ఫెల్ప్స్‌ను తలపిస్తున్న ఫ్రాన్స్ స్విమ్మర్ మర్చండ్
నాలుగో ఒలింపిక్ రికార్డుతో ‘పారిస్’లో నాలుగో స్వర్ణం కైవసం
ఒలింపిక్స్‌లో ఈత పోటీలు అనగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు మైకేల్ ఫెల్ప్స్! మకుటం లేని మహారాజులా స్విమ్మింగ్‌పూల్‌ను ఏలిన ఈ అమెరికా స్విమ్మర్.. విశ్వక్రీడల్లో ఏకంగా 28 పతకాలు సాధించి అదుర్స్ అనిపించుకున్నాడు. అందులో 23 స్వర్ణాలు ఉన్నాయంటే.. విశ్వక్రీడల్లో అతడి హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ నయా స్విమ్మర్ లియాన్ మర్చండ్.. అమెరికా దిగ్గజం బాటలో దూసుకెళ్తున్నాడు.
పాల్గొన్న తొలి ఒలింపిక్ క్రీడల్లోనే నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకొని ఫెల్ప్స్‌కు తానే సరైన వారసుడినని అనిపించుకుంటున్నాడు. రెండు గంటల వ్యవధిలో రెండు స్వర్ణాలు సాధించి అభిమానుల దృష్టిని ఆకర్షించిన మర్చండ్.. ‘పారిస్’ క్రీడల్లో నాలుగో పసిడి చేజిక్కించుకున్నాడు. నాలుగు భిన్న రేసుల్లో అగ్రస్థానంలో నిలిచిన మర్చండ్.. ఈ నాలుగింట ఒలింపిక్ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం.
ఫ్రాన్స్ యువ స్విమ్మర్ లియాన్ మర్చండ్ బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్‌లోనే నాలుగో పసిడి పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే మూడు స్వర్ణాలు నెగ్గిన మర్చండ్.. ఆదివారం పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసులో 1 నిమిషం 54.06 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో పసిడి పతకాలు గెలుచుకున్న 22 ఏళ్ల మర్చండ్.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమని అంటున్నాడు. మర్చండ్ పోటీపడ్డ తొలి రేసును కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మక్రాన్.. అతడి ప్రతిభకు ముగ్ధుడయ్యారు.
వారం రోజుల వ్యవధిలో కొలనులో సంచలన ఫలితాలు సాధించి రికార్డులు తిరగరాసిన మర్చండ్‌కు తాను అభిమాని అయిపోయానని వెల్లడించారు.‘అభిమాన సందోహం మధ్య పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చొని అభివాదం చేస్తుంటే.. ఇన్నేళ్లు పడ్డ కష్టం అంతా మరిచిపోయినట్లు అనిపిస్తుంది’ అని నాలుగో పసిడి పతకం గెలిచిన అనంతరం మర్చండ్ అన్నాడు.
తనను తాను సిగ్గరిగా చెప్పుకునే మర్చండ్.. తాజా క్రీడల్లో చివరగా బరిలోకి దిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే సమయంలో చాలా ప్రశాంతంగా కనిపించాడు. మూడు పతకాలు గెలిచిన గర్వం కానీ, మరో పతకం సాధించాలనే ఒత్తిడి కానీ ఏమాత్రం లేకుండా బరిలోకి దిగి బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. ‘నాలుగు స్వర్ణాలు గెలవడం నమ్మశక్యంగా లేదు. మొదట ఒక పతకం గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ తర్వాత వరుసగా మంచి ప్రదర్శనలు కనబర్చా. ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది’ అని మర్చండ్ పేర్కొన్నాడు.
ఫ్రెంచ్ ఫెల్ప్స్...
ఈత కొలనులో సంచలనాలు నమోదు చేస్తున్న మర్చండ్‌ను అభిమానులు ముద్దుగా ‘ఫ్రెంచ్ ఫెల్ప్స్’ అని పిలచుకుంటున్నారు. అయితే అది తనపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని.. ఒకింత ఆనందంగా కూడా ఉందని మర్చండ్ పేర్కొన్నాడు. దశాబ్దకాలం పాటు ఒలింపిక్స్‌లో ఏకఛత్రాధిపత్యం కనబర్చిన ఫెల్ప్స్ నమోదు చేసిన రెండు ఒలింపిక్ రికార్డుల (400 మీటర్ల మెడ్లే, 200 మీటర్ల మెడ్లే)ను మర్చండ్ తాజాగా బద్దలు కొట్టాడు.
మరోవైపు ఫెల్ప్స్ కూడా మర్చండ్ ఫీట్‌కు ఫిదా అయిపోయాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మర్చండ్ స్వర్ణాలు గెలిచిన సందర్భంలో ఫెల్ప్స్ సంబరాలు జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఫెల్ప్స్‌తో పోల్చినప్పుడు గర్వంగా ఉంటుంది. స్విమ్మింగ్ రూపురేఖలను మార్చిన ఘనత అతడిది’ అని మర్చండ్ అన్నాడు. ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించేందుకు ఫెల్ప్స్ ఇచ్చిన సూచనలు కూడా పనిచేశాయని వెల్లడించాడు.
అయితే ‘పారిస్’ క్రీడల్లో మర్చండ్‌తో పోటీపడిన సహచరులు మాత్రం.. ఫెల్ప్స్ కన్నా మర్చండ్ కఠిన ప్రత్యర్థి అని ప్రశంసించారు. మర్చండ్‌తో కలిసి 400 మీటర్లు, 200 మీటర్లు వ్యక్తిగత మెడ్లే విభాగంలో బరిలోకి దిగిన అమెరికా స్విమ్మర్ కార్సాన్ ఫాస్టర్ మాట్లాడుతూ.. ‘పోటీలో పాల్గొన్న వారందరికీ.. అత్యుత్తమ స్విమ్మర్‌తో బరిలోకి దిగిన అనుభవం ఎదురైంది. పోటీ పడిన నాలుగు ఈవెంట్లలోనూ స్వర్ణాలు గెలవడం మామూలు విషయం కాదు’ అని పేర్కొన్నాడు.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment