త్రీ మంకీస్ - 9
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 9
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
అక్కడ కోక్ దొరికింది. దాన్ని తాగుతూ టేబిల్ మీది దినపత్రికలో ఆ వేన్ దొంగతనం గురించి చదివాడు. టో అండ్ టో షూస్ కంపెనీ వారు దొంగతనాన్ని అరికట్టడానికి కుడి, ఎడమ బూట్ల జతలని విడదీసి విడివిడిగా రవాణా చేస్తారు. దొంగలు అవి నిరుపయోగం అని గ్రహించాక వాటిని వదిలేస్తారని, ఈ సందర్భంలో సరిగ్గా ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ వేన్ ఎక్కడ విడిచిపెట్టబడిందో కూడా రాశారు. దొంగలు ఆ వేన్‌ని సంకరజాతి పశువుల వారి కార్యాలయం ముందు వదిలి వెళ్ళారు.
తను చేసిన మొదటి దొంగతనం నించి మంచి పాఠాన్ని నేర్చుకున్నాడని మర్కట్ అనుకున్నాడు. లేచి కోకోకోలా టిన్‌ని చెత్త బుట్టలో వేసేదాకా తనని, తన కాళ్ళని అక్కడ కూర్చున్న ఓ వ్యక్తి తదేకంగా గమనిస్తున్నాడని మర్కట్‌కి తెలీదు. తర్వాత అతని వైపు తిరిగి అడిగాడు.
‘‘ఏమిటి? చూస్తున్నావ్?’’
‘‘బావున్నాయి. ఆ బూట్లెక్కడివి?’’ అతను ప్రశ్నించాడు.
‘‘టో అండ్ టో కంపెనీ షూస్‌కంపెనీ ఫ్యాక్టరీ నించి బయటికి వచ్చాయి.’’
‘‘ఏ షాపులో కొన్నావు?’’
‘‘లాభం లేదు. ఇలాంటి ఇంకో జత అక్కడ లేదు. నేను అమ్మను.’’
‘‘నేనూ కొనదలచుకోలేదు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. సిఐడి.’’
అతను జేబులోంచి తన ఐడెంటిటీ కార్డుని చూపించి చెప్పాడు.
‘‘ఈ బూట్లు ధరించడం నేరం అని నాకు తెలీదే?’’ మర్కట్ ఆశ్చర్యంగా చెప్పాడు.
‘‘ఈ బూట్లు ధరించడం నేరం.’’
అతను వెంటనే తన జేబులోంచి ఓ పరికరాన్ని బయటికి తీశాడు. అలాంటివి మర్కట్ జేమ్స్ బాండ్ సినిమాలో చూశాడు. ఆ సినిమాలో లాగానే అందులోని ఎర్ర లైటు ఆరి వెలుగుతూ తను తొడుక్కున్న బూట్ల వైపు బాణం గుర్తు చూపిస్తోంది.
‘‘అటు, ఇటు నడు’’ సిఐడి కోరాడు.
మర్కట్ ఎటు నడిస్తే ఆ బాణం గుర్తు అటు వైపు చూపించసాగింది.
‘‘ఉహు. అమ్మకపోవడమే కాదు. నా బూట్లని దాంతో ఎక్స్చేంజ్ కూడా చేయను.’’ చెప్పి వెళ్ళబోయే మర్కట్ కాలర్‌ని అతను పట్టుకుని ఆపాడు.
అంతదాకా ఆ షాపు బయట అడుక్కునే గుడ్డి బిచ్చగాడు, వాడి అసిస్టెంట్‌లు కూడా వచ్చి మర్కట్ చేతులని పట్టుకున్నారు.
‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ మర్కట్ నివ్వెరపోతూ అడిగాడు.
‘‘నువ్వు చదివిన ఈ వార్తలో రాయనిది నేను చెప్తా విను. టో అండ్ టో కంపెనీ వారు తాము రవాణా చేసే ప్రతీ బూట్ల వేన్‌లో ఓ మామూలు జత బూట్లని కూడా ఉంచుతారు. దాని సోల్‌లో అమర్చిన ఎలక్ట్రానిక్ జిపిఎస్‌ని ఈ రిసీవర్ ట్రేస్ చేసి కనుక్కుంటుంది. ఇదంతా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా జరుగుతుంది.’’
‘‘నాకు తెలీదు. నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని కాను. మెకానికల్ ఇంజనీర్ని’’ మర్కట్ నీరసంగా చెప్పాడు.
మర్కట్ సెల్‌లోకి వెళ్ళాక గార్డ్ తలుపు మూసి బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. కింది బెర్త్‌లో కూర్చున్న ఒకతను సిగరెట్ కాలుస్తున్నాడు. అతను తల తిప్పి మర్కట్ వంక పరీక్షగా చూసి అడిగాడు.
‘‘ఏం నేరం?’’
‘‘చెప్పుల దొంగతనం’’ మర్కట్ చెప్పాడు.
‘‘ఏ గుళ్ళో? అలాంటి వారినీ పోలీసులు పట్టుకుంటున్నారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘నేనంత నీచంగా కనిపిస్తున్నానా? చెప్పుల వేన్‌ని దొంగిలించి పట్టుబడ్డాను. నా పేరు మర్కట్. నీ పేరు?’’
‘‘ఏం పేర్లో? ఏమిటో? నా పేరు వేమన. దొంగ నోట్ల చలామణి. పాకిస్థాన్‌లో ప్రింటైన దొంగ నోట్లని కన్యాకుమారికి వెళ్ళి కొనుక్కొచ్చి మారుస్తూంటాను. పై బెర్త్త్ నీది.’’
‘‘పాకిస్థాన్‌లోనా? ఐతే కాశ్మీర్ కాదా వెళ్ళేది?’’
‘‘కాదు. కాశ్మీర్‌లో దొంగ నోట్ల కోసం పోలీసులు వెదుకుతారు కాని కన్యాకుమారిలో వెదకరు కదా.’’
‘‘పాయింటే. జైల్లో జీవితం బావుంటుందా?’’
చిన్నగా నిట్టూర్చి సిగరెట్ మసిని నేల మీద రాల్చి చెప్పాడు.
‘‘మన మనసే ఓ జైలు. దాన్లోంచి బయట పడితే ఇంకా ఎక్కడైనా బావుంటుంది.’’
మళ్ళీ నిట్టూర్చి అడిగాడు.
‘‘బ్రహ్మం ఒక్కటా? రెండా?’’
‘‘నాకవి తెలీవు. చెప్పినా వినను.’’
పై బెర్త్ మీదకి ఎక్కి పడుకున్నాడు.
‘‘విక్టర్ హ్యూగో అబద్ధం రాశాడు’’ మర్కట్ చెప్పాడు.
‘‘ఆయనెవరు?’’ వేమన అడిగాడు.
‘‘ఫ్రెంచ్ రచయిత.’’
‘‘ఏం అబద్ధం రాశాడు?’’
‘‘ఇద్దరు జైలు కిటికీలోంచి చూస్తే ఒకడికి నక్షత్రాలు కనిపిస్తే ఇంకొకడికి మట్టి కనిపించిందని రాశాడు. జైల్లో అసలు కిటికీలే లేవు’’ మర్కట్ చెప్పాడు.
‘‘ఏం నక్షత్రాలో? ఏం మట్టో. అన్నీ పంచభూతాల నిర్మితమేగా?’’
మర్కట్‌కి అతను వేదాంతి అని అర్ధం అయింది. మళ్ళీ చెప్పాడు - ‘‘మార్క్ టై్వన్ కూడా అబద్ధం చెప్పాడు.’’
‘‘ఆయనెవరు?’’
‘‘అమెరికన్ రచయిత.’’
‘‘ఏం అబద్ధం చెప్పాడు?’’
‘‘స్కూల్ తలుపులోంచి లోపలకి వెళ్ళిన వారు జైలు తలుపులోంచి లోపలకి వెళ్ళరు అని.’’
‘‘వాళ్ళు కూడా ఇక్కడే ఏదో సెల్స్‌లో ఉండి ఉంటారు’’ వేమన చెప్పాడు.
3
చీకటి పడుతూండగా సిఐ ఆ సందులో ‘సస్టిస్ భవన్’ అని రాసి ఉన్న ఇంటి ముందు పోలీన్ వేన్ దిగాడు. ఆ ఖరీదైన ఇంటి బయట షామియానా వేసి ఉంది. లోపలి నించి మంగళ వాయిద్యాలు కూడా వినిపిస్తున్నాయి. ఓ ఇరవై మూడేళ్ళ ముద్దాయితో సిఐ లోపలికి నడిచాడు.
(మేజిస్ట్రేట్ యమధర్మరాజు దగ్గరికి తీసుకురాబడ్డ మూడో మంకీ పేరేమిటి?)