
ముంబై క్రికెటర్ తనుశ్ కొటియాన్‌కు అరుదైన అవకాశం దక్కింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ( Border-Gavaskar Trophy- బీజీటీ)లో భాగంగా.. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు.. టీమిండియా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. తనుశ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కాగా బీజీటీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం కంగారూల చేతిలో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా అయింది.
అశ్విన్ రిటైర్మెంట్
ఇక ఈ మ్యాచ్ ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అశూ స్థానంలో ముంబై ఆటగాడు తనుశ్ కొటియాన్(Tanush Kotian)కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. నిజానికి మరో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు జట్టుతోనే ఉన్నా.. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం అతడిని ఎంపిక చేశారు.
ఎవరీ తనుశ్ కొటియాన్?
మహారాష్ట్ర చెందిన తనుశ్ కొటియాన్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్‌లో అతడు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 26 ఏళ్ల తనుశ్ ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 25.70 సగటుతో 101 వికెట్లు తీశాడు.
అదే విధంగా.. బ్యాటింగ్‌లోనూ రాణించిన అతను 47 ఇన్నింగ్స్‌లలో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2023–24 రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబై గెలుచుకోవడంలో తనుశ్‌దే కీలకపాత్ర.
ఆ ఎడిషన్‌లో 502 పరుగులు చేసి 29 వికెట్లు పడగొట్టిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలవడం విశేషం. ఇక ఇటీవల భారత్ ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఒక మ్యాచ్‌లోనూ తనుశ్ బరిలోకి దిగాడు.
వన్డే టోర్నీలో సత్తా చాటుతూ
తనుశ్ కొటియాన్ ప్రస్తుతం ముంబై తరఫు విజయ్ హజారే టోర్నీ(Vijay Hazare Trophy) మ్యాచ్‌లు ఆడుతున్నాడు. టీమిండియాలోకి ఎంపికైన రోజే అతడు అహ్మదాబాద్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించడం విశేషం. రెండు వికెట్లు తీయడంతో పాటు.. 37 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య మెల్‌బోర్న్(డిసెంబరు 26-30)లో నాలుగో టెస్టు జరుగనుంది. తదుపరి సిడ్నీ వేదికగా ఇరుజట్లు ఆఖరి టెస్టులో తలపడతాయి.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?
Comments
Please login to add a commentAdd a comment