![This Man Lay Down On Train Track And Cut Both His Legs For 23 Crore Of Insurance Money - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/12/accident.jpg.webp?itok=6oFzzsxY)
ప్రతీకాత్మక చిత్రం
ఇన్సూరెన్స్ కింద కోట్ల రూపాయలు ఆర్జించవచ్చనే దురాశతో ఓ వ్యక్తి ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. ఇది జరగడానికి కొంతకాలం ముందు సదరు వ్యక్తి ఒకటి, రెండు కాదు సుమారు 14 బీమా పాలసీలను తీసుకున్నాడు. ఐతే ఏళ్లు గడుస్తున్నా బీమా తాలూకు రూ. 23 కోట్ల డబ్బు పొందలేకపోతున్నాననే బాధతో ఈ పనికి పూనుకున్నాడు సదరు వ్యక్తి. డబ్బుకోసం కాళ్లను నరుక్కున్న ఈ వ్యక్తిని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
మీడియా కథనాల ప్రకారం హంగేరీకి చెందిన సెందర్ అనే వ్యక్తి ఇన్సురెన్స్ కింద లభించే 23 కోట్ల 97 లక్షల రూపాయల కోసం రైలు ట్రాక్‌పై పడుకుని రెండు కాళ్లు నరుక్కున్నాడు. 2014లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో 54 ఏళ్ల సెందర్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలను వాడుతూ వీల్‌చైర్ సపోర్టుతో బతుకువెళ్లదీస్తున్నాడు. కాళ్లు కోల్పోయిన తర్వాత బీమా డబ్బు కోసం సెందర్ బీమా కంపెనీలను సంప్రదించాడు. కానీ అతని ఎత్తుగడ బీమా సంస్థలు పసిగట్టి అతనికి ఊహించని షాక్ ఇచ్చాయి.
నిజానికి సెందర్ తన కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు, 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. దీంతో బీమా కంపెనీలకు అనుమానం వచ్చి, క్లెయిమ్‌ను ఆలస్యం చేశాయి. దీనితో మనస్థాపం చెందిన సెండర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో విషయం అంతా బట్టబయలయ్యింది.
పొదుపు ఖాతాల కంటే బీమా పాలసీలపై వచ్చే రాబడులు మెరుగ్గా ఉంటాయని ఆర్థిక సలహా అందుకున్న తర్వాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెందర్ కోర్టులో ఒప్పుకున్నాడు. అందుకే పాలసీలు కూడా తీసుకున్నాడట. గ్లాస్‌పై జారిపడి, అదుపు తప్పి రైలు ట్రాక్‌పై పడిపోయినట్లు, ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు తెగిపోయాయని అందరి ముందూ నమ్మబలికి, బీమా డబ్బు మొత్తాన్ని పొందడానికి ప్లాన్ వేసినట్లు కోర్టు ముందు చెప్పుకొచ్చాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఇన్సురెన్సు డబ్బు కోసమే రైలు ముందు పడుకున్నాడని ఏడేళ్ల విచారణలో రుజువు కావడంతో తాజాగా జిల్లా కోర్టు ఈ కేసుపై తీర్పు వెలువరించింది. అతని మోసం బయటపడటంతో బీమా సొమ్ము దక్కలేదు సరికదా పరువు కూడా పోయింది.
చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!
Comments
Please login to add a commentAdd a comment