యెరెవాన్ (అర్మేనియా): అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. అర్మేనియాలో ముగిసిన ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో మహిళల, పురుషుల విభాగాల్లో కలిసి భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. చివరిరోజు భారత్‌కు మూడు పసిడి పతకాలు, ఆరు రజత పతకాలు లభించాయి.
మూడు స్వర్ణాలూ మహిళా బాక్సర్లే నెగ్గడం విశేషం. పాయల్ (48 కేజీలు), నిషా (52 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో పాయల్ 5–0తో హెజినె పెట్రోసియాన్ (అర్మేనియా)పై, నిషా 5–0తో ఫరినోజ్ అబ్దుల్లాఇవా (తజికిస్తాన్)పై, ఆకాంక్ష 5–0తో తైమజోవా ఎలిజవెటా (రష్యా)పై విజయం సాధించారు.
ఇతర ఫైనల్స్‌లో వినీ (57 కేజీలు) 0–5తో మమతోవా సెవర (ఉజ్బెకిస్తాన్) చేతిలో... సృష్టి (63 కేజీలు) 0–5తో సియోఫ్రా లాలెస్ (ఐర్లాండ్) చేతిలో... అనా బుజులెవా (రష్యా) చేతిలో నాకౌట్ అయిన మేఘ (80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో సాహిల్ (75 కేజీలు), హేమంత్ సాంగ్వాన్ (ప్లస్ 80 కేజీలు), జతిన్ (54 కేజీలు) ఫైనల్లో పరాజయం చవిచూసి రజత పతకాలు గెల్చుకున్నారు. సాహిల్ 0–5తో అల్బెర్ట్ హరుతిన్యాన్ (అర్మేనియా) చేతిలో... హేమంత్ 0–5తో సలిఖోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... జతిన్ 1–4తో తులెబెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment