
50 కేజీల విభాగం బౌట్‌లో తన ప్రత్యర్థిని ఎత్తేసిన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్
గోల్డ్ రష్..
గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో గత తొమ్మిది రోజుల్లో ఒకే రోజు గరిష్టంగా మూడు స్వర్ణాలు నెగ్గిన భారత క్రీడాకారులు... పదో రోజు శనివారం మాత్రం తమ విశ్వరూపం ప్రదర్శించారు. ఊహించనిరీతిలో ఒకే రోజు ఏకంగా 8 స్వర్ణాలు సొంతం చేసుకొని పసిడి పంట పండించారు. బాక్సింగ్‌లో మేరీకోమ్ (48 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు)... రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ (మహిళల 50 కేజీలు), సుమీత్ (పురుషుల 125 కేజీలు), టేబుల్ టెన్నిస్‌లో మనిక బాత్రా (మహిళల సింగిల్స్), షూటింగ్‌లో సంజీవ్ రాజ్‌పుత్ (పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) బంగారు పతకాలు గెలిచారు. నేడు ముగియనున్న ఈ గేమ్స్‌లో ఓవరాల్ పతకాల పట్టికలో భారత్‌కు మూడో స్థానం ఖాయమైంది.
గోల్డ్‌కోస్ట్‌లో భారత్ స్వర్ణాల పంట పండించింది. కామన్వెల్త్ క్రీడల్లో మొదటి తొమ్మిది రోజుల్లో 17 బంగారు పతకాలు నెగ్గిన మన బృందం ఒక్క పదో రోజే 8 పసిడి పతకాలతో సత్తా చాటింది. బాక్సింగ్ పంచ్ మూడు... రెజ్లింగ్ పట్టు రెండు చొప్పున బంగారు పతకాలు అందించాయి. టేబుల్ టెన్నిస్, షూటింగ్, అథ్లెటిక్స్ క్రీడాంశాల నుంచి ఒక్కో స్వర్ణం భారత్ బంగారం బరువును పెంచాయి. బాక్సింగ్‌లో మూడు వెండి విజయాలు సహా 5 రజతాలు... నాలుగు కంచు మోతలతో శనివారం మన ఖాతాలో మొత్తం 17 పతకాలు చేరడం విశేషం. పోటీలకు చివరి రోజైన ఆదివారం జరగబోయే మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్ ద్వారా ఇప్పటికే ఒక స్వర్ణం మన చెంత చేరగా... బ్యాడ్మింటన్, స్క్వాష్‌లలో కలిపి మరో మూడు బంగారు పతకాలు గెలిచేందుకు అవకాశం ఉంది. ఓవరాల్‌గా పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంతో గేమ్స్‌ను ముగించడం ఖాయమైంది.
నీరజ్ ఘనత...
పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మొత్తం 86.47 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అతను అగ్రస్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో జావెలిన్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కాగా, ఓవరాల్‌గా రెండో పతకం మాత్రమే. ఇంతకుముందు 2010 ఢిల్లీ క్రీడల్లో కాశీనాథ్ నాయక్ కాంస్యం సాధించాడు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన ఐదో భారతీయ అథ్లెట్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. గతంలో మిల్కా సింగ్ (1958), కృష్ణ పూనియా (2010–డిస్కస్ త్రో), వికాస్ గౌడ (2014–డిస్కస్ త్రో), 4్ఠ400 మహిళల రిలే జట్టు (2010లో) ఈ ఘనత సాధించారు.
పంచ్ పవర్...
బాక్సింగ్‌లో ఆరుగురు ఫైనల్లోకి చేరగా... మేరీకోమ్, గౌరవ్ సోలంకి (52 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) స్వర్ణాలు గెలిచారు. అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) రజతాలు గెల్చుకున్నారు. మహిళల 48 కేజీల ఫైనల్లో మేరీకోమ్ 5–0తో క్రిస్టినా ఒహారా (నార్తర్న్ ఐర్లాండ్)పై గెలిచి ఈ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా బాక్సర్‌గా చరిత్ర లిఖించింది. ఇతర ఫైనల్స్‌లో గౌరవ్ 4–1తో బ్రెండన్ ఇర్విన్ (నార్తర్న్ ఐర్లాండ్)పై, వికాస్ 5–0తో విల్‌ఫ్రెడ్ సెయిన్‌స్టన్ (కామెరూన్)పై విజయం సాధించారు. మరోవైపు మనీశ్ కౌశిక్ 2–3తో హ్యారీ గార్సిడ్ (ఆస్ట్రేలియా) చేతిలో... అమిత్ 1–3 తేడాతో గలాల్ యాఫై (ఇంగ్లండ్) చేతిలో... సతీశ్ కుమార్ 0–5తో ఫ్లేజర్ క్లార్క్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడి రజతాలు గెలిచారు. సెమీస్‌లో ఓడిన తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు), మనోజ్ (69 కేజీలు), నమన్ తన్వర్ (91 కేజీలు)లకు కాంస్య పతకాలు లభించాయి.
సంజీవ్ స్వర్ణ గురి..
షూటింగ్ ఈవెంట్‌ను భారత్ స్వర్ణంతో ముగించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో సంజీవ్ రాజ్‌పుత్ 454.5 పాయింట్లు స్కోరు చేసి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకం గెలిచాడు. ఈ క్రీడల్లో రాజ్‌పుత్ గతం లో కాంస్యం (2006–మెల్‌బోర్న్), రజతం (2014– గ్లాస్గో) గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్, మానవ్‌జిత్ సంధూ ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు.
భళా... మనిక
టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్‌లో రజత పతకాలను తన ఖాతాలో వేసుకున్న మనిక బాత్రా సింగిల్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి మరో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో మనిక 11–7, 11–6, 11–2, 11–7 తేడాతో యు మెంగ్యు (సింగపూర్)ను చిత్తు చేసింది. తద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో టీటీలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా మనిక ఘనత సాధించింది. పురుషులు డబుల్స్‌లో ఆచంట శరత్ కమల్–జ్ఞానశేఖరన్ సత్యన్ జోడి రజతం గెలుచుకుంది. ఫైనల్లో శరత్–సత్యన్ ద్వయం 5–11, 12–10, 9–11, 6–11, 8–11తో పాల్ డ్రిన్‌కాల్–లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లోనే భారత్‌కు కాంస్యం కూడా దక్కింది. కాంస్య పతక పోరులో హర్మీత్ దేశాయ్–సానిల్ శంకర్ శెట్టి 11–5, 11–6, 12–10తో ప్యాంగ్ యెన్ కోయెన్ – షావో ఫెంగ్ (సింగపూర్)ను చిత్తు చేశారు.
దీపిక జంటకు రజతం
స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో భారత జంట దీపిక పళ్లికల్–సౌరవ్ ఘోషాల్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్లో కామెరాన్ పిల్లీ–డోనా ఉర్ఖుహర్ట్ (ఆస్ట్రేలియా) చేతిలో వరుస గేమ్‌లలో 8–11, 10–11తో ఓడిన దీపిక–సౌరవ్ రజత పతకంతో సంతృప్తి చెందారు.
హాకీలో హతవిధీ...
భారత పురుషుల, మహిళల హాకీ జట్లు గోల్డ్‌కోస్ట్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. కాంస్య పతకం కోసం బరిలో దిగిన పురుషుల జట్టు 1–2తో, మహిళల జట్టు 0–6తో ఇంగ్లండ్ జట్ల చేతిలో ఓటమిపాలై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాయి.
‘పట్టు’ నిలిచె...
రెజ్లింగ్‌లోనూ భారత్ తమ ‘పట్టు’ నిలబెట్టుకుంది. శనివారం జరిగిన నాలుగు విభాగాల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకంతో మెరిసింది. నలుగురు రెజ్లర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ పోరులో వినేశ్ ఆడిన మూడు బౌట్‌లలోనూ అజేయంగా నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. వినేశ్ వరుసగా 3–1తో మిసిని జెనెసిస్ (నైజీరియా), 4–0తో రూపిందర్ కౌర్ (ఆస్ట్రేలియా), 4–1తో జెస్సికా మెక్‌డొనాల్డ్ (కెనడా)లపై విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండోసారి వినేశ్ స్వర్ణం గెలుచుకోవడం విశేషం. పురుషుల 125 కేజీల విభాగంలో సుమీత్ స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. ఐదుగురు రెజ్లర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన బౌట్‌లలో సుమీత్ తాను ఆడిన నాలుగు బౌట్‌లలోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. సుమిత్ వరుసగా 5–0తో క్లాడ్ బియాంగ్ (కామెరూన్)పై, 3–1తో కేరీ జార్విస్ (కెనడా)పై, 3–1తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై, 5–0తో సినివి బోల్టిక్ (నైజీరియా)పై గెలుపొందాడు. మరోవైపు మహిళల 62 కేజీల విభాగంలో సాక్షి మలిక్, పురుషుల 86 కేజీల విభాగంలో సోమ్‌వీర్ కాంస్య పతకాలు నెగ్గారు.
సిక్కి జోడీకి కాంస్యం
బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో తెలంగాణ క్రీడాకారిణి ఎన్. సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప కలిసి 21–19, 21–19 స్కోరుతో ఆస్ట్రేలియాకు చెందిన మపాసా సెత్యానా–సొమర్‌విలే గ్రాన్యాలపై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment