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టును ఓడించింది. గత నెలలో టర్కీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ ఫైనల్లో ఫ్రాన్స్‌పైనే గెలిచి భారత జట్టు బంగారు పతకం సాధించడం విశేషం. అనంతరం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జంట 156–155 (39–39, 38–40, 39–38, 40–38) పాయింట్ల తేడాతో బెరా సుజెర్, ఎమిర్కాన్ హనీలతో కూడిన టర్కీ జోడీపై విజయం సాధించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రెండో ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్ (భారత్) రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మోహన్ 141–149తో ప్రపంచ నంబర్‌వన్ మైక్ షోలోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సెమీఫైనల్లో 143–141తో ప్రపంచ చాంపియన్ నికో వీనర్ (ఆస్ట్రియా)పై గెలుపొందడం విశేషం. -
భారత మహిళలకు కాంస్యం
గ్వాంగ్జూ: ప్రపంచ ఆర్చరీ స్టేజ్ 2లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహిళల రికర్వ్ విభాగంలో భారత్ కాంస్యం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6–2 (56–52, 54–51, 54–55, 55–54) తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అయితే పురుషుల రికర్వ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. తరుణ్‌దీప్ రాయ్, జయంత్ తాలుక్దార్, నీరజ్ చౌహాన్ సభ్యులుగా ఉన్న టీమ్ తమకంటే ర్యాంకుల్లో బాగా వెనుకబడి ఉన్న ఫ్రాన్స్ చేతిలో 2–6 (54–57, 55–52, 53–55, 47–53) తేడాతో ఓటమిపాలైంది. -
Asia Cup: ఆర్చరీలో భారత్ అదుర్స్
సులేమానియా (ఇరాక్): ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్లో భారత జూనియర్ ఆర్చర్లు అసాధారణ ప్రదర్శనతో ‘టాప్’ లేపారు. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో క్లీన్‌స్వీప్ చేశారు. దీంతో భారత్ 8 స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం 14 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల రికర్వ్ ఫైనల్లో భజన్ కౌర్, అవని, లక్ష్మిలతో కూడిన భారత జట్టు ‘షూటాఫ్’లో బంగ్లాదేశ్ జట్టుపై నెగ్గింది. పురుషుల రికర్వ్ ఫైనల్లో పార్థ్ , మృణాల్, జుయెల్లతో కూడిన భారత జట్టు 5–1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ప్రథమేశ్ 146–144తో రిషభ్‌పై గెలిచాడు. -
World Archery Youth Championship: ‘పసిడి’ కోమలిక
వ్రోక్లా (పోలాండ్): ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ రికర్వ్ విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరి రోజు భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. అండర్–21 జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో కోమలిక బారి 7–3తో 2018 యూత్ ఒలింపిక్స్ చాంపియన్ ఇలియా కెనాలెస్ (స్పెయిన్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో కోమలిక అండర్–18 విభాగంలోనూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. దీపిక కుమారి తర్వాత అండర్–21, అండర్–18 విభాగాల్లో విశ్వవిజేతగా నిలిచిన రెండో భారతీయ ఆర్చర్‌గా కోమలిక గుర్తింపు పొందింది. జూనియర్ మిక్స్డ్ ఫైనల్లో కోమలిక–సుశాంత్ సాలుంఖే (భారత్) ద్వయం 5–3తో ఇలియా కెనాలెస్–యున్ సాంచెజ్ (స్పెయిన్) జోడీని ఓడించి పసిడి పతకాన్ని సాధించింది. ధీరజ్ జట్టుకు స్వర్ణం... జూనియర్ పురుషుల టీమ్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్‌తో కూడిన భారత జట్టు బంగారు పతకం గెలిచింది. ధీరజ్, సుశాంత్, ఆదిత్యలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–3తో స్పెయిన్ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్‌మయ్, అమిత్ కుమార్, విక్కీ రుహాల్లతో కూడిన భారత జట్టు 5–3తో ఫ్రాన్స్‌పై నెగ్గింది. క్యాడెట్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్‌మయ్–తామ్నా జంట (భారత్) 6–2తో జపాన్ జోడీని ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. క్యాడెట్ మహిళల టీమ్ కాంస్య పతక పోటీలో భారత్ 5–3తో జర్మనీపై గెలిచింది. క్యాడెట్ మహిళల వ్యక్తిగత కాంస్య పతక పోరులో మంజిరి అలోన్ 6–4తో క్వింటీ రోఫెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. క్యాడెట్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో బిశాల్ చాంగ్‌మయ్ 6–4తో దౌలక్కెల్దీ (కజకిస్తాన్)పై గెలిచాడు. శనివారం కాంపౌండ్ విభాగంలో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు లభించాయి. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో భారత్ ఆర్చర్లు 15 పతకాలు గెలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. -
స్వాగతం పలికేవారే లేరు..!
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి స్వర్ణం సాధించిన ఆనందంలో స్వదేశానికి చేరుకున్న భారత ఆర్చర్లను అధికారుల తీరు నిరాశ పర్చింది. పోలండ్‌లో జరిగిన ఈపోటీల టీమ్ రికర్వ్ విభాగం ఫైనల్లో పటిష్టమైన కొరియాను మట్టి కరిపించిన దీపికా కుమారి, బొంబేలా దేవి, రిమిల్ మంగళవారం తెల్లవారుజామున ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అయితే వీరికి స్వాగతం పలికేందుకు అక్కడికి ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. దీంతో ఈ బృందం కాస్త నిరాశకు గురైంది. ‘మేం సాధించిన విజయాన్నే ఇతర క్రీడల్లో సాధిస్తే విమానాశ్రయానికి పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు వచ్చేవారు. కానీ ఇక్కడ మాకు ఎదురైన అనుభవం నిరాశకు గురిచేసింది. మేం చాలా గొప్ప విజయాన్ని సాధించాం. కొరియాను ఓడించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మాకు కూడా ఘనస్వాగతం లభిస్తే సంతోషించేవాళ్లం. అయినా పోటీల్లో మంచి ప్రదర్శన ఇవ్వడం మా బాధ్యత. దాన్ని సక్రమంగా నెరవేర్చాం’ అని ఆర్చర్ రిమిల్ పేర్కొంది. మంగళవారం సాయంత్రం వీరికి భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ) అధ్యక్షుడు వీకే మల్హోత్రా నివాసంలో సన్మానం చేశారు. స్వాగతించేందుకు అధికారులెవరూ వెళ్లకపోవడాన్ని మల్హోత్రా మరోరకంగా సమర్థించుకున్నారు. ‘జట్టు ఆటగాళ్లు మాత్రమే అందరి దృష్టినీ ఆకర్షించాలని అధికారులు అక్కడికి వెళ్లలేదు. చానెళ్లలో కేవలం అధికారులు మాత్రమే కనబడడం నాకిష్టం లేదు. అందుకే నా నివాసంలో వారికి స్వాగత ఏర్పాట్లు చేశాను. వారికి రివార్డు విషయమై సమాఖ్యలో చర్చిస్తాం’ అని మల్హోత్రా తెలిపారు.