
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో డోపింగ్ నిరోధానికి ఉద్దేశించిన సిరంజీ రహిత (నో నీడిల్స్) నిబంధన ఉల్లంఘించినందుకు భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రాకేశ్ బాబు (ట్రిపుల్ జంపర్), ఇర్ఫాన్ (రేస్ వాకర్) శుక్రవారం బహిష్కరణకు గురయ్యారు. ఇర్ఫాన్ పడక గదిలో, రాకేశ్ బ్యాగ్‌లో సిరంజీలు బయటపడటంతో వారు తక్షణం క్రీడా గ్రామం వదిలి వెళ్లాలని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) అధ్యక్షుడు లూయీస్ మార్టిన్ ఆదేశించారు. కాగా, ఇర్ఫాన్ తన విభాగమైన 20 కి.మీ. నడకలో 13వ స్థానంలో నిలిచి ఇప్పటికే పతకానికి దూరమయ్యాడు. రాకేశ్ శుక్రవారం పోటీలో పాల్గొనాల్సి ఉన్నా మోకాలి గాయంతో ముందే వైదొలిగాడు. మరోవైపు క్రీడల ప్రారంభానికి ముందు భారత బృందం బస చేసిన హోటల్ సమీపాన సిరంజీలు బయటపడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
తాజా ఘటనపై భారత చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా, జనరల్ టీమ్ మేనేజర్ నామ్‌దేవ్ షిర్గోంకర్, అథ్లెటిక్స్ టీమ్ మేనేజర్ రవీందర్ చౌధరిలను సీజీఎఫ్ కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. క్రీడలు ముగిశాక ఈ ఘటనపై విచారణ చేపట్టి అథ్లెట్లను శిక్షిస్తామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అంగీకరించలేమని, ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత అప్పీల్‌కు వెళ్తామని షిర్గోంకర్ మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) మాజీ కార్యదర్శి బీకే సిన్హా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘాన్ని నియమిస్తున్నట్లు ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు.
వికాస్‌కు డోప్ పరీక్ష...
ఈ క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ అనూహ్యంగా డోప్ పరీక్ష ఎదుర్కొన్నాడు. పోటీలు ముగిశాక బుధవారం తిరుగు పయనమైన అతడికి చివరి నిమిషంలో ఈ పరిస్థితి ఎదురైంది. ఇర్ఫాన్, రాకేశ్‌లతో పాటు మరో ఆటగాడిని పరీక్షించాలని కామన్వెల్త్ మెడికల్ కమిషన్ కోరడంతో వికాస్‌ను పంపినట్లు షిర్గోంకర్ తెలిపారు. అయితే... ఠాకూర్ ఎలాంటి పొరపాటు చేయనట్లు తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment