గోల్డ్‌కోస్ట్: తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్ స్వర్ణానికి విజయం దూరంలో నిలిచింది. 48 కేజీల సెమీఫైనల్లో మేరీకోమ్ 5–0తో అనూష దిల్‌రుక్షి (శ్రీలంక)ని చిత్తుచేసింది. పురుషుల విభాగంలో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. సరితా దేవి (60 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశారు.
బ్యాడ్మింటన్‌లో జోరు...
వ్యక్తిగత విభాగంలో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లందరూ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పీవీ సింధు 21–6, 21–3తో ఆండ్రా వైట్‌సైడ్ (ఫిజీ)పై, సైనా నెహ్వాల్ 21–3, 21–1తో ఎల్సీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)పై, రుత్విక 21–5, 21–7తో గ్రేస్ అలిపాక (ఘనా)పై, శ్రీకాంత్ 21–13, 21–10తో ఆతిశ్ లుభా (మారిషస్)పై, ప్రణయ్ 21–14, 21–6తో క్రిస్టోఫర్ (మారిషస్)పై గెలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సాత్విక్–అశ్విని పొన్నప్ప జంటలు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి.
గ్రూప్ ‘టాపర్’...
పురుషుల హాకీలో భారత జట్టు గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ‘బి’ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3తో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, వరుణ్ కుమార్, మన్‌దీప్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ చివరి నిమిషంలో మన్‌దీప్ సింగ్ గోల్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.
శరత్, సత్యన్ ముందంజ...
టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాళ్లు శరత్ కమల్, సత్యన్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. తొలి రౌండ్‌లో శరత్ 4–3తో జావెన్ చూంగ్ (మలేసియా)పై, సత్యన్ 4–0తో రమీజ్ (పాకిస్తాన్)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో మౌమా దాస్ 4–0తో హో వాన్ కౌ (మారిషస్)పై, మధురిక 4–1తో రెన్ చుంగ్ (ట్రినిడాడ్ టొబాగో)పై నెగ్గారు.
అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు...
అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల హైజంప్ ఫైనల్లో తేజస్విన్ శంకర్ (2.24 మీటర్లు) ఆరో స్థానంలో నిలువగా... మహిళల 400 మీటర్ల ఫైనల్లో హిమా దాస్ (51.32 సెకన్లు) తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసి ఆరో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు మహిళల లాంగ్‌జంప్‌లో నయన జేమ్స్, నీనా వరాకిల్ క్వాలిఫయింగ్‌లో వరుసగా 9, 12 స్థానాలు సాధించి ఫైనల్‌కు చేరారు.
దీపిక జంట విజయం...
మహిళల స్క్వాష్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జంట దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ జోడీ మూడో లీగ్ మ్యాచ్‌లో 11–5, 11–6తో కెల్లాస్–కొలెట్టే సుల్తానా (మాల్టా)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈ జోడీ గ్రూప్ టాపర్‌గా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
పసిడికి పంచ్ దూరంలో మేరీకోమ్
Published Thu, Apr 12 2018 1:24 AM | Last Updated on Thu, Apr 12 2018 1:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment