త్రీ మంకీస్ - 8 | Three Monkeys | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 8

Published Sun, Oct 26 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

త్రీ మంకీస్ - 8

త్రీ మంకీస్ - 8

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 8
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి

 
 ‘‘మా అన్నయ్య అలా తగలడ్డాడు సార్. నేనూ తగలడదామని బేంక్‌కి వెళ్తే మా అన్న లోన్ తీర్చలేదని వాళ్ళ రికార్డుల్లో ఉందట. దాంతో మా అన్న లోన్‌ని కడితేనే నాకు లోన్ ఇస్తామన్నారు సార్. అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్నాను.’’
 ‘‘ఏ ఉద్యోగాలకో?’’
 ‘‘కొరియర్ బోయ్, రోడ్లూడ్చేవాడు, ఇసుక మోసేవాడు... చెప్పులరిగేలా తిరిగినా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు సార్.’’
 ‘‘నువ్వు పిడబ్ల్యుడిలోనో, జి హెచ్ ఎంసిలోనో ఇంజినీర్‌గా పనికొస్తావుగా?’’
 ‘‘కాని ఎంపి, ఎంఎల్‌ఏ, కనీసం ఎంఎల్‌సి రికమండేషనైనా లేకపోతే అక్కడ ఉద్యోగాలు ఎలా వస్తాయి సార్? నేను వాళ్ళెవరికీ తెలియను.’’
 ‘‘అందుకని?’’
 ‘‘దాంతో ఉద్యోగానికి తిరిగి తిరిగి చెప్పులు అరిగాయి. వాటిని కొనే స్థోమత కూడా లేకపోవడంతో విధి లేక దొంగతనానికి దిగాను సార్.’’
 ‘‘ఈ స్టేట్‌మెంట్ చదివే సంతకం చేశావా?’’
 ‘‘అవును సార్.’’
 ‘‘ఇందులో రాసిట్లుగానే నువ్వు దొంగతనం చేశావా?’’
 ‘‘అవును సార్.’’
 వెంటనే జైలర్ పకపక నవ్వి చెప్పాడు.
 ‘‘ఐతే నువ్వూ దురదృష్టవంతుడివే అన్నమాట. సరే. నేను ఇక్కడికి వచ్చే అందరికీ చెప్పే మాటలే చెప్తాను. ఇకనించి నువ్వు మా విశ్రాంతి గృహంలో అతిథివి. వెల్‌కం. ఇప్పుడు ఆ దొంగతనం ఎలా చేశావో నీ మాటల్లో చెప్పు.’’
   
 ఆ రోజు మర్కట్ దగ్గర అతని జీవితాంతానికి సరిపడా డబ్బుంది. అతనేదైనా కొనాలనుకుంటే తప్ప. కోకోకోలా కేన్‌ని కొనాలనుకున్నాడు. కాని దొంగతనం చేేన్త కాని కోకోకోలా కేన్ కొనేందుకు కూడా డబ్బు లేదు. ‘అవుటాఫ్ మనీ ఎక్స్‌పీరియెన్స్’ ఉన్న అతను చాలామందిలా సందేహించలేదు. తక్షణం దొంగతనంలోకి దిగాడు.
 ఆ రాత్రి అతను దొంగతనం చేయడానికి గాయత్రి జూవెలరీ దుకాణం వైపు నడుస్తూంటే ఓ చెప్పుల షాపు బయట ఆగి ఉన్న ఓ వేన్ కనిపించింది. దాని మీది ప్రకటనని బట్టి అది ఆ దుకాణానికి చెప్పులని డెలివరీ చేయడానికి వచ్చిందని గ్రహించాడు. వేన్ మీద ఇలా పెయింట్ చేసి ఉంది.
 ‘కొనండి మా టో అండ్ టో జోళ్ళు. బై రైట్ సైడ్ షూ. గెట్ లెఫ్ట్ సైడ్ షూ ఫ్రీ.’
 ఒకతను సెల్‌ఫోన్‌లో మాట్లాడేది విని మర్కట్ అతను దాని డ్రెవర్ అని గ్రహించాడు.
 ‘‘మీ గోడౌన్ ఎక్కడ? యాదగిరి వైన్స్ పక్క గల్లీలోనా? అదెక్కడుంది? అస్టోరియా రెస్టారెంట్ ఎదురుగానా? సరే. వస్తున్నాను. అక్కడే ఉండండి’’ అతను సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ ముందుకి కాలినడకనే సాగాడు.
 మర్కట్ ఆ వేన్ దగ్గరికి వెళ్ళి దాని వెనక తలుపు లాగాడు. తెరుచుకోలేదు. కేబిన్ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసాడు. ఇగ్నీషన్ తాళంచెవి వేలాడుతూ కనిపించింది. అతను క్షణకాలం సందేహించాడు. కొద్దిసేపు ‘తనకి డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా ఆ వేన్‌ని డ్రైవ్ చేయచ్చా?’ అనే మీమాంసలో పడ్డాడు. ఆ నైతిక మీమాంసలోంచి బయట పడ్డాక ఇక సందేహించలేదు. వేన్ ఎక్కి దాన్ని స్టార్ట్ చేసి డ్రయివర్ వెళ్ళిన వైపు కాక దానికి వ్యతిరేక దిశలో వేన్‌ని పోనిచ్చాడు.
 ఓ కిలోమీటర్ దూరంలో ఓ డెడ్ ఎండ్ సందులో వేన్‌ని ఆపి తాళం చెవి తీసుకుని దిగి వెనక తలుపు తెరిచాడు. లోపల చీకటిగా ఉండడంతో తడిమి స్విచ్ ఆన్ చేశాడు. ఎదురుగా చెప్పుల పెట్టెలు ఒక దాని మీద మరొకటి పేర్చి కనిపించాయి.
 వెంటనే తన కాళ్ళ వంక చూసుకున్నాడు. అవి బోసిగా ఉన్నాయి. ఓ పెట్టెని అందుకుని తెరిచి అందులోని బూట్లని నేల మీద పడేశాడు. వాటి వంక చూస్తే నల్లరంగు బూట్లు. దాదాపు డజను పెట్టెల్లోంచి బూట్లని కింద పడేశాక అతను వెతికే బ్రౌన్ రంగు బూట్లు కనిపించాయి. అవి తన సైజో కాదో చూసుకోవాలని ఒంగి వాటిని అందుకుని కుడి కాలి బూటుని తొడుక్కున్నాడు. చక్కగా సరిపోయింది. తర్వాత ఎడమ కాలి బూటుని తొడుక్కోడానికి విశ్వ ప్రయత్నం చేసినా అది ఎక్కలేదు. దాన్ని పరీక్షగా చూస్తే అదీ కుడి కాలి బూటే!
 పేకర్లని తిట్టుకుంటూ కింద ఉన్న నల్ల బూటుని అందుకుని కుడి కాలికి తొడుక్కున్నాడు. అదీ సరిగ్గా సరిపోయింది. తర్వాత ఎడమ కాలి బూటుని తొడుక్కోబోతే పట్టలేదు. రెండు మూడు జతల బూట్లని తొడుక్కునే ప్రయత్నం చేశాక అనుమానం వచ్చి ఇంకొన్ని పెట్టెల్ని తెరిచి చూస్తే ప్రతీ పెట్టెలో కేవలం కుడి కాలి బూట్ల జతలే కనిపించాయి. ఓపికగా ఆ వేన్‌లోని ఐదు వందల అరవై నాలుగు పెట్టెలని తెరచి చూస్తే అతని అదృష్టం బావుండి ఓ పెట్టెలో మాత్రం కుడి, ఎడమ కాళ్ళ బూట్లు ఉన్నాయి. అది పేకర్ చేసిన పొరపాటు అనుకున్నాడు. వాటిని తొడుక్కుంటే అవి చక్కగా సరిపోవడంతో అటు, ఇటు నడిచి చూసి తృప్తి పడ్డాడు. ‘దీన్ని కుట్టినవాడికి నా పాదం సైజు ఎలా తెలుసో?’ అనుకున్నాడు.
 డేష్ బోర్డ్ వెదికితే నాలుగు పది రూపాయల నోట్లు కనిపించాయి. వాటిని జేబులో ఉంచుకున్నాడు.
   
 కోక్ ప్రియుడైన మర్కట్ మర్నాడు ఉదయం ఆ నాలుగు పది రూపాయల నోట్లతో ఓ సెల్ఫ్ సర్వీస్ రెస్టారెంట్లోకి వెళ్ళి అడిగాడు.
 ‘‘కోక్ కేన్ కావాలి.’’
 ‘‘సారీ. పెప్సీ ఉంది. ఓకేనా?’’ కేషియర్ అడిగాడు.
 ‘‘నా దగ్గర మోనోపలీ ఆటకి వాడే డబ్బుంది. అది ఓకేనా?’’
 సమీపంలోని అలాంటి ఇంకో రెస్టారెంట్‌కి వెళ్లాడు. బయట అడుక్కునే వాళ్ళు చేతిని చాపగానే అరిచాడు.
 ‘‘దుక్కల్లా ఉన్నారు. కూలి పని చేసుకోక ఏమిటిది?’’
 (మర్కట్ పోలీసులకు పట్టుబడ్డ ఫన్నీ కారణం ఊహించగలరా?)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement