శ్రీకాంత్ ఆశలు ఆవిరి..
రియోలో మరో భారత ఆశాకిరణం పోరాటం ముగిసింది. ఒలింపిక్ పతకం సాధించాలన్న భారత యువ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. పోరాటపటిమ ప్రదర్శించినా చైనా అడ్డుగోడను దాటడంలో విఫలమయ్యాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 స్కోరుతో చైనా ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. దీంతో భారత అభిమానులకు మరోసారి నిరాశతప్పలేదు. శ్రీకాంత్ పతకం వేటలో విఫలమైనా, తన ఆటతీరుతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
తొలి గేమ్లో ఆద్యంతం లిన్ డాన్దే ఆధిక్యం. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్లో శ్రీకాంత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. దీంతో లిన్ డాన్ 21-6తో తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. కాగా రెండో గేమ్లో శ్రీకాంత్ అనూహ్యంగా పుంజుకుని పోరాటపటిమ ప్రదర్శించాడు. ఎటాకింగ్ గేమ్ ఆడుతూ లిన్ డాన్ను ముప్పుతిప్పలు పెట్టాడు. రెండో గేమ్ ఆరంభం నుంచే శ్రీకాంత్ దూసుకెళ్తూ ప్రత్యర్థికి ఎక్కడా దొరకలేదు. తెలుగుతేజం రెండో గేమ్ను సునాయాసంగా కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ను 1-1తో సమం చేసి విజయావకాశాలను కాపాడుకున్నాడు.
నిర్ణాయక మూడో గేమ్ తొలి రెండు గేమ్లకు భిన్నంగా ఆద్యంతం హోరాహోరీగా, ఉత్కంఠగా సాగింది. శ్రీకాంత్, లిన్ డాన్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. ఆరంభంలో లిన్ డాన్ ముందంజలో ఉన్నా, శ్రీకాంత్ వెంటనే పుంజుకుని నిలువరించాడు. కాగా ఈ గేమ్ ఓ దశలో 13-13, 14-14 స్కోర్లతో సమమైంది. ఆ తర్వాత లిన్ 16-14, 19-16తో ముందంజ వేయడంతో భారత అభిమానుల్లో ఉత్కంఠ తీవ్రమైంది. చివర్లో శ్రీకాంత్ వెనుకబడగా, లిన్ అదే జోరు సాగిస్తూ 21-18తో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.