Kidambu Srikanth
-
భారత స్టార్ల శుభారంభం
సింగపూర్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీ సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లంతా శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్, సమీర్ వర్మ ప్రిక్వార్టర్స్ చేరారు. అయితే భమిడిపాటి సాయిప్రణీత్... టాప్ సీడ్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌లోనూ భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింధు 27 నిమిషాల్లోనే... మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సింధు సునాయాస విజయం సాధించింది. సింధు 21–9, 21–7తో ఇండోనేసియాకు చెందిన లియాని అలెసండ్ర మయినకిని చిత్తుగా ఓడించింది. కేవలం 27 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. మరో మ్యాచ్‌లో సైనా 21–16, 21–11తో యులియా యుసెఫిన్ సుశాంటో (ఇండోనేసియా)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–18తో సితికోమ్ తమసిన్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 11–21, 21–16, 21–18తో ఫ్రాన్స్‌కు చెందిన బ్రైస్ లెవెర్డెజ్పై గెలుపొందగా, సమీర్ వర్మ 21–14, 21–6తో సుపన్యు అవిహింగ్సనన్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ డ్రాకు చేరిన పారుపల్లి కశ్యప్ 21–19, 21–14తో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)పై విజయం సాధించాడు. పోరాడి ఓడిన సాయిప్రణీత్ భారత సహచరులంతా ముందంజ వేయగా సాయిప్రణీత్ ఆట తొలిరౌండ్లోనే ముగిసింది. అతను 21–19, 14–21, 20–22తో మొమొటా చేతిలో పోరాడి ఓడాడు. సిక్కి జోడీ గెలిచింది మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 21–18, 21–7తో భారత్‌కే చెందిన మనీష–అర్జున్ జోడీపై గెలుపొందింది. సౌరభ్ శర్మ–అనుష్క పారిఖ్ జోడీ 12–21, 12–21తో డెచపొల్ పువరనుక్రొ–తెరతనచయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి ద్వయం 13–21, 17–21తో డానీ క్రిస్నంటా– కియన్ హీన్ (సింగపూర్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. -
సింధు, శ్రీకాంత్‌లకు నిరాశ
కౌలాలంపూర్: గతేడాది అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు ఈ సీజన్లో మరోసారి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ సూపర్ వరల్డ్ టూర్–750 టోర్నమెంట్లో వీరిద్దరి పోరాటం సెమీఫైనల్స్‌లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో పీవీ సింధు 15–21, 21–19, 11–21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 13–21, 13–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. సింధు, శ్రీకాంత్‌లకు 9,800 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 71 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తై జు యింగ్‌తో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సింధుకు ఈసారీ అలాంటి ఫలితమే వచ్చింది. ఈ ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా కీలకదశలో సింధు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు మొమోటాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. -
ఎన్నాళ్లో వేచిన స్వర్ణం
నాలుగు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. 1978 నుంచి అందని ద్రాక్షగా ఊరిస్తున్న మిక్స్డ్ టీమ్ స్వర్ణం తొలిసారి భారత్ సొంతమైంది. తమ గురువు పుల్లెల గోపీచంద్ ఒకనాడు క్రీడాకారుడిగా, కోచ్‌గా ఇంతకాలం సాధించలేని టీమ్ స్వర్ణాన్ని ఆయన శిష్యులు నిజం చేశారు. దేశానికి బంగారు పతకం కానుకగా ఇచ్చారు. గోల్డ్‌కోస్ట్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తాము అమేయ శక్తిగా ఎదుగుతున్నామని భారత క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్ వేదికగా చాటుకున్నారు. తమ ‘రాకెట్’ సత్తా ఏంటో నిరూపిస్తూ... మూడుసార్లు వరుస చాంపియన్‌గా నిలిచిన మలేసియాను బోల్తా కొట్టించి బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకున్నారు. సోమవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3–1తో మలేసియాను ఓడించి ఈ క్రీడల చరిత్రలో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. 2006 మెల్బోర్న్, 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో గేమ్స్‌లో విజేతగా నిలిచిన మలేసియా ఈసారి మాత్రం భారత జోరు ముందు చేతులెత్తేసింది. ఇన్నాళ్లు బలహీనంగా ఉన్న డబుల్స్ విభాగం పటిష్టంగా మారడం భారత్ భవితను మార్చేసింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం 21–14, 15–21, 21–15తో పెంగ్ సూన్ చాన్–లియు యోంగ్ గో జోడీపై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–14తో దిగ్గజం లీ చోంగ్ వీని ఓడించి పెను సంచలనం సృష్టించాడు. గతంలో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన శ్రీకాంత్ ఐదో ప్రయత్నంలో అద్భుత ఫలితం సాధించాడు. భారత్‌ను 2–0తో ఆధిక్యంలో నిలబెట్టాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 15–21, 20–22తో వి షెమ్ గో–వీ క్లాంగ్ తాన్ జంట చేతిలో ఓడిపోయింది. దాంతో భారత ఆధిక్యం 2–1కి తగ్గింది. అయితే నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 21–11, 19–21, 21–9తో సొనియా చెపై గెలుపొందడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణం సాధించింది. ఫలితం తేలిపోవడంతో మహిళల డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. చీలమండ గాయం మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో పీవీ సింధును టీమ్ విభాగం మ్యాచ్‌ల్లో ఆడించలేదు. సింగిల్స్‌లో పోటీపడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ సైనా గెలుపొందడం విశేషం. డబుల్స్‌లో 17 ఏళ్ల సాత్విక్ ఐదు విజయాలు సాధించి భారత్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 2006 మెల్బోర్న్లో కాంస్యం, 2010 ఢిల్లీ గేమ్స్‌లో రజతం నెగ్గిన భారత్ ఈసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. సైనా విజయం ఖాయంకాగానే భారత జట్టులోని సభ్యులందరూ కోర్టులోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. శ్రీకాంత్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ప్రణవ్ చోప్రా, సైనా, సింధు, సిక్కి రెడ్డి, రుత్విక శివాని, అశ్విని పొన్నప్ప సభ్యులుగా ఉన్న భారత జట్టులో ప్రణయ్, అశ్విని, చిరాగ్, ప్రణవ్ మినహా మిగతా వారందరూ తెలుగు క్రీడాకారులు కావడం విశేషం. 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో పుల్లెల గోపీచంద్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు పురుషుల టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. నాడు రజతంతో సరిపెట్టుకున్న గోపీచంద్‌కు ఈసారి ఆయన శిష్యులు స్వర్ణాన్ని అందివ్వడం విశేషం. ►లీ చోంగ్ వీ గొప్ప ఫామ్‌లో లేకపోయినా దిగ్గజ హోదా ఉన్న అతడిని ఏ దశలోనూ తక్కువ అంచనా వేయొద్దు. నేనూ అదే చేశాను. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాను. విజయం సులువుగా లభించదని నాకు ముందే తెలుసు. – శ్రీకాంత్ ►మ్యాచ్ మధ్యలో ఏకాగ్రత కోల్పోయాను. కానీ కీలక దశలో పుంజుకున్నాను. నా విజయంతోనే స్వర్ణం ఖాయం కావాలని భావించాను. ఈ పతకం నాకెంతో ప్రత్యేకం. స్వర్ణం నెగ్గిన సంబరంలో సహచరులు రాత్రికి నిద్రపోరేమో? ముందు ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తా. తర్వాత సింగిల్స్‌పై దృష్టిసారిస్తాను. – సైనా ►గోల్డ్‌కోస్ట్‌లో భారత ‘గోల్డ్’ వేట కొనసాగుతోంది. అంచనాలను మించి రాణిస్తూ పోటీల ఐదో రోజు భారత క్రీడాకారులు మూడు స్వర్ణాలు సహా రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు గెల్చుకున్నారు. దాంతో పతకాల పట్టికలో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ►టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. 2006 కామన్వెల్త్ క్రీడల అనంతరం నేను జట్టుకు కోచ్‌గా వచ్చాను. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ మేం టీమ్ స్వర్ణం గెలవడంలో విఫలమయ్యాం. ఈసారి మరింత ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన డబుల్స్ విజయాలే ఇప్పుడు బంగారు పతకాన్ని అందించాయి. సాత్విక్ సాయిరాజ్, అశ్వినిలకు నా ప్రత్యేక అభినందనలు. వారి మ్యాచ్ వల్లే మెడల్ అవకాశాలు ఏర్పడ్డాయి. మిగతా పనిని శ్రీకాంత్ పూర్తి చేశాడు. లీ చోంగ్ వీతో మ్యాచ్ కోసం కూడా ఎన్నో ప్రణాళికలు రూపొందించాం. వీడియోలు చూసి శ్రీకాంత్ సిద్ధమయ్యాడు. మనం ప్రతీ మ్యాచ్‌పై కూడా ఆశలు పెట్టుకునే పరిస్థితి గతంతో పోలిస్తే వచ్చిన ప్రధాన మార్పు. –‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
ఆల్ ఇంగ్లండ్ వేటలో...
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో 1980లో ప్రకాశ్ పడుకొనే చాంపియన్... ఆ తర్వాత 21 ఏళ్ల విరామం తర్వాత విజేతగా పుల్లెల గోపీచంద్... ఆ అరుదైన విజయం దక్కి కూడా 17 సంవత్సరాలు అవుతోంది. ఈ మధ్యలో సైనా నెహ్వాల్ రెండో స్థానంలో నిలవడమే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అత్యుత్తమ ప్రదర్శన. బ్యాడ్మింటన్ చరిత్రలో అతి పురాతన టోర్నీగా గుర్తింపు ఉన్న ఈ మెగా ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణ ఉంది. గత కొన్నేళ్లలో మన షట్లర్లు ప్రపంచ వ్యాప్తంగా అన్ని పెద్ద స్థాయి టోర్నీలలో సత్తా చాటినా... ఆల్ ఇంగ్లండ్ మాత్రం వారికి కొరుకుడు పడలేదు. ఈ నెల 14 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగబోయే ఈ టోర్నీ కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ టోర్నీ బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్‌లో భారత్ తరఫున మను అత్రి–సుమీత్ రెడ్డి, సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి, మేఘన–పూర్వీ షా జోడీలు బరిలో నిలిచాయి. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జంట తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఒత్తిడి పెంచట్లేదు... ఆల్ ఇంగ్లండ్ టోర్నీ కోసం గత రెండు వారాలుగా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఇతర సూపర్ సిరీస్ టోర్నీలతో పోలిస్తే ఆల్ ఇంగ్లండ్‌కు అందరి దృష్టిలో క్రేజ్ ఉన్నా... ఆ పేరుతో ఆటగాళ్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో సన్నాహాలు జరిపి ఆడుతున్న తొలి టోర్నీ ఇదే. మంచి ఫలితాలు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ముఖ్యంగా సింధు, శ్రీకాంత్‌లకు మంచి అవకాశం ఉందని చెప్పగలను. సానుకూల ఫలితాలు ఆశిస్తున్నాం. అయితే డు ఆర్ డై లాంటి మాటలు చెప్పి ఆటగాళ్ళలో అనవసరంగా ఆందోళన పెంచాలని అనుకోవడం లేదు. ఆల్ ఇంగ్లండ్ తర్వాత వెంటనే కామన్వెల్త్ క్రీడలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా కూడా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాం. బీడబ్ల్యూఎఫ్ కొత్త షెడ్యూల్ కారణంగా మన ఆటగాళ్లకే ఎక్కువగా నష్టం జరగనుంది. 2018కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆటగాళ్లకు ఇప్పటికే అందించాను. కొత్త షెడ్యూల్ పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఏడాదికి 12 టోర్నీల్లో కచ్చితంగా ఆడాల్సిన స్థితిలో టోర్నీ, ప్రిపరేషన్ కలిపి కామన్వెల్త్, ఆసియా క్రీడలకు రెండు నెలల టైమ్ పోతుంది. బ్యాడ్మింటన్ ప్రపంచంలో భారత్‌కు, మలేసియాకు మాత్రమే ఇప్పుడు సమస్య ఉంది. దేశం తరఫున పతకం కోసం కాబట్టి మా ఆటగాళ్లెవరూ పెద్ద ఈవెంట్లకు దూరం కావడం లేదు. అందుకే ప్రతీ షట్లర్ గురించి నాకున్న అవగాహన ప్రకారం వారు ఏయే టోర్నీల్లో ఆడాలో, ఆడకూడదో స్పష్టంగా వారికి షెడ్యూల్ ఇచ్చేశాను. –పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ 1.15 మీటర్ల నిబంధనతో.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కొత్తగా రూపొందించిన ‘1.15 మీటర్ల సర్వీస్ నిబంధన’ను తొలిసారి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ లో ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం సర్వీస్ చేసే సమయంలో కోర్టు నుంచి 1.15 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే షటిల్‌ను ఉంచాలి. అది దాటితే ఫౌల్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు షట్లర్లు దాదాపు తమ నడుము భాగం వద్ద షటిల్ ఉంచి నేరుగా ప్రత్యర్థిపైకి దూసుకుపోయేలా వేగంగా సర్వీస్ చేస్తూ అదనపు ప్రయోజనం పొందుతున్నారు. నిబంధనల్లో సమానత్వం కోసం 1.15 మీటర్ల పరిమితిని విధించారు. పొడువైన ఆటగాళ్లకు ఇది సమస్యే. వారు బాగా కిందికి వంగాల్సి ఉంటుంది. భారత ఆటగాళ్లు ఫౌల్ కాకుండా ప్రత్యేక పరి కరంతో రోజూ దీనిపై ప్రాక్టీస్ చేస్తున్నారు. స్మాష్‌కు అవకాశం ఇవ్వడం లేదు... ఇటీవల నా ఆటలో కొన్ని మార్పులు చేయడం తప్పనిసరిగా మారిపోయింది. తై జు లాంటివాళ్లు తెలివిగా తప్పు దోవ పట్టించే షాట్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా జపాన్ క్రీడాకారిణులు కూడా సుదీర్ఘ ర్యాలీలపైనే దృష్టి పెట్టారు. గతంలో నా బలం స్మాష్‌ను సమర్థంగా ఉపయోగించుకునేదాన్ని. అయితే నా ప్రత్యర్థులు షటిల్‌ను ఏమాత్రం పైకి లేపకుండా ఆడుతూ స్మాష్‌కు అవకాశం ఇవ్వడం లేదు. దాంతో నేను కూడా కొత్తగా ఆలోచించాల్సి వచ్చింది. ఆల్ ఇంగ్లండ్‌లో గెలవాలనే నా కోరిక ఈ సారి తీరుతుందని ఆశిస్తున్నా. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు ఇటీవలే కొత్తగా సొంత ఫిజియోను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ముంబైకి చెందిన గాయత్రి నాతో కలిసి పని చేస్తోంది. గాయత్రి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు కూడా వచ్చింది. శరీరంపై అధిక భారం పడకుండా, అదే విధంగా ఎలాంటి లోపాలు లేకుండా ప్లానింగ్‌తో ఫిట్నెస్ ట్రైనింగ్ చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మానసికంగా కూడా మరింత దృఢంగా మారాను. – పీవీ సింధు పూర్తి ఫిట్నెస్తో ఉన్నా... గత ఏడాది నాకు అద్భుతంగా గడిచింది. ఈ సంవత్సరం ఇండియా ఓపెన్‌లో సానుకూల ఫలితం రాలేదు కానీ ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నా. ఫిట్నెస్ పరంగా ప్రస్తుతం 100 శాతం బాగున్నాను. ప్రత్యేకంగా సన్నాహాలు లేకపోయినా గత రెండు వారాలుగా బాగా శ్రమించాను. ఈ కష్టం ఫలితాల రూపంలోకి మారాలని కోరుకుంటున్నా. సింగిల్స్ కోచ్‌గా మంచి ఫలితాలు అందించిన ముల్యో జట్టుకు దూరం కావడంతో మరీ పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఆయన శిక్షణ సమయంలో కొన్ని రకాల ఆలోచనలు, ప్రత్యర్థిని ఎదుర్కొనే విషయంలో కొన్ని వ్యూహాలకు అలవాటు పడ్డాం. ఇప్పుడు మళ్లీ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే గోపీ సర్ ఉన్నారు కాబట్టి సమస్య లేదు. – కిడాంబి శ్రీకాంత్ -
మరో క్లీన్‌స్వీప్‌తో క్వార్టర్స్‌లోకి
అలోర్ సెటార్ (మలేసియా): బ్యాడ్మింటన్‌లో పసికూన జట్టు మాల్దీవులుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా రెండో విజయంతో గ్రూప్ ‘డి’ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇదే గ్రూప్ నుంచి ఇండోనేసియా కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం భారత్, ఇండోనేసియా జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘టాపర్’గా నిలుస్తుంది. ఫిలిప్పీన్స్‌పై కూడా 5–0తో నెగ్గిన భారత్ అదే జోరును మాల్దీవులుపై కనబరిచింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ‘బర్త్‌డే బాయ్’ కిడాంబి శ్రీకాంత్ 21–5, 21–6తో జయన్ హుస్సేన్‌పై; సాయిప్రణీత్ 21–10, 21–4తో అహ్మద్ నిబాల్పై; సమీర్ వర్మ 21–5, 21–1తో అర్సలాన్ అలీపై గెలిచారు. డబుల్స్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–8, 21–8తో జయన్ హుస్సేన్–షహీమ్ జోడీపై... అర్జున్–శ్లోక్ రామచంద్రన్ ద్వయం 21–2, 21–5తో అర్సలాన్ అలీ–అహ్మద్ నిబాల్ జోడీపై గెలిచాయి. -
పూర్తి ఫిట్నెస్తో ఉంటేనే...
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఈ ఏడాది సానుకూలంగా సాగింది. వచ్చే సంవత్సరం పలు పెద్ద టోర్నీలున్నాయి. వాటిలో రాణించి దేశానికి పతకాలు తేవాలంటే నేను వందశాతం ఫిట్నెస్తో ఉండటం కీలకం’ అని భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్... 2018లో పలు సూపర్ సిరీస్ టోర్నీలతోపాటు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్స్‌లో ఆడనున్నాడు. బుధవారం నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా న్యూఢిల్లీ అంచె మ్యాచ్‌లు మొదలవుతాయి. దాంట్లో భాగంగా సింధు (చెన్నై స్మాషర్స్), శ్రీకాంత్ (అవధ్ వారియర్స్) ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా 2017లో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు శ్రీకాంత్‌తో పాటు రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా సన్మానించింది. తమ అద్వితీయ ప్రదర్శనతో భారత ఖ్యాతిని పెంచుతున్న సింధు, శ్రీకాంత్‌లు దేశానికి గర్వకారణం అని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు. అంతకుముందు ఏపీ భవన్‌లోని బ్యాడ్మింటన్ కోర్టులో సింధు, శ్రీకాంత్‌లు కాసేపు షటిల్ ఆడి సందడి చేశారు. మరోవైపు సింధు మాట్లాడుతూ... కోర్టు ఉపరితలం నుంచి 1.15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే సర్వీస్ చేయాలన్న ప్రయోగాత్మక నిబంధనను ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో కాకుండా మరెప్పుడైనా ప్రవేశ పెట్టాల్సిందని వ్యాఖ్యానించింది. అయితే సాధన చేస్తే తాజా నిబంధన తనకేమంత ఇబ్బంది కాదని పేర్కొంది. ప్రముఖ ఆటగాళ్లంతా వచ్చే ఏడాది తప్పనిసరిగా 12 టోర్నీల్లో పాల్గొనాలన్న నిబంధనపై మాట్లాడుతూ... ‘ఇప్పటికే షెడ్యూల్ వచ్చేసింది. ఆడకుండా దాని గురించి చెప్పలేం. నేను మాత్రం కోచ్‌తో చర్చించి ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొనాలని భావిస్తున్నా’ అని సింధు పేర్కొంది. -
చెన్నై స్మాషర్స్‌కు షాక్
గువాహటి: పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్... మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో టాంగ్ చున్ మన్–క్రిస్టినా పెడర్సన్ ద్వయం అదరగొట్టడంతో... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్లో అవధ్ వారియర్స్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 4–3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో టాంగ్ చున్ మన్–క్రిస్టినా పెడర్సన్ (అవధ్) జంట 10–15, 15–5, 15–12తో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా అడ్కాక్ జోడీపై గెలిచి ఒక పాయింట్ సాధించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ (అవధ్) 15–12, 15–8తో డానియల్ ఫరీద్‌ను ఓడించాడు. దీనిని అవధ్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకోవడంతో అవధ్‌కు రెండు పాయింట్లు లభించాయి. దాంతో ఆ జట్టు 3–0తో ముందంజ వేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (అవధ్) 15–12, 15–13తో లెవెర్డెజ్పై గెలవడంతో అవధ్ జట్టు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్–యోంగ్ లీ జంట 15–11, 10–15, 15–11తో హెండ్రా సెతియవన్–చిన్ చుంగ్ (అవధ్) జోడీపై గెలిచింది. దాంతో చెన్నై ఖాతాలో తొలి పాయింట్ చేరింది. చెన్నై స్టార్ ప్లేయర్ పీవీ సింధుతో మహిళల సింగిల్స్‌లో అవధ్ వారియర్స్ తరఫున తలపడాల్సిన సైనా నెహ్వాల్ చీలమండ గాయంతో వైదొలిగింది. సైనా స్థానంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు బరిలోకి దిగింది. సింధు 15–10, 15–9తో ఉత్తేజితపై గెలిచింది. ట్రంప్ మ్యాచ్‌లో నెగ్గినందుకు చెన్నైకు రెండు పాయింట్లు లభించాయి. దాంతో ఓవరాల్‌గా అవధ్ 4–3తో చెన్నైను ఓడించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
టైటిల్‌పై సింధు, శ్రీకాంత్ ఆశలు
-
ఫైనల్ సవాల్
ఏడాది మొత్తం ప్రదర్శించిన ఆట ఒక ఎత్తు... ప్రతీ మ్యాచ్ ఒక పెద్ద టోర్నీ ఫైనల్‌లాగే సాగే ఈ టోర్నీ ఒక ఎత్తు... సంవత్సరం మొత్తం సాగించిన జోరును మరో టోర్నీలో కొనసాగించి సీజన్‌ను అద్భుతంగా ముగించేందుకు టాప్ షట్లర్లందరికీ ఇది మరో అవకాశం. డజను సూపర్ సిరీస్ టోర్నీలలో పెద్దా, చిన్న ప్రత్యర్థులతో తలపడి తుది పోరుకు అర్హత సాధించినవారు మరో ఐదు రోజుల పాటు సమాన స్థాయి ఆటగాళ్లను ఎదుర్కొని సత్తా చాటేందుకు ఇది తగిన వేదిక. ప్రపంచ బ్యాడ్మింటన్‌కు పెద్దన్నలాంటి సూపర్ సిరీస్ ఫైనల్స్ పోటీల సవాల్‌కు టాప్–8 ఆటగాళ్లంతా సన్నద్ధమయ్యారు. ఈ పోరులో తుది విజయం ఎవరిదో వేచి చూడాలి. దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: బ్యాడ్మింటన్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఇక్కడి హమ్దాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం టాప్–8 స్థానాల్లో ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇందులో పాల్గొంటున్నారు. ఫలితంగా ప్రతీ మ్యాచ్ హోరాహోరీగా, రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఆటగాళ్లను రెండు గ్రూప్‌లలో విభజించారు. ఒక్కో గ్రూప్‌లో తమ ముగ్గురు ప్రత్యర్థులతో షట్లర్లు తలపడతారు. మూడు మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలిచినవారు సెమీస్‌కు అర్హత సాధిస్తారు. పాయింట్లు సమమైతే గెలిచిన గేమ్‌లు, ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాల తర్వాత ఇక్కడ కూడా విజేతగా నిలవాలని సింధు పట్టుదలగా ఉండగా... ఈ ఏడాది రికార్డు స్థాయిలో నాలుగు సూపర్ సిరీస్ టోర్నీలు గెలిచిన శ్రీకాంత్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న చైనా స్టార్ ప్లేయర్ చెన్ లాంగ్ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో గ్రూప్ ‘ఎ’లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే పోటీ ఉన్నారు. సింధుకు సులువే... సింధు తొలి మ్యాచ్‌లో చైనాకు చెందిన హి బింగ్జియావోతో తలపడుతుంది. ప్రస్తుతం సింధు 3వ ర్యాంక్‌లో, బింగియావో 9వ ర్యాంక్‌లో ఉన్నారు. వీరిద్దరి మధ్య 9 మ్యాచ్‌లు జరగ్గా సింధు 4 గెలిచి, 5 ఓడింది. ఈ ఏడాది ఆరంభంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓడిన సింధు... ఇటీవల కొరియా ఓపెన్‌లో ఇదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. సింధు రెండు సూపర్ సిరీస్ విజయాలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి ఫామ్‌లో ఉండగా, బింగ్జియావో 2017లో ఒక్క జపాన్ ఓపెన్‌లో మాత్రమే రన్నరప్‌గా నిలవగలిగింది. కాబట్టి పరిస్థితి సింధుకే అనుకూలంగా కనిపిస్తోంది. శ్రీకాంత్‌కు పరీక్ష... కిడాంబి శ్రీకాంత్ మాత్రం తొలి మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్, సూపర్ సిరీస్ ఫైనల్స్ డిఫెండింగ్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ పోటాపోటీగా సాగే అవకాశం ఉంది. ఇందులో గెలిస్తే గ్రూప్‌లో మిగతా ఇద్దరిని ఓడించడం శ్రీకాంత్‌కు కష్టం కాకపోవచ్చు. ఈ సంవత్సరం రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన విక్టర్ ఒకదాంట్లో రన్నరప్‌గా నిలిచాడు. అదే శ్రీకాంత్ నాలుగు టైటిల్స్‌తో సత్తా చాటాడు. వీరిద్దరి మధ్య రికార్డు 3–3తో సమంగా ఉంది. అయితే 2017లో వరుసగా రెండు సార్లు ఓడిన తర్వాత విక్టర్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి శ్రీకాంత్ దెబ్బ తీశాడు. 12 టోర్నీల ద్వారా... ఏడాదిలో జరిగే 12 సూపర్ సిరీస్ టోర్నీల్లో ఆటగాళ్లు చూపిన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఇక్కడ సీడింగ్స్‌ను ఖాయం చేస్తారు. వీటిలో ఐదు సూపర్ సిరీస్ ప్రీమియర్ ఈవెంట్లు, మరో ఏడు సూపర్ సిరీస్ ఈవెంట్లు ఉన్నాయి. సూపర్ సిరీస్ టోర్నీలలో ప్రదర్శన మాత్రమే చూస్తారు కాబట్టి అర్హత సాధించేందుకు వరల్డ్ ర్యాంక్ ఇక్కడ వర్తించదు. ఫైనల్స్ కోసం మరో ర్యాంక్‌ను ఇస్తారు. సన్ వాన్ హో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంక్‌లో ఉన్నా... ఇక్కడ అతను నంబర్‌వన్. విక్టర్ అక్సెల్సన్ ర్యాంక్ 8 కాగా... శ్రీకాంత్ దుబాయ్ ర్యాంకింగ్ 2 (వరల్డ్ ర్యాంక్ 4). అయితే ఈ టోర్నీలో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు ఆటగాళ్లకు లేదా రెండు జోడీలకు మాత్రమే అవకాశం లభిస్తుంది. టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ బ్యాడ్మింటన్‌లో అత్యధికంగా 10 లక్షల డాలర్లు (రూ. దాదాపు 6 కోట్ల 46 లక్షలు) కావడం విశేషం. సింగిల్స్ విజేతలకు 80 వేల డాలర్ల (రూ. 51 లక్షలు) చొప్పున లభిస్తాయి. ఏ గ్రూప్‌లో ఎవరంటే... మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’: పీవీ సింధు (భారత్), అకానె యామగుచి (జపాన్), సయాకా సాటో (జపాన్), హీ బింగ్జియావో (చైనా). గ్రూప్ ‘బి’: తై జు యింగ్ (చైనీస్ తైపీ), సుంగ్ జీ హున్ (కొరియా), రచనోక్ (థాయ్‌లాండ్), చెన్ యుఫె (చైనా). పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’: సన్ వాన్ హో (కొరియా), లీ చోంగ్ వీ (మలేసియా), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్). గ్రూప్ ‘బి’: కిడాంబి శ్రీకాంత్ (భారత్), అక్సెల్సన్ (డెన్మార్క్), చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ), షి యుకి (చైనా). అత్యుత్తమ ప్రదర్శన సైనా, జ్వాలదే... 2008 నుంచి జరుగుతోన్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన రజత పతకమే. 2011లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా... 2009లో మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు జంట రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు గెలిచారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నాలుగుసార్లు సెమీఫైనల్‌కు (2008, 2009, 2012, 2014) చేరుకోగా... రెండుసార్లు లీగ్ దశలో (2013, 2015) నిష్క్రమించింది. గతేడాది సింధు తొలిసారి ఈ టోర్నీకి అర్హత సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ మూడోసారి ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నాడు. 2014లో సెమీస్‌కు చేరిన అతను 2015లో లీగ్ దశలో వెనుదిరిగాడు. గతేడాది శ్రీకాంత్ అర్హత పొందలేకపోయాడు. ►నేటి సాయంత్రం గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఐదింటిలో గెలిస్తే! ఈసారి వదలను!
ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన జోరులో ఒకరు... రెండు సూపర్ సిరీస్ విజయాలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం ఇచ్చిన ఉత్సాహంతో మరొకరు... సంవత్సరం ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి ఇప్పుడు దానికి మరో చక్కటి ముగింపు ఇవ్వాలనే ప్రయత్నం ఇద్దరిదీ. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సత్తా చాటేందుకు భారత టాప్ షట్లర్లు, తెలుగు తేజాలు కిడాంబి శ్రీకాంత్ , పీవీ సింధు సన్నద్ధమయ్యారు. టాప్–8 మంది ఆటగాళ్లు మాత్రమే తలపడే ఈ టోర్నీ రేపటి నుంచి ఆదివారం వరకు జరుగుతుంది. సోమవారం టోర్నీ ‘డ్రా’ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో తమ ఇటీవలి ప్రదర్శన, టోర్నీలో విజయావకాశాలపై వారిద్దరితో దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది ప్రత్యేక ఇంటర్వ్యూ... కెరీర్లో 2017 ముద్ర... ఆటగాడిగా ఇన్నేళ్లలో ఇంత గొప్ప సంవత్సరం రాలేదు. చాలా సంతోషంగా ఉంది అనడం చిన్న మాట అవుతుంది. ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్... ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుసగా సూపర్ సిరీస్ టైటిల్స్ సాధిస్తూ పోవడం గొప్పగా అనిపించింది. రెండేసి వారాల చొప్పున వరుసగా రెండు టైటిళ్లు సాధించడం కూడా అద్భుతంలా సాగింది. నా ఆటను మరింత మెరుగుపర్చడంతో పాటు గోపీ సర్ ప్రణాళికల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పగలను. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఓడినా... అది మన సాయిప్రణీత్తోనే కాబట్టి ఎక్కువగా బాధించలేదు. సూపర్ సిరీస్ ఫైనల్స్ సన్నద్ధత, విజయావకాశాలపై... సర్క్యూట్లో పెద్ద టోర్నీగా ఫైనల్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానికి అనుగుణంగానే గట్టిగా సిద్ధమయ్యాను. గత రెండు టోర్నీలు ఆడకపోవడం వల్ల కూడా వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టి పెట్టేందుకు తగిన సమయం లభించింది. ఒక్క మాట మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ నాలుగు సూపర్ సిరీస్ టోర్నీల విజయాలు ఇచ్చిన జోష్ మాత్రం తప్పనిసరిగా నా ఆటలో కనిపిస్తుంది. నా ఆటతీరు (యాటిట్యూడ్)లో మార్పు, షాట్ల ఎంపికలో కూడా ఆ మార్పును చూడవచ్చు. అదే ఉత్సాహంతో ఫైనల్స్‌లో కూడా ఆడగలనని నమ్ముతున్నా. ‘డ్రా’ కఠినంగా అనిపిస్తుందా... బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌లో సులువైన డ్రా గురించి ఆలోచించవద్దు. తొలి మ్యాచ్‌లోనే అక్సెల్సన్తో తలపడుతున్నాను. ఇది ఒకందుకు మంచిదే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లీగ్ దశలో తర్వాతి రెండు మ్యాచ్‌లకు కూడా ఊపు కొనసాగుతుంది. షి యుఖితో ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో గెలిచాను. అక్సెల్సన్ను డెన్మార్క్‌లో ఓడించాను. చౌ టీన్‌తో ఒక్కసారే తలపడ్డాను. అయితే ప్రత్యర్థులు ఎవరనేదానికంటే నా ఆటనే నేను ఎక్కువగా నమ్ముకున్నాను. సరిగ్గా చెప్పాలంటే ఇంత బాగా సాగిన సంవత్సరంలో మరో ఐదు మంచి రోజులు చాలు. ఈ ఐదు రోజుల్లో జరిగే ఐదు మ్యాచ్‌లను గెలిస్తే తిరుగుండదు. ఫిట్నెస్ సమస్య తగ్గినట్లేనా... ఇప్పుడు 100 శాతం ఫిట్‌గా ఉన్నాను. తొడ గాయం తగ్గిపోయింది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. నిజానికి హాంకాంగ్ ఓపెన్‌కు కూడా నేను ఆడగల స్థితిలోనే ఉన్నాను. కానీ పెద్ద టోర్నీ ముందుంది కాబట్టి రిస్క్ చేయదల్చుకోలేదు. కానీ నంబర్‌వన్ అవకాశం చేజారిందిగా... అలా ఏమీ అనుకోవడం లేదు. నంబర్‌వన్ కోసం చైనా ఓపెన్ ఆడితే పొరపాటున గాయం పెరిగి అది మరింత సమస్యగా మారిపోయేదేమో. అయితే ర్యాంకింగ్‌ను దృష్టిలో పెట్టుకొని, దాని గురించి ఆలోచిస్తూ టోర్నీలు ఆడరాదని నిర్ణయించుకున్నాము. విజయాలు సాధిస్తే ర్యాంక్ ఎలాగూ వస్తుంది. అయినా బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ గెలిస్తే నేను నంబర్‌వన్ అవుతాను కదా. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంపై... నన్ను నియమిస్తున్నట్లు ప్రకటన మాత్రమే వచ్చింది. ఇంకా అధికారికంగా ఉత్తర్వులు అందుకోలేదు. అప్పుడే బాధ్యతల గురించి ఆలోచిస్తా. అయితే ఇలా ఎంపిక కావడం మాత్రం సంతోషంగా ఉంది. ఇద్దరికీ సత్తా ఉంది. సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు సింధు, శ్రీకాంత్ అన్ని విధాలా సన్నద్ధమై వచ్చారు. వారి తాజా ఫామ్, ప్రత్యర్థులను బట్టి చూస్తే ముందైతే సెమీఫైనల్ కచ్చితంగా చేరగలరని నమ్ముతున్నాను. ‘డ్రా’ గురించి ఆందోళన అనవసరం. ఇలాంటి పెద్ద టోర్నీలో అది సహజం. గతంలో అనేక మంది బలమైన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించిన రికార్డు వీరిద్దరికీ ఉంది. 2017లో మనం అలాంటి మ్యాచ్‌లు చాలా చూశాం. కాబట్టి భారత షట్లర్లు ఇద్దరికీ ఫైనల్స్ గెలిచే సామర్థ్యం ఉందని భావిస్తున్నా. – పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఒకే గ్రూప్‌లో శ్రీకాంత్, అక్సెల్సన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్, వరల్డ్ చాంపియన్, నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో తలపడనున్నాడు. వీరిద్దరూ గ్రూప్ ‘బి’లో ఉన్నారు. ఇదే గ్రూప్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ), ఎనిమిదో ర్యాంకర్ షి యుఖి (చైనా) ఉన్నారు. గ్రూప్ ‘ఎ’లో స్టార్ ఆటగాళ్లు చెన్ లాంగ్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), సన్ వాన్ హో (కొరియా), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) తలపడుతున్నారు. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’లో హి బింగ్ జియావో (చైనా)ను మొదటి మ్యాచ్‌లో పీవీ సింధు ఎదుర్కొంటుంది. ఈ గ్రూప్‌లోనే సయాకా సాటో, అకానె యామగుచి (జపాన్) ఉన్నారు. గ్రూప్ ‘బి’లో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో పాటు ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), సుంగ్ జీ హున్ (కొరియా), చెన్ యుఫె (చైనా) ఉన్నారు. ఒక్కో గ్రూప్‌లో ప్లేయర్ తమ గ్రూప్‌లోని మిగతా ముగ్గురితో తలపడతారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీస్‌కు చేరతారు. ఈసారి వదలను 2017లో ఆటతీరుపై... గత ఏడాది రియో ఒలింపిక్స్ రజతం అంతులేని ఆనందాన్ని మిగిల్చితే ఈ సంవత్సరం కూడా బాగా సాగింది. ఇండియన్ ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలుచుకోగలిగాను. హాంకాంగ్‌లో రన్నరప్‌గా నిలిచాను. డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్ పరాజయం కూడా ఉంది. కానీ వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్లో పరాజయం మాత్రం చాలా కాలం బాధించింది. అంత గొప్ప మ్యాచ్ ఆడి ఓడిపోయాను. అయితే నా కాంస్యాన్ని రజతంగా మార్చుకోగలగడం ఆనందమే. చాలా కాలం తర్వాత నేషనల్స్‌లో కూడా బరిలోకి దిగడం చెప్పుకోదగ్గ విశేషం. రేపటి నుంచి జరిగే ఫైనల్స్‌పై... ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్స్ నా ఖాతాలో ఉన్నాయి. ఇక బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఇది అతి పెద్ద టోర్నీ కాబట్టి కచ్చితంగా విజేతగా నిలవాలని పట్టుదలగా ఉన్నా. 2016లో బాగానే ఆడినా సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాను. ఈసారి అవకాశం పోగొట్టుకోను. అంతకంటే మెరుగ్గా ఆడగలనన్న విశ్వాసం ఉంది. తగినంత సమయం దొరకడంతో చాలా బాగా సన్నద్ధమయ్యా. కలిసొచ్చిన ఈ సంవత్సరాన్ని మరింత సంతోషంగా ముగించాలని భావిస్తున్నా. ‘డ్రా’ గురించి... ప్రపంచంలో టాప్–8 షట్లర్లు మాత్రమే బరిలోకి దిగుతారు కాబట్టి డ్రా సులువా, కఠినమా అనే విషయంపై అతిగా ఆలోచించలేదు. ఇతర టోర్నీలలో ఆరంభ మ్యాచ్‌లు కాస్త సులువుగా ఉంటాయి. ఇక్కడ ఆ అవకాశం లేదు. పైగా పాయింట్లు సమంగా ఉన్నప్పుడు గెలిచిన గేమ్‌లు, సాధించిన పాయింట్లు కూడా పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి గెలుపు మాత్రమే కాదు... ప్రతీ పాయింట్, ఎంత తేడాతో గెలిచామన్నది కూడా ముఖ్యం. నా తొలి లక్ష్యం సెమీస్ చేరుకోవడమే. ఫిట్‌నెస్‌పై... ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కంటే మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పగలను. ఇటీవల బ్యాడ్మింటన్‌లో సుదీర్ఘ సమయం మ్యాచ్‌లు సాగుతున్నాయి. శారీరకంగా మేం చేసే శ్రమ దీనికి సరిపోతుంది. కానీ మానసికంగా అంత సేపు ఓపిగ్గా, ఏకాగ్రతతో ఉండటం కష్టమైపోయింది. పాయింట్ కచ్చితంగా వస్తుందని భావించిన చోట పొరపాటు జరిగితే అసహనం పెరిగిపోతుంది. అది చివరకు ఒక్క పాయింట్ నుంచి మ్యాచ్‌పై ప్రభావం చూపించే వరకు వెళుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీనిపై నేను, గోపీ సర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కోర్టులో ఓపిగ్గా ఆడే తత్వం ఇక ముందు నానుంచి కనిపిస్తుంది. వచ్చే ఏడాది బిజీ షెడ్యూల్‌పై... టాప్ ప్లేయర్లు 12 టోర్నీల్లో పాల్గొనాలంటూ కొత్తగా తెచ్చిన నిబంధన ఎలా అమలవుతుందో చెప్పలేను. ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. దీనిపై కోచ్‌తో చర్చించి ప్లానింగ్ చేసుకోవచ్చు. భారత్‌కు సంబంధించి 2018లో ఆసియా, కామన్వెల్త్ క్రీడలు కూడా ఉన్నాయి కాబట్టి అది అదనపు సమస్యగా మారవచ్చు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతల నిర్వహణపై... కొత్తగా ఉంది. ఎక్కువ రోజులు ఆఫీస్‌కు ఏమీ వెళ్లలేదు. కానీ బాధ్యతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం సెలవులో ఉన్నాను. టోర్నీలు ముగిశాక మళ్లీ వెళతాను. -
శ్రీకాంత్ ఆశలు ఆవిరి..
-
శ్రీకాంత్ ఆశలు ఆవిరి..
రియోలో మరో భారత ఆశాకిరణం పోరాటం ముగిసింది. ఒలింపిక్ పతకం సాధించాలన్న భారత యువ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. పోరాటపటిమ ప్రదర్శించినా చైనా అడ్డుగోడను దాటడంలో విఫలమయ్యాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 స్కోరుతో చైనా ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. దీంతో భారత అభిమానులకు మరోసారి నిరాశతప్పలేదు. శ్రీకాంత్ పతకం వేటలో విఫలమైనా, తన ఆటతీరుతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తొలి గేమ్‌లో ఆద్యంతం లిన్ డాన్‌దే ఆధిక్యం. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్‌లో శ్రీకాంత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. దీంతో లిన్ డాన్ 21-6తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా రెండో గేమ్‌లో శ్రీకాంత్ అనూహ్యంగా పుంజుకుని పోరాటపటిమ ప్రదర్శించాడు. ఎటాకింగ్ గేమ్ ఆడుతూ లిన్ డాన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. రెండో గేమ్ ఆరంభం నుంచే శ్రీకాంత్ దూసుకెళ్తూ ప్రత్యర్థికి ఎక్కడా దొరకలేదు. తెలుగుతేజం రెండో గేమ్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌ను 1-1తో సమం చేసి విజయావకాశాలను కాపాడుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్ తొలి రెండు గేమ్‌లకు భిన్నంగా ఆద్యంతం హోరాహోరీగా, ఉత్కంఠగా సాగింది. శ్రీకాంత్, లిన్ డాన్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. ఆరంభంలో లిన్ డాన్ ముందంజలో ఉన్నా, శ్రీకాంత్ వెంటనే పుంజుకుని నిలువరించాడు. కాగా ఈ గేమ్ ఓ దశలో 13-13, 14-14 స్కోర్లతో సమమైంది. ఆ తర్వాత లిన్ 16-14, 19-16తో ముందంజ వేయడంతో భారత అభిమానుల్లో ఉత్కంఠ తీవ్రమైంది. చివర్లో శ్రీకాంత్ వెనుకబడగా, లిన్ అదే జోరు సాగిస్తూ 21-18తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. -
ఈ భారీ అడ్డు 'గోడ'ను శ్రీకాంత్ దాటుతాడా?
కిదంబి శ్రీకాంత్ ముందు ఇప్పుడో ఓ భారీ సవాల్ ఉంది. రియో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశించాలంటే అతను.. చైనా ప్రత్యర్థి లిన్ డాన్‌ను ఓడించాలి. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించి.. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న లిన్ డాన్ ఓడించడమంటే మాటలు కాదు. శ్రీకాంత్ ఇప్పటివరకు మూడుసార్లు లిన్ డాన్‌తో తలపడ్డాడు. రెండుసార్లు ఓడిపోయాడు. కానీ, ఒక్కసారి గెలిచాడు. అది మామూలుగా కాదు లిన్ డాన్‌ను అతని సొంత గడ్డపై.. 2014లో చైనా ఓపెన్ సీరిస్ ఫైనల్లో చిత్తు చేశాడు. చైనా బ్యాడ్మింటన్ స్టాన్ లిన్ డాన్ అంటే ప్రత్యర్థులు హడలిపోతారు. ఒలింపిక్స్‌లో అతను ఎప్పుడూ ఓడిపోలేదు. సొంత గడ్డపై కూడా పరాజయం రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదని చెప్తారు. కానీ, సొంత గడ్డపైనే లిన్ డాన్‌కు ఓటమిని రుచి చూపించాడు శ్రీకాంత్. పక్కా ఫామ్‌తో ఒలింపిక్స్ బరిలోకి దిగాడు డాన్. 32 ఏళ్ల వయస్సున్న ఈ ఆటగాడికి ఇది చివరి ఒలింపిక్స్ అయ్యే అవకాశముంది. కాబట్టి రియోలో అతన్ని ఓడించడం అంటే మాటలు కాదు. కానీ, 23 ఏళ్ల మన శ్రీకాంత్ అతన్ని చూసి బెదిరిపోవడం లేదు. సొంతగడ్డపై అతన్ని ఓడించలేమన్న అభిప్రాయాన్ని తుత్తునియలు చేసిన శ్రీకాంత్ ఇప్పుడు ఒలింపిక్ వేదికపైనా అతనికి పరాజయాన్ని రుచి చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇందుకోసం నెట్లో చెమటలు కక్కేలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నానని చెప్పిన శ్రీకాంత్.. అతన్ని ఓడించడం అంత సులువు కాదు.. ఇందుకు చివరివరకు పోరాడాల్సి ఉంటుందనే విషయాన్ని పదేపదే మననం చేసుకుంటున్నానని తెలిపాడు. 'నేను అతన్ని ఓడించగలనన్న ధీమా నాకుంది. నేను అతి ఆత్మవిశ్వాసంతో ఏమీ లేను కానీ, నాకూ అవకాశాలు ఉన్నాయి' అని శ్రీకాంత్ మీడియాతో చెప్పాడు. 'ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు బాగా ఆడటం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతేకాకుండా అతని కోసం మేం ఓ వ్యూహాన్ని సిద్ధం చేశాం' అని శ్రీకాంత్ తెలిపాడు.