చైనాదే తొలి స్వర్ణం | Asian Games: New shooting star fires China into life | Sakshi
Sakshi News home page

చైనాదే తొలి స్వర్ణం

Published Sun, Sep 21 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

చైనాదే తొలి స్వర్ణం

చైనాదే తొలి స్వర్ణం

మొదటి రోజు కొరియా, చైనా హోరాహోరీ
ఇంచియాన్: ఈసారి ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన ఘనతను చైనా సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గువో వెన్‌జున్, జాంగ్ మెంగ్యున్, జౌ కింగ్‌యువాన్‌లతో కూడిన చైనా బృందం 1146 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్ బరిలో ఒక దేశం తరఫున ఉన్న ముగ్గురు క్రీడాకారిణులు సాధించిన మొత్తం స్కోరు ఆధారంగా పతకాలను నిర్ధారిస్తారు. ఓవరాల్‌గా తొలి రోజు ఐదేసి స్వర్ణాలతో ఆతిథ్య దక్షిణ కొరియా, చైనా దేశాలు పతకాల పట్టికలో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాయి.
 
వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రపంచ రికార్డు
పోటీల తొలిరోజే కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల 56 కేజీల విభాగంలో ఉత్తర కొరియా లిఫ్టర్, ఒలింపిక్ చాంపియన్ ఒమ్ యున్ చోల్ క్లీన్ అండ్ జెర్క్ అంశంలో నూతన ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను 170 కేజీల బరువెత్తి... 169 కేజీలతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు.
 
యూఏఈ జూడో జట్టుపై వేటు
ఆదర బాదరగా ఇతర దేశాల నుంచి ఆటగాళ్లను అరువు తెచ్చుకుంటే మొదటికే మోసం వస్తుందని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రీడాధికారులకు తెలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గాలనే ఉద్దేశంతో యూఏఈ రెండేళ్ల క్రితం మాల్దొవా దేశానికి చెందిన ముగ్గురు జూడో క్రీడాకారులు మిహైల్ మార్చితన్, ఇవాన్ రెమరెన్సో, విక్టర్ స్కావొర్తోవ్‌లకు తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చింది. అయితే ఆసియా క్రీడల్లో ఇతర దేశస్థులు మరో దేశం తరఫున పాల్గొనాలనుకుంటే నిబంధనల ప్రకారం ఆ దేశంలో కనిష్టంగా మూడు సంవత్సరాలు నివసించాలి. కానీ ఈ ముగ్గురు జూడో క్రీడాకారులు ఈ నిబంధనను పూర్తి చేయలేదు. దాంతో యూఏఈ తరఫున పోటీపడాలని ఇంచియాన్‌కు చేరుకున్న ఈ ముగ్గురిపై ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ వేటు వేసింది.
 
అంకుల్ కోసం...
ఎనిమిదేళ్ల క్రితం దోహా ఆసియా క్రీడల్లో అశ్వంపై స్వారీ చేస్తూ మైదానంలోనే దుర్మరణం పాలైన తన అంకుల్ కిమ్ హ్యుంగ్ చిల్‌కు... మరోసారి స్వర్ణ పతకం సాధించి ఘనమైన నివాళి ఇస్తానని చెప్పిన దక్షిణ కొరియా రైడర్ కిమ్ క్యున్ సబ్ తన మాట నిలబెట్టుకున్నాడు. శనివారం జరిగిన డ్రెస్సెజ్ టీమ్ ఈవెంట్‌లో కిమ్ క్యున్ సబ్, యూయోన్ చుంగ్, కిమ్ డాంగ్‌సియోన్; యంగ్‌షిక్ హవాంగ్‌లతో కూడిన కొరియా జట్టు పసిడి పతకాన్ని సాధించింది. 2010 ఆసియా క్రీడల్లోనూ ఈ కొరియా క్రీడాకారుడు స్వర్ణ పతకాన్ని నెగ్గి తన అంకుల్‌కు అంకితం ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement