సాక్షి, క్రీడావిభాగం: పసిడి పతకం గెలవగానే అన్నింటికంటే ముందు అచింత నోటి నుంచి వచ్చిన మాట... ‘ఈ పతకం నా అన్నయ్యకు అంకితం’... అతడిని దగ్గరి నుంచి చూసిన వారికి ఇది ఆశ్యర్యం కలిగించలేదు. ఎందుకంటే ఈ రోజు అచింత కామన్వెల్త్ పతకధారిగా సగర్వంగా నిలబడ్డాడంటే దాని వెనక అలోక్ ఉన్నాడు. తమ్ముడి కోసం తన ఆటకు దూరమైన ఆ అన్నయ్య, అంతటితో ఆగకుండా అన్నీ తానై, అంతటా వెనకుండి నడిపించాడు.
అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన కూడా ఆటలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చంటూ అన్ని రకాలుగా స్ఫూర్తినిచ్చేలా అచింత జీవితం కనిపిస్తుంది. కోల్‌కతాలోనే హౌరా నుంచి రెండు గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది దియూల్‌పూర్ గ్రామం. అక్కడ ఎక్కువ మందికి ‘జరీ’ పనినే జీవనాధారం. రిక్షా కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి 2014లో హఠాత్తుగా చనిపోయిన సమయంలో అచింత వయసు 12 ఏళ్లు! ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే తల్లి ‘జరీ’ పనిలో చేరిపోయింది.
ఆమెకు అండగా తనకంటే ఏడేళ్లు పెద్ద అయిన అన్నయ్య కూడా వెళ్లక తప్పలేదు. వయసు చిన్నదే అయినా తన చిట్టి చేతులతో అచింత తానూ ఆ పనిలో సాయం చేయడం మొదలు పెట్టేశాడు. ఇలాంటి ఆర్థిక స్థితిలో ఆటలు అనేవి ఆలోచనకు కూడా అందవు. దాంతో అప్పటి వరకు తన ఆసక్తి కొద్దీ వెయిట్‌లిఫ్టింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అన్న అలోక్ ఆ బరువును పక్కన పడేసి ఇంటి భారం తన మీద వేసుకోవాల్సి వచ్చింది.
సాయంత్రం ‘జరీ’ వర్క్‌తో పాటు ఉదయం వేళ హౌరా మిల్లుల్లో లేబర్‌గా పని చేసేందుకు సిద్ధమైన అలోక్... అదే సమయంలో తన తమ్ముడిలో తనకంటే మంచి ప్రతిభ ఉందని గుర్తించడం మర్చిపోలేదు. అందుకే ఏం చేసైనా అచింతను తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. అన్న కష్టాన్ని అచింత వృథా పోనీయలేదు. ఒకవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆటకు పదును పెట్టుకుంటూనే మరోవైపు తనకు ఇచ్చే డబ్బుల్లో ఒక్కో పైసాను అతి పదిలంగా కాపాడుకుంటూ వచ్చాడు.
2014 జాతీయ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో వచ్చినా... కోచ్ దృష్టిని ఆకర్షించడంతో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరే అవకాశం వచ్చి ంది. దాంతో అచింత రాత మారింది. తీవ్ర సాధన తో సత్తా చాటుతూ ఆసియా యూత్ చాంపియన్ షిప్‌లో రజతం, కామన్వెల్త్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం తర్వాత గత ఏడాది వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజతంతో అచింత సంచలనం సృష్టించి దూసుకుపోయాడు. ఆర్మీ ఉద్యోగం ఉండటంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు కావడంతో పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టిన ఈ బెంగాల్ కుర్రాడు ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల స్వర్ణ ఘనతను సగర్వంగా అందుకున్నాడు.
అరంగేట్రంలోనే అదుర్స్...
కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే అచింత షెయులి స్వర్ణ పతకంతో మెరిశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 73 కేజీల విభాగంలో అచింత భారత్‌కు పసిడి పతకం అందించాడు. 20 ఏళ్ల అచింత (స్నాచ్‌లో 143+క్లీన్ అండ్ జెర్క్‌లో 170) మొత్తం 313 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచాడు.
అజయ్‌కు నిరాశ
81 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ అజయ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన ఈ ఈవెంట్‌లో అజయ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. అజయ్ స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 176 కేజీలు (మొత్తం 319 కేజీలు) బరువెత్తాడు. ఈ కేటగిరీలో క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు), కైల్ బ్రూస్ (ఆస్ట్రేలియా; 323 కేజీలు), నికోలస్ వాకన్ (కెనడా; 320 కేజీలు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment