స్వర్ణ పతకాలతో భారత బ్యాడ్మింటన్ బృందం
నాలుగు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. 1978 నుంచి అందని ద్రాక్షగా ఊరిస్తున్న మిక్స్‌డ్ టీమ్ స్వర్ణం తొలిసారి భారత్ సొంతమైంది. తమ గురువు పుల్లెల గోపీచంద్ ఒకనాడు క్రీడాకారుడిగా, కోచ్‌గా ఇంతకాలం సాధించలేని టీమ్ స్వర్ణాన్ని ఆయన శిష్యులు నిజం చేశారు. దేశానికి బంగారు పతకం కానుకగా ఇచ్చారు.
గోల్డ్‌కోస్ట్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తాము అమేయ శక్తిగా ఎదుగుతున్నామని భారత క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్ వేదికగా చాటుకున్నారు. తమ ‘రాకెట్’ సత్తా ఏంటో నిరూపిస్తూ... మూడుసార్లు వరుస చాంపియన్‌గా నిలిచిన మలేసియాను బోల్తా కొట్టించి బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకున్నారు. సోమవారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3–1తో మలేసియాను ఓడించి ఈ క్రీడల చరిత్రలో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. 2006 మెల్‌బోర్న్, 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో గేమ్స్‌లో విజేతగా నిలిచిన మలేసియా ఈసారి మాత్రం భారత జోరు ముందు చేతులెత్తేసింది. ఇన్నాళ్లు బలహీనంగా ఉన్న డబుల్స్ విభాగం పటిష్టంగా మారడం భారత్ భవితను మార్చేసింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం 21–14, 15–21, 21–15తో పెంగ్ సూన్ చాన్–లియు యోంగ్ గో జోడీపై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–14తో దిగ్గజం లీ చోంగ్ వీని ఓడించి పెను సంచలనం సృష్టించాడు.
గతంలో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన శ్రీకాంత్ ఐదో ప్రయత్నంలో అద్భుత ఫలితం సాధించాడు. భారత్‌ను 2–0తో ఆధిక్యంలో నిలబెట్టాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 15–21, 20–22తో వి షెమ్ గో–వీ క్లాంగ్ తాన్ జంట చేతిలో ఓడిపోయింది. దాంతో భారత ఆధిక్యం 2–1కి తగ్గింది. అయితే నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 21–11, 19–21, 21–9తో సొనియా చెపై గెలుపొందడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణం సాధించింది. ఫలితం తేలిపోవడంతో మహిళల డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. చీలమండ గాయం మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో పీవీ సింధును టీమ్ విభాగం మ్యాచ్‌ల్లో ఆడించలేదు. సింగిల్స్‌లో పోటీపడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ సైనా గెలుపొందడం విశేషం. డబుల్స్‌లో 17 ఏళ్ల సాత్విక్ ఐదు విజయాలు సాధించి భారత్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.
2006 మెల్‌బోర్న్‌లో కాంస్యం, 2010 ఢిల్లీ గేమ్స్‌లో రజతం నెగ్గిన భారత్ ఈసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. సైనా విజయం ఖాయంకాగానే భారత జట్టులోని సభ్యులందరూ కోర్టులోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. శ్రీకాంత్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ప్రణవ్ చోప్రా, సైనా, సింధు, సిక్కి రెడ్డి, రుత్విక శివాని, అశ్విని పొన్నప్ప సభ్యులుగా ఉన్న భారత జట్టులో ప్రణయ్, అశ్విని, చిరాగ్, ప్రణవ్ మినహా మిగతా వారందరూ తెలుగు క్రీడాకారులు కావడం విశేషం. 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో పుల్లెల గోపీచంద్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు పురుషుల టీమ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. నాడు రజతంతో సరిపెట్టుకున్న గోపీచంద్‌కు ఈసారి ఆయన శిష్యులు స్వర్ణాన్ని అందివ్వడం విశేషం.
►లీ చోంగ్ వీ గొప్ప ఫామ్‌లో లేకపోయినా దిగ్గజ హోదా ఉన్న అతడిని ఏ దశలోనూ తక్కువ అంచనా వేయొద్దు. నేనూ అదే చేశాను.
నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాను. విజయం సులువుగా లభించదని నాకు ముందే తెలుసు. – శ్రీకాంత్
►మ్యాచ్ మధ్యలో ఏకాగ్రత కోల్పోయాను. కానీ కీలక దశలో పుంజుకున్నాను. నా విజయంతోనే స్వర్ణం ఖాయం కావాలని భావించాను. ఈ పతకం నాకెంతో ప్రత్యేకం. స్వర్ణం నెగ్గిన సంబరంలో సహచరులు రాత్రికి నిద్రపోరేమో? ముందు ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తా. తర్వాత సింగిల్స్‌పై దృష్టిసారిస్తాను. – సైనా
►గోల్డ్‌కోస్ట్‌లో భారత ‘గోల్డ్’ వేట కొనసాగుతోంది. అంచనాలను మించి రాణిస్తూ పోటీల ఐదో రోజు భారత క్రీడాకారులు మూడు స్వర్ణాలు సహా రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు గెల్చుకున్నారు. దాంతో పతకాల పట్టికలో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది.
►టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. 2006 కామన్వెల్త్ క్రీడల అనంతరం నేను జట్టుకు కోచ్‌గా వచ్చాను. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ మేం టీమ్ స్వర్ణం గెలవడంలో విఫలమయ్యాం. ఈసారి మరింత ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన డబుల్స్ విజయాలే ఇప్పుడు బంగారు పతకాన్ని అందించాయి. సాత్విక్ సాయిరాజ్, అశ్వినిలకు నా ప్రత్యేక అభినందనలు. వారి మ్యాచ్ వల్లే మెడల్ అవకాశాలు ఏర్పడ్డాయి. మిగతా పనిని శ్రీకాంత్ పూర్తి చేశాడు. లీ చోంగ్ వీతో మ్యాచ్ కోసం కూడా ఎన్నో ప్రణాళికలు రూపొందించాం. వీడియోలు చూసి శ్రీకాంత్ సిద్ధమయ్యాడు. మనం ప్రతీ మ్యాచ్‌పై కూడా ఆశలు పెట్టుకునే పరిస్థితి గతంతో పోలిస్తే వచ్చిన ప్రధాన మార్పు.
–‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్
Comments
Please login to add a commentAdd a comment