పారిస్: ఒలింపిక్స్‌లో మన ఆర్చర్లకు మరోసారి నిరాశ తప్పలేదు! భారీ అంచనాలు, మంచి ఫామ్‌తో పారిస్‌లో అడుగుపెట్టిన ఆర్చర్లు పోటీపడ్డ అన్నీ విభాగాల్లో విఫలమై.. రిక్తహస్తాలతో ఇంటిబాట పట్టారు. ఇప్పటికే పురుషుల టీమ్, మహిళల టీమ్, మిక్స్‌డ్ టీమ్, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో మనవాళ్లకు చేదు ఫలితాలు ఎదురుకాగా... శనివారం మహిళల వ్యక్తిగత విభాగంలోనూ అదే పునరావృతం అయింది.
ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్లో కొరియాకు చెందిన 19 ఏళ్ల టీనేజ్ ఆర్చర్ నామ్ సిహైన్ చేతిలో ఓడగా.. తొలిసారి విశ్వ క్రీడల్లో ఆడుతున్న భజన్ కౌర్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ‘పారిస్’ క్రీడల రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ నాలుగో స్థానంలో నిలవడమే ఒలింపిక్స్ చరిత్రలో మన ఆర్చర్ల అత్యుత్తమ ప్రదర్శన.
వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన దీపిక శనివారం జరిగిన రికర్వ్ మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్లో 4–6 (28–26, 25–28, 29–28, 27–29, 27–29)తో నామ్ సిహైన్ చేతిలో పరాజయం పాలైంది. తొలి మూడు సెట్‌లలో రెండింట గెలిచి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి ఆశలు రేపిన దీపిక.. నాలుగో సెట్‌లో గురితప్పి 7 పాయింట్లు సాధించడంతో వెనుకబడింది.
14 ఏళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు సాధిస్తూ మేటి ఆర్చర్‌గా పేరు తెచ్చుకున్న దీపిక వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ పతకం లేకుండానే వెనుదిరిగింది. ‘నిరాశ చెందా. ఒలింపిక్స్‌లో ప్రతిసారీ ఇలాంటి ఫలితాలే ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు.
ఈ వాతావరణం, అంచనాలే కారణమనుకుంటా. రెండు బాణాలు గురి తప్పడంతో.. మ్యాచ్‌ను నేనే ప్రత్యరి్థకి అప్పగించినట్లు అనిపించింది’ అని 2012 ‘లండన్’లో 33వ స్థానంలో, 2016 ‘రియో’లో 16వ స్థానంలో, 2020 టోక్యోలో 8వ స్థానంలో నిలిచిన దీపిక వ్యాఖ్యానించింది.
క్వార్టర్ ఫైనల్లో దీపిక గెలిచి ఉంటే సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతక రేసులో నిలిచేది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో దీపిక 6–4 (27–24, 27–27, 26–25, 27–29, 27–27)తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలిచింది.
మరో ఆర్చర్ భజన్ కౌర్ ‘షూట్ ఆఫ్’లో దినంద చోరునిసా (ఇండోనేసియా) చేతిలో ఓడింది. మొదట స్కోర్లు 28–29, 27–25, 26–28, 28–28, 27–26తో సమం కాగా.. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన ‘షూట్ ఆఫ్’లో తడబడ్డ భజన్ 8 పాయింట్లు సాధించగా.. 9 పాయింట్లతో ఇండోనేసియా ఆర్చర్ ముందంజ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment