world youth archery championship
-
World Archery Youth Championship: ‘పసిడి’ కోమలిక
వ్రోక్లా (పోలాండ్): ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ రికర్వ్ విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరి రోజు భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. అండర్–21 జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో కోమలిక బారి 7–3తో 2018 యూత్ ఒలింపిక్స్ చాంపియన్ ఇలియా కెనాలెస్ (స్పెయిన్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో కోమలిక అండర్–18 విభాగంలోనూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. దీపిక కుమారి తర్వాత అండర్–21, అండర్–18 విభాగాల్లో విశ్వవిజేతగా నిలిచిన రెండో భారతీయ ఆర్చర్‌గా కోమలిక గుర్తింపు పొందింది. జూనియర్ మిక్స్డ్ ఫైనల్లో కోమలిక–సుశాంత్ సాలుంఖే (భారత్) ద్వయం 5–3తో ఇలియా కెనాలెస్–యున్ సాంచెజ్ (స్పెయిన్) జోడీని ఓడించి పసిడి పతకాన్ని సాధించింది. ధీరజ్ జట్టుకు స్వర్ణం... జూనియర్ పురుషుల టీమ్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్‌తో కూడిన భారత జట్టు బంగారు పతకం గెలిచింది. ధీరజ్, సుశాంత్, ఆదిత్యలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–3తో స్పెయిన్ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్‌మయ్, అమిత్ కుమార్, విక్కీ రుహాల్లతో కూడిన భారత జట్టు 5–3తో ఫ్రాన్స్‌పై నెగ్గింది. క్యాడెట్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్‌మయ్–తామ్నా జంట (భారత్) 6–2తో జపాన్ జోడీని ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. క్యాడెట్ మహిళల టీమ్ కాంస్య పతక పోటీలో భారత్ 5–3తో జర్మనీపై గెలిచింది. క్యాడెట్ మహిళల వ్యక్తిగత కాంస్య పతక పోరులో మంజిరి అలోన్ 6–4తో క్వింటీ రోఫెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. క్యాడెట్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో బిశాల్ చాంగ్‌మయ్ 6–4తో దౌలక్కెల్దీ (కజకిస్తాన్)పై గెలిచాడు. శనివారం కాంపౌండ్ విభాగంలో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు లభించాయి. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో భారత్ ఆర్చర్లు 15 పతకాలు గెలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. -
మనోళ్లు మెరిశారు
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు మెరిశారు. రాష్ట్రానికి చెందిన చిట్టిబొమ్మ జిజ్ఞాస్ మూడు, జ్యోతి సురేఖ రెండు కాంస్యాలు గెలుచుకున్నారు. చైనాలోని వుజిలో శనివారం జరిగిన పోటీల్లో... కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జిజ్ఞాస్ కాంస్యం గెలిచాడు. హోరాహోరీగా జరిగిన పోరులో 143-141 తేడాతో స్కారియోక్స్(బెల్జియం)పై విజయం సాధించాడు. అటు మిక్స్డ్ ఈవెంట్లో జిజ్ఙాస్, సురేఖ 153-144తో బెల్జియం జోడిపై గెలిచి కాంస్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఇద్దరి రాణింపుతో అటు పురుషుల, ఇటు మహిళల కాంపౌండ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్యాలు దక్కాయి. మహిళల జూనియర్ కాంపౌండ్ జట్టు (సురేఖ, జయలక్ష్మి, స్వాతి) 223-214తో మెక్సికో జట్టుపై గెలిచింది. అలాగే పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చిట్టిబొమ్మ జిజ్ఞాస్, రజత్ చౌహాన్, సుధాకర్ కుమార్‌తో కూడిన జట్టు 229-222 తేడాతో బ్రిటన్‌పై నెగ్గి కాంస్యం సాధించింది. ‘మరింత మెరుగ్గా రాణించాల్సింది’ ‘ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన జంషెడ్పూర్ నేషనల్ ర్యాంకింగ్ టోర్నీలో గాయం తర్వాత మొదటి సారి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాను. అయితే కాంస్యాల కన్నా మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చి ఉండాల్సింది. కొరియాలో జరిగే ఆసియా గేమ్స్‌లో భారత జట్టు తరఫున పాల్గొనాలన్నదే నా లక్ష్యం’ - జిజ్ఞాస్ ‘సంతోషంగా ఉంది’ ‘తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈనెలాఖరున జరిగే ఏషియన్ చాంపియన్‌షిప్‌లోనూ పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. అయితే దీనికి మరింత మెరుగైన కోచింగ్ తీసుకోవడంపై దృష్టి పెట్టాను.’ - జ్యోతి సురేఖ -
కాంస్యంపై జిజ్ఞాస్, సురేఖ గురి
వుజి (చైనా): ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్లు కాంస్య పతక పోరుకు అర్హత సాధించాయి. జూనియర్ పురుషుల, మహిళల విభాగాల్లో భారత జట్లు సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాయి. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో వెన్నం జ్యోతి సురేఖ, సరికొండ జయలక్ష్మీ, స్వాతి దుద్‌వాల్‌లతో కూడిన భారత మహిళల జట్టు 221-225తో టాప్ సీడ్ అమెరికా చేతిలో పరాజయం పాలైంది. శనివారం జరిగే కాంస్య పతక పోరులో మెక్సికోతో టీమిండియా తలపడుతుంది. పురుషుల సెమీఫైనల్స్‌లో చిట్టిబొమ్మ జిజ్ఞాస్, రజత్ చౌహాన్, సుధాకర్ కుమార్ పాశ్వాన్‌లతో కూడిన భారత జట్టు 231-233తో మెక్సికో చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో బ్రిటన్‌తో భారత్ పోటీపడుతుంది. కాంపౌండ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ చిట్టిబొమ్మ జిజ్ఞాస్ సెమీఫైనల్లో ఓడిపోగా... భారత్‌కే చెందిన రజత్ చౌహాన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్స్‌లో రజత్ 148-142తో బాప్టిస్ట్ స్కారియెక్స్ (బెల్జియం)పై నెగ్గగా... జిజ్ఞాస్ 146-148తో స్టీఫెన్ హాన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. స్వర్ణం కోసం హాన్సెన్‌తో రజత్, కాంస్యం కోసం స్కారియెక్స్‌తో జిజ్ఞాస్ పోటీపడతారు.