రష్యాకు మరో ఎదురుదెబ్బ!
పారిస్: రియో ఒలింపిక్స్ విషయంలో ఇప్పటికే పలువురు అథ్లెట్లపై నిషేధం ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రష్యా వెయిట్ లిఫ్టింగ్ బృందాన్ని ఒలింపిక్స్ లో పాల్గొనకుండా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్యూఎఫ్) అడ్డుకుంది. గతంలో బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో రష్యా వెయిట్ లిఫ్టర్ల డోపింగ్ ఫలితాల నివేదిక ఆధారంగా ఆ జట్టుపై నిషేధం విధిస్తూ ఐడబ్యూఎఫ్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఐడబ్యూఎఫ్ తాజా ప్రకటన విడుదల చేసింది. గత ఒలింపిక్స్ ల్లో రష్యన్ వెయిట్ లిఫ్టర్లలో అధికశాతం మంది డోపింగ్కు పాల్పడి ఆ క్రీడకు మచ్చ తెచ్చారని పేర్కొన్న ఐడబ్యూఎఫ్.. మొత్తం ఆ జట్టుపై ఒలింపిక్స్ నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లతో కలుపుకుని 117 మంది రష్యా క్రీడాకారులపై నిషేధం పడింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తాజా నిబంధనల ప్రకారం రియోలో పాల్గొనే రష్యా అథ్లెట్లు ముందుగా ఆయా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీంతో ఆ సమాఖ్యలు తీసుకునే నిర్ణయాన్నే బట్టే రష్యా అథ్లెట్ల భవితవ్యం ఆధారపడివుంది. రియో ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతున్నా...రష్యా అథ్లెట్ల నిషేధ పరంపర కొనసాగుతూనే ఉండటం గమనార్హం.