బరువైపోయిందా ? | Amadalavalasa weightlifting training center | Sakshi
Sakshi News home page

బరువైపోయిందా ?

Oct 9 2024 5:56 AM | Updated on Oct 9 2024 11:18 AM

Amadalavalasa weightlifting training center

వైభవం కోల్పోయిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్‌ శిక్షణ కేంద్రం 

కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజలను తీర్చిదిద్దిన కేంద్రంపై నిర్లక్ష్యం

పరికరాలు లేకపోవడం, భవనం శిధిలం కావడంతో అటువైపు చూడని ఔత్సాహికులు 

ప్రభుత్వం ఆదుకోకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం 

రెండు దశాబ్దాల క్రితం ఆమదాలవలస పేరు చెబితే జాతీయ స్థాయిలో ఠక్కున గుర్తుకొచ్చేది వెయిట్‌ లిఫ్టింగ్‌. ఒకరా ఇద్దరా.. పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటేవారు. విశ్వక్రీడావేదిక ఒలింపిక్స్‌లోనూ ఆమదాలవలస వైభవాన్ని చాటిచెప్పారు. 

కానీ నేడు ఆ వైభవమంతా గతకాలపు స్మృతిగా మిగిలిపోయింది. కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజ వంటి దిగ్గజ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్‌ శిక్షణ కేంద్రం నేడు ఆదరణ కరువై శిధిలావస్థకు చేరుకుంది. ప్రోత్సాహం కరువై క్రీడాకారులు ఇటువైపు చూడటమే మానుకున్నారు. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాంశంలో ఒలింపిక్‌ పతకంతో పాటు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను తీర్చిదిద్దిన శిక్షణా కేంద్రానికి నేడు నిర్లక్ష్యపు గ్రహణం కమ్మేసింది. పట్టించుకునే నాథుడు లేక దయనీయ స్థితికి చేరుకుంది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పేరు మారుమ్రోగింది. 

ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్‌ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమదాలవలస ప్రాంతం నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారులు ఎక్కువగా వస్తుండటంతో 1987లో ప్రభుత్వం ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేసింది.

మెరిసిన ఆణిముత్యాలు.. 
ఈ ప్రాంతం నుంచి తొలిసారిగా ఊసవానిపేటకు చెందిన నీలం శెట్టి గురువునాయుడు సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఆ తరువాత నీలంశెట్టి సూర్యనారాయణ, కరణం నరసమ్మలు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే సీతమ్మ అనే క్రీడాకారిణి స్టేట్‌ చాంపియన్‌గా నిలిచింది. 

అనంతరం కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకం సాధించి నీలంశెట్టి లక్ష్మి సిక్కోలు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్ధాయిలో నిలిపింది. ఇక 2000 సంవత్సరంలో ఆ్రస్టేలియాలో జరిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకంతో కరణం మల్లీశ్వరి సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. 

కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన పూజారి శైలజ ప్రతిభ చెప్పనవసరంలేదు. వీరితోపాటు యామిని, కరణం కల్యాణి, కరణం కృష్ణవేణి, గౌరి, నీలంశెట్టి ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి, చీర రాజేశ్వరి, ఎన్ని శ్రీదేవి ఇలా ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారు.  

ఆదరణ లేకే.. 
ఆమదాలవలసలో తొలుత కొత్తకోట అమ్మినాయుడు అనే వ్యక్తి మారుతి వ్యాయామ మండలిని ఏర్పాటు చేశారు. అనంతరం 1983లో అప్పటి ప్రభుత్వం చిన్న శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అది శిధిలావస్థకు చేరడంతో అమ్మినాయుడు  విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించుకున్నారు. 1987లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. వాటితో నూతన భవనాన్ని నిర్మించారు.

 నీలంశెట్టి అప్పన్న అనే వ్యక్తి కోచ్‌గా ఉండేవారు. ఆయన రిటైరయ్యాక కోచ్‌ను నియమించలేదు. దీంతో సీనియర్‌ క్రీడాకారులే శిక్షకులుగా వ్యవహరిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడం, ఔత్సాహికులు కూడా ముందుకు రాకపోవడంతో శిక్షణా కేంద్రం దయనీయ స్థితికి చేరుకుంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. సామగ్రి లేకపోవడంతో క్రీడాకారులు వెళ్లడం మానేశారు. 

దీంతో పూర్తిగా మూతపడిపోయింది. ఇటీవల ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణి చిగురుపల్లి రాజ్యలక్ష్మి తన సొంత డబ్బులతో ఇక్కడ వెయిట్‌ లిఫ్టింగ్‌ సామగ్రి ఏర్పాటు చేశారు. అక్కడే తన కుమార్తె చిగురుపల్లి హారికరాజ్‌కు శిక్షణ ఇస్తున్నారు. ఆ బాలిక ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తుండటంతో మరో 8 మంది వచ్చి ప్రాక్టీస్‌ చేస్తున్నారని ఆమె చెబుతున్నారు.  

ఆ వైభవం గతమే.. 
ఆమదాలవలసలో వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో జాతీయ ,అంతర్జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌  క్రీడాకారులు సుమారు 60నుంచి 80మంది వరకు ఉండేవారు. ఇప్పుడు పది విభాగాల్లో పాల్గొనేందుకు క్రీడాకారులే కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు.  

పట్టించుకునే నాథుడే లేడు 
ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్‌ శిక్షణ కేంద్రం శిధిలావస్థకు చేరిపోవడం బాధగాఉంది. 2001లో ఇక్కడ ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన నేను జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్నాను. ప్రస్తుతం సరైన ప్రోత్సాహం, వసతులు లేక ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావడంలేదు. 

ఈ ప్రాంతంలో ఈ క్రీడ కనుమరుగైపోకుండా చూడాలనే ఉద్దేశ్యంతో నా సొంత డబ్బుతో సామగ్రి కొనుగోలు చేసి నాకున్న సామర్థ్యం మేరకు శిక్షణ ఇస్తున్నాను. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు చింతాడ రవికుమార్‌ ఇటీవల రూ.50వేలు ఇచ్చి ప్రోత్సహించారు. 

నా కుమార్తెకు కూడా ఆయనే స్పాన్సర్‌ చేసి పోటీలకు పంపిస్తున్నారు. ఇప్పటికైనా శిక్షణా కేంద్రంలో సామగ్రి ఏర్పాటు చేసి,  వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులను ఆదుకోవాలి. కోచ్‌ను ఏర్పాటు చేయాలి.  – చిగురుపల్లి రాజ్యలక్ష్మి,  వెయిట్‌ లిప్టర్, ఆమదాలవలస

క్రీడాకారులు కరువు    
వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ క్రీడాంశాన్ని ఎంచుకుంటుంటారు. ఆరి్థక పరిస్థితులు అంతగా సహకరించక రాణించలేకపోతున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాణించినవారికి కనీసం హోంగార్డు పోస్టులో అయినా ప్రాధాన్యత ఇస్తే ఉత్సాహంగా ముందుకువచ్చేవారు. 

పతకం తెచ్చిన క్రీడాకారుడిని నాయకులు ఆరోజు అభినందించడం తప్ప తరువాత పట్టించుకోవడంలేదు. గతంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం 30 నుంచి 40 మంది మాత్రమే పాల్గొంటున్నారు. – బలివాడ తిరుపతిరావు, వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా మాజీ కార్యదర్శి, వెయిట్‌లిఫ్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement