స్వాగతం పలికేవారే లేరు..!
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి స్వర్ణం సాధించిన ఆనందంలో స్వదేశానికి చేరుకున్న భారత ఆర్చర్లను అధికారుల తీరు నిరాశ పర్చింది. పోలండ్‌లో జరిగిన ఈపోటీల టీమ్ రికర్వ్ విభాగం ఫైనల్లో పటిష్టమైన కొరియాను మట్టి కరిపించిన దీపికా కుమారి, బొంబేలా దేవి, రిమిల్ మంగళవారం తెల్లవారుజామున ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అయితే వీరికి స్వాగతం పలికేందుకు అక్కడికి ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. దీంతో ఈ బృందం కాస్త నిరాశకు గురైంది. ‘మేం సాధించిన విజయాన్నే ఇతర క్రీడల్లో సాధిస్తే విమానాశ్రయానికి పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు వచ్చేవారు. కానీ ఇక్కడ మాకు ఎదురైన అనుభవం నిరాశకు గురిచేసింది. మేం చాలా గొప్ప విజయాన్ని సాధించాం. కొరియాను ఓడించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మాకు కూడా ఘనస్వాగతం లభిస్తే సంతోషించేవాళ్లం. అయినా పోటీల్లో మంచి ప్రదర్శన ఇవ్వడం మా బాధ్యత. దాన్ని సక్రమంగా నెరవేర్చాం’ అని ఆర్చర్ రిమిల్ పేర్కొంది. మంగళవారం సాయంత్రం వీరికి భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ) అధ్యక్షుడు వీకే మల్హోత్రా నివాసంలో సన్మానం చేశారు.
స్వాగతించేందుకు అధికారులెవరూ వెళ్లకపోవడాన్ని మల్హోత్రా మరోరకంగా సమర్థించుకున్నారు. ‘జట్టు ఆటగాళ్లు మాత్రమే అందరి దృష్టినీ ఆకర్షించాలని అధికారులు అక్కడికి వెళ్లలేదు. చానెళ్లలో కేవలం అధికారులు మాత్రమే కనబడడం నాకిష్టం లేదు. అందుకే నా నివాసంలో వారికి స్వాగత ఏర్పాట్లు చేశాను. వారికి రివార్డు విషయమై సమాఖ్యలో చర్చిస్తాం’ అని మల్హోత్రా తెలిపారు.