
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో 1980లో ప్రకాశ్ పడుకొనే చాంపియన్... ఆ తర్వాత 21 ఏళ్ల విరామం తర్వాత విజేతగా పుల్లెల గోపీచంద్... ఆ అరుదైన విజయం దక్కి కూడా 17 సంవత్సరాలు అవుతోంది. ఈ మధ్యలో సైనా నెహ్వాల్ రెండో స్థానంలో నిలవడమే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అత్యుత్తమ ప్రదర్శన. బ్యాడ్మింటన్ చరిత్రలో అతి పురాతన టోర్నీగా గుర్తింపు ఉన్న ఈ మెగా ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణ ఉంది. గత కొన్నేళ్లలో మన షట్లర్లు ప్రపంచ వ్యాప్తంగా అన్ని పెద్ద స్థాయి టోర్నీలలో సత్తా చాటినా... ఆల్ ఇంగ్లండ్ మాత్రం వారికి కొరుకుడు పడలేదు. ఈ నెల 14 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగబోయే ఈ టోర్నీ కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ టోర్నీ బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్‌లో భారత్ తరఫున మను అత్రి–సుమీత్ రెడ్డి, సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి, మేఘన–పూర్వీ షా జోడీలు బరిలో నిలిచాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జంట తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఒత్తిడి పెంచట్లేదు...
ఆల్ ఇంగ్లండ్ టోర్నీ కోసం గత రెండు వారాలుగా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఇతర సూపర్ సిరీస్ టోర్నీలతో పోలిస్తే ఆల్ ఇంగ్లండ్‌కు అందరి దృష్టిలో క్రేజ్ ఉన్నా... ఆ పేరుతో ఆటగాళ్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో సన్నాహాలు జరిపి ఆడుతున్న తొలి టోర్నీ ఇదే. మంచి ఫలితాలు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ముఖ్యంగా సింధు, శ్రీకాంత్‌లకు మంచి అవకాశం ఉందని చెప్పగలను. సానుకూల ఫలితాలు ఆశిస్తున్నాం. అయితే డు ఆర్ డై లాంటి మాటలు చెప్పి ఆటగాళ్ళలో అనవసరంగా ఆందోళన పెంచాలని అనుకోవడం లేదు. ఆల్ ఇంగ్లండ్ తర్వాత వెంటనే కామన్వెల్త్ క్రీడలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా కూడా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాం. బీడబ్ల్యూఎఫ్ కొత్త షెడ్యూల్ కారణంగా మన ఆటగాళ్లకే ఎక్కువగా నష్టం జరగనుంది. 2018కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆటగాళ్లకు ఇప్పటికే అందించాను. కొత్త షెడ్యూల్ పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఏడాదికి 12 టోర్నీల్లో కచ్చితంగా ఆడాల్సిన స్థితిలో టోర్నీ, ప్రిపరేషన్ కలిపి కామన్వెల్త్, ఆసియా క్రీడలకు రెండు నెలల టైమ్ పోతుంది. బ్యాడ్మింటన్ ప్రపంచంలో భారత్‌కు, మలేసియాకు మాత్రమే ఇప్పుడు సమస్య ఉంది. దేశం తరఫున పతకం కోసం కాబట్టి మా ఆటగాళ్లెవరూ పెద్ద ఈవెంట్లకు దూరం కావడం లేదు. అందుకే ప్రతీ షట్లర్ గురించి నాకున్న అవగాహన ప్రకారం వారు ఏయే టోర్నీల్లో ఆడాలో, ఆడకూడదో స్పష్టంగా వారికి షెడ్యూల్ ఇచ్చేశాను. –పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్
1.15 మీటర్ల నిబంధనతో..
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కొత్తగా రూపొందించిన ‘1.15 మీటర్ల సర్వీస్ నిబంధన’ను తొలిసారి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ లో ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం సర్వీస్ చేసే సమయంలో కోర్టు నుంచి 1.15 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే షటిల్‌ను ఉంచాలి. అది దాటితే ఫౌల్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు షట్లర్లు దాదాపు తమ నడుము భాగం వద్ద షటిల్ ఉంచి నేరుగా ప్రత్యర్థిపైకి దూసుకుపోయేలా వేగంగా సర్వీస్ చేస్తూ అదనపు ప్రయోజనం పొందుతున్నారు. నిబంధనల్లో సమానత్వం కోసం 1.15 మీటర్ల పరిమితిని విధించారు. పొడువైన ఆటగాళ్లకు ఇది సమస్యే. వారు బాగా కిందికి వంగాల్సి ఉంటుంది. భారత ఆటగాళ్లు ఫౌల్ కాకుండా ప్రత్యేక పరి కరంతో రోజూ దీనిపై ప్రాక్టీస్ చేస్తున్నారు.
స్మాష్‌కు అవకాశం ఇవ్వడం లేదు...
ఇటీవల నా ఆటలో కొన్ని మార్పులు చేయడం తప్పనిసరిగా మారిపోయింది. తై జు లాంటివాళ్లు తెలివిగా తప్పు దోవ పట్టించే షాట్‌లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా జపాన్ క్రీడాకారిణులు కూడా సుదీర్ఘ ర్యాలీలపైనే దృష్టి పెట్టారు. గతంలో నా బలం స్మాష్‌ను సమర్థంగా ఉపయోగించుకునేదాన్ని. అయితే నా ప్రత్యర్థులు షటిల్‌ను ఏమాత్రం పైకి లేపకుండా ఆడుతూ స్మాష్‌కు అవకాశం ఇవ్వడం లేదు. దాంతో నేను కూడా కొత్తగా ఆలోచించాల్సి వచ్చింది. ఆల్ ఇంగ్లండ్‌లో గెలవాలనే నా కోరిక ఈ సారి తీరుతుందని ఆశిస్తున్నా. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు ఇటీవలే కొత్తగా సొంత ఫిజియోను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ముంబైకి చెందిన గాయత్రి నాతో కలిసి పని చేస్తోంది. గాయత్రి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు కూడా వచ్చింది. శరీరంపై అధిక భారం పడకుండా, అదే విధంగా ఎలాంటి లోపాలు లేకుండా ప్లానింగ్‌తో ఫిట్‌నెస్ ట్రైనింగ్ చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మానసికంగా కూడా మరింత దృఢంగా మారాను.
– పీవీ సింధు
పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా...
గత ఏడాది నాకు అద్భుతంగా గడిచింది. ఈ సంవత్సరం ఇండియా ఓపెన్‌లో సానుకూల ఫలితం రాలేదు కానీ ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నా. ఫిట్‌నెస్ పరంగా ప్రస్తుతం 100 శాతం బాగున్నాను. ప్రత్యేకంగా సన్నాహాలు లేకపోయినా గత రెండు వారాలుగా బాగా శ్రమించాను. ఈ కష్టం ఫలితాల రూపంలోకి మారాలని కోరుకుంటున్నా. సింగిల్స్ కోచ్‌గా మంచి ఫలితాలు అందించిన ముల్యో జట్టుకు దూరం కావడంతో మరీ పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఆయన శిక్షణ సమయంలో కొన్ని రకాల ఆలోచనలు, ప్రత్యర్థిని ఎదుర్కొనే విషయంలో కొన్ని వ్యూహాలకు అలవాటు పడ్డాం. ఇప్పుడు మళ్లీ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే గోపీ సర్ ఉన్నారు కాబట్టి సమస్య లేదు.
– కిడాంబి శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment