
వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు సిద్ధమవుతున్న ఇప్పిలి ధనుంజయరావు
వెయిట్‌లిఫ్టింగ్, సంగిడిరాయి పోటీల్లో ప్రతిభ
పతకాల పంట పండిస్తున్న ధనుంజయరావు
గ్రామీణ యువతకు ఆదర్శం
నందిగాం: మండలంలోని శివరాంపురం గ్రామానికి చెందిన ఇప్పిలి ధనుంజయరావు పల్లెక్రీడల్లో పతకాల పంట పండిస్తున్నాడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచి గ్రామీణ క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. సంగిడీ, ఈడుపురాయి, ఉలవల బస్తా పోటీల్లో సత్తా చూపుతున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏ గ్రామంలో పోటీలు జరిగినా ప్రత్యక్షమవుతాడు. పోటీల్లో తలపడి విజేతగా నిలుస్తున్నాడు. 2000 సంవత్సరం నుంచి ఆయన విజయపరంపర కొనసాగుతోంది. మొదటలో గ్రామీణప్రాంతంలో సరైన శిక్షణ లేకుండా బరువులను ఎత్తేవాడు. కంచిలి, పలాస, నందిగాం, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, జలుమూరు, పోలాకి, గార, సారవకోట తదితర మండలాల్లో జరిగిన సంగిడి, ఉలవల బస్తా పోటీల్లో తలపడి బహుమతులు సాధించాడు. 2009లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల జిమ్ కోచ్‌గా ఉన్న వి.ఈశ్వరరావుతో ఏర్పడిన పరిచయంతో సంగిడీలు ఎత్తడం నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు దష్టి మళ్లించాడు. ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ, ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఇప్పుడు వెయిట్‌లిఫ్టింగ్‌లో రాష్ట్ర, జిల్లాస్థాయి పోటీల్లో రాణì స్తున్నాడు.
ఆయన సాధించిన పతకాలు
2009 సంవత్సరంలో నరసన్నపేట మండలం బుచ్చిపేటలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 150 కిలోల విభాగంలో, 2010లో సారవకోట మండలం కిన్నెరవాడలో 105 కిలోల విభాగంలో విశేష ప్రతిభ చూపిన ధనుంజయరావు, 2011 శ్రీకూర్మాంలో 140 కిలోల రాళ్లు ఎత్తి సత్తా చాటాడు. సంతబొమ్మాళి మండలం గొదలాంలో 125 కిలోల రాళ్లు ఎత్తి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాడు. 2014లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 105 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ధనుంజయరావు ప్రతిభను మెచ్చి రాయలసీమ ఐజీగా పని చేస్తున్న రౌతుపురం గ్రామానికి చెందిన వజ్జ వేణుగోపాలకష్ణ రూ.50 వేల నగదు అందజేశారు. అలాగే, పాలకొండకు చెందిన పల్ల కొండబాబు వెయిట్ లిప్టింగ్ సెట్‌ను అందజేసి ప్రోత్సహించారు. వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ గత ఏడాది రూ.50 వేలు అందజేసి ఆర్థిక తోడ్పాటునందించారు.