తన కూతురిని ‘షూటర్’గా తీర్చిదిద్ది తప్పుచేశామంటూ మనూ భాకర్(Manu Bhaker) తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను క్రికెటర్‌ను చేసి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని పేర్కొన్నారు. ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించినా సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు.
కాగా భారత ప్రభుత్వం ప్రదానం చేసే క్రీడా అత్యుతన్నత పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న’(Major Dhyan Chand Khel Ratna). ఇందుకు సంబంధించిన అవార్డు కమిటీ సోమవారం నామినీల పేర్లను ప్రకటించగా.. అందులో మనూ భాకర్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన మనూ తండ్రి రామ్ కిషన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నా బిడ్డ ఇంకేం చేయాలి?
‘‘ఇప్పటి వరకు భారత్ తరఫున ఎవరూ సాధించని ఘనత నా కూతురు సాధించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతకంటే దేశం కోసం నా బిడ్డ ఇంకేం చేయాలి? ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించాలి కదా!.
పతకాలు గెలవకుంటేనే బాగుండేది
ఈ విషయం గురించి నేను మనూతో మాట్లాడాను. తన మనసంతా బాధతో నిండి ఉంది. ‘నేనసలు దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించకపోయి ఉంటే.. ఈ బాధ ఉండేదే కాదు.
అసలు క్రీడాకారిణిని కాకపోయే ఉంటే ఇంకా బాగుండేది’ అని తను నాతో అన్నది’’ అని రామ్ కిషన్ భాకర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తమ ఆవేదనను పంచుకున్నారు.
బాహ్య శక్తుల ప్రభావం ఉంది!
ఇక దేశానికి ఇంత గొప్ప పేరు తెచ్చినా గుర్తింపు దక్కకపోవడం చూస్తుంటే.. కమిటీపై బాహ్య శక్తుల ప్రభావం లేదంటే నమ్మబుద్ధి కావడం లేదని రామ్ కిషన్ భాకర్ అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె విషయంలో ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
కాగా హర్యానాకు చెందిన రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్. ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024(Paris Olympics 2024)లో రెండు మెడల్స్ గెలిచింది.
పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా స్వాతంత్ర్యం తర్వాత భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మొట్టమొదటి ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment