నిజామాబాద్ స్పోర్ట్స్ : క్రీడల్లో రాష్ట్రంలో ఇందూరు జిల్లా, దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచేలా ఆటగాళ్లు కృషి చేయాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్, మేయర్ సుజాత సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ అండర్-16 ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి టోర్నీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మేయర్ ఆకుల సుజాత, విశిష్ట అతిథిగా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా అథారిటీ జెండాలను ఆవిష్కరించారు. ఆయా జిల్లాల క్రీడాకారులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల తో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. పాఠశాల, కళాశాలలకే క్రీడలు పరిమితం కాకుండా జీవితాంతం ఆటలు ఆడాలని సూచించారు. క్రీడాకారులను తెలంగాణ సర్కారు ప్రోత్సహిస్తోందన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. అన్ని క్రీడల్లో రాష్ట్రంలో ఇందూరు, దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచేలా ఆడాలన్నారు. పీఈటీలు, పీడీలు ఆ దిశగా కృషి చేయాలన్నారు.
టోర్నీలో తెలంగాణలోని హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల ఫుట్‌బాల్ జట్లు, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. రెండు అంశాలకు సంబంధించి 423 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శర్మ తెలిపారు. మూడు రోజులపాటు టోర్నీ సాగుతుందన్నారు. బాలికలకు నిర్మల హృదయ పాఠశాలలో, బాలురకు ఎమ్‌ఎస్‌ఆర్ పాఠశాలలో వసతి సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, లింగన్న, ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు షకీల్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం గర్వించేలా ఆడండి
Published Fri, Dec 19 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement
Advertisement