
గోల్డ్ కోస్ట్ : ప్రేమ ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో చెప్పలేం. ప్రేమను గెలుపించుకున్న ఆనందం ఒకరిదైతే.. తన మనసుకు నచ్చినవాడే ఎదురొచ్చి ప్రపోజ్ చేస్తే ఆ సంతోషమే వేరు. ప్రస్తుతం అస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఇలాంటి మధుర క్షణం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఆ దేశానికి చెందిన ఇద్దరు బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కామన్వెల్త్ గేమ్స్‌ను తమ జీవితాల్లో మరచిపోలేని వేడుకకు వేదికగా చేసుకున్నారు. బాస్కెట్ బాల్ పురుషుల జట్టుకు చెందిన జామెల్ అండర్సన్, ఆ దేశ బాస్కెట్ బాల్ మహిళల జట్టుకు చెందిన జార్జియా జోన్స్‌కి ప్రపోజ్ చేశాడు.
బాస్కెట్ బాల్ విభాగంలో కామెరూన్ జట్టుపై విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ జట్టు సభ్యుడు అండర్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ జోన్స్‌కి మోకాలిపై కూర్చోని సినిమా సీన్లను తలపించేలా.. తన ప్రేమ విషయాన్ని తెలిపాడు. అతడి లవ్ ప్రపోజల్‌కు జోన్స్ ఒకే చెప్పగానే అండర్సన్ తోటి క్రీడాకారుల సమక్షంలో ఆమెకు ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగి ఉద్వేగానికి లోనయ్యాడు. తన తోటి క్రీడాకారులు చేసిన ఏర్పాట్ల వల్లే ఇంత చక్కగా తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయగలిగానని అండర్సన్ తెలిపాడు. వీరి నిశ్చితార్థంతో మైదానంలో సందడి వాతావరణం నెలకొంది.
కామన్వెల్త్ వేదికగా జరిగిన వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇంగ్లండ్ బాస్కెట్‌బాల్ టీమ్ తమ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు క్రీడాకారులు వీరికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment