
తగ్గేదేలే: స్వర్ణం సాధించిన భారత ఆర్చరీ జట్టు సభ్యులు రజత్, అమన్, అభిషేక్ వర్మ సంబరం
గ్వాంగ్‌జు (దక్షిణ కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో సత్తా చాటుకున్నారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగం మ్యాచ్‌ల్లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 (56–57, 58–58, 60–56, 58–59) పాయింట్ల తేడాతో అడ్రియన్ గాంటియర్, జీన్ ఫిలిప్ బౌల్చ్, క్విన్‌టిన్ బారిర్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టును ఓడించింది. గత నెలలో టర్కీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ ఫైనల్లో ఫ్రాన్స్‌పైనే గెలిచి భారత జట్టు బంగారు పతకం సాధించడం విశేషం.
అనంతరం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ, అవ్‌నీత్ కౌర్‌లతో కూడిన భారత జంట 156–155 (39–39, 38–40, 39–38, 40–38) పాయింట్ల తేడాతో బెరా సుజెర్, ఎమిర్కాన్ హనీలతో కూడిన టర్కీ జోడీపై విజయం సాధించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రెండో ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్ (భారత్) రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మోహన్ 141–149తో ప్రపంచ నంబర్‌వన్ మైక్ షోలోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సెమీఫైనల్లో 143–141తో ప్రపంచ చాంపియన్ నికో వీనర్ (ఆస్ట్రియా)పై గెలుపొందడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment